Urvasivo Rakshasivo Review: మూవీ రివ్యూ: ఊర్వశివో రాక్షసివో

టైటిల్: ఊర్వశివో రాక్షసివో
రేటింగ్: 2.75/5
తారాగణం: అల్లు శిరీష్, అను ఇమాన్యువల్, ఆమని, వెన్నెల కిషోర్, పృథ్వి తదితరులు
కెమెరా: తన్వెర్ మీర్
సంగీతం: అచ్చు రజమణి 
ఎడిటింగ్: కార్తికా శ్రీనివాస్
నిర్మాతలు: తమ్మారెడ్డి భరద్వజ, ధీరజ్ మొగిలినేని 
దర్శకత్వం: రాకేష్ శశి 
విడుదల తేదీ: 4 నవంబర్ 2022

తమిళంలో 2018లో వచ్చిన "ప్యార్ ప్రేమ కాదల్" కి తెలుగు రీమేక్ "ఈ ఊర్వశివో రాక్షశివో". ఎక్కడా సొంత క్రియేటివిటీకి పని పెట్టుకోకుండా హీరో హీరోయిన్ల పేర్లతో సహా తమిళమాతృక నుంచి యథాతధంగా దింపేయడం జరిగింది. అయితే ఎంత లేదన్నా సంభాషణల రచన, అవి చెప్పడంలో టైమింగ్, నటీనటుల అభినయం మాత్రం సొంతమని చెప్పుకోవాలి. 

మొదట ఈ సినిమాకి బజ్ లేదు. అయితే బాలకృష్ణ ప్రొమోషన్స్ కి రావడంతొ కాస్త ఊపందుకుంది. విడుదల దగ్గరపడుతున్నప్పటి నుంచీ ఈ సినిమా ఒకటుందని తెలిసేలా ప్రొమోషన్స్ అయితే చేసారు. 

ఎంత ప్రయత్నిస్తున్నా ఒక లెవెల్ దాటి వెళ్లకుండా ఉన్న అల్లు శిరీష్ కెరీర్ ని ఈ సినిమా ఎంతవరకు ప్రభావితం చేయగలదో చూద్దాం. 

ఈ సినిమాలో కథ కన్నా కథనానిదే పైచేయి. దీనికి టార్గెట్ ఆడియన్స్ యూత్ మాత్రమే. సహజీవనంలో ఉన్న ఆకర్షణని, ఈజ్ ని చెప్పే సినిమా ఇది. ప్రతి పెళ్లి చిరకాలం బంధంగా ఉండడం సాధ్యం కాదు. ఎన్నో విడాకులౌతుంటాయి. కనుక పెళ్ళిచేసుకోకుండా సహజీవనంలో ఉండడాన్ని తక్కువగా చూడాల్సిన అవసరం లేదన్న పాయింటు మీద నడిచే కథ. 

శ్రీ, సింధు ఒకరినొకరు ఇష్టపడతారు. శ్రీ కి ఆమెని పెళ్లి చేసుకోవాలనుంటుంది. కానీ ఆమె "అన్నిటికీ" ఓకేనే కానీ పెళ్లికి విరుద్ధం. మొత్తానికి సహజీవనానికి తెరలేపుతారు. ఒక పక్క శ్రీకి ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లిచూపులు చూస్తుంటారు. తన సహజీవనాన్ని రహస్యంగా పెట్టి ఈ ఇబ్బందులన్నీ ఎలా దాటుకుపోతుంటాడన్నది హిలారియస్ గా తీసారు ఒరిజినల్లో లాగానే. 

అలాగే సింధుకి హోటల్ బిజినెస్ పెట్టడం కల. అది నెరవేరాలంటే పెళ్లి, పిల్లలు అనే పెద్ద పెద్ద బాధ్యతలు పెట్టుకోకూడదనుకుంటుంది. చివరికి ఆమె మారుతుందా, లేక అతను మారతాడా అనేది కథ? 

ఈ కథలో ఎండింగ్ ప్రెడిక్టెబుల్ గా లేకపోవడం ఒక ముఖ్యమైన ప్లస్ పాయింట్. 

చివరికిచ్చిన సందేశంలో మంచిచెడులు, సమాజం మీద ప్రభావం వగైరా చర్చలను పక్కనపెడితే సినిమావరకు కన్విన్సింగ్ గా, ప్రాక్టికల్ గా, సరదాగా ముగిసింది. 

టెక్నికల్ గా చూస్తే అచ్చురాజమణి సంగీతం బాగుంది. ఒకటి రెండు పాటలైతే మొదటిసారే వింటున్నా కూడా బాగున్నాయి. కెమెరావర్క్ రిచ్ గా బాగుంది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా తమిళ మూలానికి సమాంతరంగా సాగింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతమని అనలేం కానీ ఎక్కడా సన్నివేశం డౌన్ అవ్వకుండా, డల్ గా అనిపించకుండా కాపాడింది. 

సంభాషణల్లో డబుల్ మీనింగ్స్ దొర్లాయి. ప్రీమారిటల్ సెక్స్ గురించి చెబుతూ "అయినా ఈ రోజుల్లో లైసెన్సులు, ఆర్సీ బుక్కులు ఎవరడుగుతున్నారండి..హెల్మెట్ ఉంటే చాలు నడపడానికి" లాంటి డయాలాగ్స్ కి హాల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఇలాంటివి మరి కొన్ని ఉన్నాయి. 

అలాగే అల్లు శిరీష్- అను ఇమాన్యువల్ మధ్యన సాగే మొదటి ఫోన్ కాల్ సీన్ నవ్విస్తుంది. కథ లేకుండా మొమెంట్స్ తో నడుస్తూ సమయం తెలీకుండా ఉంటుంది చాలాసేపటివరకు. 

దర్శకుడిగా రాకేష్ శశి ఈ సినిమాతో తనని తాను నిరూపించుకున్నాడు. మూలాన్ని మార్చి ఏదో చేయకుండా ఉన్నదున్నట్టు తీసి టార్గెట్ తెలుగుప్రేక్షకులని మెప్పించాడు. 

నటీనటుల విషయానికొస్తే అల్లు శిరీష్ ఓవర్ హీరోయిజం లేని హంబుల్ పాత్రలో ఒదుగుతాడని ఒప్పించాడు. నటనపరంగా మరింత స్కోప్ ఉన్నా తాను చేయగలిగినంత వరకు చక్కగానే చేసాడు. 

అను ఇమాన్యువల్ మేకప్ కానీ, సింపుల్ ఎక్స్ప్రెషన్స్ కానీ కట్టిపారేసేలా ఉన్నాయి. అయితే సెంటిమెంటల్ సీన్స్ ని ఆమె అంతగా పండించలేకపోయింది. 

సునీల్ మళ్లీ పాతతరహా కామెడీ పాత్రలోకి వచ్చాడు. తాను సహజంగా ఆకట్టుకునేలా చేయగలిగేది ఇలాంటి కామెడీయేనని మరో సారి ప్రూవ్ అయింది. వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగుంది. 

తల్లిపాత్రలో ఆమని కూడా ఒదిగిపోయింది. క్యారెక్టర్ నటిగా ఆమె మరింత బిజీ కావొచ్చు. హీరో తండ్రిగా కేదార్ శంకర్, హీరోయిన్ తండ్రిగా "పెళ్లి" పృథ్వి కూడా పాత్రలకు సరిపోయారు. 

పైన చెప్పుకున్నట్టుగా ఇది పూర్తిగా యూత్ ని టార్గెట్ గా చేసుకుని తీసిన సినిమా. లిఫ్ట్ లో లిప్ లాకులు, ప్రీమారిటల్ సెక్స్, డబుల్ మీనింగ్ డయలాగులు..ఇవన్నీ ఈ జానర్లో ఈ టార్గెట్ ఆడియన్స్ ముందు నిలబడడానికి సేలబుల్ పాయింట్స్ అని గట్టినా నమ్మి తీసారీ చిత్రాన్ని. అయితే క్లైమాక్స్ కి వచ్చేసరికి కాస్త హెవీ అయినట్టు అనిపించినా ఎండింగ్ సీన్ మళ్లీ యూత్ కి నచ్చినట్టుగా తీసి ముగించారు. 

ప్రస్తుతం సమాజంలో యూత్ ఆలోచనలకి అద్దం పట్టే అంశాన్ని ఎత్తుకుని, దానికి కాస్తంత కామెడీని జోడించి సరదాగా సాగిపోయే విధంగా మలచిన 143 నిమిషాల కాలక్షేపచిత్రం ఈ "ఊర్వశివో రాక్షశివో".

బాటం లైన్: రాక్షసి మాత్రం కాదు

Show comments