స‌రైన స‌మ‌యంలో...స‌రైన నిర్ణ‌యం

త‌న అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కాంగ్రెస్‌లో కొన‌సాగ‌డంపై త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక‌కు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామా కార‌ణ‌మైన సంగ‌తి తెలిసిందే. 

ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ రాక‌నే, కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు ప‌ర‌స్ప‌రం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. మునుగోడులో గెలుపు త‌మ‌దంటే త‌మ‌ద‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నారు. ఈ నేప‌థ్యంలో మూడు పార్టీల నేత‌లు పోటాపోటీగా బ‌హిరంగ స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇవాళ రాజ‌గోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న రాజీనామా వృథా కాలేద‌న్నారు. ప్ర‌భుత్వంలో క‌ద‌లిక తెచ్చింద‌న్నారు. రాజీనామా చేసిన త‌ర్వాతే చేనేత కార్మికుల‌కు ప్ర‌భుత్వం పింఛ‌న్లు ప్ర‌క‌టించింద‌న్నారు. అలాగే మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్డు వేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. ఇప్పుడే మునుగోడులో అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. గ్రామ పంచాయ‌తీల‌కు నిధులు విడుద‌ల చేసి స‌ర్పంచుల‌కు ఫోన్లు చేసి చెబుతున్నార‌న్నారు.

అలాగే త‌న అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కాంగ్రెస్‌లో కొన‌సాగ‌డంపై స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటార‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది. మ‌రోవైపు కోమ‌టిరెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై విమ‌ర్శ‌ల దాడి పెంచారు. మునుగోడులో పార్టీని ఆయ‌న గెలిపించుకోవాల‌ని సూచించారు.

కోమ‌టిరెడ్డి త‌న‌కు తానుగా కాంగ్రెస్ నుంచి బ‌య‌టికి రావ‌డ‌మా, లేక ఆయ‌న్ను గెంటేడ‌మా? ఏదో ఒక‌టి త్వ‌ర‌లో జ‌రిగే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. అయితే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారే త‌ప్ప ఎంపీ ప‌ద‌విని వెంక‌ట‌రెడ్డి వ‌దులుకోర‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తానికి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కేంద్రంగా తెలంగాణ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌న్న‌ది వాస్త‌వం.

Show comments