కాంగ్రెస్ అక్క‌డా కూల‌దోసుకుంటుందా!

కాంగ్రెస్ అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో కాకుండా, కూట‌మిలోని వేరే పార్టీ వ‌ల్ల కాంగ్రెస్ ప్ర‌మేయం ఉన్న ప్ర‌భుత్వం ప‌డిపోయిన రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర నిలుస్తుంది. సాధార‌ణంగా కాంగ్రెస్ లో క‌ల‌హాలే ఆ పార్టీ ఉన్న కూట‌మి ప్ర‌భుత్వాల‌ను కూల‌దోస్తూ ఉంటుంది. 

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ వ‌ల్ల‌నే జేడీఎస్- కాంగ్రెస్ కూట‌మి ప్ర‌భుత్వం కుప్ప కూలింది. కాంగ్రెస్ లో నేత‌ల మ‌ధ్య విబేధాలు అలా దెబ్బేశాయి. అయితే కాంగ్రెస్ లో చీలిక తీసుకురావ‌డంలో బీజేపీ ప్ర‌య‌త్నాలు కూడా ఆ స‌మ‌యంలో అలా స‌క్సెస్ అయ్యాయి. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ బుట్ట‌లో చేయి పెట్టిన బీజేపీ, మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌ను చిత్తు చేసింది.

ఇక దేశంలో కాంగ్రెస్ పాత్ర ఉన్న ప్ర‌భుత్వాల్లో చెప్పుకోద‌గిన రాష్ట్రం రాజ‌స్తాన్. మ‌రి ఇక్క‌డ ఇప్ప‌టికే కాంగ్రెస్ ప్ర‌భుత్వం మీద బీజేపీ క‌న్నుంది. ఏదో ఫ‌ర్వాలేద‌నిపించుకునే మెజారిటీ ఉంది కాబ‌ట్టి, కాంగ్రెస్ ను బీజేపీ తేలికగా ఏమీ చేయ‌లేక‌పోతోంది. లేక‌పోతే ఎప్పుడో మ‌ధ్య‌ప్ర‌దేశ్ త‌ర‌హా ప‌రిస్థితి ఏర్ప‌డేది. 

అశోక్ గెహ్లాట్ ముఖ్య‌మంత్రిగా ఉన్నాడు, సచిన్ పైల‌ట్ ను ప్ర‌యోగించి ఈ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసే ప్ర‌య‌త్నాలు జ‌రిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇందుకు త‌గ్గ‌ట్టుగా అశోక్, స‌చిన్ లు బోలెడ‌న్ని సార్లు స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు చేసుకున్నారు. ఈ ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.

వీరి మ‌ధ్య‌న విబేధాలు మ‌రోసారి ర‌చ్చ‌కు ఎక్కాయి. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా వీరి మ‌ధ్య‌న మ‌రోసారి విబేధాలు భ‌గ్గుమ‌న్నాయి. స‌చిన్ కు ప‌రోక్షంగా అశోక్ స‌వాళ్లు విస‌ర‌గా, ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన స‌మావేశానికి హాజ‌రు కాకుండా స‌చిన్ త‌న నిర‌స‌న‌ను తెలిపాడు. ఇదే సంద‌ర్భంలో పార్టీలో కార్య‌క‌ర్త‌ల‌కు గౌర‌వం ద‌క్క‌డం లేదంటూ స‌చిన్, కార్య‌క‌ర్త‌ల‌కు గౌర‌వం ద‌క్కుతోందంటూ అశోక్ లు ప‌రోక్ష వాద‌న‌కు దిగారు. 

మ‌రి వీరి తీరును గ‌మ‌నిస్తే..  క‌నీసం రాజ‌స్తాన్ లో అయినా కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేసుకుంటుందా, లేక ఇక్క‌డా సొంతంగానే కూల దోసుకునే చ‌ర్య‌ల‌తో బీజేపీకి ఛాన్స్ ఇస్తుందో అనుకోవాల్సివ‌స్తోంది.

Show comments