కేసిఆర్ ముందు మోడీ తేలిపోయారా?

భాజపా జాతీయ సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రసంగం ముగిసింది. చాలా మంది ఈ ప్రసంగం గురించే ఆసక్తిగా ఎదురు చూసారు. ఎందుకంటే తెలంగాణలో రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో భాజపా తరపున బలమైన వాదనను మోడీ వినిపిస్తారని చాలా మంది ఆశించారు. దానికి తోడు గత రెండు రోజులుగా హైదరాబాద్ లో తెరాస చాలా దూకుడుగా వుంది. 

నిన్నటికి నిన్న కేసిఆర్ హిందీలో మోడీ లక్ష్యంగా చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కేసిఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ మీద వుంది. ముఖ్యంగా తెలంగాణకు కేంద్రం చేసింది ఏమీ లేదన్నది కేసిఆర్ వాదన. దాన్ని మోడీ కౌంటర్ చేయాల్సి వుంది.

కానీ మోడీ ప్రసంగం ఆ దిశగా సాగలేదు. వాస్తవం చెప్పాలంటే చప్పగానే వుంది. కేంద్రం ఇచ్చే బియ్యం, పింఛన్లు ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చారు తప్ప ఇంకేమీ లేదు. కేంద్రం ఈ సాయం అన్నది కేవలం తెలంగాణకే పరిమితం కాదు. అన్ని రాష్ట్రాలకు వుంటుంది. ప్రత్యేకించి తెలంగాణకు ఏమి ఇచ్చామన్నది మోడీ క్లారిటీగా చెప్పలేకపోయారు. 

కేంద్రం రాష్ట్రాలకు సాయం ఎలా చేస్తుంది. ఈ రాష్ట్రం నుంచి జీఎస్టీ రూపంలో కేంద్రం వాటాగా వచ్చిన ఆదాయంతోనే కదా. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ఆదాయంలో కొంత ఇక్కడకు ఇవ్వడం సాయం ఎలా అవుతుంది?

ముఖ్యంగా నిన్న కేసిఆర్ సంధించిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పలేదు. అసలు కేసిఆర్ ఊసే ఎత్తలేదు. రాబోయే ఎన్నికల్లో భాజపాను ఆదరించాలనే విధంగా మాట్లాడారు తప్ప, ఎందుకు ఆదరించాలో అన్నది చెప్పలేకపోయారు. తమ ప్రభుత్వం వస్తుందని చెప్పారు కానీ ఎలా వస్తుందన్నది లేదు. ప్రజలు కేసిఆర్ పట్ల అంత విముఖతతో వున్నారా? అన్నది కూడా మోడీ చెప్పలేదు.

మొత్తానికి ఈ రోజు వరకు అయితే రాజకీయ పోరు లో కేసిఆర్ దే పైచేయిగా వుంది. సోషల్ మీడియాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. భాజపా కార్యకర్తలు కూడా మోడీ ప్రసంగం పట్ల నిరాశకు లోనయ్యారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Show comments