రామారావుతో సికాకుళం సారంగి

నా పేరు సీసా..నాపేరు సీసా అంటూ పాట ప్రోమో వదిలితే ఏంటో అనుకున్నారు. ఐటమ్ సాంగ్ అని అర్థం అవుతోంది కానీ ఈ సీసా కాన్సెప్ట్ ఏమిటో అనుకున్నారు. కానీ పాట విడుదలయ్యాక తెలిసింది. సీసా అంటే సికాకుళం సారంగి అని. రవితేజ ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ సినిమా కోసం తయారు చేసిన ఐటమ్ సాంగ్ ను ఈ రోజు విడుదల చేసారు. అన్వేషి జైన్ సీసాగా పరిచయం అయింది. తన గ్లామర్, మెస్మరైజింగ్ లుక్స్, సిజ్లింగ్ షోతో ప్రేక్షకులని కట్టిపడేసింది.

చాన్నాళ్ల తరువాత ఖవ్వాలి..జావళి లాంటి ట్రెడిషనల్ ట్యూన్ ను మరోసారి వినిపించారు సంగీత దర్శకుడు సామ్ సిఎస్. సీసా అనే పదాన్ని జస్టిఫై చేస్తూ..

ఒకరికినే తేనె సీసా

ఒకరికినే కల్లు సీసా

ఒకరికినే మసాలా సీసా

ఇంకొకరికి రసాల సీసా

అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా

అంటూ చంద్రబోస్ అందించిన సాహిత్యం భలేగా వుంది. పాట పల్లవిలో వినిపించిన ఈ లిరిక్స్ క్యాచిగా ఆకట్టుకున్నాయి. శ్రేయా ఘోషల్, సామ్ సిఎస్ ఫుల్ ఎనర్జీటిక్ గా ఈ పాటని ఆలపించారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Show comments