ఎమ్బీయస్: యుగాంతం

డూమ్స్‌డే గురించి యండమూరి వీరేంద్రనాధ్ రాసిన సైఫై నవల ‘‘యుగాంతం’’ జ్యోతి మాసపత్రికలో అవసరమైన దాని కంటె చిన్న సీరియల్‍గా రాసి తర్వాత పుస్తకంగా వేశారు. జీవితం అంటూ వుంటేనే లోకం వుంది, ఆ లోకంలో ఏదో సాధించాలన్న ఆశ వుంది, లోకాన్ని ఉద్ధరిద్దామన్న ఆశయం వుంది. ప్రాణం అంటూ వుంటేనే పరువుకోసం పాకులాట వుంటుంది, డబ్బుకోసం పోరాటం వుంటుంది. అవేమీ లేని రోజు త్వరలో వస్తోందంటే ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు అన్నదే ‘‘యుగాంతం’’ నవలలో వీరేంద్రనాథ్‍ చర్చించారు. ఈ నవలలో అనేకానేక పాత్రలు. ఒక్కొక్కరిది ఒక్కో వాతావరణం. పాత్రలను పరిచయం చేయడం, కాస్త కథ నడపడం, తర్వాత ఇంకోచోటకు కెమెరాను తీసుకుపోవడం, అక్కడ పాత్రల పరిచయం, కాస్త కథ, మళ్లీ యింకోచోటకి, మళ్లీ మొదటి చోటికి కెమెరా.. యిలా నడిచే నవలను ఎవరికి వారు చదువుకుంటే బాగానే అర్థమవుతుంది. ఎందుకంటే వీడెవడ్రా అనుకుని కన్‍ఫ్యూజ్‍ అయితే పేజీలు వెనక్కి తిప్పవచ్చు. క్లుప్తంగా చెప్పినపుడు ఆ సౌలభ్యం లేదు కాబట్టి, ఒక్కో పాత్రను తీసుకుని, వాళ్ల కథను ఆల్మోస్టు కడదాకా చెప్పుకుపోతాను. తర్వాత ఇంకో పాత్రను ఫోకస్‍ చేసుకుని వాళ్ల కథ మొదటినుండీ చెప్పుకు వస్తాను. అలా అయితే బాగా అర్థమవుతుంది.

భూమికి అతి దగ్గరగా వున్న నక్షత్రం ప్రాక్సిమా సెంక్చువరీ. ఎంత దగ్గర అంటే సూర్యుడికీ, భూమికీ దూరం ఓ అంగుళం అనుకుంటే, దానికీ భూమికీ మధ్య దూరం నాలుగు మైళ్లు. అంత దగ్గర. అది ఓ అశుభముహూర్తాన తన కక్ష్యలో నుంచి వెంట్రుకవాసిలో బయటపడి అమితమైన వేగంతో జారిపోవడం మొదలుపెట్టింది. క్రమక్రమంగా అతి వేగంగా అంటే కొన్ని వేల కోట్ల మైళ్ల వేగంగా ప్రయాణిస్తూ భూమికి దగ్గరగా రాసాగింది. అంటే అది భూమికి దాదాపు యాభై లక్షల మైళ్ల దూరం నుంచి ప్రక్కగా దూసుకుపోయి అనంత విశ్వంలో కలిసిపోతుందన్నమాట. అదే వేగం కొనసాగితే, అది భూమికి అత్యంత సమీపంగా, దాని పరిధిలోకి రావడానికి కథాకాలం నాటికి ఇరవై రోజుల కంటె ఎక్కువ టైము లేదు. అంటే ఆగస్టు 17న మధ్యాహ్నం గం।। 11.10 ని।।లకు ప్రవేశించి మూడు సెకన్లపాటు భూమి పరిధిలో వుండి ముందుకు దూసుకుపోతుందన్నమాట.

దీనివల్ల జరిగే పరిణామం ఏమిటంటే - ఆ నక్షత్ర అయస్కాంత ప్రభావం భూమి మీద పడుతుంది. భూకంపం కలుగుతుంది. భూమి అడుగుపొరల్లో వుండే ఇనుము, లావా దాని ఆకర్షణ శక్తికి లోనై పెల్లుబుకుతాయి. అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. దాంతో భూమి మీదున్న చరాచరాలన్నీ గుర్తుకూడా మిగలకుండా నాశనమవుతాయి. విశ్వంలో వున్న కోటానుకోట్ల గ్రహాల మాదిరిగానే భూమికూడా నిస్తేజమైపోతుంది. సముద్రాలు యింకిపోయి వాటిమీద లావా గట్టిపడుతుంది. ఆక్సిజన్‍ ఓజోనుగా మారుతుంది. ఈ పరిణామాన్ని గ్రీన్‍విచ్‍ అబ్జర్వేటరీ గమనించింది. ఆ విషయం తెలిస్తే అందరిలో గందరగోళం పుడుతుందని, భూమి నాశనం కావడానికి ముందే యిప్పటినుండీ కల్లోలం రేగుతుందని, నైతిక విలువలు మంటగలుస్తాయని, భయపడి భూప్రపంచంలో అన్ని అబ్జర్వేటరీలను మూసేయమని ఆర్డరేసింది.

భూమిపై వున్న వస్తువులన్నీ ఒకేరీతిగా ఆ నక్షత్రం వైపు ఆకర్షింపబడతాయా? ఆ నక్షత్రంమీద మన మామూలు అయస్కాంతం వుందనుకోండి. అప్పుడు భూమిమీద వున్న యినుము అన్నిటికంటె ముందు దాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ దాని మీద వున్నది బంగారాన్ని ఎక్కువగా ఆకర్షించే గుణం కలదనుకోండి, అప్పుడు బంగారం తొందరపడుతుంది. అయితే ప్రాక్సిమా ఆకర్షణకు లోనయ్యే లోహం ఒకటి వుంది. అది ఓ బండరాయిలో వుంది. భూమి రౌండ్లు కొడుతూ వుంటుంది కదా, ఒకానొక దశలో ఆ నక్షత్రానికి కాస్త చేరువైనప్పుడు ఈ బండరాయిలోని లోహం ఆకర్షింపబడి అంత పెద్ద బండరాయి నాలుగైదు అడుగులు గాల్లోకి లేచింది. అంతలోనే ఆ ప్రాక్సిమా దూరమయిపోయింది. దాంతో ఈ బండరాయి దబ్బున కింద పడిపోయింది. అది దేశప్రధానమంత్రి జగదీష్‍ కంటబడింది. ఆయన పార్టీ ఎన్నికల్లో నెగ్గి అతి కష్టం మీద మెజారిటీ సంపాదించింది. వాటాలేసి మంత్రివర్గం తయారుచేయాలి. ఏ మాత్రం అసంతృప్తి కలిగినా పార్టీ అధికారంనుండి జారిపోవడం ఖాయం. ఏం చేదామాని ఆలోచిస్తూండగా రాత్రి రెండుగంటల వేళ ఈ బండరాయి లేవడం చూశాడు. అదేమిటో ఆయనకు అర్థం కాలేదు. అవేళ ఏప్రిల్‍ 13.

ఆగస్టు 1 నాటికి ఆయనకు ప్రొఫెసరు ఆనందమార్గం అనే ఆయన వద్దనుంచి ఓ తమాషా ఐన ఉత్తరం వచ్చింది, ఆగస్టు 17 నాటికల్లా భూమి బద్దలయిపోతుందని! ఆ పాటికి ఆయన కాబినెట్‍ ఏర్పాటు చేయడం, అసమ్మతి రగలడం, ప్రతిపక్షం వాళ్లు దాన్ని ఆసరా చేసుకుని ఏదో గోలచేయడం జరిగింది. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏదో ఒకటి దొరికితే బాగుండునని చూస్తున్నాడు. ఆ సమయంలో ఈ ఉత్తరం అనుకోకుండా ఆయనకు చేరింది. ఆ ప్రొఫెసర్‍గార్ని ఢిల్లీ వచ్చి కలవమని కబురు పెట్టాడు. ఆ ఉత్తరం రాసిన పెద్దమనిషి ఓ సైంటిస్టు. పేరు ప్రొఫెసరు ఆనందమార్గం. అందరూ ప్రొఫెసర్‍ అయోమయం అంటారు. వయసు 75 సంవత్సరాలు.  ఒకయామా అస్ట్రోఫిజికల్‍ అబ్జర్వేటరీనుండి సర్టిఫికెట్‍ పొందాడు. ఒకప్పుడు హార్ట్‌లాండ్‍ మాగ్నెట్‍ ఫీల్డులో రాయల్‍ అస్ట్రానమర్‍గా నాలుగు వేల పౌండ్ల జీతం తీసుకున్నాడు. అది వదులుకుని వచ్చేసి స్వంత టెలిస్కోప్‍ పెట్టుకున్నాడు.

ప్రస్తుతం పరమ దుస్థితిలో వున్నాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. ఓ నవాబుగారు వాళ్ల పూర్వీకులకు యిచ్చిన పాత భవనంలో వుంటున్నాడు. అది పూర్తిగా శిథిలావస్థలో వుండి, ఎలకలకు, పందికొక్కులకు ఆవాసంగా వుంది.  ఆ శిథిల భవనంలోనే ప్రొఫెసర్‍ గారికి ఓ టెలిస్కోపు వుంది. ఆస్తంతా ఖర్చు పెట్టి ప్రపంచంలోకెల్లా పెద్ద టెలిస్కోపు తయారుచేశాడు. ఆ గది కప్పుకి అద్దాలు బిగించి కొత్త గెలాక్సీ కనబడుతుందేమో, కొత్త ప్లానెట్‍ కనబడుతుందేమోనని చూస్తూంటాడు. అది ప్రపంచానికి తెలియపరచి నోబెల్‍ ప్రైజ్‍ సంపాదిద్దామనే ఆశ అతనిది. మరీ గొప్ప మేధావులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారంటారు కదా, అలా అయ్యాడన్నమాట. అప్పుడప్పుడు ‘సైన్సు టుడే’కు ఆర్టికల్స్ పంపిస్తూంటాడు.

రమణ అనే ఒకతనికి ఈ ప్రొఫెసర్‍ యిరానీ హోటల్లో తారసిల్లాడు. టీకి డబ్బులు లేవు గానీ నా దగ్గర ఉద్యోగం చేస్తావా? అన్నాడు. ప్రస్తుతానికి నాలుగు వందలు జీతం యిస్తాను. తర్వాత, అంటే నోబెల్‍ ప్రైజ్‍ వచ్చాక జీతం వెయ్యి చేస్తాను అన్నాడు. రమణ నవ్వుకుంటూనే అతని దగ్గర చేరాడు. ప్రొఫెసర్‍ పర్యవేక్షణలో టెలిస్కోపు చూస్తూండగా ఈ ప్రాక్సిమా కనబడింది. అది ఒకరోజు నారింజపండు సైజులో కనబడింది. మర్నాడు ఫుట్‍బాల్‍ సైజులో కనబడింది. దాని గురించి ప్రొఫెసరుకి చెప్పాడు. అప్పుడు ప్రొఫెసరు లెక్కలు వేసి ఆగస్టు 17 కల్లా భూమి అంతం అయిపోతుందని చెప్పాడు. ఈ రమణ నిరుద్యోగి అయితే అతని అన్న ప్రకాశరావు చిరుద్యోగి. తండ్రి విశ్రాంతోద్యోగి, పైగా జబ్బు మనిషి. ప్రకాశరావు, జానకి దంపతులకు ఓ బాబు. ఇటువంటి కుటుంబాల్లో వుండే కష్టాలన్నీ వున్నాయి.

ఇలాటి పరిస్థితుల్లో వున్న రమణను ఓ డబ్బున్న అమ్మాయి, మాలతి ప్రేమించింది. అతనితో ఎంతదూరం వెళ్లడానికైనా సిద్ధపడింది. కానీ అతను నీతి, నిజాయితీ, పెళ్లి కాకుండా యివన్నీ కూడవు అంటూ దూరంగానే వుంచాడు. కనీసం ఆమె చేతిని తన చేతిలో తీసుకోవడం కూడా తప్పు అనుకునే తత్వం అతనిది. ఆమె తండ్రి దగ్గరకు ఓ సారి వెళితే ‘‘ఇంకెప్పుడూ యిటురాకు. మాలతికి సంబంధాలు చూస్తున్నాం. నీవల్ల దానికి అపకారం జరిగిందంటే, నీ రక్తం కళ్ల చూడాల్సి వస్తుంది.’’ అన్నాడాయన. ‘‘అపకారం చేయాలన్న ఆలోచనే వుంటే మీ ముందుకు ఎందుకు వస్తాను? మాలతికి మైనారిటీ తీరిపోయిందనీ, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలంటే మీ డబ్బుగానీ, గూండాలుగానీ ఆపలేవనీ తెలుసు. అయితే ఈ వివాహం జరగకుండా ఆపుతున్నది - నైతిక విలువలకు నేనిస్తున్న గౌరవం, అంతే!’’ అని సమాధానమిచ్చాడు. అదీ అతని నిబద్ధత.

ఉద్యోగం గురించి రమణ ఇండియన్‍ టైమ్స్ అనే పత్రికాఫీసుకి వెళ్లాడు. అక్కడ ఓ రికమెండేషన్‍ కాండిడేట్‍ సిద్ధంగా వుండడం వలన యితన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి తరిమేశారు. అక్కడ అతన్ని చూసిన సబ్‍ ఎడిటర్‍ శైలజ అనే అమ్మాయి మనసు పారేసుకుంది. అనుకోకుండా అతని జవాబులు విని అతని మేధస్సును ఆరాధించింది. శైలజది ‘‘అంతులేని కథ’’లో హీరోయిన్‍ పాత్ర. తండ్రి, తల్లి, తమ్ముళ్లు వున్న ఉమ్మడి కుటుంబాన్ని తన ఒక్కదాని జీతంతో పోషిస్తోంది. ఆమె గురించి పట్టించుకునేవారు లేరు. ప్రళయం వస్తోందంటే వాళ్ల నాన్న ఐదువందలు ఖర్చు పెట్టి ఓ తాయెత్తు కొందామంటాడు. ఈమె కోసం కాదు, ఈమె తమ్ముడి కోసం! జీవితం మోడువారిపోతున్నా పవిత్రంగా వుండి, తనను కట్టుకున్నవాడి చేతిలో తన కన్యత్వం ధారపోద్దామని ఆమె ఆశ. రమణను చూడగానే యితను తన ఆఫీసులో చేరి, తనను ప్రేమిస్తాడేమోనని కలలు కంది.

తీరాచూస్తే అతనికి ఉద్యోగమే రాలేదు. అయితే సెలక్టయిన రామన్‍ అనే అతను తనకి వేరే ఉద్యోగం రావడం వలన యీ ఉద్యోగానికి రావటం లేదని టెలిగ్రాం యిచ్చాడు. అది ఆసరాగా తీసుకుంది. రామన్ పేరు చివర ‘ఎ’ చేర్చేసి రమణకు అపాయింట్‍మెంట్‍ ఆర్డరు పంపేసింది. ఆమె ధర్మమాని అతను ఉద్యోగంలో చేరాడు. ఆగస్టు 1 నాటికి అతనికి నాలుగురోజుల జీతం కూడా వచ్చింది. ఆ పాటికి ప్రొఫెసర్‍ ఆగస్టు 17 నాటి ఉపద్రవం గురించి ప్రధానమంత్రికి ఉత్తరం రాయడం, ఆయన యీయన్ని రమ్మనడం జరిగాయి. ఈయన రమణ ఆఫీసుకి వచ్చి నువ్వూ నాకు తోడుగా రా అన్నాడు. లీవు దొరుకుతుందాని రమణకు భయం. శైలజ ప్రొఫెసర్‍ను గుర్తుపట్టి, ఆయన్ని కదలేసి వివరాలన్నీ అడిగింది. దీని నిజానిజాల మాట ఎలాగున్నా న్యూస్‍ వర్దీనెస్‍ వుందని ఆమెకు తట్టింది. అందుకని మరే యితర న్యూస్‍పేపర్‍కు చెప్పనని మాట యిస్తే రమణకు సెలవు మంజూరు చేయిస్తానంది. సరే అన్నాడీయన. 

ఆగస్టు 4 వ తారీకున ఇండియన్‍ టైమ్స్‌లో శైలజ ఇంకో 13 రోజుల్లో భూమి అంతం కాబోతోందని ప్రొఫెసర్‍ ఆనందమార్గం చెబుతున్నారు అని న్యూస్‍ వేసింది. దానికి ఎవడూ పెద్దగా ప్రాముఖ్యం యివ్వలేదు. అవేళే ప్రొఫెసరు, రమణ ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. అప్పుడాయన మూడు నెలల క్రితం బండరాయి గాలిలో లేవడం తాను గమనించిన విషయం చెప్పి మీ థియరీ మీద వర్క్ చేయండి, ఫలితాలు చెప్పండి అన్నాడు. ఈయన చెప్పినట్టు భూమి అంతం కాకపోయినా, యీ మధ్యలో ప్రజల దృష్టి అటు మరలితే పార్టీని బలోపేతం చేసుకునే సావకాశం చిక్కుతుంది కదాని ఆయన ఆలోచన.

అవేళ రాత్రి పౌర్ణమి అయినా చంద్రుడు రాత్రి పదిన్నర వరకూ ఆకాశంలోకి రాలేదు. బండరాయిని పరీక్షించిన సైంటిస్టు దానిలో వున్న లోహాన్ని కనుక్కోలేకపోయాడు. అప్పుడు ప్రొఫెసరుకి ఓ ఐడియా వచ్చింది. చంద్రుడిలో వున్న పదార్థం పేరు ఆర్మాల్‍ కొలైట్‍. చంద్రుడిమీదకు వెళ్లిన ఆస్ట్రోనాట్స్ చంద్రశిలను వెనక్కి తెచ్చారు. దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ప్రతీ దేశానికి బహూకరించారు. దాన్ని మ్యూజియంలోంచి దొంగిలించి తెచ్చి ఆ బండరాయిలోది, దీనిలోది ఒకటే పదార్థమా చూడండి అన్నాడు ప్రొఫెసర్‍. ఒకటే అన్నాడు జియాలజిస్టు. ‘అయితే చంద్రుడు ఎల్లుండి రాత్రి పన్నెండు గంటలకి ఆకాశంనుండి అదృశ్యమైపోతాడు. అతనిలోని ఆర్మాల్‍ కొలైట్‍ ఆ నక్షత్రం ఆకర్షణకు బలంగా లోనవుతోంది. అందువల్ల చంద్రుడు వెళ్లి నక్షత్రానికి గుద్దుకుని స్మాష్‍ అయిపోతాడు’ అన్నాడు ప్రొఫెసర్.

అయితే యీ విషయాన్ని పత్రికలకు వెల్లడించాలా, వద్దా? అన్న మీమాంసలో పడ్డాడాయన. చెబితే ప్రజల్లో భయోత్పాతం కలగడం తప్ప వేరే ప్రయోజనం లేదు. ఎలాగూ ఛస్తున్నామన్న తెగింపు వస్తే మనిషిలో వికృతత్వం చెలరేగవచ్చు. బహుశా అందుకనే రష్యా, అమెరికాలు తమ అబ్జర్వేటరీల ద్వారా గ్రహించిన ఈ విషయాన్ని బయటపెట్టలేదేమో అని తోచిందతనికి. అందుకనే తమ వెంట ఢిల్లీ వచ్చి న్యూస్‍ అడుగుతున్న శైలజకు ఆ విషయం చెప్పనన్నాడు. కానీ రమణ దీన్ని మరోలా అర్థం చేసుకున్నాడు. నోబెల్‍ ప్రైజు తనకే రావాలన్న స్వార్థంతో నిజాన్ని దాస్తున్నాడనుకుని అతను శైలజకు వున్న విషయం చెప్పేశాడు.

శైలజ తన పత్రికకు న్యూస్‍ పంపుతూండగా ఆమె దిగిన హోటల్లో పనిచేసే ఓ కుర్రాడి ద్వారా తక్కిన న్యూస్‍పేపర్లకు కూడా యీ వార్త చేరిపోయింది. ప్రపంచంలోని అబ్జర్వేటరీలన్నీ మూసివేయడంతో, ఇంటర్వ్యూ లివ్వడానికి ప్రముఖులైన అస్ట్రానమిస్టులు నిరాకరించడంతో ఈ వార్త నిజమేననుకున్నాయి పత్రికలు. ‘చంద్రుడు శాశ్వతంగా అస్తమించ బోతున్నాడా?’ అని హెడింగులు పెట్టి ఇవాళ రాత్రి పన్నెండుకి చూడండి. అని రాశారు. ఈ వార్త నమ్మినవాళ్లూ, నమ్మనివాళ్లూ అందరూ రాత్రి పన్నెండుగంటలకు చంద్రుడిమీదనే దృష్టి సారించారు. సరిగ్గా పన్నెండు గంటలకు, చంద్రుడు ఫుట్‍బాల్‍లా వుండవలసినవాడు, టెన్నిస్‍ బంతిలా అయి, ఆ తర్వాత యింకా కుదించుకుపోయి, క్షీణించాడు. అంటే చంద్రుడు వెనక్కి వెనక్కి వెళ్లిపోయాడు. అంటే నక్షత్రం చేత ఆకర్షింపబడి విశ్వంలోకి అదృశ్యమైపోయాడు. ఇక దాంతో పదిరోజుల్లో భూమి బద్దలవుతోందన్న సంగతి అందరికీ రూఢి అయిపోయింది. ఇక చూసుకోండి రియాక్షన్స్!

మర్నాడు పొద్దున్న రేడియో వార్తలు వింటున్న రమణ తండ్రి ఏదో ఒకటి చెయ్యవచ్చుగా అని విసుక్కున్నాడు. రమణ ముందుముందు దొరుకుతాయో లేదో అని సామాన్లు కొనిపడేశాడు. పక్కింటావిడ పుట్టింటికి ప్రయాణం కట్టింది. పనిమనిషి పని ఎగ్గొట్టేసింది. వ్యవస్థ కట్టుబాటుని ఛేదించే మొదటి ప్రయత్నం ‘పనిచేయడానికి తిరస్కరించడం’ అని వాళ్లకు అప్పటికి అర్థం కాలేదు. అతి కొద్ది రోజుల్లోనే భూమి కాస్త కాస్త బీటలు వారడం మొదలెట్టింది. అందరికీ యుగాంతం మాట నిజమేనని రూఢి అయింది. బిబిసిలో వార్తలు చదివే అతనికి హఠాత్తుగా జీవితం పది రోజులే కదా వున్నది, పెళ్లాం బిడ్డల్ని చూడాలనిపించింది. చదువుతున్న వార్తలు వదిలేసి యింటికి వెళ్లిపోయాడు. వెళితే ప్రమాదం ఏముంది? ఉద్యోగం పీకేస్తారు అంతేగా. పదిరోజుల్లో అంతా నాశనమవుతూంటే యిప్పుడు ఉద్యోగం పట్టుకుని వేళ్లాడడం ఎందుకు?

సైన్యంలో కూడా అలజడి ప్రారంభమైంది. ఉన్నతోద్యోగులను మాత్రం వుంచి కింది వాళ్లను యిళ్లకు వెళ్లవచ్చన్నారు. రమణ తండ్రి కాశీ వెళ్లి చద్దామనుకుంటే రైలు నడిపేవాడే లేకుండా పోయాడు. మనుషుల్లో రాక్షసత్వం పురులు విప్పుకుంది. అందమైన ఆడవాళ్లను మానభంగాలు చేస్తున్నారు. ఆహార పదార్థాల్ని దోచుకుంటున్నారు. అక్రమాలతో డబ్బు సంపాదించినవాళ్లు పాపభీతితో సంతర్పణలు చేసేస్తున్నారు. ముష్టివాళ్లంతా స్టార్‍ హోటల్స్‌లో గదులు ఆక్రమించేశారు. ఆగస్టు 12 నాటికి రమణ వచ్చి యీ విషయాలన్నీ ప్రొఫెసరుకి చెప్పాడు. ఏదైనా చేయాలని ప్రొఫెసరు గట్టిగా అనుకున్నాడు కానీ అతనికి ఏ ఐడియా రావటం లేదు. మాట్లాడి వెళ్లిపోయేటప్పుడు రమణ ఆ యింటి తలుపు గట్టిగా వేసి వెళ్లిపోవడంతో ఆటోమెటిక్‍ లాక్‍ పడిపోయింది. దాంతో ప్రొఫెసర్‍ ఆ యింట్లో బందీ అయిపోయాడు.

ఓ పల్లెటూళ్లో స్వామీ బుద్బుబానంద అని ఒకతను వెలిశాడు. కల్కి పుట్టే సమయం ఆసన్నమైంది. ఆయన చక్రంగా అమరడానికే చంద్రుడు వెళ్లాడు. నన్ను నమ్మినవాళ్లకు రక్షణ లభిస్తుంది. తాయెత్తులు కట్టించుకోండి అన్నాడు. దేశమంతా అల్లకల్లోలమవుతున్నా ఆ వూరు చేరిన భక్తులు మాత్రం స్వామివారి మీద భారం వేసి నిశ్చింతగా వున్నారు. తమాషా ఏమిటంటే, ఓరోజు భూకంపం వచ్చి ఆయన యింటికప్పు కూలి కుడికాలు విరిగినా ప్రజల నమ్మకం చెదరలేదు. అందరికీ తాయెత్తులు కట్టడంలో నిమగ్నమై తన చేతికి కట్టుకోకపోవడం వల్లనే ఈ అనర్థం జరిగిందని వారందరూ నమ్మారు.

ప్రపంచంలో సీను ఎలా వుందంటే -  అరబ్‍రాజ్యాలు కలిసి సమావేశమై ఇజ్రాయేలును సముద్రంలోకి తోసేయడానికి యిదే అదను అనుకున్నాయి. అయితే ఆ సమావేశ వివరాలు ఇజ్రాయేలుకి ముందే తెలిసిపోయి, న్యూక్లియార్‍ వెపన్స్ రెడీ చేసుకుంది. ఆయిల్‍ కోసం యిన్నాళ్లూ అరబ్‍ రాజ్యాలను సహించిన అమెరికా ఇజ్రాయేల్‍ని రక్షించడానికి వాళ్లపై మిస్సయిల్స్ పంపింది. అరబ్‍ వాళ్లు తమ నూనె గనుల్ని పేల్చిపారేశారు. ఆ మంటల్లో ఆ మిస్సయిల్స్ దగ్ధమయ్యాయి. సముద్రమంతా నూనెయే. ప్రపంచం ఆఖరవడానికి నాలుగురోజుల ముందే ప్రపంచంలోని 70 శాతం పెట్రోలు నాశనమైంది. ఆస్ట్రేలియాకు ఉత్తరంగా లాండ్‍ ఆఫ్‍ యుటోపియా అనే ఓ అనామకమైన చిన్న దీవిలో ఏ లోహాలూ, ఏ మిశ్రమాలు లేవని తెలిసింది. అక్కడ కిందనుండి లావా పొంగి రాకపోతే మాత్రం ఈ దీవి నక్షత్రం చేత ఆకర్షింపబడకుండా, నాశనం కాకుండా వుంటుంది. అక్కడ మానవజాతి మళ్లీ తలెత్తడానికి వీలుగా కొంతమంది మగవాళ్లను, ఆడవాళ్లను, ఆహారపదార్థాలను విడిచిపెడదామా అని అమెరికా అనుకుంటూండగానే రష్యా ఆ దీవిని చుట్టుముట్టింది.

ఇటువంటి పరిస్థితుల్లో ఆగస్టు పధ్నాలుగున అంటే ప్రళయం రావడానికి మూడురోజుల ముందు ప్రొఫెసర్‍కు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. భూమిని ఆవరించి కొన్ని వాతావరణపు పొరలు వున్నాయి. ట్రోసోస్ఫియర్‍, స్ట్రాటో స్పియర్‍, అయినోస్పియర్‍.. ఇలాగ. ఈ అయినోస్పియర్‍ అనేది ఓజోన్‍ పొర. ఓజోన్‍ అంటే ఏమిటి? మనం పీల్చే ప్రాణవాయువు, ఆక్సిజన్‍లో రెండు ‘ఓ’ పరమాణువులు వుంటాయి. దానికి మరొక ‘ఓ’ చేరిస్తే ఓజోన్‍ అవుతుంది. అయినోస్ఫియర్‍లో వున్న ఓజోన్‍ను ఆక్సిజన్‍గా విడగొడితే, అంటే దానిలోంచి ఒక ‘ఓ’ పరమాణువును విడగొడితే, ఆక్సిజన్‍ విడిగా తయారవుతుంది. అయితే విడిపోయిన ఒక్క ‘ఓ’ ఆ ఆక్సిజన్‍ చుట్టూ తిరుగుతూ దానితో కలిసి ఓజోన్‍ అయిపోదామని చూస్తుంది. కానీ యిది ఓ పట్టాన కలవనివ్వదు. ఈ ఘర్షణలో యాంటీ మాగ్నటిక్‍ ఫీల్డు ఏర్పడుతుంది. భూమి చుట్టూ యాంటీ మేగ్నటిక్‍ ఫీల్డు ఏర్పడితే యింకేం కావాలి? ఆ నక్షత్రం ఆకర్షణకు మనం లోబడము. భూమి రక్షింపబడుతుంది.

ప్రొఫెసర్‍కు ఈ ఐడియా రాగానే బయటకు పరిగెట్టి సూపర్‍సానిక్‍ వైబ్రేషన్స్ ద్వారా ఆ ఓజోన్‍ను విడగొట్టమని ప్రపంచ సైంటిస్టులకు చెబుదామనుకున్నాడు. అయితే గుమ్మం దగ్గరకు వచ్చి చూసేసరికి, పది అడుగుల ఎత్తున్న తలుపుకి పడిపోయిన ఆటోమెటిక్‍ లాక్‍ వెక్కిరించింది. రమణ పొరబాటున గట్టిగా వేయడంతో ఆ లాక్‍ పడిపోయింది. ఆ పురాతన భవంతిలో ఊడపీక గలిగిన కిటికీలు, గుమ్మాలు వుండే వుంటాయి కానీ ఈ ప్రొఫెసర్‍గారికి అలాటి సింపుల్‍ ఆలోచన రాదు, వచ్చినా ఊచలు వంచేటంత శక్తీ లేదు. 75 ఏళ్ల ముసలివాడు, పైగా రోజుల తరబడి అన్నాహారాలు లేనివాడు. ఈయన లోపలే ఉండిపోయాడు. మధ్యలో రమణ ఓ సారి వచ్చి తలుపు తట్టి వెళ్లిపోయాడు. బయటవున్న కుర్రాడు పెద్దాయన తాళం వేసి ఎక్కడికో వెళ్లారు అని చెప్పేశాడు. ఈయన లోపల కదల లేని, మెదలలేని స్థితిలో నోబెల్‍ ప్రైజు గురించి కలలు కంటూ కన్నుమూశాడు.

ఆ తలుపే తీసివుంటేనా? ఆయనే బతికివుంటేనా? అని పాఠకుణ్ని కాస్సేపు ఎక్సయిట్‍ చేసిన వీరేంద్రనాధ్‍ నవల చివరిలో చెప్పేశారు, రెండు ఓజోన్‍ మాలిక్యూల్స్‌ను విడగొడితే మూడు ఆక్సిజన్‍ మాలిక్యూల్స్‌గా తయారవుతుంది కానీ అక్కడ ఘర్షణేమీ వుండదని, యాంటీ మేగ్నటిక్‍ ఫీల్డ్ తయారుకాదనీ ముసలాయన మర్చిపోయాడని రాసేశారు. ఆగస్టు 15 వచ్చింది. అల్పజీవులకు ప్రతినిథి అనదగిన రమణ అన్న యిక ఉండబట్టలేక పోయాడు. చావుభయం అతన్ని చుట్టుముట్టింది. స్మశానానికి నడుచుకుంటూ వెళ్లి యిది యింకెంత కాలమో అనుకుంటూ నిలబడ్డాడు. అంతలో చెట్టుమీద నుంచి ఓ ఎండుకొమ్మ అతనిమీద పడింది. అంతే! భయపడి గుండాగి చచ్చిపోయాడు. మానసికంగా ఎప్పుడో చచ్చిపోయిన అతను శారీరకంగా కూడా చచ్చిపోయాడు. అతని భార్య అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతన్ని కప్పెడదామని చూసినా ఎవరూ కలిసిరాలేదు. అందరిలోనూ నిర్లిప్తత. అయితే ఆమె భిక్షం వేసిన ఓ గుడ్డి ముష్టివాడు మాత్రం సాయం చేశాడు.

ఆగస్టు 16 న మాలతి తండ్రిని ఎదిరించి అన్నీ వదులుకుని పసుపుతాడు పట్టుకుని రమణవద్దకు చేరింది. పెళ్లి చేసుకో అంది. మనం ఏ కారణం వల్ల యింతకాలం వివాహం చేసుకోలేదో ఆ కారణం వల్లనే యింకో రోజు ఆగుదాం. ప్రళయం వస్తోంది కదాని మన ఆలోచనావిధానం మార్చుకోవడం ఎందుకు అన్నాడు రమణ. ఆమెను యింటికి దిగబెడుతూండగా దారిలో భూకంపం వచ్చింది. పెద్ద గొయ్యి ఏర్పడి అతని అన్నగార్ని కప్పిపెట్టడానికి సహాయపడ్డ గుడ్డి ముష్టివాడు కందకంలో పడిపోయాడు. పడిపోతూ ఓ రాయిని పట్టుకుని వేళ్లాడుతున్నాడు. అతన్ని కాపాడడానికి రమణ వెళ్లాడు. ముష్టివాడిని పైకి తోయగలిగాడు కానీ అతను ఇరవై అడుగుల గోతిలో పడిపోయాడు. అతను పడిపోగానే మాలతి కూడా ఉరికేసింది. అక్కడే వాళ్లు సమాధి అయిపోయారు. ఇక్కడ కట్టుకున్నవాడికే తన కన్యత్వం ధారపోద్దామనుకున్న జర్నలిస్టు శైలజ కాలు జారకుండానే తను మూగగా ఆరాధించిన రమణ ఫోటో గుండెలమీద పెట్టుకుని సమాధి అయిపోయింది.

ఇక ఆఖరిరోజు ఆగస్టు 17. అగ్రదేశాలు ఆఖరిక్షణాల్లో తమ ఆధిపత్యం చూపించుకోబోయాయి. న్యూక్లియార్‍ మిసయిల్స్ శత్రుదేశాలపై గురిపెట్టాయి. సముద్రాలన్నీ ఏకమవుతున్నాయి. పృథ్వి, ఆకాశం, జలం, శిలలు, అగ్ని, కాలం, క్రియ అన్నీ నాశనమవటానికి ఆయత్తమవుతున్నాయి. మేఘాలన్నీ ఒకచోట చేరి ఏడుస్తున్నట్టు కుండపోతగా వర్షం! ప్రాక్సిమా చేరువవుతోంది. రమణ వదిన జానకి దేవుణ్ని ప్రార్థించింది, ‘ప్రభూ, సర్వనాశనం చేస్తున్నావు. చెయ్యి. తొందరగా అందరినీ నీలో కలుపుకో. ఈ సారి మళ్లీ సృష్టి అంటూ చేస్తే ఆ క్రొత్త ప్రపంచంలో మనిషి నిజమైన మనిషిలా బ్రతకాలి. మానసికంగా, సాంఘికంగా, నైతికంగా చావకూడదు. అలాటి ప్రపంచమంటూ వుంటే అందులో రాయిగానో, పిచ్చిమొక్కగానో మళ్లీ పుట్టడాన్ని నేను కోరుకుంటాను. అలా పుట్టడం కోసం ఈ ప్రళయాన్ని ఆహ్వానిస్తాను..’ అని. ఆమె ప్రార్థన ముగిసింది. ఆ తర్వాత భయంకరమైన శబ్దంతో భూమి పెఠేలున విడిపోయింది. ముక్కలు విశ్వంలో ఐక్యమయిపోయాయి. ఇదీ భూమి, కలియుగం అంతమైన గాథ.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)

mbsprasad@gmail.com

Show comments