ఎమ్బీయస్‍ కథ: ఓనరమ్మ సుపుత్రుడు

‘’రాజీవ్‍ మదర్‍ వస్తున్నారట యివాళ సాయంత్రం. ఆ ఆల్బమ్‍ బయటకు లాగు. మళ్లీ యింకోసారి మన కథ రిహార్సల్‍ వేసుకుందాం.’’ అంది రజని కంగారు పడుతూ. ‘‘కూతురు పురుటికి అమెరికా వెళ్లినది ఆర్నెల్లదాకా అక్కడే వుండకుండా పరిగెట్టుకుని వచ్చేయడం దేనికో! ఇప్పుడు యిల్లంతా చచ్చేట్లా సర్దాలి కాబోలు.. ఆ కనకదుర్గమ్మ చాలా స్ట్రిక్టని రాజీవ్‍ చెప్తూనే వుంటాడు..’’ సంధ్య విసుక్కుంటూ సోఫాలోంచి లేచి దులపసాగింది. ‘’కనకదుర్గ కాదు, కాత్యాయని... ఆవిడెళ్లి ఆర్నెల్లు అయ్యాయి. మనం యీ యింట్లో చేరిన దగ్గర్నుంచి లెక్కలేయకు..’’ అంటూ చిరాకు పడింది రజని.

ఇద్దరూ అరగంటసేపు అవస్థ పడి ఆ ఫ్లాట్‍ను ఓ కొలిక్కి తెచ్చారు. తర్వాత వెడ్డింగ్‍ ఆల్బమ్‍ ముందేసుకుని కూర్చున్నారు. ఒక్కోరిని చూపించి ‘వీడు పెళ్లికొడుకు మేనమామ’ ‘ఈవిడ పెళ్లికూతురు పినతల్లి’ అంటూ బట్టీపట్టసాగారు. కాస్సేపు పోయాక పేజీలు వెనక్కి తిప్పి యిద్దరూ ఒకటే చెప్తున్నామా లేదా అని చెక్‍ చేసుకుంటున్నారు. సంధ్యకు ఓర్పు నశించింది. ‘’ఆ మహాతల్లి యింత క్షుణ్ణంగా అడుగుతుందేమిటే, నీ చాదస్తం కానీ! ఏదో ఒకళ్లిద్దరి ఫోటోలు చూసి పక్కన పడేస్తుంది.’’ అంది ఆవులిస్తూ. ‘’తిప్పి పడేయడానికి రాజీవ్‍ అనుకున్నావా? ఆవిడ మహా గట్టిపిండం. అన్నీ కూపీ లాగుతుందట, రాజీవే చెప్పాడు.’’

‘’అంత గట్టిపిండమే అయితే ‘ఆడపడుచునంటున్నావ్‍, ఆల్బమ్‍లో నువ్వు లేవేం?’ అని నన్నడుగుతుంది.’’ ‘’దానికి సమాధానం రెడీగా పెట్టుకున్నాంగా, నువ్వు అప్పుడు ఆన్‍సైట్‍ సింగపూర్‍ వెళ్లావ్‍. సెలవు దొరకలేదు.’’ సంధ్య నిట్టూర్చింది. ‘’నువ్విస్తున్న కలరింగ్‍ చూస్తే మనకీ యీ యింటికీ యీ నెలతో ఋణం తీరిపోతుంది. ఆవిడ వస్తూనే నోటీసు యిస్తుంది చూడు.’’ ‘’ఒసే, అపశకునపక్షీ! వచ్చిన నాలుగు నెలలు కాలేదు, మళ్లీ యిల్లు వెతకడం నా వల్ల కాదు. కాస్త కోపరేట్‍ చెయ్యి.’’ అని బతిమాలింది రజని.

ఇంటివేటలో వుండగా రజనికి వచ్చిన బ్రహ్మాండమైన ఐడియా - వెడ్డింగ్‍ ఆల్బమ్‍! తనూ, సంధ్య యిద్దరూ పిజి హాస్టళ్లతో విసిగిపోయారు. పెళ్లికాని ఆడపిల్లలకు యిల్లివ్వడానికి హైదరాబాదులో యింటి ఓనర్లు దడిసిపోతున్నారు. ‘బ్రహ్మచారులకైనా యిస్తాం కానీ, మీకివ్వం, మీ ఆగడాలు భరించలేం. ఏమైనా అంటే సెక్సువల్‍ హెరాస్‍మెంట్‍ కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారు. ఈ మధ్య మీటూ.. ఒకటి! పైగా యిల్లు తగలేస్తారు, మగాళ్లే నయం.’ అని కరాఖండీగా చెప్తున్నారు.

పాత తెలుగు సినిమాల్లో బ్రహ్మచారులు అద్దె యిల్లు కోసం పెళ్లయిందని అబద్ధాలు చెప్పేవారట. ఇప్పుడు తమకా గతి పట్టింది. రజనికి మేట్రిమోనియల్‍ వెబ్‍సైట్‍ నుంచి ఒక ప్రపోజల్‍ వచ్చింది. వెంకట్రామ్‍ అని నోయిడాలో సాఫ్ట్‌వేర్‍ యింజనీరుగా పనిచేస్తున్నాడు. రజనీ వాళ్లమ్మ ఆసక్తి కనబరచి, ఫోటోలు తెప్పించింది. కానీ ఎప్పటిలాగే రజని కొట్టి పారేసింది. కానీ ఫోటోలు అక్కరకు వచ్చాయి.  అవి స్టూడియోవాడి కిస్తే తను యీ మధ్యే తయారుచేసిన వెడ్డింగ్‍ ఆల్బమ్‍లో పెళ్లికొడుకు, పెళ్లికూతురు స్థానంలో వీళ్లిద్దరి మొహాలూ పెట్టేసి చౌకగానే ఆల్బమ్‍ ప్రింట్‍ చేసి యిచ్చేశాడు. కొసరుగా వీళ్లిద్దరిదీ కలిపి ఓ పోస్టుకార్డు సైజు ఫోటో ఫ్రేమ్‍ కట్టి కూడా యిచ్చాడు. ఆల్బమ్‍ పూర్తయాక గుర్తువచ్చింది, సంధ్యను కూడా ఓ ఫోటోలో యిరికించి పెళ్లికొడుకు చెల్లెలని చెప్దామని. మళ్లీ చేయించడమంటే ఖర్చు. అందుకని సింగపూరు కథ చెప్దామనుకున్నారు.

అవి దగ్గర పెట్టుకుని యిళ్ల వేట ప్రారంభించింది రజని. 99 ఏకర్స్ వెబ్‍సైట్‍లో చూసి, ఫోన్‍ చేస్తే రాజీవ్‍ తీశాడు. ‘’ఇలాటి వ్యవహారాలన్నీ మా పేరెంట్సు చూసుకుంటారండి. మా అక్క డెలివరీకని స్టేట్స్ వెళ్లారు. పెళ్లయినవాళ్లకే యిమ్మనమని మా అమ్మ చెప్పింది...’’ అన్నాడు నానుస్తూ. ‘’నాకీమధ్యే పెళ్లయిందండి. మా వారు నోయిడాలో పనిచేస్తున్నారు. త్వరలోనే ట్రాన్స్ఫరై వచ్చేస్తున్నారు. నాతో బాటు మా ఆడపడుచు కూడా వుంటుంది. ఓ సారి ఫ్లాట్‍ చూడవచ్చా?’’ అంది రజని.‘‘సాయంత్రం మా బంగళాకి వస్తే తీసుకెళ్లి చూపిస్తానండి. దగ్గరే, జస్ట్ హండ్రడ్‍ యార్డ్స్. స్థలం మాదే, డెవలప్‍మెంట్‍కి యిస్తే ఆరు ఫ్లాట్స్ యిచ్చారు. ఇల్లు మేన్‍టెనెన్స్ గురించి మా అమ్మకు పట్టింపులు ఎక్కువ.’’ అన్నాడు రాజీవ్‍.

వీడెవడో బడుద్ధాయి అనుకుంది రజని, రాజీవ్‍ను కలిసేదాకా! మంచి రూపసి. చూడగానే తెలివైనవాడు, మంచివాడు అనిపిస్తాడు. ఎలక్ట్రానిక్స్ యింజనీరు. ఉద్యోగంలోకి వెళ్లకుండా రిసెర్చి చేస్తున్నాడు. లౌకిక వ్యవహారాలంటే ఆసక్తి లేనట్టుంటాడు. ఫ్లాట్స్, అద్దె కివ్వడాలు, వసూలు చేసుకోవడాలు, వాళ్లని గదమాయించడాలు.. యివన్నీ అతనికి పరమ చికాకు. అతని తండ్రికి తన బిజినెస్‍ తప్ప మరొకటి పట్టదు. అందువలన యివన్నీ అతని తల్లి కాత్యాయినే చూస్తుంది. చాలా కచ్చితమైన మనిషి. రజని, సంధ్య యిల్లు నచ్చిందని అన్నాక రాజీవ్‍ వాళ్లతో యివన్నీ చెప్పి ‘’మీరేం అనుకోకపోతే ఫైనల్‍ డెసిషన్‍ తీసుకునే ముందు అమ్మ మీ యిద్దర్నీ వీడియోకాల్‍లో చూస్తానంది. మీ కిష్టం లేకపోతే చెప్పేయండి. ఐ పెర్‍ఫెక్ట్లీ అండర్‍స్టాండ్‍ యువర్‍ ఫీలింగ్స్’’ అన్నాడు.

సంధ్య గొణిగింది - ‘ఇలాటి హేండ్సమ్‍ దగ్గర్లో వుంటాడంటే నాకు ఏ కండిషనైనా ఓకే’ అని. రజని ఆమె కాలు తొక్కి ‘నో ప్రాబ్లెమ్‍, పెద్దవాళ్లు కదా, వాళ్ల భయాలు వాళ్లకుంటాయి. మా అమ్మయినా, అత్తగారైనా యిలాగే బిహేవ్‍ చేస్తారు..’ అంది. ‘అత్తగారు!? ఆవిడెవరో? కొత్త పెళ్లికూతురు పాత్ర తెగ పోషించేస్తున్నావే తల్లీ’ అని మళ్లీ గొణిగింది సంధ్య. రజని మళ్లీ కాలు తొక్కింది. రజని అదృష్టమో ఏమో కానీ, నెట్‍ సమస్య కారణంగా కాత్యాయనితో వీడియో యింటర్వ్యూ సజావుగా సాగలేదు. ఊరూ, పేరూ గురించి నాలుగు ప్రశ్నలడిగి ‘‘సరే, ఎలాగూ నాలుగు నెలల్లో తిరిగి వస్తున్నానుగా, అప్పుడు కలుద్దాంలే’’ అందావిడ.

అంటూనే ‘ఇల్లు బాగా పెట్టుకోవాలి, ఫ్రెండ్స్‌తో మందు పార్టీలు, డాన్సు పార్టీలు పనికి రావు. మధ్యమధ్యలో ఓ సారి వెళ్లి చూడమని, వీడియోలో యిల్లంతా చూపమని మా వాడికి చెప్తాను. మీకు ఓకేనా?’ అంది. రజని, సంధ్య ఒక్కసారి మొహామొహాలు చూసుకున్నారు. ‘ఈ హేండ్సమ్‍ దగ్గరకి మనం వెళ్లక్కరలేదు, తనే వస్తాడు. ప్రతీ వీకెండూ రమ్మనమను. ఆవిడ అమెరికా నుంచి వచ్చాక కూడా ఆవిడ రాకూడదని, అతనే రావాలనీ చెప్పు’ అంది సంధ్య రజని చెవిలో. వస్తున్న నవ్వు ఆపుకుంటూ రజని ‘’వారానికో సారి వచ్చినా మాకేం అభ్యంతరం లేదండి. ఓ కప్పు కాఫీ చేసి యిస్తాం.’’ అంది వినయంగా. కాత్యాయని సంతోషించింది. ‘’బుద్ధిమంతురాలివమ్మా, మీ ఆయన అదృష్టవంతుడు.’’ అని మెచ్చుకుంది.

అవేళ మెచ్చుకుంది, యివాళ ఏమంటుందో అనుకుని భయపడుతూనే ఆవిడ వచ్చినపుడు వెడ్డింగ్‍ ఆల్బమ్‍ చూపించింది. ఆవిడ ఆల్బమ్‍లో రెండు, మూడు పేజీలు తిప్పి పక్కన పడేసింది. ‘చూశావా, అనవసరంగా రిహార్సల్స్ వేయించావ్‍’ అని సణిగింది సంధ్య. ఆవిడ రజని మెడకేసి చూసి ‘’నీ మంగళసూత్రం బంగారపుదానిలా లేదే!?’’ అంది. ‘’ఈ మధ్య హైదరాబాదులో చెయిన్‍ స్నాచింగ్‍లు ఎక్కువయ్యాయని...’’ అని నసిగింది రజని ఆవిడ పరిశీలనకు యిబ్బంది పడుతూ.

‘’..అది కట్టినతను నోయిడా వదిలిపెట్టి వర్జీనియా వెళ్లినట్లు నీకు చెప్పలేదా?’’ అందావిడ గుచ్చిగుచ్చి చూస్తూ. రజని నిర్ఘాంతపోయింది. ‘’వర్జీనియానా?’’ ‘’అవును, మా అమ్మాయీ వాళ్లూ వుంటున్న స్టేటే. అతను మా అల్లుడి క్లాసుమేటే. ఏవైనా సంబంధాలు వుంటే చెప్పమని, నాకు కొన్ని ఫోటోలూ, టీ నెంబరూ కూడా యిచ్చాడు...’’ ఎఫెక్ట్ కోసం ఆవిడ ఆగింది. రజనికి పైప్రాణాలు పైకి పోయాయి. ‘తన కర్మ కాకపోతే పోయిపోయి ఆ వెంకట్రామ్‍ గాడు యీవిడకి వర్జీనియాలో తగలడమేమిటి?’ సంధ్య నోరు వెళ్లబెట్టి చూస్తోంది.

‘’అతనికి చెల్లెళ్లెవరూ లేరు. అంటే నీ ఫ్రెండు కూడా బూటకపు మనిషే అన్నమాట. ఏమిటీ నాటకం? ఇల్లు కోసమే!? పాత రోజుల్లో మగాళ్లు అబద్ధాలు చెప్పేవారట. ఆడదానివై వుండి, పరాయి మగాణ్ని మొగుడని చెప్పుకుంటూ తిరిగేస్తున్నావంటే ఎంతకు బరి తెగించావనుకోవాలి? మిమ్మల్ని చూసి ఎంతో మర్యాదస్తులని, చక్కటి పిల్లలని సర్టిఫికెట్లు యిస్తూన్నాడు చూడు మావాడు.. వాణ్ననాలి. లోకజ్ఞానం లేని శుంఠ! మేం పోయాక వాడి చేతిలో ఆస్తి పెడితే నీలాటి వాళ్ల చేతిలో మోసపోయి ఏడాది తిరక్కుండా రోడ్డు మీదకు వస్తాడు....’’ ఇలా ఆవిడ ఆవేశంతో, రోషంతో, మోసపోయామన్న ఉక్రోషంతో దాదాపు ఏడెనిమిది నిమిషాలు ఏకపాత్రాభినయం వేయడం వలన యీ లోపున రజనికి ఓ ఐడియా తట్టింది.

‘’కాత్యాయనిగారూ, మీ కోపం సమంజసమే. అసలు విషయం చెప్పనని మీ అబ్బాయికి మాటిచ్చాను కానీ యిప్పుడు చెప్పక తప్పటం లేదు..’’ అంది. కాత్యాయని నొసలు చిట్లించింది. ‘’...అవునండి, మీ అబ్బాయీ, నేనూ ప్రేమించుకున్నాం. ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేసుకోనన్నారు. పైగా మీకు నచ్చితే తప్ప చేసుకోనన్నారు. అందువల్ల టెనెంట్‍గా మీకు పరిచయం చేస్తానన్నారు. అలా అయితే కొన్నాళ్లపాటు మీరు నన్ను, నా ప్రవర్తనను గమనించడానికి అవకాశం వస్తుంది కదా. ఒక అభిప్రాయం ఏర్పడుతుంది కదా. అప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేయవచ్చని ఆయన ఊహ..’’

కాత్యాయని నిర్ఘాంతపోయి వింది. కాస్సేపు ఆగి ‘’పెళ్లయి పోయిన అమ్మాయిలా పరిచయం చేయడం దేనికి?’’ అని అడిగింది.  ‘’పెళ్లి కాకపోతే మీరు యిల్లు యివ్వనన్నారు కదా!’’ ‘’ఓహో.. అవునూ, యీ అమ్మాయికి పెళ్లయిపోయిందని చెప్పి, నువ్వు ఆడపడుచుగా వేషం కట్టవచ్చుగా?’’ ‘’తనకి రెండు మూడు నెలల్లో నిజంగా పెళ్లి అయిపోయేట్టుందండి. పైగా యిది నా లవ్‍ ఎఫయిర్‍ కదా. తనని రిస్కు తీసుకోమనడం ఏం భావ్యం? మీరు చెప్పినట్లుగా నేను చాలా రిస్కు తీసుకున్నాను. రేపు మీరు నన్ను ఎప్రూవ్‍ చేయకపోతే రాజీవ్‍తో పెళ్లి జరగదు. పైగా నాకు పెళ్లయిపోయిందని ప్రచారం జరిగి, వచ్చే సంబంధాలు కూడా రావు..’’

‘’..అదే అంటున్నాను. కాస్త వెనకా ముందూ ఆలోచించి యిలాటి ఐడియాలు వేయాలి. ఇది తప్పకుండా నీదే అయి వుంటుంది. మా వాడు నీ అంత గడుసువాడు కాదు. అన్నట్టు, ఆల్బమ్‍ ఐడియా కూడా నీదేనా? బయటపడ్డాక ఎంత అబాసు చెప్పు, ఆడపిల్లవు.. జాగ్రత్తగా వుండవద్దా?’’ ‘’మామూలుగా అయితే బయటపడేది కాదు. కానీ కాకతాళీయమో మరోటో అతను మీకు అమెరికాలో తగిలాడు.’’

ఈలోగా సంధ్య కిచెన్‍లోకి జారుకుని చేసి యిచ్చిన కాఫీ తాగుతూ కాత్యాయని చల్లబడింది. వాళ్లిద్దరి కుటుంబాల గురించి అడిగి తెలుసుకుంది. చివరగా ‘‘సరే మా వాడు యిన్నాళ్లకు పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు. నాకు అదే చాలు. నాకు తెలిసిపోయిందని తెలిస్తే వాడు బాధపడతాడు. నాకు చెప్పినట్లు చెప్పకు. నేనూ ఏమీ తెలియనట్లు వుంటాను.’’ అంది వెళ్లబోతూ.

ఆవిడ వెళ్లాక సంధ్య రజని మీద విరుచుకుపడింది. ‘’నీకేమైనా బుద్ధుందా? ఇప్పుడు మరీ గందరగోళంగా తయారైంది. రాజీవ్‍ లవర్‍వి కాదని తెలిశాక ఆవిడ పోలీసు కంప్లయింటు యిస్తుంది చూడు.’’ ‘’అప్పటిలోగా మనం యింకో యిల్లు వెతికేసుకుందాం. అయినా రాజీవ్‍ మనిద్దరి గురించి మంచి రిపోర్టు యిచ్చాడని ఆవిడ చెప్తోంది. ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు అన్నట్లు రాజీవ్‍ నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడనే అనుకో..’’ అంది రజని ధీమాగా.

‘’..‘మనల్ని’ ఏమిటి అసహ్యంగా? అనవసరంగా నీ పేరు చెప్పుకున్నావు. నా పేరు చెప్పి వుండాల్సింది, నేను ట్రై చేసుకునేదాన్ని. పైగా రెండు నెలల్లో ఎవరో తలమాసినవాడితో పెళ్లి ఫిక్స్ చేశావు! పెళ్లయినదానిగా పరిచమయ్యావు కదా, రాజీవ్‍ నీ గురించి ఆ కోణంలో ఎందుకు ఆలోచిస్తాడే? ఏదైనా ఛాన్సుంటే నాకే వుంది.. నువ్వు చెడగొట్టావ్‍’’ వాపోయింది సంధ్య. ‘’బావుంది, ఆవిడ దగ్గర యిరుక్కుపోయింది, దొరికిపోయింది నేను. ప్రస్తుతానికి గండం గడిచింది. నా మానాన నన్ను కాస్సేపు వదిలేస్తే ఏదైనా కొత్త ఆలోచన తడుతుంది.’’ అంటూ రజని తన గదిలోకి వెళ్లి మంచం మీద వాలింది.

రాజీవ్‍ అంటే సంధ్యకు కూడా అలాటి అభిప్రాయం వుంటుందని తనకెప్పుడూ తోచలేదు. వాళ్ల అమ్మ చెప్పిన మాట జవదాటకుండా అతను ప్రతీ వారం ఏదో ఒక టైములో రావడం యిద్దరికీ ఎగతాళిగా వుండేది. మొదట్లో యిద్దరూ అతని గురించి జోకులేసుకునేవారు, వాళ్ల అమ్మంటే భయమని, మెతకవాడని, మరీ మర్యాదస్తుడని.. యిలా. ఓనరమ్మ సుపుత్రుడని నిక్‍నేమ్‍ పెట్టుకున్నారు. కొన్నాళ్లకి స్పైసీ జోకులేసి అతన్ని ఆటపట్టించేవారు. చిట్టిపొట్టి డ్రస్సుల్లో వున్నా మార్చుకునేవారు కారు. తనను లోకువ కడుతున్నారని తెలిసినా రాజీవ్‍ బయటపడేవాడు కాదు. చిరునవ్వు చిందిస్తూ, మర్యాదగా మాట్లాడేవాడు. అతనికి స్నేహితులు తక్కువేమో, రిసెర్చి వర్కులో బుఱ్ఱ వేడెక్కినప్పుడల్లా వచ్చి పలకరించేవాడు. అతని మృదుస్వభావం చూసి, తనూ సంధ్యా అతనంటె అభిమానం పెంచుకున్నారు. అతని ప్రత్యక్షంలో కాని, పరోక్షంలో కాని జోకులు తగ్గిపోయాయి.

కానీ రాజీవ్‍ తమను కేవలం స్నేహితులుగా చూశాడా, అంతకు మించి ఆలోచించాడా అనేది తెలియలేదు. అతను తెలియనివ్వలేదు. అతనెన్నో సార్లు తన వంక ఆరాధనగా చూశాడు. ఓ సారి ఆల్బమ్‍ చూపించినపుడు ఓ ఫోటో చూసి ‘యూ ఆర్‍ లుకింగ్‍ గార్జియస్‍’ అన్నాడు. ‘మరి వెంకట్రామ్‍? అతని సంగతి..?’ అని అడిగింది కొంటెగా. ‘వెల్‍...’ అని నవ్వేశాడు. ‘మీ లాటి అందమైన వాళ్లు..’ అని ఒకటి రెండు సార్లు అన్నాడు కూడా. అప్పుడు తను అడిగింది - ‘మీరూ బావుంటారు కదా. పెళ్లి ఎందుకు చేసుకోలేదు?’ అని.

అతను నవ్వేసి ‘నా లాటి రిసెర్చి స్కాలర్‍ని ఎవరు చేసుకుంటారండి? సాఫ్ట్‌వేర్‍ వాళ్లకే గిరాకీ. లక్షల్లో జీతం రావాలి, అమెరికాలో సెటిలవ్వాలి. ఇక్కడ ఎంత డబ్బున్నా వేస్టు అనుకుంటారు అమ్మాయిలు.’ అని జవాబిచ్చాడు. ‘అలా అనుకోని అమ్మాయిలను వెతికి పెట్టమంటారా?’ అని అడిగితే ‘వద్దువద్దు, ఫ్లర్టింగ్‍లో పడితే రిసెర్చి కొండెక్కుతుంది.’ అన్నాడు కంగారుగా. ఆ మాట చెప్తే సంధ్య ‘ఏదో కొద్దిపాటి ఆశ వుంటే అదీ తుడిచిపెట్టేశావ్‍. వదిలేయ్‍, జస్ట్ ఫ్రెండ్‍గానే చూద్దాం’ అంది. ఇవాళ యింకోలా మాట్లాడుతోంది.

మ్యారీడ్‍ అనుకుంటున్నాడు కాబట్టి రాజీవ్‍తో తన కథ ముందుకు సాగలేదు. లేకపోతే బయటపడేవాడేమో, వరంగల్‍ ప్రయాణంలో హద్దు దాటేవాడేమో. తేల్చేసుకోవాలంటే ఒకటే మార్గం. సంధ్య ద్వారా ఓ రాయేసి చూడడం! ‘‘ఇప్పుడు రాజీవ్‍ మనసు కనుక్కోవాలి. నువ్వు ప్రేమిస్తున్నానని ప్రపోజ్‍ చేసి చూడు’’ అంది.

సంధ్య చేసింది. ‘‘సారీ అండి, నాకు రజనిగారి టైపు బాగా నచ్చింది. ఆవిడకు సిస్టర్‍ ఎవరైనా వున్నారా అని అడిగితే ఎవరూ లేరంది. కజిన్స్ ఎవరైనా వున్నా ఫర్వాలేదు. లుక్స్ అనే కాదు, ఆవిణ్ని చూశాకే నాకు పెళ్లి వూహ పోయింది.’’ అన్నాడు రాజీవ్‍. సంధ్య దగ్గర బయటపడలేదు కానీ నిజానికి వరంగల్‍ సంఘటన తర్వాతే తనలో చలనం కలిగిందని, పెళ్లి దిశగా ఆలోచనలు ప్రారంభమయ్యాయని అతనూ గ్రహించాడు.

నెలన్నర క్రితం ఓ శనివారం రాత్రి రాజీవ్‍కు ఫోన్‍ వచ్చింది. రజని మాట్లాడుతోంది. ‘‘నేను ఓ రిసార్టులో వున్నాను, సంధ్య వాళ్ల వూరు వరంగల్‍ వెళ్లింది, కాస్త వచ్చి యింటికి దింపుతారా?’’ అని అడిగింది. ‘‘రాత్రి పన్నెండు దాటుతోంది. అక్కడి కెందుకు వెళ్లారు?’’ ‘‘ఆఫీస్‍ ఔటింగ్‍ అంటూ కొలీగ్స్ పార్టీ పెట్టారు. సరదాగా అనుకున్నది శ్రుతి మించుతోంది. నాకు భయంగా వుంది. వెళ్లిపోతానంటే వెళ్లనీయటం లేదు. క్యాబ్‍ కూడా దొరకదు, కాస్త ఆగు, కలిసే వెళదాం అంటున్నారు. .’’

‘‘నేను వచ్చి ఏం చేయాలి? పార్టీలోకి నన్నెందుకు రానిస్తారు?’’

‘‘యూ డోంట్‍ వర్రీ. మిమ్మల్ని నా బాయ్‍ఫ్రెండ్‍గా పరిచయం చేస్తాను. వచ్చి తీసుకెళ్లిపోండి, ప్లీజ్‍’’ కొలీగ్స్ దగ్గరే భయపడుతోందంటే పరిస్థితి యిబ్బందికరంగా మారి వుంటుంది. తనేమీ వెళ్లి వాళ్లతో ఫైట్‍ చేయనక్కరలేదు. జస్ట్ తనను తీసుకుని వచ్చేయడమంతే. ఓకే అన్నాడు.

రిసార్టులో రజనిని చూస్తే తాగి వుందని తెలుస్తూనే ఉంది. ఎన్నడూ లేనంత చనువుగా తనను దగ్గరకు లాక్కుని, తీసుకెళ్లి తన బాయ్‍ఫ్రెండ్‍గా ఫ్రెండ్స్‌కు పరిచయం చేసింది. మందు మహత్యమో, లేక గర్ల్‌ఫ్రెండ్‍గా నటించవలసిన అవసరమో కానీ బాగా హత్తుకుని నిలబడింది. అక్కడి వాతావరణం నిజంగానే గందరగోళంగా ఉంది. ఒళ్లు వశంలో ఉన్నవాళ్లు తక్కువగా కనబడుతున్నారు. ‘‘డ్రగ్స్ కూడా తీసుకుంటారా మీ వాళ్లు?’’ చిరాగ్గా అడిగాడు రాజీవ్‍ బయటకు వస్తూనే. ‘‘ఏమోనండి, నాకు యిలా రావడం యిదే ఫస్ట్ టైమ్‍. ఆఫీసు పార్టీల్లో కూడా మందు తీసుకోను. ఇవాళ చాలా బలవంతం చేశారు. ఒళ్లు తేలిపోతోంది. ఆ డిస్కో లైట్లలో ఏమీ కనబడటం లేదు. ఎవరైనా ఏమైనా చేసినా రెసిస్ట్ చేయలేనట్టున్నాను. ఎలాగైనా బయటపడాలని మీకు ఫోన్‍ చేశాను, సారీ.’’

ఆమె మొహం చూస్తే నిజమే చెపుతోందనిపించింది. కారెక్కబోతూ అడిగాడు - ‘మీ కొలీగ్స్ ‘ఇలాటి బాయ్‍ఫ్రెండ్‍ ఉన్నాడు కాబట్టే మాకు నో చెప్తున్నావ్‍’ అని టీజ్‍ చేస్తున్నారేమిటి? పెళ్లయినవాళ్లకి కూడా లైనేస్తారా? పెళ్లయ్యాక కూడా మీరు బాయ్‍ఫ్రెండ్‍ను మేన్‍టేన్‍ చేస్తున్నారంటే మీ గురించి చీప్‍గా అనుకోరా?’’ అని. రజని బుర్ర పని చేసింది. ‘‘పెళ్లయిందని చెప్పలేదు. వాళ్లకు తెలియదు.’’ ‘‘అదేం?’’ తెల్లబోతూ అడిగాడు రాజీవ్‍. ‘‘...చెపితే నోయిడా ట్రాన్స్ఫర్‍ చేస్తారు. అక్కణ్నుంచి ఒకడు యిక్కడకు వద్దామని చూస్తున్నాడు. వెంటనే నన్ను అక్కడికి తోలేస్తారు.’’

‘‘మంచిదేగా? మీరు మీ ఆయన దగ్గరే ఉండవచ్చు.’’ ‘‘మా ఆయనే యిక్కడకు వస్తున్నాడు. ఇప్పుడు నేను అక్కడకు వెళ్లిపోతే ఎలా?’’ అంది రజని. అతను యింకా ఎన్ని ప్రశ్నలేస్తాడోనని భయపడి ‘‘నాకు పెళ్లయి ఆర్నెల్లే అయింది, పెళ్లయ్యాకే యిక్కడ చేరాను. ..’’ అంటూ ఏదో చెప్పబోయింది. కానీ రాజీవ్‍ ఆమెను అర్ధోక్తిలోనే ఆపాడు. కటువుగా ‘‘ఏది ఏమైనా అబద్ధం చెప్పడం నాకు అసహ్యం. పెళ్లయినా కాలేదని చెప్పడమేమిటి? తప్పు కదా! బదిలీ చేస్తానంటే ఉద్యోగం మానేయవచ్చు. మీ ఆయన యిక్కడకు వచ్చేదాకా యింకో ఉద్యోగం చూసుకోవచ్చు. కాకపోతే ఖాళీగా యింట్లో కూర్చోవచ్చు.’’ అన్నాడు. ‘ఈ సుపుత్రులతో యిదే చిక్కు, వెధవ యిల్లు గురించి యితని దగ్గర పెద్ద అబద్ధాలకోరుగా తేలాను’ అనుకుని ‘వేరేవాళ్లకి హాని కలగనంత వరకు అబద్ధం ఆడితే తప్పు లేదని నేననుకుంటాను’ అని సంభాషణను ముగించేసింది. రాజీవ్‍ భుజాలు ఎగరేసి వూరుకున్నాడు.

ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం ఏలింది. చల్లగాలికి రజనికి కళ్లు మూతలు పడసాగాయి. కారు నడుపుతూనే రాజీవ్‍ ఆలోచించాడు. ఇల్లు చేరేసరికి యీ పిల్ల స్పృహలో ఉండదు. సినిమాల్లో చూపించినట్లు చేతుల్లో ఎత్తుకుని తీసుకెళితే యిద్దరి పరువూ పోతుంది. అమ్మ అమెరికాలో, నాన్న బొంబాయిలో ఉన్నారు కానీ పనివాళ్లు చూస్తారు. రేపు తన భర్త ఎదుట ఆమె సమాధానం చెప్పుకోవడం కష్టం. ఊళ్లో ఏదైనా హోటల్‍కి తీసుకెళ్లి రూమ్‍ తీసుకున్నా అంతే! కాస్సేపు ఆలోచిస్తే వరంగల్‍ కెళ్లడం మంచిదనిపించింది. రాత్రి కారులో గడిచిపోతుంది. పొద్దున్న సంధ్యకు అప్పగించి వచ్చేస్తే రిటర్న్‌లో యిద్దరూ కలిసి వచ్చేస్తారు.

మధ్యలో టోల్‍ గేట్‍ వద్ద ఆగి, మళ్లీ కదిలినపుడు రజనికి కాస్త మెలకువ వచ్చినట్టుంది. మత్తుతో మూతపడిపోతున్న కళ్లు కొద్దిగా తెరిచి ముందుకు చూస్తే హైవే. పక్కన చూస్తే దీక్షగా డ్రైవ్‍ చేస్తున్న రాజీవ్‍. మసక వెలుతురులో అతని నుదురూ, ముక్కూ, పెదవులు, గడ్డం సిల్‍హౌట్‍లో కనబడుతూ గ్రీకువీరుడిలా, దుష్టుల బారి నుండి రాకుమారిని రక్షించి తీసుకుని వెళ్లిపోతున్న జానపదహీరోలా అనిపించాడు. కాలం ఈ రొమాంటిక్‍ ఘట్టంలోనే ఆగిపోయి, యీ హాయి మాత్రం సాగిపోతే బాగుండుననిపించింది. ‘‘అప్పుడే యిల్లు వచ్చేస్తోందా?’’ అని అడిగింది దిగులుగా.

‘‘వరంగల్‍ వెళుతున్నాం, సంధ్య దగ్గరకి..’’ అన్నాడతను. ‘‘వరంగల్లే కాదు, హెల్‍కు కూడా రెడీయే, నువ్వు తీసుకెళితే..’’ అందామె కన్నుకొట్టి. రాజీవ్‍ ఉలిక్కిపడ్డాడు. మద్యం నిషా తలకెక్కి, ఆడపిల్లకు సహజమైన కొంటెతనం బయటకు వస్తోంది అనుకున్నాడు. చిరునవ్వు నవ్వి, ‘నాకు హెల్‍కు వెళ్లే ఉద్దేశం లేదు కానీ, బుద్ధిగా కూర్చోండి చాలు.’’ అన్నాడు. ‘‘ఏదో ఫ్లోలో అనేశాను కానీ నీలాటి సుపుత్రులు నరకానికి ఎందుకు వెళతారు?’’ అంటూ ఆమె అతని తల మీద చేయి పెట్టి జుట్టంతా రేపేసింది. ఆ తర్వాత అతని భుజం మీద వాలి కూనిరాగాలు తీయసాగింది. అతనికి సరదాగానూ ఉంది, స్టీరింగ్‍ కంట్రోలు తప్పుతుందేమోనని బెదురుగానూ ఉంది. కారు స్లో చేసి, రోడ్డుకి ఓ పక్కగా ఆపాడు.

ఆమె తన లోకంలో తాను చాలా హుషారుగా ఉంది. అతని మెడ చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుని ‘‘ఓ అబ్బాయి, అమ్మాయి యీ వేళ యిలా రోడ్డు పక్కన కారు ఆపితే ఏమనుకుంటారో తెలుసా?’’ అంది. రాజీవ్‍లో కూడా చిలిపితనం తన్నుకువచ్చింది. ‘‘ఇద్దరూ కారు ముందు సీట్లలోనే ఉంటే ఏమీ అనుకోరు.’’ అన్నాడు. ‘‘అయితే వెనక సీటుకే వెళదాం పద’’ అంది రజని తను సీటులోంచి లేవబోతూ. రాజీవ్‍ కంగారు పడ్డాడు. ‘‘మతిపోయిందా? అందరూ అలా అనుకోవాలనా?’’ అని చివాట్లు వేయబోయాడు. కానీ ఆమె వినిపించుకునే మూడ్‍లో లేదు. ‘‘అందరి కోసం కాదు, నా కోసమే, ముందు యీ  సీటు బెల్టు ఊడదీయ్‍. రావటం లేదు’’ అంది క్లిప్పు గురించి వెతుక్కుంటూ.

అసలా బెల్టు వేయడానికే నానా అవస్థా పడాల్సి వచ్చింది. హైవే ఎక్కేటప్పటికే ఆమెకు మత్తు ఎక్కేసింది. బెల్టు వేయబోతే మారాం చేసింది. చివరకు తనను గట్టిగా పట్టుకుని. చెయ్యి ఎక్కడ పడినా తప్పదనుకుంటూ బెల్టు వేసి క్లిప్పు పెట్టేశాడు. ఇప్పుడు తీసేస్తే దిగిపోయి ఏం అల్లరి పెడుతుందో. సీట్లో కూర్చున్నా గట్టిగా అరవసాగిందామె. పెట్రోలింగ్‍ పోలీసులు వచ్చి సంగతేమిటి అంటారేమోనని భయం వేసిందతనికి. అందుకే కారు దిగనిచ్చాడు, ఆమె తూలుతూ వెనక డోరు తీసి, తనను రమ్మనమని కేకలు పెడుతూంటే ఐదు నిమిషాల కంటె ఉండలేకపోయాడు. ఆమె చెప్పినట్లే నడుచుకున్నాడు.

ఆమె కారు బ్యాక్‍ సీట్లో అతన్ని కూర్చోమంది. అతని ఒడిలో తల పెట్టుకుని పడుక్కుంది. మాటిమాటికీ అతని ముఖాన్ని నిమురుతూ, అతని పేరు ఉచ్చరిస్తూ తన వలపంతా కుమ్మరించింది. పది నిమిషాలకు మించి నిర్వికారంగా కూర్చోవడం రాజీవ్‍కు చేతకాలేదు. అతనూ స్పందించసాగాడు. కానీ ఎవరైనా వచ్చి కారు తలుపు తడతారేమోనన్న జంకుతో తన పరిమితుల్లోనే ఉన్నాడు. మత్తు కారణంగా అలాటి జంకేమీ లేని రజని అతన్ని అల్లుకుపోయింది, హత్తుకుపోయింది. ఆ అరగంటా తనను తాను నిగ్రహించుకోవడం అతనికి చాలా కష్టమైంది. చివరకు తన పేరు పలవరిస్తూ ఆమె నిద్రలోకి జారుకోవడంతో అమ్మయ్య అనుకుని అతను కారు ముందు సీటులోకి వచ్చి డ్రైవింగు కొనసాగించాడు. ఊరు రాబోతూండగా నిద్ర లేపి ముందు సీట్లో వచ్చి కూర్చోమన్నాడు.

పెట్రోలు బంకు దగ్గర ఫ్రెషప్‍ అయి వచ్చాక రజని మామూలుగానే ఉంది. వరంగల్‍ రావడం మంచిదే అయింది. రాత్రి ఏం జరిగిందో ఆమెకు గుర్తు లేకపోవడం అంతకంటె మంచిదైంది అనుకున్నాడు రాజీవ్‍. ‘ఒకటి మాత్రం నిశ్చయం. ఈమెకు నాపై ప్రేమ ఉంది, కానీ పెళ్లయిన కారణంగా అదంతా గుండెల్లోనే దాచుకుంది. అదీ యీ దేశపు మహిళలకున్న సంస్కారం అనుకున్నాడు. ఇలాటి సంస్కారం ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవడంలో ఎంతో హాయి వుంది. పైగా నిన్న రాత్రి సంఘటన వలన స్త్రీ పొందు కోసం నా శరీరం ఎంత తపిస్తోందో నాకూ తెలియవచ్చింది’ అనుకున్నాడు.

అతను ఆలోచనల్లో పడడంతో కాస్సేపు వేచి చూసిన సంధ్య ‘రజని లాటిదే ఎందుకు కావాలను కుంటున్నారు?’ అని సూటిగా అడిగింది. ‘‘సరదాగా ఉంటారనే కాదు, ఆవిడ నిజాయితీ కూడా నచ్చింది. తప్పు జరిగితే ఒప్పుకుంటారు. ఫ్రాంక్‍గా మాట్లాడతారు.  అబద్ధాలు చెప్పేవారంటే నాకు అసహ్యమని ఆవిడకూ తెలుసు.’’ అన్నాడు రాజీవ్‍.

సంధ్య వచ్చి రాజీవ్‍తో జరిగిన సంభాషణ చెప్పగానే రజని గుండెల్లో రాయి పడింది. నెలన్నర క్రితం ఆదివారం పొద్దున్న వరంగల్‍లో జరిగింది గుర్తుకు వచ్చింది. ఊళ్లోకి వెళ్లేక ‘దారిలో స్నానం చేసి, గుడికి వెళదాం. తాగుడు మానేస్తానని ఒట్టేసుకోండి. దానివలన చాలా అనర్థాలు జరుగుతాయి.’ అన్నాడు. ‘‘నిన్నేమైనా జరిగిందా?’’ అని అడిగింది తను. ‘‘జరగబోయింది, కానీ కాలేదు.’’ అన్నాడతను క్లుప్తంగా. ఏం జరిగి వుంటుంది? రాజీవ్‍ పట్ల తనకు అస్పష్టంగా ఉన్న భావాలు వెలికి వచ్చేశాయా? తనేమైనా వాగిందా? భరించలేక కారు వెనక సీట్లో పడేశాడా? అడిగి భంగపడడం కంటె అడక్కుండా గుంభనంగా ఉండడం మేలు.

గుడి నుంచి సంధ్య యింటికి తీసుకెళ్లి దింపి వెళ్లిపోయాడు. ఇద్దరూ కలిసి హైదరాబాదు చేరేసరికి రాత్రి ఎనిమిదవుతోంది. వెంటనే రాజీవ్‍ దగ్గరకు ఒంటరిగా వెళ్లింది, క్షమాపణ చెప్పడానికి. ‘‘మళ్లీ ఎందుకు?’’ అన్నాడతను ఆశ్చర్యంగా. ‘‘పొద్దున్న హేంగోవర్‍లో సరైన రీతిలో రియాక్టయినట్లు తోచలేదు. ఇప్పుడు వరంగల్‍ నుంచి వస్తూంటే నేను మిమ్మల్ని ఎంత యిబ్బంది పెట్టానో పూర్తిగా అర్థమైంది. నా కోసం పాపం మీరు రాత్రంతా డ్రైవ్‍ చేయాల్సి వచ్చింది.’’ అంది. ‘‘ఇట్సాల్‍రైట్‍, కానీ ఒక సలహా చెప్తాను. ఆ పార్టీ గురించి జరిగింది జరిగినట్లు మీ ఆయనకు చెప్పేయండి. వైవాహిక జీవితంలో అబద్ధాలు ఆడడం మంచిది కాదు.’’

‘‘చెప్తే ఆయనకు నా మీద యింప్రెషన్‍ పోదా? ఈ మధ్యే పెళ్లయింది. దూరంగా ఉంటున్నాం. కొన్నాళ్లు కాపురం చేశాక, నా గురించి పూర్తిగా అర్థమయ్యాక చెప్తాను లెండి.’’ ‘‘వద్దు. మీరు చెప్పకపోతే నేను చెప్పేస్తాను. లేకపోతే మీ కొలీగ్స్ వేరేలా మార్చి చెపితే అపోహలు వస్తాయి. కొత్తకాపురానికి అది మరింత చేటు కలిగిస్తుంది.’’ ఈ చాదస్తుడిని ఒప్పించడం మన వల్ల కాదనుకుని రజని, ‘‘సరే, తప్పకుండా చెప్దాం. ఫోన్లో కాదు, ఆయన వచ్చినపుడు ప్రత్యక్షంగా యిద్దరం కలిసి చెపుదాం’’ అని కన్విన్స్ చేసింది.

రాజీవ్‍ తృప్తిపడ్డాడు. ‘‘ఇది బాగుంది. ఇప్పుడు కలిసి కాఫీ తాగుదాం.’’ అన్నాడు. కాఫీ తాగుతూంటే రజని కొంటెగా అడిగింది ‘‘మీరింత సత్యవ్రతులు కదా, మీకు కాబోయే భార్యకు అన్నీ చెపుతారా? ఎందుకంటే అవేళ రాత్రి నేనేదో మిమ్మల్ని టీజ్‍ చేసినట్లు లీలగా గుర్తుకు వస్తోంది. అదీ చెప్తారా?’’ అంది. రాజీవ్‍ తెల్లబోయి, ఫక్కున నవ్వాడు. ‘‘మందు చేసే మహిమ అది. మియర్‍ హెల్యూసినేషన్స్. ఏమీ జరగలేదు. గిల్ట్ ఫీలింగేమీ పెట్టుకోకండి.’’ అన్నాడు.

సంస్కారమంటే యిది అనుకుంది ఆనాడు. తర్వాత కూడా అతను తనంటే బాహాటంగా యింట్రస్టు ఏమీ చూపలేదు కాబట్టి కథ ముందుకు సాగలేదు. ఇప్పుడు సంధ్య ద్వారా అతనికి తనపై ఉన్న అభిప్రాయం తెలిశాక కూడా యితన్ని వదులుకుంటే నా కంటె దురదృష్టవంతురాలు మరొకరు ఉండరు, అనుకుంది రజని. తన కోరిక సిద్ధించాలంటే కాత్యాయనీ వ్రతమే శరణ్యం. ఇన్ని అబద్ధాలు ఆడాను, మరొకటి ఆడి చూస్తే సరి అనుకుంది.

రాజీవ్‍ లేనప్పుడు కాత్యాయని యింటికి వెళ్లి రజని చెప్పింది - ‘‘మీరు నన్ను మన్నించాలి. మేం యిద్దరం ప్రేమించుకున్నామని అబద్ధం చెప్పాను. నిజానికి అది ఒన్‍సైడ్‍ లవ్వే. నేనే మీ అబ్బాయిని లవ్‍ చేసి అబద్ధం చెప్పి టెనంట్‍గా చేరాను. ఎందుకంటారేమో, యీ రోజుల్లో ఏ అబ్బాయినీ నమ్మడానికి లేకుండా ఉంది. అమ్మానాన్న ముందు బుద్ధిమంతుడిలా నటిస్తారు. కానీ ఊళ్లో వేరే చోట కాపురం పెట్టేసి ఉంటారు. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసేసుకుంటారు. మనది ఫారిన్‍ కాదు కదా, మోసం బయటపడితే విడాకులు యివ్వగలగడానికి. ముందే జాగ్రత్తగా అన్నీ చూసుకోవాలి. తెలిసున్నవాళ్లెవరూ సంబంధాలు చెప్పటం లేదు, లేనిపోని గొడవలెందుకని. వెబ్‍సైట్‍లో చూస్తే గుణగణాలు ఏం తెలుస్తాయి చెప్పండి. అందుకే యీ రిస్కు తీసుకున్నాను. మీ అబ్బాయితో కొన్ని సందర్భాల్లో చనువు తీసుకుని టెస్ట్ చేశాను. అతను మామూలు కుర్రాళ్లలాటివాడు కాదు. మర్యాదస్తుడు. తొణకలేదు. మీ పెంపకం కదా మరి...’’

కాత్యాయని చిరునవ్వు నవ్వింది. ‘‘బాగానే ఉన్నాయి ట్విస్టులు..’’ అంది. రజని విషాదంగా మొహం పెట్టి ‘‘మా మధ్య సాన్నిహిత్యం, పరస్పర గౌరవం పెరిగాయి కానీ అబద్ధం అనే గోడ మధ్యలో నిలిచింది. నిన్ననే సంధ్య ద్వారా కదిపి చూస్తే తనకు అబద్ధమాడే వాళ్లంటే పరమ అసహ్యం అని కుండబద్దలు కొట్టి చెప్పాడాయన. పెళ్లి కాకుండానే అయిందని చెప్పానని తెలిస్తే నన్ను ఛీత్కరించుకుంటాడు...’’ ‘‘..అవును, మా వాడికి అబద్ధాలంటే అసహ్యం.’’ ‘‘సంధ్య మాటలు విన్నాక ఆశ చచ్చిపోయింది. నేను యిల్లు ఖాళీ చేసి వెళ్లిపోతాను, నాన్న పోయారు. నా పెళ్లి గురించే అమ్మకు బెంగ. రాజీవ్‍ ఫోటో పంపాను. ఇదైనా కుదురుతుందని తను ఆశ పెట్టుకుంది’’ అంటూ కళ్లు ఒత్తుకోసాగింది.

ఆమెను కాస్సేపు మౌనంగా ఏడవనిచ్చి కాత్యాయని ఓదారుస్తూనే తన అభిప్రాయం నిష్కర్షగా చెప్పింది ‘‘ఈనాటి కుర్రాళ్ల విషయం నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. నాకూ కూతురుంది. దాని పెళ్లి గురించి మేమూ యిలాటి ఆందోళనే పడ్డాం. చివరకు భగవంతుడి దయ వలన అల్లుడు మంచివాడే దొరికాడు. కానీ యిలా అబద్ధాలాడి చాలా రిస్కు తీసుకున్నావమ్మాయ్‍. దాని పర్యవసానం ఎలాగైనా ఉంటుందని నీకు ముందే తోచాలి.’’ ‘‘నాకు గైడెన్స్ యిచ్చేందుకు ఎవరూ లేరండి, మా అమ్మ మీలా సమర్థురాలు కాదు. నాన్నగారు చిన్నపుడే పోయారు. అన్నదమ్ముడు ఎవరూ లేరు.’’ అంది దీనంగా రజని. కాత్యాయని కరిగింది. ‘‘మా వాడు ఎవర్నీ ఓ పట్టాన యిష్టపడడు, వాడి తరహా యీ కాలపు అమ్మాయిలకు నచ్చదు. పెళ్లి ఎలా అవుతుందా అని నేనూ ఆలోచిస్తున్నాను. సర్లే, నా ప్రయత్నం నేను చేస్తాను, యీలోగా కంగారు పడకు’’ అంది.

అవేళ రాత్రే కాత్యాయని కొడుకుతో రజని గురించి నీ అభిప్రాయం ఏమిటంది. ‘‘పెళ్లయిపోయింది కదమ్మా’’ అన్నాడతను ఆశ్చర్యంగా. ‘‘... కాలేదు, నేనే అలా చెప్పమన్నాను. ఈ కాలపు అమ్మాయిలను నమ్మడానికి లేకుండా వుంది. అందుకని టెనంట్‍గా వచ్చి చేరమన్నాను. నిన్ను మాటిమాటికి వేళకాని వేళల్లో వెళ్లి టెస్ట్ చేయమన్నాను. మంచి అమ్మాయని నువ్వే సర్టిఫై చేస్తున్నావు. ఇంకేమిటి అభ్యంతరం?’’ రాజీవ్‍ నిర్ఘాంతపోయాడు. ‘‘అదేమిటమ్మా, మరి ఆ పెళ్లి ఆల్బమ్‍?’’ ‘‘ఆ పెళ్లి కొడుకు ఫోటో నేనే పంపాను. కావాలంటే నా దగ్గర మాట్రిమోనియల్‍ నెంబరుంది చూడు. వాడికింకా పెళ్లి కాలేదు. స్వతహాగా అబద్ధాలు ఆడే అమ్మాయి కాదు. నేను చెప్పడం బట్టి ఎంతో రిస్కు తీసుకుంది, అదీ నువ్వంటే యిష్టపడింది కాబట్టి...’’

రాజీవ్‍కు వరంగల్‍ ట్రిప్పు, అప్పుడామె హృదయావిష్కరణ గుర్తుకు వచ్చింది. సరే అన్నాడు నిమిషం ఆగకుండా. (మరో సరదా కథ వచ్చే నెల మూడో బుధవారం).

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)

mbsprasad@gmail.com

Show comments