క్ష‌మాప‌ణ మ‌న‌సు మార్చుతుందా?

ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప‌ట్టు ప‌ట్టి టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డితో క్ష‌మాప‌ణ చెప్పించుకున్నారు. అయినా ఆయ‌న మ‌న‌సు మారుతుందా? కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఈ మొత్తం వివాదానికి కార‌ణ‌మైన అద్దంకి ద‌యాక‌ర్ రెండోసారి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి క్ష‌మాప‌ణ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

చండూరు సభలో తాను చేసిన వాఖ్యలకు భాదపడుతున్నట్లు ద‌యాక‌ర్ ఇవాళ మ‌రోసారి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన తరుపున ఔన్న‌త్యంతో క్షమాపణ చెప్పారన్నారు. సోదర భావంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోసం పనిచేయాలని అద్దంకి దయాకర్ కోరడం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స్పంద‌న ఎలా వుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి  క్ష‌మాప‌ణ చెప్పిన విష‌యం త‌న దృష్టికి రాలేదన్నారు. రేవంత్ క్ష‌మాప‌ణ తాను విన‌లేదు, క‌న‌లేద‌న్నారు. కానీ త‌న‌పై అవాకులు చెవాకులు పేలిన అద్దంకి ద‌యాక‌ర్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని తాజాగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి డిమాండ్ చేయ‌డం విశేషం. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కోరుకున్న‌ట్టు రేవంత్ క్ష‌మాప‌ణ చెప్పార‌ని, ఇక పార్టీ కోసం ఆయ‌న ప‌ని చేయాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంతురావు కోరారు.

అయితే కోమ‌టిరెడ్డి స్పంద‌న చూస్తే ఆయ‌న పార్టీ కోసం ప‌నిచేసేలా క‌నిపించ‌డం లేదు. ఎంత‌సేపూ డిమాండ్ల మీద డిమాండ్లు పెడుతూ పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అద్దంకి రెండు సార్లు, రేవంత్‌రెడ్డి ఒక‌సారి క్ష‌మాప‌ణ చెప్పినా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మ‌న‌సు మార‌ద‌నే అంటున్నారు. 

కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకునే, ఏవో ఒక డిమాండ్ల‌ను తెర‌పైకి తెస్తున్నార‌ని కాంగ్రెస్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. రేవంత్‌, అద్దంకి క్ష‌మాప‌ణ‌లు వృథా అవుతాయ‌నే వాళ్లే ఎక్కువ‌. 

Show comments