Krishna Vrinda Vihari Review: మూవీ రివ్యూ: కృష్ణ వ్రింద విహారి

టైటిల్: కృష్ణ వ్రింద విహారి
రేటింగ్: 2.5/5
తారాగణం: నాగ శౌర్య, షర్లీ సెటియా, రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్, రాధిక, బ్రహ్మాజి తదితరులు
కెమెరా: సాయి శ్రీరాం
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: మహతి స్వర సాగర్
నిర్మాత: ఉష ముల్పూరి
దర్శకత్వం: అనీష్ ఆర్ కృష్ణ
విడుదల తేదీ: 23 సెప్టెంబర్ 2022

నాగశౌర్య మంచి నటుడే కానీ కొంతకాలంగా సరైన సినిమా పడక విజయాలందుకోలేకపోతున్నాడు. కథలెంచుకోవడంలో సమస్యా లేక ఎంచుకున్న కథ సరిగా తెరకెక్కించలేకపోవడమా అనేది వేరే విషయం? ఏది ఏమైనా మరోసారి స్వయనా తన తల్లే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని అందించారు. విషయమేంటో చూద్దాం. 

సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హీరో. తన, తన కుటుంబసభ్యుల అలవాట్లకి భిన్నంగా ఉండే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకుంటారు. కానీ ఆమెకి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. కానీ ఆమెలోని లొపాన్ని కప్పి పుచ్చి లోపం తనలోనే ఉందని తన ఇంట్లో వాళ్లకి చెప్పి గత్యంతరం లేని పరిస్థితి కల్పించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఏమౌతుందనేది అసలు కథంతా. 

మీకొచ్చిన డౌట్ నిజమే. ఇది "అంటే సుందరానికి..." గురించి కాదు. "కృష్ణ వ్రింద విహారి" గురించే. కథపరంగా రెండింటిలోనూ ఉన్నది ఒకటే పాయింట్. ఒకటే బ్రాహ్మణ బ్యాక్ డ్రాప్. కథాగమనం, అందులోని ట్విస్ట్ కూడా ఒకలాగే సాగుతాయి. 

అంతా ఒకటే అయితే ఈ సినిమాలో ఒరిజినల్ గా తీసింది ఏమిటంటే మధ్య మధ్యలో పేలే చిన్న చిన్న కామెడీ సీన్లు. వాటిని మినహాయిస్తే ఈ చిత్రంలో చెప్పుకొవడానికి విషయాలేవీ లేవు. అన్నీ గతంలో చూసిన సినిమాల తాలూకు రొట్టకొట్టుడు సీన్లే. 

ప్రధమార్ధమైతే సహనానికి పరీక్ష పెడుతూ సా....గుతుంటుంది. బ్రాహ్మణ కుటుంబం. అందులో ఒకడు కులం కట్టుబాటు తప్పడమనే "అదుర్స్" లో బ్రహ్మానందం నాటి ట్రాక్ ని ఇక్కడ బ్రహ్మాజి మీద పెట్టారు. పోనీ అదేమైనా అదుర్స్ అనేట్టుగా ఉందా అంటే అస్సలు లేదు. 

అదుర్స్, దువ్వాడ జగన్నాథం, అంటే సుందరానికి సినిమాలు గుర్తొస్తూ కంపారిజన్ లో ఇది ఎంత బ్యాడ్ గా ఉందో తెలియడం తప్ప ఇందులో హీరో బ్రాహ్మిన్ అవ్వడం వల్ల కథకొచ్చిన ఉపయోగమేమిటో అర్థం కాదు. కొన్ని అలవాట్లు లేకపోవడానికి, దైవభక్తి ఉండడానికి బ్రాహ్మినే అవ్వాలా? పైగా ఈ పాయింట్ మీద ప్రీ రిలీజ్ పబ్లిసిటీ చేసుకోవడం మరో గమ్మత్తు. పోనీ మెథడ్ యాక్టింగ్ లాంటిది చెయ్యాల్సిన అవసరమున్న పాత్రా అంటే అదీ కాదు. 

టెక్నికల్ గా కెమెరా, ఎడిటింగులు బానే ఉన్నా సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాటల్లో వినగానే హత్తుకునే ట్యూన్ ఒక్కటి కూడా లేదు. నేపథ్య సంగీతం కూడా రొటీన్ గా ఉంది తప్ప ఎక్కడా ప్రత్యేకత లేదు. అయితే సందర్భానుసారంగా సెకండాఫ్ చివర్లో వచ్చే టైటిల్ సాంగ్ కాస్త పర్వాలేదనిపించింది, అది కూడా లిరిక్ కారణంగా. మిగిలిన పాటలైతే లిరిక్స్ పరంగా కూడా పరమ వీక్ అని చెప్పుకోవాలి. సంభాషణలు కామెడీ ట్రాక్ వరకు ఓకే కానీ మిగతావి యావరేజ్. 

ఫస్టాఫులో ఆఫీస్ సన్నివేశాలు, లేడీ బాస్ కోసం ఫైట్స్ అన్నీ కృతకంగా ఉండి చిరాకు తెప్పిస్తాయి. సెకండాఫ్ చివర్లో ఎటువంటి ఎమోషనల్ ట్విస్ట్ లేకుండా మరీ ప్రెడిక్టబుల్ గా ముగిసింది.

నాగశౌర్య స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, నటన కానీ ఆకట్టుకుంటాయి. అయితే తాను అవసరాల శ్రీనివాస్ నుంచి ట్రైనింగ్ అయ్యి మరీ బ్రాహ్మిన్ లా నటించడం నేర్చుకున్నాను అని చెప్పినంత విషయం ఇక్కడ క్యారెక్టర్లోనే లేదు. సగటు రొమాంటిక్ హీరోగా తనదైన శైలిలో నటించాడు తప్పించి ప్రత్యేకంగా చేసిందేమీ లేదిందులో. 

హీరోయిన్ షర్లీ అకట్టుకుంది. ఉన్నంతలోనే నటనా ప్రతిభ చూపించడానికి వైవిధ్యమైన సన్నివేశాలున్నాయి. నార్త్ ఇండియన్ క్యారెక్టర్ కి సరిపోయింది. 

హీరో తల్లిగా రాధిక ఓకే. ఆమె ఇంట్రడక్షన్ కాస్త ఓవర్ గా ఉందనిపించినా కథానుగుణంగా ఆమె పాత్ర గాడిలో పడి కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. 

సత్య, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజి ఉక్కపోత మధ్యలో చల్లగాలిలాగ సేదతీర్చారు. ఈ నలుగురూ నాలుగు నవ్వులు పండించబట్టి ప్రధాన కథనాన్ని భరించడం వీలైంది. 

ఒకే తరహా కథతో రెండు సినిమాలు మూడు నెలల వ్యవధిలో వస్తే ఎంత జాగ్రత్తగా తీసినా ప్రేక్షకులు పెదవి విరిచేయడం సహజం. కానీ ఇందులో ఆ జాగ్రత్త కూడా లోపించింది. ఫస్టాఫుని గాలికొదిలేసి కేవలం సెకండాఫ్ చివర్లో కాసిన్ని నవ్వులు తెప్పించి క్లైమాక్స్ లో రిలీఫిచ్చేస్తే సరిపోతుందనుకుంటే పొరపాటే. ఉద్దేశపూర్వకంగా అలా అశ్రద్ధతో ఫస్టాఫ్ రాసుకున్నారని అనలేం కానీ ప్రేక్షకుడిగా చూస్తున్నపుడు మాత్రం ఆ ఫీలింగొస్తుంది. అడుగడుగునా "అంటే సుందరానికి" గుర్తొస్తూ కొత్త సినిమా చూస్తున్న అనుభూతి లోపిస్తుంది. 

బాటం లైన్: అంటే కృష్ణకి..

Show comments