ఎమ్బీయస్‍: గుజరాత్‌కు తరలిన తైవాన్ ప్రాజెక్టు

తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ, అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూపు కలిసి జాయింట్ వెంచర్ (జెవి)గా ఏర్పడి, రూ.1.54 కోట్ల పెట్టుబడితో ఒక సెమికండక్టర్ ప్రాజెక్టును ఇండియాలో పెడదామనుకున్నాయి. దానికై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర పోటీ పడ్డాయి. గుజరాత్ కూడా పోటీ పడబోయింది కానీ జెవి తొలిదశలోనే దాన్ని తప్పించేసింది. చాలా వడపోతల తర్వాత 2021 డిసెంబరులో మహారాష్ట్రలో పెడదామని నిర్ణయించింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం పుణెలోని తాలేగావ్ ఇండస్ట్రియల్ బెల్ట్‌లో పెట్టమని సూచించింది. 2022 ఫిబ్రవరిలో వేదాంత టీము వచ్చి ఆ స్థలాన్ని చూసి ఓకె చేసింది. ప్రాజెక్టుకి ఏయే రాయితీలు యివ్వాలో చర్చలు జరిగాయి. జూన్ 30న ముఖ్యమంత్రిగా ఏకనాథ్ శిందే వచ్చారు. జులై 15న మహారాష్ట్ర ప్రభుత్వంలోనే హై పానెల్ వాటికి ఆమోదముద్ర వేసింది. జులై 26న శిందే వేదాంతకు లేఖ ద్వారా షరతులు ఒప్పుకుంటున్నట్లు తెలియపరిచారు. బహిరంగ ప్రకటన చేశారు. జులై 29న ఎంఓయు (అంగీకార ఒప్పందం) సంతకాలు చేద్దామని ప్రతిపాదించారు.

దీనికి రెండు రోజుల తర్వాత జులై 28న గుజరాత్ ప్రభుత్వం ‘గుజరాత్ సెమికండక్టర్ పాలసీ’ 2022-27ని ప్రకటించింది. అహ్మదాబాద్‌కు 110 కి.మీ. దూరంలో ఉన్న ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెటం రీజియన్‌లో ‘సెమికాన్ సిటీ’ని పెడతామని ప్రకటించింది. అంతే, మహారాష్ట్రలో ప్రాజెక్టు పెట్టే పనులు ఆగిపోయాయి. కంపెనీ వాళ్లు మహారాష్ట్ర మంత్రులను తప్పించుకుని తిరిగి, కేంద్రంతో సమాలోచనలు జరిపారు. ఒప్పందంపై సంతకాలు పెట్టలేదు. సెప్టెంబరు 5న వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ మోదీని కలిసి ప్రాజెక్టును గుజరాత్‌లో పెట్టే విషయమై మాట్లాడారు. వెంటనే ఫడణవీస్‌కు ఫోన్ చేసి మేం గుజరాత్‌కు వెళ్లిపోతున్నాం అన్నారు. సెప్టెంబరు 13న కంపెనీ గుజరాత్ ప్రభుత్వంతో అంగీకార ఒప్పందం చేసుకుంది.

ఆ విధంగా ఏడు నెలల మహారాష్ట్రకు ప్రయత్నం వ్యర్థమై లక్షన్నర కోట్ల ప్రాజెక్టు నెల వ్యవధిలో గుజరాత్‌కు తరలించ బడింది. దీనిపై మహారాష్ట్ర భగ్గుమంటోంది. ప్రతిపక్షాలు శిందేను, ఫడణవీస్‌ను తిట్టి పోస్తున్నారు. శిందే తప్పంతా ఉద్ధవ్ ప్రభుత్వానిదే అంటున్నాడు. ఫడణవీస్ ‘‘తరలింది పాకిస్తాన్‌కు కాదు, మన తమ్ముడు లాటి గుజరాత్‌కే’’ అని సర్ది చెప్పబోయాడు. కానీ 2 లక్షల మందికి రావలసిన ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు పోయాయన్న బాధ, ఐదేళ్లలో జిఎస్‌టి ద్వారా రూ.27 వేల కోట్ల ఆదాయం పోయిందన్న వ్యథ మహారాష్ట్రలో ఉంది.

వివరాలలోకి వెళ్తే వేదాంత గ్రూపు మన దేశంలో సెమికండక్టర్ ఫాబ్రికేషన్ ఎకోసిస్టమ్ తలపెట్టింది. డిజిటల్ కన్‌స్యూమర్ ఉత్పాదనల్లో సెమికండక్టర్ చిప్స్‌ను ఉపయోగిస్తారు. కార్ల నుంచి మొబైల్ ఫోన్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల దాకా అన్నిటిలో యివి ఉపయోగపడతాయి. సెమికండక్టర్‌ల అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబరులో ‘ఇండియా సెమికండక్టర్ మిషన్’ పేర సెమికండక్టర్‌లను ఇండియాలో భారీగా తయారు చేయాలని పిలుపు నిచ్చింది. వేదాంత గ్రూపు, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో 60-40 నిష్పత్తిలో జెవి ఏర్పాటు చేసుకోగానే ఆ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు పోటీ పడ్డాయి. వీటన్నిటిలో ఐటీ హ్యూమన్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. పైగా అన్ని ప్రభుత్వాలు భారీ రాయితీలు యిస్తానన్నాయి. గుజరాత్ తాము సెమికండక్టర్ హబ్‌గా డెవలప్ చేస్తున్న ధోలేరాలో పెట్టమని ఆఫర్ చేస్తూ పోటీ పడింది కానీ కంపెనీ తొలి దశలోనే దాన్ని తప్పించి వేసింది.

‘అక్కడి నేల బురదగా ఉండి అనువుగా లేదు. దాన్ని సవ్యంగా చేసుకోవాలంటే చాలా డబ్బే ఖర్చవుతుంది. నీటి వసతి తక్కువ, దొరికే నీటిలో ఉప్పును తీసివేసే ప్రక్రియ (డీసాలినైజేషన్ ప్రాజెక్టు) ఖర్చుతో కూడినది. నీరు పొదుపుగా వాడుకోవాలి. వాడినదాన్ని రీసైకిల్ చేయాలి. స్కిల్డ్ మాన్‌పవర్ దొరకడం యితర ప్రాంతాలతో పోలిస్తే కష్టం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కస్టమర్లు లేరు. సప్లయి చైన్ ఏర్పరుచుకోవడానికి సమయం, శ్రమ అవసరం. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు సంబంధించిన వాతావరణం పెద్దగా లేదు. ఆ ఊరి వాతావరణం అంత బాగా ఉండదు. ధోలేరాను కొత్తగా అభివృద్ధి పరుస్తున్నారు కాబట్టి, ప్రతీదానికీ అన్నీ వెతుక్కోవాలి.’ అనే కారణాలను కంపెనీ యింటర్నల్ రిపోర్టు పేర్కొందని మా సమాచారం అంటూ ‘‘ఇండియా టుడే’’ రాసింది. ఇది అబద్ధమని మనం కొట్టిపారేయవచ్చు కానీ ఒక విషయం మనం గుర్తించాలి.

గుజరాత్‌లో పెడతామని సెప్టెంబరు 13న ఒప్పందం జరిగినా, యిప్పటిదాకా ఎక్కడ పెడతారో తేల్చుకోలేక పోయారు. గుజరాత్ చూపించిన స్థలాలు కంపెనీకి ఆమోదయోగ్యంగా లేవని అనుకోవాలి. నిజానికి ఏ ప్రాజెక్టయినా, ఏ ఫ్యాక్టరీ ఐనా పెట్టే స్థలం ముఖ్యం. అది అన్ని విధాలుగా అనువుగా ఉందంటేనే ముందుకు వస్తారు. ఎక్కడ పెట్టాలో తేల్చుకోకుండానే గుజరాత్‌కు వచ్చేస్తున్నాం అని కంపెనీ అనడం చాలా వింతగా ఉంది. నిజానికి పుణెకు 35 కి.మీ. ల దూరంలో ఉన్న తాలేగావ్ 4న ఫేజ్ తమకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ యిప్పటిదాకా అభిప్రాయపడింది. 200 కిమీల వ్యాసార్థంలో హైలీ డెవలప్‌డ్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి. వాటిలో ఎలక్ట్రో మేగ్నటిక్ కంపాటబిలిటీ ఉన్న విడి భాగాలు తయారు చేసే యూనిట్లు కూడా అనేకం ఉన్నాయి. కస్టమర్లు కూడా అందుబాటులో ఉన్నారు. రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండవు కాబట్టి భూప్రకంపనలు ఉండవు.  

మహారాష్ట్ర ప్రభుత్వం కూడా యీ ప్రాజెక్టుకి రూ. 39 వేల కోట్ల ఇన్సెన్టివ్‌లు యిచ్చింది. భూమి, నీరు విషయంలో సబ్సిడీలు యిచ్చింది. మాన్యుఫాక్చరింగ్‌కై 30శాతం దాకా కాపిటల్ సబ్సిడీ, విద్యుత్ విషయంలో పవర్ డ్యూటీ ఎత్తివేత, విద్యుత్ రేట్లలో యూనిట్‌కు రూపాయి చొప్పున సబ్సిడీ, సౌరవిద్యుత్ అందించడానికై 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు కడతానంది. ఇవి వర్కవుట్ చేయడానికి తమ ప్రభుత్వం ఎన్నో చర్చలు జరిపింది, ఎంతో కృషి చేసింది అంటున్నాడు ఉద్ధవ్ ఠాక్రే. ‘అవన్నీ ఫలించి కంపెనీ ఒప్పందంపై సంతకం పెట్టబోయే సమయానికి జూన్ 30న శిందే ముఖ్యమంత్రి అయ్యాడు. నెల తిరక్కుండా ప్రాజెక్టును గుజరాత్‌కు పంపించేశాడు. లేదా బిజెపి గుజరాత్‌కు తరలించుకుని పోతూ ఉంటే గుడ్లప్పగించి చూస్తూన్నాడు. మహారాష్ట్రకు యింత అన్యాయం జరుగుతున్నా, తన పదవి పోతుందనే భయంతో కిమ్మనడం లేదు. ఫడణవీస్‌కు రాష్ట్ర ప్రయోజనాల కంటె పార్టీ ప్రయోజనాలే ముఖ్యం.’ అని ఆరోపించాడు.

మహారాష్ట్ర యిస్తానన్నదాని కంటె గుజరాత్ అమోఘమైన సౌకర్యాలేమీ యిచ్చేయటం లేదు. వాళ్లది రూ.12 వేల ఇన్సెన్టివ్ పాకేజి మాత్రమే. భూమి విషయంలో తొలి 200 ఎకరాల కొనుగోలుపై 75శాతం సబ్సిడీ. సొంత డిసాలినైజేషన్ ప్లాంట్ కట్టుకుంటే తొలి 5 సంవత్సరాలలో 50శాతం కాపిటల్ సబ్సిడీ, ఉత్పత్తి ప్రారంభమయ్యాక పది సంవత్సరాల పాటు విద్యుత్‌పై యూనిట్‌కు రూ.2ల సబ్సిడీ. విద్యుత్ డ్యూటీ ఎత్తివేసే విషయం ఆలోచించి చెప్తామంది. భూమి కొనుగోలు, లీజు, బదిలీ వ్యవహారాలపై చెల్లించిన స్టాంపు డ్యూటీని తిరిగి యిస్తామని చెప్పింది. వీటికే కంపెనీ గుజరాత్‌కు తరలి వెళ్లడానికి నిశ్చయించుకుంది. మహారాష్ట్ర విషయంలో నిర్ణయానికి రావడానికి చాలా నెలల పాటు సంప్రదింపులు జరిగాయి. గుజరాత్ విషయంలో ఒక నెలలోనే అన్నీ ముగిసిపోయాయి. గతంలో చెప్పిన అభ్యంతరాలన్నీ గాలికి ఎగిరిపోయాయి.

గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రాన్ని నడుపుతున్న బిజెపి పెట్టిన ఒత్తిడికి కంపెనీ లొంగిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని అడ్డుకోలేక పోయిన శిందే, ఫడణవీస్‌లను మహారాష్ట్ర ప్రజలు తప్పు పడుతున్నారు. శిందే ఏమీ చేయలేక ‘రెండున్నరేళ్ల పాటు ఉద్ధవ్ ఠాక్రే తన యింట్లోంచి బయటకు రాకపోవడం చేతనే యిప్పుడు కంపెనీ వెళ్లిపోయింది’ అనే సాకు చెప్పాడు. ఠాక్రే కదలకపోతే తన వంటి మంత్రులు ఏం చేస్తున్నారట? అతను యింట్లోంచి కదిలినా కదలకపోయినా వ్యవహారాలు ముందుకు సాగి, ఎంఓయుపై సంతకాలు పెట్టే ఆఖరి దశకు చేరాయి కదా! ఫడణవీస్ ‘ఇది పోతే పోయింది, యింతకంటె పెద్ద ప్రాజెక్టు యిప్పిస్తానని మోదీ నాకు హామీ యిచ్చారు’ అన్నాడు. ఈ ప్రాజెక్టు యాన్సిలరీ యూనిట్ మహారాష్ట్రకు వస్తుంది లెండి అని భరోసా యిస్తున్నాడు.

ఆ ముక్క చెప్పవలసినది కంపెనీ, యితను కాదు. పైగా గుజరాత్ మన సోదరరాష్ట్రమే కదా అని సర్దిచెప్పాలని చూస్తున్నాడు. పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు తగాదాలు, నీటి తగాదాలు పెట్టుకునేటప్పుడు యీ సోదరభావం గుర్తుకు రాదా? బిజెపి అధిష్టానాన్ని ఎదిరించలేక చెప్పే కబుర్లివి అని సామాన్యుడికి కూడా తెలుసు. ఫడణవీస్ గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా 2015లో యిదే ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని రూ.40 వేల కోట్ల పెట్టుబడి పెడతానంటూ ఎంఓయుపై సంతకం పెట్టింది. తర్వాత యిస్తానంటున్న పన్ను మినహాయింపులు సరిపోలేదంటూ ప్రాజెక్టును తమిళనాడుకి తరలించుకు పోయింది. ఇన్నాళ్లకు అంతకంటె చాలా పెద్ద ప్రాజెక్టు వస్తుందనుకుంటే గుజరాత్ తన్నుకుపోయింది.

ఇదొక్కటే కాదు, దీని తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కై సి-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారు చేసే రూ.22 వేల కోట్ల టాటా-ఎయిర్‌బస్ ప్రాజెక్టు కూడా మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలిపోయింది. దీన్ని ఆదిత్య ఠాక్రే తప్పు పట్టగానే శిందే ‘దానికి సంబంధించి కేంద్ర రక్షణ శాఖ, కంపెనీ మధ్య 2021 సెప్టెంబరు లోనే ఒప్పందం కుదిరింది. దానికి ఉద్ధవే బాధ్యుడు’ అనేశాడు. మరి యిప్పుడు తరలిపోయిన ప్రాజెక్టుకి తను బాధ్యుడని ఒప్పుకుంటున్నట్లా? మహారాష్ట్ర నాగపూరులోని మిహాన్‌ (మల్టిమోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అంట్ ఎయిర్‌పోర్టు నాగపూర్)లో ప్రాజెక్టు పెడదామని చూస్తూండగానే, గుజరాత్‌లో స్థలం కూడా నిర్ణయం కాకపోయినా తరలిపోయింది. ఫాక్స్‌కాన్ ప్రాజెక్టు తీసుకున్నారు కాబట్టి దీన్ని మహారాష్ట్రకు వెనక్కి యిచ్చేస్తారని మహారాష్ట్రులు ఆశ పడ్డారు. కానీ అక్టోబరు 30న వడోదరాలో యీ ప్రాజెక్టును మోదీ ఆవిష్కరించేశారు. దాంతో దానిపై కూడా ఆశ వదులుకోవలసి వచ్చింది.

దేశంలో మూడు చోట్ల బల్క్ డ్రగ్ పార్కులు పెడతామని, అక్కడ తలా వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ప్రతిపాదనలు ఆహ్వానించింది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని కేంద్రం సెప్టెంబరు 1న ప్రకటించింది. ఇప్పుడీ ఫాక్స్‌కాన్ ప్రాజెక్టు చేజారడంతో బల్క్ డ్రగ్ ప్రాజెక్టయినా చేజిక్కించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అది సఫలం కాకపోయినా తనే సొంతంగా రాయగఢ్ జిల్లాలో రోహా, మురుద్ తాలూకాలలో రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పార్కు పెట్టి 50 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షిస్తామని చెప్పుకుంటోంది. 2015లో ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్టులో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్‌సి) పెడదామని ప్రయత్నిస్తే, గుజరాత్‌లోని గిఫ్ట్ (గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ)లో పెట్టి ఫోకస్‌ను ముంబయి నుంచి దానివైపు తిప్పి, దాన్ని హెడ్‌క్వార్టర్స్‌గా చేశారు. అప్పుడు ఫడణవీస్‌పై చాలా విమర్శలు వచ్చాయి. మహారాష్ట్రలో ఐఎఫ్ఎస్‌సి పెట్టాలని ప్రయత్నం యిప్పటికీ సాగుతోంది. అది జరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ఎకనమిక్ జోన్‌గా గుర్తింపు రావాలి. గిఫ్ట్ తరహాలో మాకూ అలాటి గుర్తింపు యివ్వండి అని మహారాష్ట్ర అడుగుతున్నా కేంద్రం యింకా యివ్వలేదు. గిఫ్ట్‌కి పోటీగా ఏదీ రాకూడదని బిజెపి ప్లాను అని మహారాష్ట్రుల భావన.

డైమండ్ వ్యాపారులు స్టాక్ ఎక్స్‌ఛేంజి మాదిరి కార్యకలాపాలు జరిపే డైమండ్ బౌర్స్ ముంబయిలో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన భారత్ డైమండ్ బౌర్స్‌ను పైన చెప్పిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 2010లో 20 ఎకరాల్లో ఒక్కోటి 9 ఫ్లోర్లు ఉన్న 26 టవర్లలో నెలకొల్పారు. 2500 మంది చిన్నా పెద్దా డైమండ్ ట్రేడర్స్ యిక్కడ ఆపరేట్ చేస్తూంటారు. ఇప్పుడు దీనికి పోటీగా గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో 2010లో ప్రారంభించిన డైమండ్ బౌర్స్‌ను విస్తరించింది. డ్రీమ్ (డైమండ్ రిసెర్చ్ అండ్ మర్కంటైల్) సిటీ ప్రాజెక్టు కింద 2000 ఎకరాల్లో పదహారేసి ఫ్లోర్లు ఉన్న 9 టవర్లలో ఉన్న డైమండ్ బౌర్స్‌లో 4000 మంది ట్రేడర్స్ ఆపరేట్ చేయవచ్చు. ఈ నెలలోనే దాని ప్రారంభోత్సవం జరిగాక ముంబయి నుంచి వ్యాపారస్తులు తరలి వస్తారని అంచనా.

ఇలా మహారాష్ట్రకు జెల్ల కొట్టి గుజరాత్ బాగుపడడం బిజెపికి గుజరాత్ ఎన్నికలలో విజయానికి సాయపడుతుందేమో కానీ మహారాష్ట్ర బిజెపి యూనిట్, దానితో చేతులు కలిపిన శివసేన శిందే వర్గం యిబ్బంది పడుతున్నాయి. మహారాష్ట్ర ఋణం యిప్పటికే రూ.6.50 లక్షల కోట్లుంది. పరిశ్రమలు యిబ్బడిముబ్బడిగా వచ్చి, పన్నుల ఆదాయం ద్వారా వడ్డీలైనా కట్టవచ్చేమో అనుకుంటే ప్రాజెక్టులు పోవడం యిబ్బందికరంగా ఉంది. ఇది పోతే పోయింది మరొకటి వస్తుంది అని శిందే ప్రకటించాడు కానీ వాల్‌మార్ట్‌కు చెందిన రూ. 690 కోట్ల ఫోన్‌పే అనే ఫైనాన్షియల్ టెక్నాలజీ అప్లికేషన్ కంపెనీ తన రిజిస్టర్డ్ ఆఫీసును మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు మార్చేసింది. అక్కడైతే మాకు పన్నులు తక్కువ అంది. ఇలాటి విషయాలన్నీ ప్రతిపక్షాలకు ఆయుధాలను అందిస్తున్నాయి.

ముంబయి కార్పోరేషన్ ఎన్నికలు యిప్పటికే ఆలస్యమయ్యాయి. ఈ ఏడాదిలో ఎప్పుడైనా జరగవచ్చు. పుణెలో కూడా త్వరలో జరగనున్నాయి. ఈ తరలింపు వ్యవహారం అధికార కూటమికి యిబ్బందిగా మారవచ్చు. ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంటే అభివృద్ధే అభివృద్ధి అన్నారు. మీ ప్రభుత్వమే రాష్ట్రంలో వచ్చినా పరిస్థితి యిలా వుందేం?’ అని ఓటర్లు అడగవచ్చు. కార్పోరేషన్ ఎన్నికలు ఎలా పోయినా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కేంద్రం వారికి ఓ రెండు ప్రాజెక్టులిచ్చి ఓట్లు రాబట్టడానికి చూడవచ్చు. ఈలోగా శిందే పరువు ప్రతిష్ఠలేమవుతాయో చూడాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2022)

mbsprasad@gmail.com

Show comments