తెలుగుదేశం వైపుగా కృపారాణి...?

వైసీపీలో తనకు సరైన అవకాశాలు దక్కడంలేదని భావిస్తున్న శ్రీకాకుళం జిల్లా సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైకిల్‌ ఎక్కాలని ఆరాటపడుతున్నట్లుగా ప్రచారం గట్టిగా సాగుతోంది. 

ఆమె నిజానికి వైఎస్సార్‌ తెచ్చిన నాయకురాలు. అంతవరకూ డాక్టర్‌ వృత్తిలో ఉన్న ఆమెను పిలిచి తొలిసారి 2004లో శ్రీకాకుళం ఎంపీ టిక్కెట్‌ ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ది. 

తొలి ప్రయత్నంలో ఆమె గెలవకపోయినా మలివిడత అంటే 2009 ఎన్నికలలో మాత్రం దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రంనాయుడును గెలిచి జెయింట్‌ కిల్లర్‌ అనిపించుకున్నారు. ఆ తరువాత ఆమె కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 

ఇక 2014లో వైసీపీలో చేరాలని ఆహ్వానం వచ్చినా ఆమె కాంగ్రెస్‌ వైపు ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరినా జగన్‌ టిక్కెట్‌ హామీ ఇవ్వలేకపోయారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నిన్నటిదాకా ఉన్న ఆమె ఆ పదవిని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఇవ్వడంతో ఖాళీ అయిపోయారు. 

ఇక రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని భావించినా ఆ ఆశ కూడా నెరవేరలేదు. దాంతో కిల్లి కృపారాణి టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. తెలుగుదేశంలో చేరితే వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చునని ఆమె భావనగా ఉందిట. 

ఇక శ్రీకాకుళం జిల్లాలో బలమైన నాయకురాలిని తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా వైసీపీకి రుల‌క్ ఇవ్వాలని చూస్తున్న టీడీపీకి కూడా ఆమె రాక ఓ అవకాశంగా మారుతుంది అంటున్నారు.

Show comments