ఎమ్బీయస్‍: ‘ఆదిపురుష్’ సమస్య

‘‘ఆదిపురుష్’’ సినిమా టీజరు ధర్మమాని రామాయణంలోని పాత్రల రూపురేఖలు, ఆహార్యం చర్చకు వచ్చాయి. ఆ సినిమా తీసినవాళ్లు యిప్పటి తరానికి కూడా నచ్చేట్లు ఉండాలని పాత్రలను కొత్త తరహాలో చూపించబోయారు. తరతరాలుగా ఆ పాత్రలను ఒక మూసలో ఊహించుకుంటూ వచ్చిన మనకు అది మింగుడు పడలేదు. దాంతో నిర్మాత, దర్శకుడు కావాలని హిందూమతాన్ని కించపరచడానికే అలా తీశారనే వాదన బయలుదేరింది. అది అబద్ధం. నిర్మాతలైన గుల్షన్ కుమార్ కుటుంబం హిందూ దేవీదేవతల భక్తులు. దర్శకుడు ఓం రావూత్‌పై హిందూత్వ ప్రభావం ఉన్నట్లే తోస్తుంది. అంతకు ముందు తీసిన ‘‘తానాజీ’’లో అతను హిందూ పాత్రలను కించపరచలేదు కదా. అన్నిటిని మించి యీ సినిమా బిజెపి నాయకుల ఆదేశాల మేరకు, వారి ప్రయోజనాల మేరకు తయారవుతోందనే వాదనను కొట్టి పారేయలేము.

2024 నాటికి అయోధ్య ఆలయ నిర్మాణం చాలా మేరకు పూర్తి కావచ్చు. అప్పుడు వచ్చే ఎన్నికల్లో రాముడి పేర హవా సృష్టించి తద్వారా బిజెపి గెలవడానికి చూస్తోందన్న వాదన ఒకటుంది. అది లేకపోయినా గెలవవచ్చు. కానీ అది కూడా తోడైతే ఏ 400-450 సీట్లు సంపాదించవచ్చనే ఆలోచన దానికి ఉండవచ్చు. ఈలోగా దేశంలో రాముడి మూడ్ క్రియేట్ చేయడానికి సినిమాలను కూడా ఉపయోగించు కోవడంలో ఆశ్చర్యం లేదు. ‘‘ఆరారార్’’లో పోలీసు డ్రస్సులో ఉంటూ వచ్చిన రామచరణ్ హఠాత్తుగా క్లయిమాక్స్‌లో రాముడి వేషం కట్టి, విల్లు చేతపట్టి దుష్టుల్ని దునుమాడడం ఆ ప్లానులో భాగమనే అంటున్నారు. అలా రూపొందించినందుకే విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం లభించిందనే చాలామంది నమ్మకం. ‘‘కశ్మీర్ ఫైల్స్’’ తరహాలో ఆయనచే ‘‘రజాకార్ ఫైల్స్’’ తీయిస్తారనే ప్రచారమూ ఉంది.

అల్లు అరవింద్ సారథ్యంలో బిజెపికి అనుకూలంగా ఉండే మైహోమ్ రామేశ్వరరావు వంటి కొందరు కలిసి రూ. 500 కోట్లతో ‘‘రామాయణం’’ తీయబోతున్నారని 2023 వేసవిలో ప్రారంభమౌతుందనే వార్త అక్టోబరులో బయటకు వచ్చింది. సాధారణంగా ఒకే కథతో 2023లో ఒక సినిమా, 2024లో మరో సినిమా రావడం విడ్డూరం. కావాలంటే ఎన్ని పురాణాలు లేవు? వీళ్లు రామాయణం తీస్తే వాళ్లు భారతం తీయవచ్చు, లేదా భాగవతం తీయవచ్చు. అందరూ రామాయణమే తీస్తున్నారు. ఎందుకంటే రామప్రభంజనం అంత ధాటీగా ఉండాలని బిజెపి ఆకాంక్షిస్తూండవచ్చు. ‘‘ఆదిపురుష్’’లో అమిత్ షా పెట్టుబడి పెట్టారనే టాక్ కూడా ఉంది. ప్రతీదానికీ అతని పేరు వాడేస్తున్నారు కాబట్టి దాన్ని నమ్మాలని లేదు. కానీ ఎవరో ఒక బిజెపి నాయకుడో, మద్దతుదారో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు. అందుకే దాని టీజరు మీద వచ్చిన సంచలనాన్ని చప్పున చల్లార్చేశారు. మరొకరెవరైనా తీసి ఉంటే యిప్పటికీ వాట్సాప్‌లు వచ్చి పడుతూండేవి.

‘‘అదిపురుష్’’ నిర్మాత, దర్శకుడు హిందూ భక్తులే అయితే పాత్రలను అలా రూపొందించారేం అనే ప్రశ్న వస్తుంది. దీనికి కాస్త వివరణ అవసరం. ప్రతీ జాతికీ పురాణాలుంటాయి. వాటిని తెలుసుకోవడం యువతరం విధి. తెలియచెప్పడం పెద్దల విధి. అప్పుడే జాతి ఔన్నత్యం, వారసత్వం, సంస్కృతి గురించిన అవగాహన ఒక తరాన్నుంచి మరో తరానికి ప్రసరిస్తుంది. అయితే పురాణాలను యథాతథంగా చెప్తే యువతరానికి నచ్చదు. ఎందుకంటే గతంలో కంటె యిప్పుడు హేతువాదం, ప్రశ్నించే తత్వం పెరిగాయి కాబట్టి అలా ఎందుకు చేశాడు? ఇలా చేయవచ్చుగా అని పిల్లలు అడిగే పరిస్థితి వచ్చింది.  పురాణకర్తలు అన్నీ లాజిక్‌లతో రాయలేదు. తరతరాలుగా పుస్తకాలు రాసేవాళ్లూ, నాటకాలు ఆడినవాళ్లు, సినిమాలు తీసినవాళ్లూ అదే ధోరణిలో హాయిగా వెళ్లిపోయారు.

కానీ ప్రస్తుత తరానికి పురాణాలను కన్విన్సింగ్‌గా చెప్పాలని చూసేవాళ్లకు యీ లాజిక్కులు వెతకవలసిన పని బడుతోంది. అందుకే ఏవేవో కల్పించవలసి వస్తోంది. పైగా పాత కథలను అలాగే చెపితే బోరు కొడుతుందని అధునాతన టెక్నాలజీని ఉపయోగించి, ఆకర్షణీయంగా చూపించి ఆకట్టుకునే ప్రయాస కూడా పడుతున్నారు. పుస్తకాలైతే కథనంలో ప్రయోగాలు చేస్తూ, ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్పడమో, నెగటివ్ పాత్రల ద్వారా చెప్పడమో, సాధారణ భాషలో డైలాగులు రాయడమో వంటి టెక్నిక్కులు వాడుతున్నారు. సినిమా అయితే హాలీవుడ్ స్టయిల్లో గ్రాఫిక్స్ ఉపయోగించి కళ్లు చెదరగొడదామని చూస్తున్నారు. వీటికి తోడు ఓ పదేళ్ల పిల్లాడి మనసులో మెదిలే సందేహాలకు సమాధానం చెప్పడానికి కూడా చూస్తున్నారు.

ఇప్పుడు వైకుంఠద్వారాలంటూ సినిమాల్లో చూపిస్తారు. ఆకాశంలో ఒక గుమ్మం నిలబడి ఉంటుంది. విష్ణువు దగ్గరకు మొర పెట్టుకోవడానికి దేవతలు వస్తే వాటి తలుపులు తెరుచుకుంటాయి. అంతా ఆకాశమే అయినప్పుడు అసలా గుమ్మం దేనికి? తలుపులు దేనికి? పక్కనుంచి లోపలకు దూరవచ్చు కదా! ఈ ప్రశ్న సినిమా చూస్తున్న మీ పిల్లో, పిల్లవాడో అడిగితే మీరేం సమాధానం చెప్తారు? వైకుంఠంలో నారాయణుడు పాము మీద తల కింద చెయ్యి పెట్టుకుని పడుక్కుంటాడు. లక్ష్మీదేవి కాళ్లు ఒత్తుతూ ఉంటుంది. ఎప్పుడూ అదే దృశ్యం. దేవతలు వచ్చి రాక్షసుడి గురించి ఫిర్యాదులు చేయగానే ఏం చేయాలా, యీసారి ఏ అవతారం ఎత్తాలా అని ఆలోచించడానికైనా విష్ణువు లేచి కాస్త అటూయిటూ నాలుగడుగులు వేయవచ్చుగా! అబ్బే, అలా పడుక్కునే మాట్లాడుతూంటాడు. అసలా పాలసముద్రం సెట్టింగు అవతల వైకుంఠంలో తక్కిన ప్రాంతాలేవైనా ఉంటాయా? విష్ణువు సేవకులు ఎక్కడా కనబడరా? డ్యూటీ లేని టైములో గరుత్మంతుడు ఏ భవనంలో ఉంటాడు? లక్ష్మీదేవికి భర్త కాళ్లు పిసకడం తప్ప వేరేమీ చేయదా? తన భక్తుల గోడు ఎప్పుడు వినిపించుకుంటుంది? ఆదిశేషుడికి వెయ్యి తలలంటారు. ఏడో, తొమ్మిదో బేసి సంఖ్యలోనే తలకాయలు కనబడతాయి. తక్కినవి ఏమైనట్లు?

ఇలా ఎన్నో సందేహాలు. నా ఉద్దేశంలో లక్ష్మీనారాయణులను ఒక చిత్రకారుడు ఆ భంగిమలో పటం గీసి ఉంటాడు. ఇక అప్పణ్నుంచి వాళ్లను ఎప్పుడు చూపించాలన్నా ఆ ఒక్క యాంగిల్‌లోనే చూపిస్తున్నారు. వేరేలా చూపిస్తే ప్రేక్షకులు అబ్బే, తప్పు అనేస్తారన్న భయమేమో! నిజానికి గజేంద్రమోక్షం ఘట్టంలో పోతన గారు ‘అల వైకుంఠపురములో..’ పద్యంలో నగరి, సౌధం, సరస్సు, చంద్రకాంత శిల.. దానిపై లక్ష్మీ విష్ణువు ఉన్నట్లు వర్ణించాడు. మనకు సినిమాలో యీ లొకేషన్‌లో వాళ్లనెప్పుడూ చూపించరు. చూపించినా నాబోటి వాళ్లు గుర్తు పట్టలేరు. నా వయసు వాళ్లకు చిన్నప్పటి నుంచి మనసులో ఒక ముద్ర గుద్దేశారు. దాన్ని పట్టుకునే వేళ్లాడుతున్నాం. కానీ యువతరానికి యిలాటి హేంగప్స్ లేవు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు.

ఇక ఆకారాలు, హావభావాలు కూడా ఎప్పుడో రవివర్మ వంటి చిత్రకారుడు శకుంతల యిలా నాజూగ్గా ఉంటుంది, భీష్ముడు గడ్డంతో యిలా ఉంటాడు అని బొమ్మలు గీస్తే కాలండర్ల ద్వారా అవి ప్రచారంలోకి వస్తే, తక్కిన చిత్రకారులు వాటినే అనుకరిస్తూ బొమ్మలు గీస్తే వాళ్లు అలాగే ఉంటారనే భావంలో పడ్డాం. నారదుడు ముని కదా, నెత్తిమీద, చేతులకు పూలమాలలు ఎందుకు చుట్టుకోవాలి? మెళ్లో దండెందుకు వేసుకోవాలి? ఋషులెవరూ అలా ఉండరే! ఎక్కడో చదివాను. నాటకాల్లో నారదుడికి పాటలెక్కువ కాబట్టి స్త్రీలు ఆ పాత్ర ధరించేవారట. జుబ్బా తొడిగి, ఎత్తులు కవర్ చేయడానికి మెళ్లో దండ వేశారట. దండతో పాటు చేతులకూ పూలు. ఇక అప్పణ్నుంచి నారదుడంటే యిలాగే ఉంటాడు అని జనం ఫిక్సయిపోయారు.

తెలుగువాళ్లకు నిజం కృష్ణుడు సాక్షాత్కరించినా, ఎన్టీయార్ పోలికల్లో లేకపోతే నమ్మని పరిస్థితి వచ్చేసింది. తంజావూరు బొమ్మలు చూస్తూ పెరిగినవాడికి కృష్ణుడు బొద్దుగా, గుండ్రంగా ఉండకపోతే నమ్మని పరిస్థితి. ద్వారకాధీశుడి బొమ్మ చూస్తూ పెరిగినవాడికి ఇస్కాన్ కృష్ణుడిలా తెల్లగా ఉంటే నమ్మలేని స్థితి. నిజానికి దేవుళ్లు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. కానీ మన మీద పడిన యింప్రెషన్ల బట్టి మనం ప్రవర్తిస్తాం. రామాయణం భారతదేశంలోనే కాదు, ఆగ్నేయాసియా దేశాలన్నిటిలోనూ ప్రాచుర్యంలో ఉంది. అక్కడి జానపదకళారూపాల్లో, నాటకాల్లో, నృత్యాల్లో రామాయణ పాత్రలు కనబడుతూనే ఉంటాయి. వాటిని చూస్తే మనకు ఏదో బొమ్మలు చూస్తున్నట్లు ఉంటుంది తప్ప వాళ్లు దేవుళ్లని, దణ్ణం పెట్టుకోవాలని తోచదు.

దేవుళ్లనే కాదు, చారిత్రక పురుషుల విషయంలో కూడా మనది క్లోజ్‌డ్ మైండే. శివాజీ, కృష్ణదేవరాయులు, అల్లూరి సీతారామరాజు వీళ్లెవరూ పొడుగరులు కారు. కానీ నాటకాల్లో, సినిమాల్లో ఆ యా పాత్రలు ధరించినవారు పొడుగ్గా, అందంగా ఉండడంతో మరోలా వాళ్లను ఊహించుకోలేము. అసలైన అక్బర్, పృథ్వీరాజ్ కపూరంత పెర్శనాలిటీతో ఉండడంటే మనం నమ్మం. అంతెందుకు, ఏసు క్రీస్తు అనగానే మన కళ్లముందు ఒక రూపం కడుతుంది కదా, పొడుగ్గా, మొహం సన్నగా, కోలగా.. అసలు రూపం అది కాదని ఆల్మనాక్ ఆఫ్ క్రైమ్ లాటి పేరున్న పుస్తకంలో రాశాడు. రోమ్ ప్రభుత్వం అతన్ని పట్టిచ్చినవారికి బహుమతి అంటూ వేసిన పోస్టరులో అతని వర్ణన యిది అంటూ యిచ్చాడు. దాని ప్రకారం చూస్తే యిప్పుడు గీస్తున్న రూపానికి, దానికీ పోలికే ఉండదు.

మన మధ్య కొంతకాలం సజీవంగా ఉన్న వ్యక్తుల రూపాలలోనే యింత కన్‌ఫ్యూజన్ ఉన్నపుడు దేవుళ్ల విషయంలో యింకెంత ఉంటుంది? వేల సంవత్సరాల క్రితం విగ్రహాలు చెక్కినవారు యీ ఛాలెంజ్‌ను ఎదుర్కుని ఉంటారు. వాళ్లకు తోచిన రీతిలో వాళ్లు పరిష్కరించుకున్నారు. ఇక నాటకాల దగ్గరకు వచ్చేసరికి అసలు సమస్య వచ్చింది. హనుమంతుడు, గరుత్మంతుడు, జాంబవంతుడు నాగరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు.. మామూలు మనుషుల్లో వీళ్ల ఆకృతి స్ఫురింపచేయడం ఎలా అనేది పెద్ద ప్రశ్న. అదే సందిగ్ధత సినిమాలకూ విస్తరించింది.

ఇక రంగుల విషయలో వచ్చిన గందరగోళాలు కొన్ని ఉన్నాయి. రాముడు, కృష్ణుడు శరీరఛాయ నీలము అన్నారు. నీలము అంటే బ్లూ అనీ, బ్లాక్ అని రెండర్థాలున్నాయి. నలుపు అని తీసుకోవడం సమంజసం. కానీ ఎవరికి తోచిందో కానీ రాముడికి నీలం రంగు పులిమారు. బ్లూ ఫాక్స్ కథలో లాగ అది అసహజమైన శరీరవర్ణం అని ఎందుకు అనుకోలేదో కానీ తెలుగునాట అది ప్రాచుర్యం పొందింది. కృష్ణుడికీ అదే రంగు పులిమారు. కృష్ణుడు నల్లనివాడు అని అనేక ప్రాచీన పద్యాలున్నాయి, పాటలున్నాయి. ఉత్తర భారతంలో కూడా నల్లనివాడిగానే ప్రసిద్ధి. కానీ తెలుగు సినిమాల్లో నీలం రంగు పూశారు. ఇప్పుడు వేరేలా తీస్తే తిట్టిపోస్తారు. టీవీ రామాయణ, భారతాల్లో రాముణ్ని, కృష్ణుణ్ని తెల్లగానే చూపించారు. వాళ్లకు చెల్లిపోయింది.

ఇక మీసాల దగ్గరకు వస్తే తెలుగులో రాముడు, కృష్ణుడికి పెట్టరు, హిందీ టీవీ సీరియల్స్‌లో వాళ్లూ పెట్టలేదు. ఇప్పుడు ఆదిపురుష్‌లో ప్రభాస్‌కు పెట్టారేమిటి? అంటున్నారు.  మీసాలెందుకు ఉండకూడదో నాకు అర్థం కాదు. వాళ్లు క్షత్రియులు. రామలక్ష్మణులు వనవాసం చేసినప్పుడు కూడా నారవస్త్రాలు కట్టి, జుట్టు అట్టలు కట్టించుకున్నారు కానీ ఆయుధాలు ధరించి ఉన్నారు, వేటాడారు. మీసాలుంటే దైవత్వానికి ఏదైనా లోపం వస్తుందా? మనవైపు శివుడికి మీసాలు పెద్దగా పెట్టరు కానీ ఉత్తర భారతంలో చాలా చోట్ల పెడతారు. ఈ మీసాల మీమాంస మనవాళ్లని అనవసరంగా సతాయిస్తుంది. తెలుగులో సర్వవిధాలా ప్రామాణికమైన ‘‘భారతి’’ మాసపత్రిక ఉండేది. ఆంధ్రపత్రిక గ్రూపు వాళ్లదే. దానిలో మహామహా పండితుల రచనలే పడేవి. దానిలో ‘అర్జునుడికి మీసాలు ఉండెనా?’ అనే టాపిక్‌పై ఏళ్ల తరబడి చర్చోపచర్చలు జరిగాయట. అది అయిపోయాక ‘కృష్ణుడికి మీసాలుండెనా?’ అనే టాపిక్ ఎత్తుకుని అది కొన్నేళ్లు నడిపారట. పురాణపురుషుల వ్యక్తిత్వాలపై చర్చ జరిగితే బాగుండేది కానీ మీసాల గురించి రచ్చ ఎందుకో!

రామాయణ పాత్రల దగ్గరకు వస్తే రావణాసురుడు పది తలకాయలను మోసుకుంటూ తిరిగేడని అనుకోవడం చాలా కష్టం. తినేటప్పుడు, తిరిగేటప్పుడు, శయ్యాసుఖం అనుభవించేటప్పుడు యివి పెద్ద చికాకు కదా! అన్ని ముఖాలు వేసుకుని తిరిగితే ఏ సుందరాంగైనా వరిస్తుందా? భయపడదూ? రావణ పాత్రధారికి కూడా కష్టమే. అవి బేసి సంఖ్యలో ఉండి ఉంటే అసలు తలకాయకు అటు నాలుగు, యిటు నాలుగు లేదా అటు ఐదు, యిటు ఐదు పెట్టుకుంటే బాలన్స్ అవుతాయి. కానీ ఒకవైపు నాలుగు, మరో వైపు ఐదు అంటే తూకం తప్పుతుంది. రాక్షసుడు అనగానే మనం నోట్లో కోరలు, నెత్తి మీద కొమ్ములూ ఊహిస్తాం. శూర్పణఖను కూడా కోరలతో చూపించినవారున్నారు. మరి ఆమె సవతి సోదరుడైన రావణుడికి కోరలు, కొమ్ములు లేవేం? అతని సోదరులకూ చూపించరు. మండోదరికీ చూపించరు. ఏమిటీ తేడా?

ఇక వానర పాత్రలు.  మగవాళ్లందరికీ తోకలుంటాయి. వానరస్త్రీలకు తోకలుండవు. అదెలా? బయట ఆడా, మగా తేడా లేకుండా కోతులన్నిటికీ తోకలుంటాయి. రామాయణంలో మాత్రం తేడా ఎందుకు? జాంబవంతుడు ఎలుగుబంటి అయితే కృష్ణుడు వాళ్లమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? పిల్లల్ని ఎలా కన్నాడు? మన కిలాటి సందేహాలు చిన్నప్పుడే కలిగాయి. కానీ పైకి అడిగితే ‘చొప్పదంటు ప్రశ్నలు’ అని పెద్దవాళ్లు కసిరి, నోరు మూయించేవారు. గట్టిగా అడిగితే దేవుడికి కోపం వచ్చి కళ్లు పోగొట్టేస్తాడేమో, పరీక్ష ఫెయిల్ చేయించేస్తాడేమో ననుకుని భయపడి నోరు మూసుకునే వాళ్లం. కానీ యీనాటి పిల్లలు భయపడే రకం కాదు. కన్విన్స్ కాకపోతే నిలదీస్తున్నారు. వీళ్లకు నచ్చేట్లు, వీళ్లను మెప్పించేట్లు పౌరాణిక సినిమాలు తీయడం ఓ పెద్ద ఛాలెంజ్. అందువలన మనం ‘‘ఆదిపురుష్’’ తీసేవారి కష్టాలను సానుభూతితో అర్థం చేసుకోవాలి.

వాళ్లు హిందూమతాన్ని కించపరిచే ఉద్దేశంతో సినిమా తీయటం లేదు. వాళ్లకు తోచిన రీతిలో యింటర్‌ప్రెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది మనకు నచ్చుతుందో లేదో వాళ్లకి తెలియదు. చూసేదాకా మనకీ తెలియదు. మనకు అలవాటు పడిన రూపురేఖల్ని మారుద్దామనుకున్నపుడు ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ అంటూ కాస్తకాస్తగా అలవాటు చేయాల్సింది. అలా కాకుండా వెరైటీగా చూపించి సర్‌ప్రైజ్ చేద్దామని వాళ్లనుకున్నారు. మనం షాక్‌కు గురై వెగటుగా ఉందనుకున్నాం. సినిమా రిలీజు లోపున చూపించి చూపించి అలవాటు చేయవచ్చేమో. గ్రాఫిక్స్ క్వాలిటీ బాగా లేదు వంటి వ్యాఖ్యలపై నేనేమీ చెప్పలేను. అవి సాంకేతికతకు సంబంధించిన విషయాలు. పాత్రల రూపురేఖల గురించే నేను వ్యాఖ్యానిస్తున్నాను.

వానరజాతి వారిని కోతులుగా చూపించారని కొందరు కోపగించుకున్నారు. వాళ్లు కోతులా? మనుష్యులా? కోతులైతే మనుష్యులతో ఎలా సంభాషిస్తాయి? మనుషుల లాగానే శాస్త్రాలు ఎలా అభ్యసిస్తాయి? నేను చిన్నపుడు ఏదో పుస్తకంలో చదివాను. కిష్కింధలో ఉండే కొన్ని జాతుల వారు గోచీలను పొడుగ్గా ధరించేవారని, వాటిని వాల్మీకి తోకలుగా భ్రమించాడట. సంజయుడు కురుక్షేత్ర యుద్ధం చూసినట్లు, వాల్మీకి రాముడి నడిచిన మార్గంలో నడుస్తూ రికార్డు చేయలేదు. చూసినవారెవరో చెప్పి ఉంటారు. ఆయన గ్రంథస్తం చేసి ఉంటారు. ఈ గోచీల తర్కంతో వానరస్త్రీలకు తోకెందుకు లేదనే ప్రశ్న పరిష్కారమౌతుంది. స్త్రీలు మొలకు గుడ్డ చుట్టుకుంటారు తప్ప గోచీలు పెట్టుకోరు కదా!

రామాయణాన్ని తార్కికంగా పరిశీలించిన ప్రొఫెసర్ కవనశర్మ గారి ‘‘రామకాండం’’ పుస్తకాన్ని వచ్చే వ్యాసంలో పరిచయం చేస్తాను. ఆయనన్నా, ఆయన రచనలన్నా నాకు చాలా గౌరవం. పురాణగాథలను అభూతకల్పనలుగా కొట్టి పారేయలేమని, వాటికి చారిత్రక మూలం ఉంటుందని, అయితే అతిశయోక్తులు, అసత్యాలు వచ్చి చేరడంతో ఆధునికులు ఆమోదించడానికి యిబ్బంది పడతారని ఆయన అభిప్రాయం. నా అభిప్రాయమూ అదే. కమ్యూనికేషన్ యింత పెరిగిన యీ రోజుల్లో కూడా అతిశయోక్తులు ఏ స్థాయిలో ఉంటున్నాయో చూస్తున్నాం. నచ్చినవారిని ఇంద్రుడు, చంద్రుడు అనేస్తున్నారు. సమాచారప్రసారం తక్కువగా ఉండి, నోటిమాట ద్వారానే వార్తలు ప్రచారమయ్యే ఆ రోజుల్లో ఆవ గింజ వెయ్యి మందిని దాటుకుని వెళ్లేసరికి నేరేడు గింజ కావడంలో ఆశ్చర్యం లేదు. ఇంకో రెండు తరాలు గడిచేసరికి అది కొబ్బరికాయ కావడంలో వింత లేదు.

పైగా విజేతల కథ గ్రంథస్తం అయ్యేటప్పుడు తప్పకుండా మాటలు కోటలు దాటుతాయి. 19వ శతాబ్దం, 20వ శతాబ్దం మొదటిలో కూడా కవుల రచనలు చూశాం. ఒక తాలూకా అంత కూడా లేని సంస్థానాన్ని పాలించేవాణ్ని సైతం కవులు ‘నాలుగు సముద్రాల పర్యంతం వ్యాపించి ఉన్న నీ సామ్రాజ్యం’ అంటూ పొగిడిన పద్యాలు అనేకం కనబడతాయి. ఈ వర్ణనలన్నీ దాటుకుని అసలు నిజాలను కనిపెట్టడం శ్రమతో కూడిన పనే. ‘రామాయణం ఒకప్పుడు జరిగిన చరిత్రకి సాహిత్యరూపం అనే స్పృహతో, దానిలో అభూతకల్పనలుంటే వాటిని తొలగించి చూడాలనే స్పృహతో రాస్తున్నా’ అంటూ అయన ‘‘రామకాండం’’ అనే పుస్తకాన్ని పదేళ్ల క్రితం రాశారు. ఆయన సైంటిస్టు. ఇతిహాసాలపై పట్టు కలవారు. ప్రతీదాన్ని శాస్త్రీయంగా తర్కించగల నైపుణ్యం ఉన్నవారు. ఆయన రామాయణాన్ని ఎలా చెప్పారనేది ‘‘రామాయణ పాత్రలు’’ వ్యాసంలో చెప్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2022)

mbsprasad@gmail.com

Show comments