మెగాస్టార్ అయితే దండం పెట్టరా?

పవర్ స్టార్, జ‌నసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఏం మాట్లాడతారో మనకే కాదు ఆయనకు కూడా అర్థం కాదు. భలే సిల్లీగా మాట్లాడుతుంటారు.ఈ రోజు కూడా భలేగా డైలాగులు వేసారు. మెగాస్టార్ చిరంజీవి వెళ్లి సిఎమ్ జ‌గన్ ముందు చేతులు జొడించి నిల్చున్నారు. అదే పవన్ కళ్యాణ్ కు చాలా అంటే చాలా బాధ అంట. 

అలా నిల్చోవడానికి కారణం ఏమిటి? అది తప్పా? ఒప్పా అన్నది కూడా గతంలోనే మెగాస్టార్ నే స్వయంగా వివరణ ఇచ్చారు. తాను చేతులు జోడించింది అక్కడ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఆ హోదాకు, ఆ పదవికి గౌరవంగా నమస్కరించాను తప్ప వేరోటి కాదు అది చెప్పారు. అయినా అది మాత్రం పవన్ చెవికి ఎక్కదు.

ఒక మెగాస్టారు, రెండు రాష్ట్రాలకు సిఎమ్ కావాల్సిన వ్యక్తి చేత చేతులు జోడించి నమస్కారం చేయించుకున్నాడు, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?

ఇదీ పవన్ డైలాగు. ఇంతకన్నా అవివేకం మరోటి వుంటుందా? మన సిఎమ్ లు ప్రధానికి నమస్కారం పెట్టరా? మన పవర్ స్టార్ కేంద్ర భాజ‌పా నాయకులకు, వేరే పార్టీల నాయకులకు మొక్కిన సందర్భాలు లేవా? ఇవన్నీ గౌరవ సూచకాలు తప్ప ఊడిగాలు కావు. 

సినిమా రంగంలో కాళ్లకు మొక్కడం అనే దిక్కుమాలిన పద్దతి వుంది. మెగాస్టార్ కు కూడా అలా బోలెడు మంది మొక్కిన వారే. మరి వారి సంగతి ఏమిటి? అలా కాళ్లకు దండాలు పెట్టించుకున్న మెగాస్టార్ రేపు సిఎమ్ అయితే పరిస్థితి ఏమిటి అని ఎవరైనా అడిగితే ఎంత అసహ్యంగా వుంటుంది?

చిరంజీవి లేదా మొగాస్టార్ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు వున్నా వెళ్లి నమస్కరించడం అన్నది కామన్ అన్న కామన్ సెన్స్ పవన్ కు లేకపోవడం దారుణం. పోనీ జ‌గన్ ఏమన్నా రమ్మని పిలిచారా? వచ్చి దండం పెట్టమన్నారా? చిరంజీవినే కదా అడిగి మరీ వెళ్లింది. అక్కడికేదో చిరంఙీవి వచ్చి తనకు దండం పెడుతూ నిల్చుుంటేనే సినిమా రంగ సమస్యలు పరిష్కారం అవుతాయని జ‌గన్ చెప్పినట్లు పవన్ మాట్లాడతారేమిటి? 

రాజ‌కీయంగా ఎదుగుతారో ఎదగరో తెలియదు కానీ పవన్ మాత్రం ఎప్పటికీ పబ్లిక్ స్పీచ్ ల్లో మాత్రం ఎదగలేరేమో? నొటికి ఏది వస్తే, అప్పటికి ఏది తడితే అదే మాట్లాడేయడం మానకుంటే అంతే మరి.

Show comments