Godfather Review: మూవీ రివ్యూ: గాడ్ ఫాదర్

చిత్రం: గాడ్ ఫాదర్
రేటింగ్: 2.75/5
తారాగణం: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్ తదితరులు
కెమెరా: నీరవ్ షా
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: తమన్ ఎస్
కథ: మురళి గోపి (లూసిఫర్)
నిర్మాత: రాం చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్
దర్శకత్వం: మోహన్ రాజా
విడుదల తేదీ: 5 అక్టోబర్ 2022

మలయాళంలో సూపర్ హిట్టైన "లూసిఫర్" ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేయడం, పైగా సల్మాన్ ఖాన్ ఇందులో ఒక ప్రధానపాత్ర పోషించడం వంటి కారణాల వల్ల ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు పెద్దగా లేకపోయినా, విడుదలైన తార్ మార్ టక్కర్ మార్ రికార్డులు సృష్టించకపోయినా ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టిమాత్రం కేంద్రీకృతమై ఉంది. 

చిరంజీవి సినిమా అంటేనే డ్యాన్సులు, ఫైట్లు గుర్తొస్తాయి. ఫైట్లున్నా డ్యాన్సులు మాత్రం లేవిందులో. అసలు హీరోయినే లేని మొదటి చిరంజీవి సినిమా ఇదేనేమో. పేరుకి లూసిఫర్ రీమేకే అయినా చాలా మార్పులు చేసారు. 

లూసిఫర్ చూడని వాళ్లకి ఏమీ చెప్పాల్సిన పనిలేదు. కానీ చూసినవాళ్లకి చెప్పాలంటే అందులోని సవితికూతురు పాత్రని ఇందులో మరదల్ని చేసారు. అందులో ఉన్న సీయం కొడుకు క్యారక్టర్ని ఇందులో పూర్తిగా ఎత్తేసారు. బహుశా ఆ క్యారక్టర్ పెడితే పవన్ కళ్యాణ్ క్యారక్టర్ కి పోలికలొస్తాయనేమో. జైల్లో వినిపించే రోమాలు నిక్కబొడుచుకునే ఉద్యమగీతం కూడా ఇక్కడ లేదు. చెప్పుకుంటూ పోతే చాలా మార్పులు కనిపిస్తాయి. ఎలా చూసుకున్నా ఇది చిరంజీవి ఫ్యాన్స్ కోసం టైలర్ మేడ్ చేసిన కథనంలా ఉంది. 

కొన్ని సీన్లైతే మరీ వెటకారంగా ఉన్నాయి. రాష్ట్ర హోం మంత్రి, పైగా సీయం అవ్వాలనుకునే స్టేచరున్న మురళీశర్మ పాత్ర ముంబాయిలో డ్రగ్ మాఫియా గ్యాంగుని వాళ్ల డెన్నుకెళ్లి కలవడం లాంటి సన్నివేశం మరీ థర్డ్ గ్రేడ్ సినిమా స్థాయిలాగ ఉంది. 

అలాగే జైల్లో చిరంజీవి పూరీ జగన్నాథ్ కి ఫ్లాష్ బ్యాకులో ఒక చిన్న సీన్ చెప్పగానే మారిపోవడమేంటో సిల్లీగా ఉంది. 

లూసిఫర్ తో పోలిక పక్కనపెట్టి ఈ సినిమా వరకు చర్చించుకుంటే చిరంజీవి ఆద్యంతం హుందాగా కనిపిస్తూ వయసుకు తగ్గట్టు కనిపించారు. అయితే ఆయననుంచి ఆశించే నామమాత్రపు డ్యాన్సు కూడా ఇందులో లేదు. చివర్లో వచ్చే తార్ మార్ టక్కర్ మార్ లో కూడా సరైన స్టెప్పు ఒక్కటి కూడా వేయలేదు. పైగా దానికి ప్రభుదేవా కోరియోగ్రఫీ. ఎంత చిరంజీవి వయసుని దృష్టిలో పెట్టుకున్నా ఆయననుంచి కనీసం ఖైది 150లో షూలేస్ స్టెప్పులాంటిదైనా ఆయన ఫ్యాన్స్ ఆశించడం సహజం. అది పెద్దగా శ్రమలేని స్టెప్పే. ఆ విషయంలో మాత్రం పూర్తిగా నిరాశకలిగినట్టే. అసలు తార్ మార్ పాట పెట్టి ప్రయోజనం లేకుండా పోయింది. 

ఇక టెక్నికల్ గా చూసుకుంటే సంగీతం వీక్. ఒక్క "నజభజజజర" పాట తప్పిస్తే మిగతావేవీ ఆకట్టుకోవు. ఆఖరికి ఐటం సాంగ్ కూడా వేస్టైపోయింది. కమెర్షియల్ గా "ఊ అంటావా" లాంటి ఐటం సాంగ్స్ కూడా సినిమాల్ని నిలబెడుతున్న రోజులివి. కానీ ఆ అవకాశాన్ని జారవిడుచుకోవడం ఆశ్చర్యం. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాలేదు. జస్ట్ యావరేజ్ అండ్ రొటీన్ అని చెప్పాలి.

పాటల్లోని లిరిక్స్ కూడా సర్వసాధారణంగా ఉన్నాయి. సంభాషణల్లో కూడా  పెద్దగా మెరుపుల్లేకపోయినా పర్వాలేదనిపించాయి. "మీ గ్యాంగ్ లీడర్", "నా ప్రాణం ఖరీదెంతో.." లాంటి వాక్యాలతో చిరంజీవి గత సినిమాల్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేసాడు రచయిత. 

ఒరిజినల్ కి చేసిన మార్పులు గొప్పగా లేవు, తీసేసినవి పెట్టుంటే బెటర్ గా ఉండేదేమో అన్నట్టు ఉంది. మొత్తమ్మీద ఒరిజినల్ స్క్రిప్ట్ మీద కూర్చుని కసరత్తు చేసి దాని స్థాయిని పెంచాల్సింది పోయి తగ్గించారు. అలాగని చిరంజీవికి హీరోయిన్ ని పెట్టడం లాంటివి అవసరం లేదు. కనీసం పొలిటికల్ డ్రామాని మరింత పకడ్బందీగా, తెలివిగా నడిపుండాల్సింది. కేవలం 40 మంది ఎమ్మెల్యేలని కొనడమన్న పాయింటుతోటే మొత్తం డ్రామా నడపడం భావదారిద్రంగా ఉంది. 

నటీనటుల విషయనికొస్తే మురళీశర్మ మెథడ్ యాక్టింగ్ చేసారు. విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో ప్రత్యేకంగా కనిపించే ప్రాయత్నం చేసాడు. చాలానాళ్ల తర్వాత సయజీషిండే కనిపించాడు. సముద్రఖని మలయాళమాతృకలోని పాత్రకి యథాతథంగా న్యాయం చేసాడు. సీయం పాత్ర వేసింది "సిరివెన్నెల" హీరో సర్వదమన్ బెనర్జీ అని ఎంతమంది గుర్తుపట్టారో తెలియదు. షఫీది కూడా వెండితెరమీద బహుకాలదర్శనం. టాప్ కమెడియన్ గా వెలుగు వెలిగి, హీరోగ ఉనికి చాటుకుని అస్సలు ప్రాధాన్యత లేని చిన్న పాత్రలో సునీల్ కనిపించడం బాధాకరం. 

నయనతారది మొత్తం సీరియస్ పాత్రే. కన్నీళ్లు పెట్టుకోవడానికే తప్ప వైవిధ్యం చూపించడానికి పెద్దగా స్కోప్ లేదు. సత్యదేవ్ మాత్రం విలన్ గా తనవరకు న్యాయం చేసాడు. కానీ చిరంజీవి ఇమేజ్ కి సరితూగే విలనీని ప్రదర్శించలేకపోయాడు. ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ మరింత క్రుయల్ గా కనిపిస్తాడు. 

సల్మాన్ ఖాన్ ఆటలో అరటిపండుల ఉన్నాడు. లూసిఫర్ కి చేసిన మార్పుల్లో ప్రిథ్విరాజ్ పోషించిన ఈ పాత్ర నిడివి కూడా పెంచుంటారని అనుకున్నారు చాలామంది. కానీ అదేం జరగలేదు. 

ఇక ప్రధానంగా చిరంజీవి హ్యాండ్ సం గా, షార్ప్ గా కనిపించారు. చాలా బ్యాలెన్స్డ్ గా, ఎక్కడా ఓవరాక్షన్ లేకుండా కంపోజ్డ్ గా నటించారు. కానీ ఆయన సినిమాల్లోని హ్యూమర్ కి, డ్యాన్సులకి అలవాటు పడిన ఫ్యాన్స్ కి ఇందులో అవేవీ లేకపోవడం వల్ల ఎలా స్పందించాలో తెలియని విధంగా ఉంటుంది. అంటే సినిమాగా ఎలా ఉందని చెప్పినా చిరంజీవి సినిమాగా మాత్రం గొప్పగా ఉందనిపించదు. 

ఇంటర్వెల్ వరకు బాగానే ఉందనిపించినా ద్వితీయార్థానికి వచ్చేసరికి క్రమంగా కథనం ఫక్తు కమెర్షియల్ ఫార్మాట్ లోకి వెళ్లిపోయి రొటీన్ అనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ తెర మీద ఉన్నా, అతనొక తెలుగు డయలాగ్ చెప్పినా మనసు ఉప్పొంగి చప్పట్లు కొట్టాలనిపించదు.. ఏదో అలా చూడడం తప్ప. 

కేరళ వంటకాన్ని తెలుగు స్టైల్లో వండివార్చే పనిలో రుచి కాంప్రమైజ్ అయిపోయింది. లూసిఫర్ చూసినవారికి మాతృకే బాగుందనిపించవచ్చు. చూడని వాళ్లకి పూర్తి పొలిటికల్ డ్రామా అనే తప్ప పెద్దగా కంప్లైంట్ లేకపోవచ్చు. 

బాటం లైన్: నాట్ ఎ బ్యాడ్ ఫాదర్

Show comments

Related Stories :