విజ‌య‌సాయిరెడ్డిలో ఏమిటీ మార్పు?

వైఎస్సార్‌సీపీలో రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి నెంబ‌ర్‌-2గా పిలుస్తారు. రాజకీయంగా చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై ఆయ‌న ఒంటికాలిపై లేస్తూ వుండ‌డం చూశాం. కానీ ఇటీవ‌ల కాలంలో విజ‌య‌సాయిరెడ్డి ఎందుక‌నో కాస్త నెమ్మ‌దించారు. ఆయ‌న‌లో ఏదో మార్పు క‌నిపిస్తోంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌పై ఏది ప‌డితే అది మాట్లాడ్డం లేదు. జ‌గ‌న్‌తో పాటు త‌న‌ను నెల‌ల త‌ర‌బ‌డి జైలుపాలు చేసిన కాంగ్రెస్ అంటే విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ‌డం చూశాం.

అలాంటి విజ‌య‌సాయిరెడ్డి మాజీ ప్ర‌ధాని, కాంగ్రెస్ నాయ‌కుడు మ‌న్మోహ‌న్‌సింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం విశేషం. సాధార‌ణంగా ప్ర‌ధాని మోదీ, అమిత్‌షా, ఇత‌ర బీజేపీ నేత‌లకు మాత్ర‌మే విజ‌య‌సాయిరెడ్డి శుభాకాంక్ష‌లైనా, ఇత‌ర‌త్రా ఏదైనా చెబుతూ వుంటారు. కానీ తాజాగా ఆయ‌న‌లో వ‌చ్చిన మార్పున‌కు సంకేతంగా మ‌న్మోహ‌న్‌సింగ్‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఉద‌హ‌రిస్తున్నారు.

ముఖ్యంగా చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై ప‌రుష కామెంట్స్‌తో ట్వీట్ చేయడం బాగా త‌గ్గించారు. అటువైపు నుంచి కూడా విజ‌య సాయిరెడ్డిపై నెగెటివ్ కామెంట్స్ లేవు. కాక‌పోతే రాజ‌కీయంగా త‌న ఉనికి చాటుకోవ‌డానికి అన్న‌ట్టుగా టీడీపీపై విమ‌ర్శ‌లు చేస్తూ... రెండురోజుల‌కో మారు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఆ ప్ర‌క‌ట‌న కూడా సాక్షి ప‌త్రిక‌కే ప‌రిమితం. తాజాగా అర‌స‌వ‌ల్లికి చేప‌ట్టిన పాద‌యాత్ర టీడీపీ స‌ర్కార్‌కు భూములిచ్చిన వ్య‌వ‌హారంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఈ పాద‌యాత్ర‌కు టీడీపీ జ‌న‌సమీక‌ర‌ణ చేస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇంత‌కు మించి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు విజ‌య‌సాయిరెడ్డి వెళ్ల‌క‌పోవ‌డం ఆయ‌న‌లో వ‌చ్చిన మార్పుగా చెబుతున్నారు.

గ‌త నెల‌లో విజ‌యసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ‌కీయాల వ‌ర‌కే ప‌రిమిత‌మై మాట్లాడితే తాము కూడా అదే రీతిలో గౌర‌వంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్నారు. హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తిస్తే తాము ప‌దింత‌లు చేస్తామ‌ని టీడీపీ నేత‌ల‌కు స్ప‌ష్ట‌మైన హెచ్చ‌రిక చేశారు. కావున వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు వెళ్లాలా? వ‌ద్దా? అనేది టీడీపీ నేత‌ల చేత‌ల్లోనే వుంద‌ని, చాయిస్ వారికే వ‌దిలేస్తున్న‌ట్టు ఆయ‌న తేల్చి చెప్పారు. అంతేకాదు, వ‌రుస‌కు చంద్ర‌బాబు త‌న‌కు అన్న అవుతార‌ని కూడా విజ‌య‌సాయిరెడ్డి చెప్ప‌డం తెలిసిందే.

విజ‌య‌సాయిరెడ్డిలో రాజ‌కీయంగా వ‌చ్చిన మార్పును ఆ రంగానికి చెందిన వారు గ‌మ‌నిస్తున్నారు. ఇటీవ‌ల వైసీపీ సోష‌ల్ మీడియా బాధ్య‌త‌ల్ని విజ‌య‌సాయిరెడ్డి నుంచి త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే. మీడియా ముందుకు కూడా పెద్ద‌గా ఆయ‌న రావ‌డం లేదు. ట్విట‌ర్ వేదిక‌గా ప‌ద్ధ‌తిగా ట్వీట్లు చేయ‌డం మాత్రం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ట్వీట్ చేశారు.

చిరంజీవి సందేశాత్మక చిత్రం 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండటం సంతోషకరమ‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్‌కు ఆయ‌న శుభాకాంక్ష‌లు కూడా చెప్పారు. చిరంజీవి జీవితం ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌క‌మ‌నే ట్వీట్‌తో మెగా అభిమానుల ప్రేమ‌ను చూర‌గొనే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత వ‌ర‌కూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు సొంత పార్టీ నేత‌ల నుంచి కూడా ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు. పెద్ద‌ల స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తూ... చిల్ల‌ర ట్వీట్లు చేయ‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లున్నాయి. అయినా ఆయ‌న ప‌ద్ధ‌తి మార్చుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఉన్న‌ట్టుండి ఆయ‌న‌కు ఏమైందో తెలియ‌దు కానీ, సంస్కారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే గుర్తింపున‌కు నోచుకోవ‌డం గ‌మ‌నార్హం.

కొంద‌రి వాడిలా ఉన్న తాను... అంద‌రి వాడిన‌ని అనిపించుకోవాల‌నే త‌ప‌న విజ‌య‌సాయిరెడ్డిలో క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మార్పు అనేది స‌హ‌జం. అది మంచి కోస‌మైతే స‌మాజం ఆహ్వానిస్తుంది. అలాంటిదేదో విజ‌య‌సాయి రెడ్డిలో క‌నిపిస్తున్నట్టే ఉంది. 

Show comments