ఎమ్బీయస్‍ కథ: నారీ - నారీ

(నేను రాసిన ‘‘టూ విమెన్ అండ్ ఎ మ్యాన్ టూ’’ అనే ఇంగ్లీషు కథకు యిది స్వీయానువాదం. ఇంగ్లీషు కథ ఎ.పి.టైమ్స్ అనే దినపత్రిక ఆదివారం స్పెషల్‌లో 02 11 1997న ప్రచురితమైంది.)

సవిత ఫోన్ తీసింది. చేసినది దుర్గాదేవి ‘‘సవితా, మన సమితి తరఫున విశాల్ టవర్స్ దగ్గర ఓ నిరసన ప్రదర్శన ఉంది. నాలుగు గంటలకు. రాగలవుగా?’’

‘‘తప్పకుండా! సంగతేమిటి?’’

‘‘అజిత అని కొత్త సభ్యురాలు చేరింది. తన మొగుడు హింసిస్తున్నాడు. విడాకులు యిమ్మంటే యివ్వటం లేదు. అతని ఆఫీసు విశాల్ టవర్స్‌లో ఉంది. వెళ్లి అక్కడే ప్రదర్శన చేద్దామని నిశ్చయించాను. అజితను అక్కడే కలుద్దుగాని. నాకో ఉపకారం చేసిపెట్టు. రీటా, ఆయేషాల నెంబర్లు కలవటం లేదు. మీ ఆఫీసున్న వీధిలోనే వాళ్ల ఆఫీసులూ కాబట్టి వెళ్లి స్వయంగా చెప్పేసి రా.’’

రోడ్డు మీద నడుస్తూ సవిత నిట్టూర్చింది. ఈ అజిత పురుషాహంకారానికి బలైన మరో అమ్మాయన్నమాట. నీతో బతకలేక పోతున్నాను విడాకులియ్యి మొర్రో అని అడిగినప్పుడు యివ్వడానికి ఆ మొగుడు గాడిదకు ఏం తీపు తీసింది? తన మొగుడూ యిలాగే ఏడిపించాడు. తరచు కొట్టేవాడు. పిల్లలు పుట్టలేదు కదా, హింస భరించలేక పోతున్నాను, విడాకులు యిమ్మనమని ప్రాధేయపడితే యివ్వలేదు. పిల్లలు లేరు కాబట్టి, తనకు మగతనం లేదనే సందేహంతో వేరే ఏ అమ్మాయీ చేసుకోదని అతనికి జంకు. ఇప్పుడీ అజితకీ పిల్లలుండి ఉండరు. పిల్లలుంటే వాళ్ల మొహం చూసి కలిసి ఉండండి అని పెద్దవాళ్ల పోరు. లేకపోతే, యిదిగో, యిలాటి సంకోచంతో మొగుడు విడాకులివ్వడు.

తన మొగుడు విడాకులివ్వకపోగా తనపై కిరోసిన్ పోసేసి వంటింట్లో గ్యాస్ స్టవ్‌తో చంపేసి, ప్రమాదంగా చూపిద్దామని చూశాడు. తను పెనుగులాడింది. భర్తను గట్టిగా తోయడంతో గోడకు కొట్టుకుని, మేకు అతని తలలో గుచ్చుకుని రక్తం కారింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపునే చచ్చిపోయాడు.  పోలీసులు తనపై హత్య కేసు పెట్టారు. అప్పుడు పుట్టింటి వాళ్లతో సహా, తన బంధువులెవరూ తన పక్షాన నిలబడలేదు. ప్రముఖ లాయరు దుర్గాదేవి మాత్రమే తన తరఫున వాదించి ఆత్మరక్షణ ప్రయత్నంలో జరిగిన తోపులాట అని నిరూపించి, తనను గట్టున పడేసింది. తన బోటి మహిళల బాగు కోసమే స్త్రీరక్షా సమితి అనే సంస్థ నడుపుతోందని తెలిసి సవిత దానిలో చేరింది. దుర్గాదేవి సమితి పనులు చాలా చెప్తుంది. ఒక్కోసారి అవి తన ఆఫీసు డ్యూటీకి అడ్డు వస్తాయి కూడా. అయినా సవిత ఆవిడ మాట జవదాటదు.

విశాల్ టవర్స్ దగ్గర ముప్ఫయి మందికి మించి లేరు. చాలామంది సభ్యురాళ్లంతే. తమ సమస్య తీరిపోయిన తర్వాత యితరుల కోసం సమయం వెచ్చించడం వేస్టనుకుంటారు. వాళ్ల కర్మ అలా కాలింది, మనమేం చేయగలం అనేసి ఊరుకుంటారు. ముప్ఫయి మందే ఉన్నా గొంతు చించుకుని అరవడంతో ఆ దారిన వెళ్లేవారు చాలామంది పోగడ్డారు. అజిత భర్త రాజేందర్ దుశ్చర్యలను వర్ణిస్తూ తయారు చేసిన కరపత్రాలు ప్రెస్ నుంచి రాకపోవడంతో వీళ్లే వచ్చినవాళ్లందరికీ రాజేందర్ ఎంతటి ఉమనైజరో, భార్యకు విడాకులు యివ్వకుండా ఎలా చంపుకు తింటున్నాడో వివరించి చెప్పసాగారు. ఈ కార్యక్రమం కాస్సేపు సాగాక, మనం ఆఫీసులోకి చొచ్చుకుపోయి అతన్ని నిలదీద్దాం అని దుర్దాదేవి ప్రతిపాదించింది.

కానీ రాజేందర్ ఆఫీసు పని మీద క్యాంప్‌కు వెళ్లాడని ఆఫీసు మేనేజరు చెప్పాడు. ‘‘ఈ సన్నాసి రాజేందర్‌కు చంచా. తనను ఎలాగైనా కాపాడాలని చూస్తున్నాడు.’’ అని అరిచింది అజిత. అతనామె చూసి ‘‘అజిత గారూ, మీకు రాజేందర్ సంగతి తెలుసు కదా. నైస్ గై. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు. అందుకే విడాకులకు ఒప్పుకోవటం లేదు. మీ యిద్దరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటే పోయేదానికి యీ రచ్చంతా ఎందుకు?’’ అని అనునయంగా చెప్పబోయాడు. అజిత రుసరుస లాడుతూ ఏమీ మాట్లాడలేక పోవడం చూసి దుర్గాదేవి కలగజేసుకుంది. ‘‘రాజేందర్ నైస్ అని నువ్వెలా చెప్పగలవు? నీతో యికిలిస్తూ మాట్లాడతాడు కాబట్టా? ఊళ్లో అందరితో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, యింటికి వచ్చి పెళ్లం మీద రుసరుసలాడే మగవెధవల్ని చాలామందిని చూశాను.’’ అని తిట్టిపోసింది.

‘‘... తనో ప్లేబోయ్, ఆడాళ్లతో తిరుగుతాడు అంటోందావిడ. అది మాత్రం నేనొప్పుకోను.’’ అన్నాడు మేనేజర్. ‘‘అదే అంటాను, మీ కొలీగ్స్‌తో తిరక్కపోతే చాలనుకుని సర్టిఫికెట్టు యిచ్చేస్తున్నావ్. బంధువుల్లో, స్నేహితుల్లో, బజారు మనుషులతో తిరగడని నువ్వు చెప్పగలవా? ఇరవై నాలుగ్గంటలూ అతని నీడలాగ తిరగలేవు కదా! నీ అభిప్రాయాలతో నాకేం పని! వాడెక్కడ దొరుకుతాడో అది చెప్పు చాలు.’’ అంది దుర్గాదేవి మండిపడుతూ. ‘‘చెప్పాను కదా, క్యాంప్ కెళ్లాడు. వచ్చేవారం దాకా రాడు.’’ అని అతను కచ్చితంగా చెప్పడంతో దుర్గాదేవి సభ్యురాళ్ల కేసి తిరిగి ‘‘ఆ రాజేందర్ దొరికేదాకా ఏమీ చేయలేం. ఇవాళ్టికిది చాలు. వచ్చేవారం ప్రోగ్రాం గురించి నాకు ఫోన్ చేసి కనుక్కోండి.’’ అంది.

అందరూ కదిలారు. ఆయేషా సవిత దగ్గరకు వచ్చి వెళదామా అంది. ‘‘మీ యిద్దరూ వెళ్లిపోండి. నేనింక ఆఫీసుకి వెళ్లను. సాయంత్రం మా ఫ్రెండుతో కలిసి రాక్సీలో సినిమాకు  వెళుతున్నాను. ఈ ఆఫీసులోనే ఫ్రెషప్ అయిపోయి, యిక్కణ్నుంచే వెళతాను.’’ అంది సవిత. వాష్‌రూమ్ దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ఒకతను ఆదుర్దాగా ‘‘ఆ గ్యాంగు వెళ్లిపోయిందా?’’ అని అడిగాడు. చూస్తే అతను రాజు, తన బాల్యస్నేహితుడు. కానీ అతను తనను గుర్తు పట్టినట్లు లేదు. తన సమాధానం కోసం ఆతృతగా తన మొహంలోకి చూస్తున్నాడు. సవిత మెదడులో లైటు వెలిగింది. అజిత మొగుడు రాజేందర్, రాజూయే కాబోలు. అందరూ దండెత్తి రావడంతో టాయిలెట్‌లో దాక్కున్నాడు. చిన్నప్పటి నుంచి అతనంతే, బిడియస్తుడు, భయస్తుడు. దేన్నీ ధైర్యంగా ఎదుర్కోలేడు. ఎవరినీ ఎదిరించలేడు.

ఈలోగా రాజు సవితను గుర్తుపట్టాడు. ‘‘సవితా!’’ అని గట్టిగా అరిచి, అంతలోనే గొంతు తగ్గించి ‘‘నువ్వేమిటి? ఇక్కడున్నావ్?’’ అని అడిగాడు. చిన్నప్పటి నుంచి సవిత అతన్ని అట పట్టిస్తూనే ఉండేది. అదే గొంతుతో ‘‘నువ్వన్నావ్ చూడు గ్యాంగ్ అని. నేనూ ఆ గ్యాంగ్‌లో సభ్యురాలినే. మేమంతా అజిత కాసనోవా మొగుణ్ని పట్టుకోవడానికి దండెత్తి వచ్చాం. నేను యిక్కడ సోదా చేయడానికి వచ్చా.’’ అంది. వెంటనే రాజు గిర్రున తిరిగి టాయిలెట్ లోపలకి వెళ్లబోయాడు. సవిత అతని భుజం పట్టుకుని ఆపి ‘‘కంగారు పడకు, అంతా వెళ్లిపోయారులే. వెళ్లి నీ సీటులో కూర్చో, మొహం కడుక్కుని వస్తాను. చాయి తాగించు.’’ అంది.

 ‘‘ఏమిటి, చాయ్ అంటే చాయి ఒక్కటేనా? బిస్కట్లూ అవీ లేవా? అంత కక్కుర్తా?’’ అంది సవిత కుర్చీలో కూర్చుంటూ. ‘‘పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణసంకటం అన్నట్లు నీ వెక్కిరింతలకు యిదా సమయం? ఎలాటి చిక్కుల్లో పడ్డానో చూడు. ఇప్పుడే యిక్కణ్నుంచి పారిపోకపోతే నీలాగ ఏ అమ్మాయైనా నక్కి ఉంటే నా కొంప మునిగిందే.’’ అన్నాడు రాజు. ‘‘ఓ పని చేద్దాం, రాక్సీలో సినిమాకు రెండు టిక్కెట్లు బుక్ చేశాను. మా ఫ్రెండుకి రావద్దని ఫోన్ చేసేస్తాను. నువ్వు రా. సంగతేమిటో వివరంగా చెప్పు.’’ అంది సవిత.

రాజు, అజితలు తన కారణంగా గొడవలు పడుతున్నారని విని ఆశ్చర్యపోయింది సవిత. రాజు, తను యిరుగుపొరుగు వాళ్లు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఉత్తరాలు రాసుకున్నారు. రాజు చెల్లెలి పెళ్లి అయ్యేదాకా ఆగుదామనుకున్నారు. అయితే కుండమార్పిడి ప్రతిపాదన ఒకటి వచ్చింది. అజితను రాజు చేసుకునేట్లయితే అజిత అన్నకు రాజు చెల్లెల్ని చేసుకుంటామన్నారు. రాజు తలిదండ్రులు సరేననేశారు. రాజు బుద్ధిమంతుడు కాబట్టి సవితతో ఎప్పుడూ హద్దులు దాటలేదు. అందువలన యిలాటి ప్రతిపాదన వస్తే అతను అమ్మానాన్నలకు ఎదురు చెప్పడని సవిత ఊహించి, ‘సరే మంచిదే, చేసుకో అంది. అలా అనగానే రాజు మొహంలో కనబడిన రిలీఫ్ చూసి మాత్రం మండిపడింది. నీలాటి పిరికివాణ్ని ప్రేమించడం నాదే తప్పు అనుకుని పై చదువులకు సిటీ వెళ్లిపోయింది. పెళ్లికి కూడా వెళ్లలేదు.

ప్రతాప్‌తో జరిగిన పెళ్లి కారణంగా జీవితంలోని మధురఘట్టాలన్నిటినీ మర్చిపోయింది. వాటిలో రాజుతో నడిచిన రొమాన్సు కూడా ఉంది. కాపురంలో గొడవల గురించి అడుగుతారేమోనన్న భయంతో తన స్నేహితులు, క్లాస్‌మేట్స్ ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోలేదు. ఈ దూరప్రదేశానికి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వచ్చేసింది కూడా. దాంతో ఎవరి సంగతీ తెలియకుండా పోయింది. దానికి తనేమీ చింతించలేదు. తన మస్తిష్కంలో రాజు ఒక వెలిసిన ఫోటోలా మిగిలిపోయాడు.

కానీ రాజు మనసులో సవిత జ్ఞాపకాలు సజీవంగా నిలిచిపోయాయి. ఒక విధేయుడైన భర్తగా అతను అజితకు కట్టుబడే ఉన్నాడు కానీ సవితను మనస్సులోంచి తీసివేయలేదు. పెళ్లయిన కొత్తల్లోనే చాలా నిజాయితీగా ఫలించని తన ప్రేమకథను భార్యకు చెప్పాడు. అజిత దానితో తృప్తి పడక రాజు చెల్లెల్ని అడిగితే ఔను వాళ్లు పెళ్లి చేసుకుందామనుకున్నారని ఆమె చెప్పింది. అజిత తన ఊహాశక్తి నుపయోగించి, వారి మధ్య నడిచినదాన్ని గోరంతలను కొండంతగా ఊహించుకుంది. ఇక అప్పణ్నంచి తన భర్త జీవితాన్ని దుర్భరం చేసింది. ఒకసారి ప్రేమించాక ఆ మనిషిని మర్చిపోవడం అసాధ్యమని, సవితను మనసులో ఉంచుకుని భౌతికంగా మాత్రమే తనతో కలిసి ఉంటున్నాడని ఆరోపించింది, ఒకసారి ప్రేమలో పడినవాడు మళ్లీమళ్లీ పడుతూంటేనే ఉంటాడని తీర్మానించి, యిప్పుడు కూడా తన కొలీగ్స్‌తో, బంధువులతో, యిరుగుపొరుగుతో వ్యవహారాలు నడుపుతున్నాడంటూ వేధించింది.

అజిత ప్రవర్తనకు ఒక కారణం ఉంది. ఆమె తండ్రికి ఒక ఉంపుడుగత్తె ఉండేది. ఆస్తంతా ఆమె పేర రాసేసి, సొంత భార్యకు పుట్టిన పిల్లలకు యీ కుండమార్పిడి పెళ్లి చేసేసి చేతులు దులుపుకున్నాడు. మగవాళ్లంతా యింతే అనే అభిప్రాయంలో ఉన్న అజితకు భర్తకు ప్రేమ వ్యవహారం ఉందని తెలియగానే అభద్రతాభావం పట్టుకుంది. తన భర్తను అదుపులో పెట్టుకోకపోతే, ఎవత్తయినా వచ్చి ఎత్తుకుపోయి, తనను వీధిలో పడేస్తుందన్న భయం పీడించింది. లేనిపోని అనుమానాలతో భర్తను అనునిత్యం సాధిస్తూండడంతో అతను మాట్లాడడం తగ్గించివేసి అంతర్ముఖుడై పోయాడు. పిల్లలు కలగకపోవడం  కూడా భార్యాభర్తల మధ్య అనుబంధం క్షీణించడానికి ఒక కారణమైంది. ఇదే సమయంలో సవిత తన భర్తను చంపిందని పేపర్లలో రావడంతో అజితకు కొత్త సందేహాలు పుట్టుకుని వచ్చాయి. సవిత, తన భర్త కలిసి కూడబలుక్కుని, ఆమె తన భర్తను, యితను తనను చంపేసి, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని భావించింది. చంపకపోయినా పిల్లలు కలగలేదన్న కారణం చెప్పి విడాకులు తీసుకుంటాడని అనుకుంది. అదే జరిగితే ఉద్యోగం లేని తన గతి ఏమిటన్న చింత ఆమెను బాధించి, హిస్టీరిక్‌గా మార్చింది.

ఇంటికి వచ్చినవారితో కూడా ఆమె వింతవింతగా ప్రవర్తించడంతో బంధువర్గాల మధ్య తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. వాళ్లకు దూరంగా ఉంటే మంచిదని రాజు యీ వూరికి బదిలీ చేయించుకున్నాడు. అయితే దురదృష్టం ఎలా ఉందంటే ఓ సారి ఓ క్లాస్‌మేట్ కనబడి ‘నీకు తెలుసా? సవిత కూడా యీ ఊళ్లోనే ఉంటోంది.’ అని అజిత ముందే రాజుతో అన్నాడు. ఓహో యిదంతా వాళ్లిద్దరూ కలిసే ప్లాను చేశారన్నమాట అనుకుంది అజిత. ఇతనితో కలిసి ఉంటే నాకు చావు మూడుతుంది. విడాకులు తీసుకుని పోతే మంచిదనుకుని ఆమె ఒకరోజు యిల్లు విడిచి వెళ్లిపోయింది. దుర్గాదేవిని ఆశ్రయించింది.  

అంతా విని సవిత అడిగింది. ‘ఇదంతా చాలాకాలం నడిచింది కదా. చివర్లో వెళ్లిపోవడానికి దారి తీసిన సంఘటన ఏమిటి? నేను ఊళ్లోనే ఉన్నానని తెలిసినా నువ్వు కాంటాక్ట్ చేయలేదు. నేనైతే నిన్ను దాదాపుగా మర్చిపోయాను. ఇక అజితకు నా గురించి అనుమానం రావడానికి స్కోపెక్కడుంది? తనపై ఉక్రోషంతో ఎవరైనా గర్ల్‌ఫ్రెండ్‌ను ఏర్పాటు చేసుకున్నావా?’’ ‘‘నా మొహం, నేను అప్పటికీయిప్పటికీ ఒక్కలాగానే ఉన్నాను. ఆడవాళ్లతో మాట్లాడడానికే జంకు నాకు.’’ ‘‘మరి తన సతాయింపు భరించలేక నువ్వే యింట్లోంచి పంపించేశావా?’’

‘‘ఏం జరిగిందో చెప్తాను విను. అవేళ నా కప్‌బోర్డులో నీ ఉత్తరాలు కనబడ్డాయి తనకి. విపరీతమైన కోపం వచ్చింది. అవి పాత ఉత్తరాలు, వాటివలన ఎవరికీ ఏ హానీ లేదు అని నచ్చచెప్పాను. వినలేదు. నా ఎదురుగా వాటిని తగలబెట్టు అని పట్టుబట్టింది. నాకు జీవితంలో ఊరట నిచ్చేది ఆనాటి జ్ఞాపకాలే. అందుకని అది మాత్రం అడగకు అన్నాను. వాదోపవాదాలు నడిచాయి. తనకు పౌరుషం పొడుచుకు వచ్చింది. అప్పటికప్పుడు బ్యాగ్ సర్దుకుని బయటకు వెళ్లిపోయి నా మీద నానా రకాల ఆరోపణలూ చేస్తోంది. ఆధారాలు చూపమని ఆమెను ఎవరూ అడగరు. దుర్దాదేవి అండ చూసుకుని యివాళ నా మీద దండయాత్రకు వచ్చింది. నా గోడు చెప్దామంటే వినే రకం కాదు ఆ దుర్దమ్మ.’’

సవితకు ఆ పైన ఏమడగాలో తోచలేదు. తన వలన ఒక కాపురం పాడై పోయిందనే బాధ లోపల్లోపల తినేసింది. నిట్టూర్చి వచ్చేసి, యింటికి వచ్చాక కరువుతీరా ఏడ్చింది. ఆ తర్వాత ఆమెకు తట్టింది. ఈ గొడవలు పడే బదులు రాజు విడాకులకు ఒప్పేసుకోవచ్చుగా, ఎందుకు మొండిపట్టు పడుతున్నాడు? మర్నాడు వాళ్లింటికి వెళ్లి అదే అడిగింది.

‘‘ఎందుకా? నా యిష్టాయిష్టాలతో ప్రమేయం లేదా? నేను పెళ్లి చేసుకుందా మనుకున్నపుడు ఎక్కణ్నుంచో వచ్చి పెళ్లికి తయారై, నీ నుంచి నన్ను దూరం చేసింది. ఇప్పుడు నా మీద చెడ్డవాడనే ముద్ర కొట్టి విడిచి వెళ్లిపోదామనుకుంటోంది. అప్పుడూ తలూపి, యిప్పుడూ తలూపడానికి నేనేమైనా గంగిరెద్దునా? తను ఎన్నయినా ఊహించుకోనీ. వాస్తవమేమిటంటే, నేను ఒంటరిని, చెప్పుకుని ఏడవడానికి కూడా ఎవరూ లేనివాణ్ని. ఇంత గొడవయ్యాక ఎవర్నయినా కట్టుకోగలనా? అసలు ఎవరితోనైనా ఆత్మీయంగా ఉండగలనా? నాకెందుకీ శిక్ష? నేనేం చేశానని? లేనిపోని అనుమానాలు పెట్టుకుని నేరం చేసినది తను. శిక్ష నాకు! నేను విడాకులిస్తే మా చెల్లెలి కాపురం ఏమౌతుందోనన్న భయం కూడా ఉంది. మా బావ తనని వదిలేస్తే..?’’

అంతా విని సవిత నిట్టూర్చింది. ‘‘నీ బాధ అర్థమౌతోంది. మరి ఏం చేద్దామనుకుంటున్నావ్?’’

‘‘తనకు నచ్చచెప్పడానికే చూస్తున్నాను. అనుమానం భూతం నెత్తి మీద నుంచి దిగితే, తనతో సర్దుకుపోవచ్చు. అందుకే వాళ్ల అన్నయ్యను వచ్చి మాట్లాడమని రిక్వెస్టు చేశాను.’’

‘‘మంచిదే, యింతకీ ఆ ఉత్తరాల సంగతేమిటి?’’

‘‘చెప్తే బాధపడతావు.’’

‘‘ఫర్వాలేదు చెప్పు.’’

‘‘ఇన్నాళ్లూ వాటికి చాలా విలువ ఉందనుకున్నాను. కానీ నువ్వు నీ జ్ఞాపకాల్లోంచి నన్ను పూర్తిగా తుడిచి పెట్టేసేవని యిప్పుడు అర్థమైంది. నువ్వు కేసులో యిరుక్కున్నపుడు వచ్చి తోడుగా నిలబడదా మనుకున్నాను. కానీ అజిత భయం చేత రాలేకపోయాను. కానీ మానసికంగా అనుక్షణం నీతోనే ఉన్నాను. నువ్వు మాత్రం నా గురించి పట్టించుకోలేదు. ఏదో యిలా అనుకోకుండా నిన్న తారసిల్లి నా గురించి అడిగావు తప్ప, నీ జీవితంలో నేను నథింగ్. అలాటప్పుడు ఆ ఉత్తరాల గురించి నేనంత పట్టుబట్టడం అవివేకం అనిపిస్తోంది. అజిత తిరిగి రావడానికి ఒప్పుకుంటే, తన ఎదుటే ఆ ఉత్తరాలను కాల్చి బూడిద చేయడానికి నిశ్చయించుకున్నాను.’’

ఇది విన్నాక చిత్రంగా సవిత మనసు బాధపడింది. కానీ అదేమీ కనబరచకుండా ‘‘నువ్వు చెప్పినది చాలా సమంజసంగా ఉంది. కానీ నాకు అర్థం కానిదేమిటంటే తన తృప్తి కోసం నువ్వెందుకు అలా చేయాలి? నీ దృష్టిలో అవి యిప్పుడు చిత్తు కాగితాలే, కానీ నీ పొరపాటు ఏమీ లేనప్పుడు, తనేవో సిల్లీ డిమాండ్స్ చేస్తే నువ్వెందుకు తలొగ్గాలి?’’ రాజు నిట్టూర్చాడు. ‘‘ఇటీజ్ మాన్స్ వరల్డ్ అంటారు. కానీ నన్నడిగితే అది తప్పంటాను. జనాలంతా ఆడవాళ్లంటేనే జాలి చూపిస్తారు. తను చెప్పిందాన్ని నమ్ముతారు తప్ప నేను చెప్పినది ఎవరూ నమ్మరు.’’ సవిత ఒప్పుకోలేదు. ‘‘నా అనుభవం వేరేలా ఉంది. మా ఆయన యాక్సిడెంటల్‌గా చచ్చిపోయినా, నన్నెవరూ నమ్మలేదు.’’ రాజు ఏం మాట్లాడకుండా భుజాలు ఎగరేశాడు. ‘‘ఒక్కోప్పుడు అలా జరగవచ్చు. నేను లోకం తీరు చెప్తున్నాను.’’ అన్నాడు.

సవిత దుర్గాదేవి దగ్గరకు వెళ్లి సమస్తం చెప్పింది. ‘‘నా కారణంగా బాధలు పడిన ఒక అమాయకుడికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి నాకు గిల్టీగా ఉంది. దయచేసి నన్ను యీ ఇస్యూలోంచి తప్పించండి.’’ అని కోరింది. ‘‘అతను నిన్ను గుర్తుంచుకున్నా, నువ్వు అతన్ని మర్చిపోయావన్న గిల్టీ ఫీలింగుతో బాధపడుతున్నావు. దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి అజిత పక్షాన పోరాడనంటున్నావు. కానీ ఒకటి గుర్తుంచుకో. నీతో మానసిక వ్యభిచారం చేస్తూ భార్యకు ద్రోహం చేశాడతను. పోనీ నిన్నేమైనా ఉద్ధరించాడా? అలాటి మూగప్రేమ ఒట్టి దండగమారిది. నీకు అవసరమైనప్పుడు నాబోటి పరాయివాళ్లే వచ్చారు తప్ప అతను వచ్చి నీ పక్కన నిలబడలేదు. ఇక అతని గురించి జాలెందుకు?’’

‘‘నా సంగతి వదిలేయండి. అజిత ఆరోపణలన్నీ ఊహాజనితమని తేలిపోయినప్పుడు మనం అజిత పక్షాన ఎందుకు పోట్లాడాలి? నాతో రొమాన్సు ఉందని ఆమె ఆరోపణ. అసలు అతనెక్కడున్నాడో కూడా నాకు తెలియదని చెప్తున్నాను కదా.’’ ‘‘నువ్వు రాజేందర్ చెప్పినది విని తీర్మానించేస్తున్నావు. అజిత వెర్షన్ కనుక్కోలేదు కదా.’’ ‘‘కరక్ట్. నేను వెళ్లి నా విషయం చెప్పి, తక్కిన కేసుల్లో కూడా యిలాటి అపోహలే ఉన్నాయేమో చెక్ చేసుకోమని అడుగుతాను.’’

‘‘అలాటి పిచ్చిపని చేయకు. ఒక యిల్లాలు తన కాపురం కూల్చుకుంటోందంటే దానికి తప్పకుండా సబబైన, బలమైన కారణం ఉండి తీరుతుంది. రాజేందర్ చెప్పినదే నిజమనుకున్నా, అలాటి అనుమాన పిశాచితో కలిసి ఉండే బదులు విడాకులిచ్చేయవచ్చుగా! ఎందుకు యివ్వనంటున్నాడు? భరణం ఎగ్గొట్టడానికా?’’ అడిగింది దుర్గాదేవి. ‘‘మీరు జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు. మినహాయింపులు కూడా ఉండవచ్చుగా.’’ అంది సవిత. ‘‘భర్త చేతిలో నానా అవస్థలూ పడిన అమ్మాయేనా యిలా మాట్లాడుతోంది?’’ అని దుర్గాదేవి వెక్కిరించింది.

‘‘మేడమ్, బాధితమహిళలు మాత్రమే మీ దగ్గరకు వస్తారు. సుఖంగా కాపురం చేసుకునేవాళ్లు రానే రారు. అందుకని లోకంలోని వనితలందరూ బాధితులే అని మీరనుకుంటూండవచ్చు. నా బోటి దౌర్భాగ్యుల సంగతి వదిలేస్తే మంచి మొగుళ్లు దొరికే ఆడవాళ్లూ లేకపోలేదు. మగాళ్లందరూ మా ఆయనలాటి వాళ్లే కాదు.’’ అంది సవిత కటువుగా.

దుర్గాదేవికి సంభాషణ పొడిగించాలని లేదు. ‘‘సవితా, నేను బిజీగా ఉన్నాను. ఒక విషయం అర్థం చేసుకో. అజిత మన దగ్గరకు వచ్చింది. మనం హెల్ప్ చేయాలి. దట్సాల్. ఇంటి నుంచి వచ్చేశాక తను హాస్టల్లో ఉంటోంది. సంపాదన లేదు. నెలనెలా వెయ్యి రూపాయల ఫీజు కట్టాలి. అది నువ్వు కట్టు, తనకు భరణం వచ్చేదాకా!’’ అని ధాటీగా చెప్పేసి కుర్చీలోంచి లేచింది.

దుర్గాదేవికి ఋణపడి ఉన్న సవిత ఆమె చెప్పినట్లే ఫీజు కడుతూ పోయింది. అయితే దీనివలన ఒక పరిణామం జరిగింది. తన కారణంగా అజిత కాపురం చెడిపోయిందని విన్నాక రాజును యికపై కలవకూడదని చేసుకున్న నిర్ణయం సడలింది. ఇటు అజితకు సాయం చేస్తున్నాను కాబట్టి, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి రాజుకీ సాయం చేయాలనుకుంది. అజిత వెంట తామంతా ఉన్నారు. రాజు పాపం ఒంటరి. ఆ జాలితో ఒక పక్క అతనికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతూ, రిలే నిరాహార దీక్షలు చేస్తూన్నపుడు కూడా తీరిక సమయాల్లో అతనితో సినిమాలకు, హోటళ్లకు వెళ్లేది, కబుర్లు చెప్పేది. ఓ సారి అతని యింటి ఎదుట ప్రదర్శన చేస్తూన్నపుడు ఎవరూ చూడకుండా కన్ను కొట్టింది కూడా. తన ద్విపాత్రాభినయం చూసి రాజు విస్తుపోయాడు.

ఓ రోజు ‘‘ఈ మానసిక సంఘర్షణ తప్పించుకోవాలంటే హాయిగా నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా!’’ అన్నాడు నవ్వుతూ. ‘‘నాతో ప్లాటోనిక్ లవ్ ఉన్నందుకే నీ జీవితం నాశనమైంది. ఇక పెళ్లంటే సర్వనాశనమే.’’ అని ఛట్టున జవాబిచ్చింది సవిత. నిజంగా తను రాజుని పెళ్లి చేసుకుంటే అడ్డుకునేవారెవరూ లేరు. కానీ అలా చేస్తే దుర్గాదేవికి ద్రోహం చేసినట్లే అని ఫీలయింది సవిత. రాజు కాపురం చక్కబడాలనే కోరుకుంది. కానీ అజిత పట్టు వీడటం లేదు. అన్నగారు వచ్చి నచ్చచెప్పబోయినా వినలేదు. తండ్రి కాదు, సోదరుడు కాదు, ఎవరైనా సరే మగాడు మగాడే. ఆడదాన్ని హింసించడంలో సాటి మగాడికి సాయపడేవాడే అని విదిలించేసింది. నీ ఖర్మ అంటూ అతను వెళ్లిపోయాడు.

రెండు నెలల తర్వాత దుర్గాదేవి సవితను పిలిచి ‘ఇకపై నువ్వు అజిత ఫీజు కట్టనక్కరలేదులే’ అంది. ‘‘అబ్బే నాకేమీ యిబ్బంది లేదండి. వ్యవహారం సెటిలయ్యేదాకా కడుతూంటాను.’’ అంది. ‘‘అబ్బే దాని కోసం కాదు. ఈ యిస్యూలోంచి తప్పించమని నువ్వే ఓసారి అడిగావు కదా. ఆలోచించగా అదే కరక్టనిపించింది నాకు. నువ్వు యికపై యీ కేసులో ఇన్వాల్వ్ అవకు. అజితకు సాయం చేయవలసిన అవసరం కూడా లేదులే. ఇంకోళ్లకు చెప్తాను.’’ అంది దుర్గాదేవి. ఆవిడ చెప్పిన మాటలకు సంతోషించాలో లేదో సవిత తేల్చుకోలేక పోయింది. అజితకు సాయం చేస్తున్నానన్న మిషతో రాజుని కలుస్తోంది. ఇకపై రాజుని కలవడం సబబే అని మనసుకు నచ్చచెప్పుకోవడానికి యింకే కారణమూ దొరకదు. దుర్గాదేవి కేసి దీర్ఘంగా చూసింది. ఆవిడ ఏదో దాస్తోందని అనిపించింది. ‘‘ఎవిరీథింగ్ ఆల్‌రైట్ మేడమ్? మీరేదో మథన పడుతున్నా రనిపిస్తోంది నాకు.’’ అంది.

దుర్గాదేవి నిట్టూర్చింది. ‘‘ఒక్కోప్పుడు యీ తిక్క మనుషులను చూసి విసుగొస్తుందనుకో. చెపితే అర్థం చేసుకోరు. నువ్వు ఫలానా అని అజిత కెవరో చెప్పారట. నీ దగ్గర్నుంచి ఏ సాయమూ అక్కరలేదని పట్టుబట్టి కూర్చుంది.’’ ‘‘ఓహ్, అదా కారణం! నన్ను శాసించినట్లే ఆమెను కూడా శాసించి ఉండాల్సింది.’’ కాస్త గట్టిగానే అంది సవిత.

‘‘చూడు, తను ఒక బాధిత గృహిణి. తన సెంటిమెంట్లను మనం గౌరవించాలి. తన అనుమానాలు, భయాలు ఊహాజనితమే కావచ్చు. కానీ యీ సంక్షోభసమయంలో యివన్నీ తర్కించ కూడదు. మనం అండగా నిలిచి, తనలో ఆత్మవిశ్వాసాన్ని నిలిపి, తననుకున్నది సాధించేట్లు సహకరించాలి.’’

‘‘మరి నా ఫీలింగ్స్ మాటేమిటి? నేను అమాయకురాల్ని. వాళ్ల పెళ్లి తర్వాత రాజు ఎక్కడున్నాడో కూడా పట్టించుకోనిదాన్ని. నన్ను ఒక దుర్గార్గులిగా, స్వైరిణిగా చిత్రీకరించి, రేపు కోర్టులో నా పేరు యీడ్వడానికి కూడా అజిత సిద్ధపడుతోందే, దాని గురించి ఏమైనా ఆలోచించారా? నేనెవరో తెలియకుండానే ఆమె నన్ను అసహ్యించుకుంటోంది. ఒకసారి కలిసి నన్ను మాట్లాడనీయండి. అమె భయాలు నిర్హేతుకమని రుజువు చేస్తాను.’’

 ‘‘నీ తరఫున నేనే మాట్లాడాను. అన్నీ విపులంగా చెప్పాను. కానీ ఒట్టి మొండిఘటం. మాట వినటం లేదు. పైగా మన సంస్థకు వ్యతిరేకంగా ఓ స్టేటుమెంటు యిస్తానని బెదిరిస్తోంది కూడా. ప్రాణం విసిగిపోయిందనుకో.’’

‘‘రెండు నెలల్లోనే మీరు ఆమెతో వేగలేక పోయారు. ఏళ్ల తరబడి ఆమెను భరించిన రాజు పరిస్థితి ఏమిటో ఊహించండి, మేడమ్.’’

‘‘కానీ ఆమె మన సమితిలో సభ్యురాలు. మనం మధ్యలో తన చెయ్యి వదిలేయకూడదు...’’

‘‘..మరొక సభ్యురాలి మనోభావాలు దెబ్బతిన్నా, చేయని నేరానికి ఆమె పేరు పత్రికలకు ఎక్కినా ఫర్వాలేదంటారు?’’ అడిగింది సవిత పళ్లబిగువున.

దుర్గాదేవికి కోపం వచ్చింది. ‘‘హద్దు మీరుతున్నావు, సవితా’’

సవిత లేచి నిలబడింది. ‘‘మేడమ్, ఈ సమస్యకు పరిష్కారం నాకిప్పుడే తట్టింది. నేను వెళ్లి రాజుని పెళ్లి చేసుకుంటాను. అది జరగాలంటే అజితకు విడాకులు యివ్వక తప్పదు. మీ అత్యంత అభిమాన సభ్యురాలైన అజితకు కావలసినది దక్కుతుంది. కథ సుఖాంతమౌతుంది. దుర్గాదేవి గారూ, సెలవు. మీరు చేసిన మేలు మర్చిపోయేటంత కృతఘ్నురాలిని కాను. ప్రతీ నెలా వెయ్యి రూపాయల విరాళం పంపుతూంటాను. ఎందుకో తెలుసా, గతంలో చేసినదే కాదు, తాజాగా కూడా గొప్ప ఉపకారం చేశారు. మీ కారణంగానే రాజుని మళ్లీ కలవగలిగాను. నా జీవితం మళ్లీ చిగురిస్తే ఆ పుణ్యం మీదే!’’

గదిలోంచి సవిత విసవిసా వెళ్లిపోతూ ఉంటే దుర్గాదేవి నోరు వెళ్లబెట్టుకుని చూసింది.(స్వీయానువాద సీరీస్‌లో మరొక కథ వచ్చే నెల నాలుగో బుధవారం నాడు)

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)

mbsprasad@gmail.com

Show comments