ఎమ్బీయస్‍: బాబు లోకేశ్‌ను వారించలేక పోతున్నారా?

ఎన్టీయార్ యూనివర్శిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్టీయార్ యిచ్చిన స్టేటుమెంటులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. పేరు మార్చకూడదనేవారు కానీ, మార్చినా ఫర్వాలేదనే వారు కానీ ఎవరూ అభ్యంతర పెట్టలేని విధంగా ప్రకటన విడుదలైంది. కానీ అది టిడిపి అనుకున్న రీతిలో లేదు. పేరు మార్పుపై అది చేస్తున్న ఆందోళనకు వత్తాసు పలికే తీరులో లేదు. ఇది వాళ్లకు వేదన కలిగిస్తోంది, కోపం రగిలిస్తోంది. టిడిపి ముఖ్యనాయకులు కాకపోయినా ఉపనాయకులు బహిరంగంగా జూనియర్‌పై విరుచుకు పడుతున్నారు. సోషల్ మీడియా ట్రోలింగు మాట చెప్పనే అక్కరలేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన ‘కొత్త పలుకు’లో ‘టిడిపి కార్యకర్తలకు, జూనియర్ అభిమానులకు మధ్య జగడం ప్రారంభమైంది’ అని రాసే స్థాయికి వివాదం ముదిరింది. దీనివలన టిడిపికి లాభమా? నష్టమా? నష్టమనుకుంటే బాబు నివారించ గలుగుతున్నారా? అనే దానిపైనే యీ వ్యాసం.

పేరు మార్పు అనవసరమైన చేష్ట అని, కొన్ని అంశాల నుంచి దృష్టి మరల్చడానికి చేసిన పని అని కొందరు వాదిస్తున్నారు. కులాల వారీ విడగొట్టే వ్యూహం దానిలో ఉండవచ్చని నేను ఒక వ్యాసంలో ప్రతిపాదించాను. టిడిపి, ముఖ్యంగా కమ్మ కులస్తులు దీన్ని పెద్ద అంశంగా చేయకుండా ఉంటేనే మేలని నేను అభిప్రాయపడ్డాను. కానీ టిడిపి దీన్ని వదిలిపెట్ట దలచుకోలేదు. దానితో వైసిపి వాళ్లు, విమర్శకులు ఎప్పటెప్పటివో విషయాలు బయటకు లాగుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీయార్ ఆరోగ్యశ్రీగా మార్చినప్పుడు ఏమైంది యీ లాజిక్? బాపట్లలో అగ్రికల్చరల్ కాలేజీలకు రైతుబాంధవుడు ఎన్జీ రంగా పేరు తీసేసి ఎన్టీయార్ పేరు పెట్టినప్పుడు ఏమైంది మీ విజ్ఞత? రంగా పేరు అలాగే ఉంచి కొత్త కాలేజీ కట్టి దానికి ఎన్టీయార్ పేరు పెట్టలేక పోయారా? అని అడగసాగారు.

వెన్నుపోటు ఉదంతాన్ని తవ్వి తీసి ‘మనిషి పేరు మారిస్తే విలవిల్లాడి పోతున్నారు, ఆయన ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నపుడు ఏం చేశారు?’ అని యావన్మంది కుటుంబసభ్యులను నిలదీస్తున్నారు. 26 ఏళ్ల క్రితం నాటి ఉదంతం కాబట్టి, అప్పట్లో బాబు ఎన్టీయార్‌ను ఎంత యీసడించారో, 45 ఏళ్ల లోపు వాళ్లలో చాలామందికి వివరంగా తెలిసి ఉండకపోవచ్చు. విజనరీగా, ఐటీ విప్లవసారథిగా బాబు యిమేజిని మనసుల్లో ప్రతిష్ఠాపించుకున్న ఆ తరానికి వెన్నుపోటు ఉదంతం లీలగానే గుర్తు. అయినా పార్టీ, ఓటర్లు బాబును టిడిపి అధినాయకుడిగా ఆమోదించి మరల మరల నెగ్గించిన తర్వాత వెన్నుపోటు వెనకపడింది. ఇప్పుడీ సందర్భంగా అవన్నీ రీలురీలుగా ప్రదర్శిస్తున్నారు. లక్ష్మీపార్వతిలోని హరికథా కళాకారిణి వెలికివచ్చి కథాకాలక్షేపం మళ్లీ మొదలుపెట్టారు. అవసరమా యిదంతా?

‘ప్రస్తుతం జగన్ ఆర్థికనిర్వహణతో విసిగి ఉన్నాం. ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాం. సంక్షేమం వలన సంక్షోభం కలుగుతోందని లోకేశ్, తాము అధికారంలోకి వస్తే యిప్పుడున్న వాటి కంటె ఎక్కువ యిస్తామని బాబు అంటున్నారు. ఖాళీ ఖజానాతో బాబు ఆ మ్యాజిక్ ఎలా చేయగలుగుతారు? సిఎంగా ఛాన్సిస్తే అమరావతిని అద్భుతంగా కట్టించి చూపుతారా?’ అని తటస్థులు అనుకుంటూన్న యీ రోజుల్లో బాబు వర్తమానంలో ఉన్న లోపాల గురించి, భవిష్యత్తు గురించి తను రూపొందించిన ప్రణాళికల గురించి జనం మాట్లాడుకునేట్లా చేయాలి తప్ప గతించిన కాలపు సమాధి తవ్వి అస్తిపంజరాలను బయటకు తీసేట్లా చేయకూడదని మనం అనుకోవచ్చు. కానీ టిడిపికి వేరే వ్యూహం ఉండి ఉండవచ్చు. అందుకని తాము గొడవ చేయడమే కాక, చేయని కమ్మవాళ్లని కులద్రోహి, తెలుగు ద్రోహి అని తిట్టిస్తున్నారని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పినదాని బట్టి తెలుస్తోంది. నిజానికి వైయల్పీ తన పదవిని వదులుకున్నారు. కానీ అది చాలలేదు టిడిపి వర్గాలకు.

టిడిపి మైండ్‌సెట్ యిలా ఉన్నపుడు చాలా తూకంగా ఉన్న జూనియర్ స్టేటుమెంటు వారికి నచ్చకపోవడంతో ఆశ్చర్యం లేదు. దానికిగాను లోలోపల పిసుక్కోవచ్చు కానీ బహిరంగంగా విరుచుకు పడడమేమిటి? పైన చెప్పినట్లు చిన్న నాయకులందరూ జూనియర్ని చెరిగేస్తున్నారు. బాలకృష్ణ లెవెల్లో రెచ్చిపోకుండా ఆ మెతకమాటలేమిటి అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగు! ‘బాలయ్య ఫైర్ - పేరు పెట్టుకుంటే సరిపోయిందా?’ అనే థంబ్‌నెయిల్‌తో యూ ట్యూబు టీవీలో కనబడితే నిజమాని చూశాను. అంతా వింటే బాలకృష్ణ సన్నిహితుడు జూనియర్‌ను ఉద్దేశించి ‘ఎన్టీయార్ పేరు పెట్టుకోగానే సరిపోయిందా?’ అన్నారు అని చెప్పారు. అంటే అలా అన్నది బాలకృష్ణ కాదన్నమాట. కానీ ఆయన పేరు మీద ప్రచారం సాగిపోతోంది.

ఆ వీడియోలోనే కాదు, అనేక మంది టిడిపి తరఫు వక్తలు టీవీ ఛానెళ్లలో జూనియర్‌ కెరియర్‌కు బాబు ఎంతో మేలు చేశారని, దగ్గరుండి పెళ్లి చేయించారని, యిప్పుడు జూనియర్ స్పందించక పోవడం కృతఘ్నత లాటిదేనని చెప్తున్నారు. పెళ్లి విషయంలో బాబు తన మేనకోడలు భర్త నార్నె శ్రీనివాసరావుని పిలిచి, జూనియర్‌కు పిల్ల నివ్వవద్దని చెప్పారని లక్ష్మీపార్వతి అంటున్నారు. అదెంత వరకు నిజమో తెలియదు కానీ జూనియర్‌ను పెళ్లి చేసుకోవడానికి లక్ష్మీప్రణతి పట్టుబట్టిందేమో అనుకోవచ్చుగా. ఇతను అందగాడు. కెరియర్ విజయపథంలో దూసుకుపోతున్నపుడు పెళ్లాడింది. ఏ స్కాండల్‌లోనూ యిరుక్కోని మంచి భర్తగా, యిద్దరు పిల్లలకు మంచి తండ్రిగా ఉన్నాడు. ఇవి ఊహించి ఆమె పెళ్లాడిందేమో! పని గట్టుకుని బాబు పెళ్లి చేయించవలసిన అవసరమేముంది? సూచించాలంటే ఆయన సోదరుడి కొడుకులు లేరా? పూర్తి స్థాయి మేనల్లుళ్లు లేరా?

ఇక కెరియర్ పరంగా చెప్పాలంటే జూనియర్‌ది మౌర్య చంద్రగుప్తుణ్ని తలపించే రసవత్తరమైన కథ. నందమూరి కుటుంబంలో నవనందులుండగా ఎవరికీ లేనంత అందచందాలు, ప్రతిభాపాటవాలు యితనికే అబ్బాయి. కుటుంబం మద్దతు బొత్తిగా లేకపోయినా, కొంతకాలం పాటు వారు యితనిపై కత్తి కట్టినా, పోటీకి వచ్చినా, స్వయంకృషితో పైకి వచ్చిన ధీరుడు. కులం పేరుతో అభిమానులను పోగేసుకున్న హీరో కాదు. కమ్మ కులస్తులైన హీరోలెందరున్నా కమ్మ ఐకాన్‌గా వెలుగుతున్నది బాలకృష్ణ ఒక్కరే. జూనియర్‌తో సహా వేరెవరికీ ఆ మద్దతు లేదు. బాలకృష్ణ, జూనియర్ల మధ్య కొంతకాలం పాటు స్పర్ధ, వైరుధ్యం నడిచాయి కూడా. కళ్యాణరామ్ ఒక్కడే జూనియర్‌కు ఆప్తుడనుకోవాలి. తక్కినవారందరూ అంతంత మాత్రంగా ఆదరించేవారే. తెరపై ఏ భావాన్నయినా అద్భుతంగా పలికించగల జూనియర్‌పై సినీమా ప్రేమికులందరికీ అభిమానమే. అతని సినిమాలు కొన్ని ఆడకపోవచ్చు కానీ అతని అభినయం బాగా లేదని అనలేము.

చాలా ఆలస్యంగా ఆరారార్ సినిమా చూశాను. సినిమా బాగా లేదు. మర్చిపోవచ్చు కానీ జూనియర్ నటన మాత్రం మరపుకు రాదు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్. అమిత్ షాకు ఆరారార్ అంత నచ్చితే రాజమౌళిని పిలవవచ్చు, రామ్‌చరణ్‌ను పిలవవచ్చు, యితన్ని ఒక్కణ్నే పిలవడమేమిటి? అని నేనూ రాశాను. కానీ సినిమా చూశాక అనిపించింది, అతనొక్కడే పిలవదగినవాడు, ఆ భేటీలో తక్కినవాటితో పాటు యీ నటన గురించి కూడా అమిత్ ప్రస్తావించి ఉండవచ్చనిపించింది. ఇక వ్యక్తిగా చూసినా జూనియర్ 2009లో టిడిపికి సేవ చేసి, ప్రచారం చేసి పెట్టాడు. తర్వాతి రోజుల్లో వాళ్లు పక్కకు నెట్టేస్తే మారుమాట్లాడకుండా ఊరుకున్నాడు తప్ప విశ్వాసఘాతకులు అంటూ స్టేటుమెంట్లు యివ్వలేదు. అలాటివాడిపై విశ్వాసఘాతకుడంటూ టిడిపి అభిమానులు యిప్పుడు ట్రోలింగు చేయడం తప్పు.

ఈ సాధింపు వలన టిడిపి సాధించేది ఏముంది? ప్రస్తుత పరిస్థితి గమనిస్తే బిజెపి జూనియర్ని దువ్వుతోంది. అతను పార్టీలో చేరకపోయినా, 2014లో పవన్ కళ్యాణ్ తరహాలో పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశాలున్నాయని నేనొక వ్యాసంలో రాశాను. దాని తర్వాత జూనియర్ సేవలను మేము ఉపయోగించుకుంటాం అంటూ సోము వీర్రాజు స్టేటుమెంటు యిచ్చారు. ఇప్పుడు యూనివర్శిటీ పేరు మార్పు విషయంలో కూడా జివిఎల్ నరసింహారావు జూనియర్ని వెనకేసుకుని వచ్చారు.

ఇటు టిడిపి బిజెపితో పొత్తు కోసం కన్నులు కాయలు కాచేట్లు ఎదురు చూస్తోంది. టిడిపి ఎన్డీయేలో చేరడం ఖాయమంటూ పచ్చ మీడియా ఉధృత ప్రచారం చేసి దసరా ముహూర్తం పెట్టింది. దసరా ప్రారంభమైంది. విజయదశమి దాటినా చర్చలు ప్రారంభించకపోతే పచ్చ మీడియా దీపావళి ముహూర్తం పెట్టవచ్చు. బిజెపితో పొత్తు కుదరాలని తహతహ లాడే టిడిపి అభిమానులకు దీపావళి కాంతులీనుతుందో, అమావాస్యగా మిగులుతుందో తెలియదు. అప్పుడూ ఏమీ జరగకపోయినా, ఎన్నికల పాటికి మోదీ ప్రజాదరణ దిగజారుతుందని, గతానుభవాల దృష్ట్యా బాబుపై ఎంత ఉక్రోషం ఉన్నా, మోదీ టిడిపితో చేతులు కలపక తప్పని పరిస్థితి వస్తుందని ఆశావహులు యింకా లెక్కలు వేస్తూనే ఉన్నారు. ఈ ఆశలకు ప్రాతిపదిక ఏమిటో నాకు తెలియదు. మోదీకి ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కానరాదు. రాజస్థాన్ ప్రహసనం ఒక్కటి చాలు, కాంగ్రెసు హై కమాండ్‌కు పార్టీపై ఎంత కమాండ్ ఉందో చెప్పడానికి! కెసియార్ థర్డ్ ఫ్రంట్ అంటూ నీతీశ్‌ను కలిస్తే, అతను థర్డ్, ఫోర్త్ ఫ్రంట్‌లేవీ లేవంటూ సోనియాను కలిసి వచ్చాడు! ఇలాటివాళ్లా మోదీని హడలగొట్టగలిగేది!?

మోదీ బలపడినా, బలహీనపడినా వైసిపిని ఓడించడానికై చివరిక్షణంలోనైనా తమతో కలుస్తాడనే ఆశ టిడిపిది. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆ ఆశాభావంతోనే బిజెపిని పన్నెత్తి మాట అనకుండా కాలక్షేపం చేస్తోంది టిడిపి. ఇప్పుడీ జూనియర్ విషయానికి వచ్చేసరికి ఆ జాగ్రత్త గాలికి ఎగిరిపోవడం ఆశ్చర్యకరంగా లేదూ! జూనియర్ బిజెపి ప్రచారసారథి అయిన పక్షంలో, బిజెపి, టిడిపిలకు పొత్తు కుదిరే పక్షంలో అతను టిడిపి అభ్యర్థుల కోసం కూడా ప్రచారం చేసే సందర్భం వస్తుంది. అప్పుడు టిడిపి యివాళ టిడిపి జూనియర్‌పై చేసిన దుష్ప్రచారానికి ఏం సమాధానం చెప్పుకుంటుంది? అబ్బే మేమేమీ అనలేదు అని సీనియర్లు తప్పుకున్నా దుర్మార్గమైన ట్రోలింగును ఖండించలేదేం? అని జూనియర్ అడిగితే టిడిపి అభ్యర్థులు నీళ్లు నమలాల్సిందే కదా!

చంద్రబాబుకి యీపాటి ఆలోచన లేదా అన్న సందేహం కలుగుతుంది. ఆయన ఏ మార్గమూ మూసేసే రకం కాదు. లెఫ్ట్, రైట్, సెంటర్ ఎవరితోనైనా కలవగలరు. కాంగ్రెసుతో కూడా దోస్తీ చేయగల మనిషి. నన్ను బాబే కాంగ్రెసులోకి పంపించారని రేవంత్ రెడ్డి యీ మధ్యే చెప్పాడు. అధ్యక్షుడు కావడానికి కూడా సాయం చేసి ఉంటాడని కొందరి నమ్మకం. దాన్ని బట్టి కాంగ్రెసులో కూడా బాబుకి పలుకుబడి ఉందని తేల్తోంది. మోదీ అనే వ్యక్తి లేకపోతే బిజెపితో యీపాటికే కలిసిపోగల చాకచక్యం ఉంది బాబుకి. అలాటాయన కావాలని జూనియర్‌ను రాంగ్‌సైడ్ రబ్ చేసి సంబంధాలు చెడగొట్టుకుంటాడా? పొత్తు మాట ఎలా ఉన్నా, ఓటింగులో ఉత్సాహంగా పాల్గొనే వయసులో ఉన్న లక్షలాది యువతీయువకులు అభిమానులుగా ఉన్న జూనియర్ ఆగ్రహానికి పార్టీని గురి చేస్తాడా? అబ్బే!

మరి ఎవరు యిలా చేయిస్తున్నారు అంటే లోకేశ్ చేయిస్తున్నాడేమో అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే బాబు కనుక జూనియర్ని తిట్టించాలనుకుంటే ఆయన మార్గమే వేరు. ఏ దళిత నాయకుడి చేతో తిట్టించేవారు. వర్ల రామయ్య వంటి గంభీరకంఠుడు అందుబాటులో ఉన్నాడు. కానీ యిప్పుడు జూనియర్‌పై దాడి ఎక్కువగా జరుగుతున్నది సోషల్ మీడియా ద్వారా! సోషల్ మీడియా అనగానే లోకేశే గుర్తుకు వస్తాడు. సోషల్ మీడియాను తన అనుచరుల ద్వారా దుర్వినియోగం చేసేది లోకేశే అని కొడాలి నాని, వల్లభనేని వంశీ చాలాసార్లు అన్నారు.

పైగా జూనియర్ టిడిపిలోకి వచ్చినా, బిజెపి ద్వారా టిడిపికి సాయపడినా అతను బాబుకి పోటీ ఎప్పుడూ కాదు. అతని పట్ల స్పర్ధ చూపి, అతను వస్తే తన ప్రాధాన్యత తగ్గుతుందని జంకేది లోకేశ్ మాత్రమే. బాబులా కష్టపడి పైకి వచ్చినవారికి అందర్నీ కలుపుకుని పోవడం, లౌక్యం, ఒక హద్దు మీరి దూకుడు ప్రదర్శించకపోవడం సెకండ్ నేచర్‌గా ఉంటుంది. వారసత్వంగా అధికారం దక్కినవారికి ఓర్పు తక్కువ, దూకుడు ఎక్కువ. మిస్‌ఎడ్వెంచర్ చేయడానికి సిద్ధపడతారు. పెద్దలు చెప్పినా వినరు. ‘మీ తరం గడిచిపోయింది, యీ కాలంలో యిలా ఎగ్రెసివ్‌గా ఉండడమే కరక్టు’ అని ఎదురునీతులు చెప్తారు. లోకేశ్ వినే స్థితిలో ఉంటే బాబు కలగజేసుకుని, కూటమి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యీ దాడిని ఆపించి ఉండేవారు. ఆగటం లేదు కాబట్టి బాబు లోకేశ్‌ను వారించలేక పోతున్నారా? అనే సందేహం వస్తుంది. నిజానిజాలు వారిద్దరికే తెలుసు. మనది కేవలం ఊహ మాత్రమే!

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)

mbsprasad@gmail.com

Show comments