మ‌హాపాద‌యాత్ర దేనికోసం?

అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని వుంటుంద‌ని హైకోర్టు తీర్పుతో సంబ‌రాలు చేసుకున్నారు. అస‌లు అసెంబ్లీకి రాజ‌ధాని ఏర్పాటు చేసే హ‌క్కు ఉండ‌ద‌ని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఏదైనా పార్ల‌మెంట్‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాకుండా, ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను కూడా కొట్టి వేసింది. ఈ తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌లేదు. మ‌రెందుకు మ‌ళ్లీ అమ‌రావ‌తి రైతులు మ‌హాపాద‌యాత్ర చేప‌ట్టాల్సి వ‌స్తోంది?

ఇప్ప‌టికే న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో తిరుమ‌ల‌కు పాద‌యాత్ర చేశారు. హైకోర్టు తీర్పు కూడా వారికే అనుకూలంగా వ‌చ్చింది. మూడు రాజ‌ధానుల‌పై ఏం చేయాలో ఏపీ ప్ర‌భుత్వానికి దిక్కుతోచ‌ని స్థితి. అయితే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విశాఖ‌కు ప‌రిపాల‌న రాజ‌ధాని వ‌చ్చి తీరుతుంద‌ని అప్పుడ‌ప్పుడు వైసీపీ నేత‌లు ఆర్భాట ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. న్యాయ‌స్థానాన్ని ఒప్పించి ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని తీసుకెళ్తామ‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ నుంచి అర‌స‌వెల్లికి మ‌హాపాద యాత్ర చేయాల‌ని అమ‌రావ‌తి రైతులు నిర్ణ‌యించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సెప్టెంబ‌ర్ 12 నాటికి అమ‌రావ‌తి ఉద్య‌మానికి వెయ్యి రోజులు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో అదే రోజు మ‌హాపాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. 60 రోజుల పాటు పాద‌యాత్ర సాగించాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే పాద‌యాత్ర చేసే హ‌క్కు ఎవ‌రూ కాద‌న‌లేరు.

ఇప్పుడు అమ‌రావ‌తి రాజ‌ధానికి వ‌చ్చిన ఇబ్బంది ఏంట‌నేదే ప్ర‌శ్న‌. ప్ర‌భుత్వంపై ఇత‌ర ప్రాంతాల్లో వ్య‌తిరేక‌త పెంచే ల‌క్ష్యంతో పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌క్కా టీడీపీ పొలిటిక‌ల్ యాత్ర‌గా వైసీపీ నేత‌లు అభివ‌ర్ణిస్తున్నారు. 

అమ‌రావ‌తి కార్పొరేట్ శ‌క్తుల వెనుక టీడీపీ వుంటూ నాట‌కానికి తెర‌లేప‌నున్న‌ట్టు అధికార పార్టీ విమ‌ర్శ‌లు చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ పాద‌యాత్ర ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో చూడాలి.

Show comments