మహానుభావులకు కులం పులిమేయడం ఘోరం!

అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఘనమైన కార్యక్రమం జరిగింది. అల్లూరి సీతారామరాజు వంటి పోరాట యోధుడిని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటూ ఉత్సవాలు నిర్వహించుకుంటున్న ఈ సమయంలో స్మరించుకోవడం, 30 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణతో ఘనంగా నివాళి అర్పించడం గొప్ప విషయం. 

అయితే.. అల్లూరి సీతారామరాజును క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి గనుక గౌరవించడం.. ఆయనకు కులం రంగు పులిమి ఆ కులం వాళ్లు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేయడం ఇదంతా.. శోచనీయం. 

ఇది కేవలం అల్లూరికి మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. కులం లాంటి పరిధులను దాటి.. యావత్ దేశానికి గర్వకారణమైన అనేక మంది నాయకుల విషయంలో.. వర్తమానంలోని స్వార్థ రాజకీయ శక్తులు, ఇతర ప్రయోజనాలను ఆశించే వారి వల్ల కులం రంగు పులమడం చాలా సహజంగా జరిగిపోతూ ఉంటోంది. 

గాంధీ ఈ దేశానికి అందించిన సేవలు తెలిసిన వారు.. ‘ఆయన ఏ కులం  వాడు’ అని ఆలోచించారు. గాంధీ.. అంటే మహాత్ముడు! ఈ దేశానికి జాతిపిత! మనం అందరమూ గాంధీని అదే దృష్టితో చూస్తున్నాం. అయితే.. వర్తమానంలో.. గాంధీ తమ కులం వాడు అని చెప్పుకోవడం వైశ్యులకు ఫ్యాషన్ అయిపోయింది. 

గాంధీ జయంతి రాగానే.. వైశ్యులంతా వేడుకలు నిర్వహించడం. వైశ్య కుల ట్యాగ్ లైన్ తెలిసేలాగా.. ప్రత్యేకించి.. ప్రకటనలు ఇవ్వడం చాలా రివాజు అయిపోయింది. వైశ్యులు ఇలా కుల ముద్ర వేసే విషయంలో పొట్టి శ్రీరాములు సంగతి కూడా అంతే. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి చివరిదశలో కీలక కారకుడు పొట్టి శ్రీరాములు. ఆయన పుణ్యమాని ఆంధ్రరాష్ట్రం అప్పటికి వచ్చింది. ఆయన సేవలు, పోరాటం ఒక కుల ప్రతినిధిగా సాగినవి కాదు!

అంబేద్కర్ సేవలు, ఈ దేశానికి సంబంధించినంత వరకు దళితులకు పరిమితమైనవి కాదు. రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ కూడా.. రాజ్యాంగ కమిటీకి సారథ్యం వహించిన అంబేద్కర్ మేథను గౌరవించాల్సిందే. అయితే, దళితులు ప్రత్యేకించి అంబేద్కర్ ను తమ వాడుగా ముద్ర వేసుకుంటూ.. ఇతర కులాల వారు ద్వేషించే వాతావరణాన్ని ఎందుకు చేస్తుంటారో అర్థం కాదు. 

కులాన్నే నమ్ముకుని ఎదిగే నాయకులు కొందరుంటారు. ఫలానా కులం వాడు కావడం వల్లనే ప్రజాజీవితంలోకి రావడం, రాజకీయాల్లో కెరీర్ ను ఆశించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ల జయంతులకు, వర్ధంతులకు కులసంఘాలు ప్రకటనలు ఇచ్చినా సబబుగానే ఉంటుంది. 

కానీ.. కులాల మతాల గోడలను పటాపంచలు చేసేసి.. జాతినేతలుగా ఎదిగిన వారి మీద.. కులం ముద్రలు పడేలా.. ఇప్పుడు కులసంఘాల ప్రతినిధులు.. ప్రకటనలు గుప్పించుకుంటూ.. ప్రవర్తిస్తే.. వారి కులాలకు చెందిన సదరు మహానుభావులకే మచ్చ. ఆ సంగతి వారు తెలుసుకుంటే మంచిది!

జాతి గర్వించదగిన నాయకులు కూడా వారి పుట్టుక కారణంగా ఏదో ఒక కులానికి చెందిన వారై ఉంటారు. అలాగని ఆ కులం వాళ్లు.. ‘ఫలానా నేత మావాడే’ అని టముకు వేసుకునే కొద్దీ.. భవిష్యత్తరాలు.. ఆ నాయకుడిని జాతీయనేతగా గుర్తించడం మానేసి.. ఒక కుల ప్రతినిధిగా చూసే దారిద్ర్య వాతావరణం ఏర్పడుతుంది!

Show comments