Ori Devuda Review: మూవీ రివ్యూ: ఓరి దేవుడా!

టైటిల్: ఓరి దేవుడా!
రేటింగ్: 2.5/5
తారాగణం: వెంకటేష్, విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, రాహుల్ రామకృష్ణ, వెంకటేష్ కాకుమాను తదితరులు
కెమెరా: విధు అయ్యన్న
సంగీతం: లియోన్ జేంస్
సంభాషణలు: తరుణ్ భాస్కర్
ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు
నిర్మాత: ప్రసాద్ వి పొట్లూరి
దర్శకత్వం: అశ్వథ్ మారిముత్తు
విడుదల తేదీ: 21 అక్టోబర్ 2022

రెండున్నరేళ్ల క్రితం తమిళంలో వచ్చిన "ఓ మై కడవులే" కి తెలుగు రీమేక్ ఈ "ఓరి దేవుడా!". యువతలో క్రేజ్ సంపాదించుకున్న హీరో విశ్వక్ సేన్, అలాగే ఎఫ్-3 వంటి సినిమాలతో ఇప్పటికీ కమెర్షియల్ హీరోగా రిలవెంట్ గా ఉన్న వెంకటేష్ ఇందులో ప్రధాన ఆకర్షణలు. 

ఇది ఒక వెరైటీ కథ. జీవితంలో ఒక నిర్ణయం తీసుకుని ఇబ్బందులకు గురైనప్పుడు దేవుడు హీరోకి వెనక్కెళ్లి వేరే నిర్ణయం తీసుకోవడానికి రెండో చాన్స్ ఇస్తాడు. అలాగని టైం మెషీన్ కథ కాదిది. దేవుడితో కథ అనగానే గోపాల గోపాల, బ్రూస్ అల్మైటీ లాంటివి గుర్తొచ్చి కొత్తగా అనిపించదు కానీ, రెండవ చాన్స్ తీసుకోవడమనే కాన్సెప్ట్ వెరైటీగా అనిపిస్తుంది. 

సమకాలీన అంశమైన ప్రేమ, పెళ్లి, విడాకులు చుట్టూ తిరుగుతుంది. రచయిత అశ్వథ్ ఐడియాను మెచ్చుకోవచ్చు. ఆడియన్స్ లో టీనేజ్, ఆ పైన వయసువాళ్లంతా కనెక్ట్ అయ్యే అంశమిది. దాని చుట్టూ సరదాగా కథను నడిపిస్తూ, బలవంతపు కామెడీ ట్రాక్ కాకుండా ఉన్న పాత్రలతోటే హ్యూమర్ సృష్టిస్తూ లైటర్ వీన్ లో నడపడం బాగుంది. తరుణ్ భాస్కర్ సంభాషణలు కూడా తేలిగ్గా ఉన్నాయి. అయితే ఇది ఐడియాగా మంచి మార్కులు వేయించుకునే సినిమాయే కానీ కథనం పరంగా ప్రెడిక్టబిలిటీ చట్రంలో పడి సెకండాఫు నుంచి చివరి వరకు ఫోర్స్డ్ గా ఉంటుంది. 

సాంకేతికంగా కెమెరా, సంగీతం విభాగాల్లో తమిళ టెక్నిషియన్స్ నే మళ్ళీ వాడారు. కథనంలో ఇబ్బందేంటంటే విషయమంతా అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగొస్తుంది. కాన్-ఫ్లిక్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి, మళ్లీ సెకండ్ హాఫులో ఎండ్స్ ని కలపడానికి కథకుడు హ్యూమర్ కంటే ఎమోషన్ ని ఎక్కువ వాడాడు. దాంతో సెకండాఫులో ఎంగేజింగ్ ఫ్యాక్టర్ లోపిస్తుంది. 

ఇక ప్రధానమైన మైనస్సల్లా సాంగ్స్. యూత్ ని టార్గెట్ చేసిన కథ కనుక చక్కని పాటలుండాల్సింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మ్యాజిక్ క్రియేట్ చేయలేదు. రొటీన్ గా ఉండి జస్ట్ యావరేజనిపిస్తుందంతే. 

విశ్వక్ సేన్ తన సహజమైన ఈజ్ తో చేసాడు. సగటు హీరోలా కాకుండా ఫిజిక్, హెయిర్ మీద ఏ మాత్రం దృష్టి పెట్టకుండా బాయ్ నెక్స్ట్ డోర్ లుక్కుతోనే కొనసాగుతున్నాడు. ఇలా అతనికి ఎన్నాళ్లు సాగుతుందో చూడాలి. 

హీరోయిన్సిద్దరూ పర్వాలేదు. హీరో చేత "పొట్టి నూడుల్స్" అని అనిపించుకుంటూ మిథిలా పాల్కర్ ఉన్నంతలో ఎమోషన్స్ ని చూపించే ప్రయత్నం చేసింది. మరో హీరోయిన్ ఆశా పాత్రకు తగ్గట్టైతే మరింత స్టన్నింగ్ గా ఉండాలి. అలా లేదు. 

దేవుడి పాత్రలో వెంకటేష్, సహదేవుడి పాత్రలో రాహుల్ రామకృష్ణ కాసేపు చిరునవ్వు తెప్పించారు. అయితే వాళ్ల క్యారక్టర్స్ కి మరింత డెప్త్ ఉండాలి. తేలిపోయినట్టయ్యింది. 

మొత్తంగా ఈ "ఓరి దేవుడా!" ఒక యావరేజ్ చిత్రం. సోషియో ఫాంటసీ ఎలిమెంటుతో టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. అయితే ఓటీటీల పుణ్యమా అని ఒరిజినల్ వెర్షన్ అయిన "ఓ మై కడవులే" చూసేసిన వాళ్లకి కొత్త అనుభూతి ఏ మాత్రం కలగదు. విషయమేంటో తెలియకుండా ఏ అంచనాలు పెట్టుకోకుండా డైరెక్ట్ గా చూసే ఆడియన్స్ కు మాత్రం కొంతవరకు నచ్చొచ్చు. 

బాటం లైన్: జస్ట్ పర్వాలేదు

Show comments