చంద్రబాబుపై విశాల్..ఎంత వరకు నిజం?

వున్నట్లుండి కోలీవుడ్ వైపు నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. రాబోయే ఎన్నికల్లో వైకాపా తరపున కుప్పం నియోజకవర్గం నుంచి పోటీకి హీరో విశాల్ సిద్ద పడుతున్నారన్నది ఆ వార్తల సారాంశం. 

కుప్పం నియోజకవర్గం అంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వంత నియోజక వర్గం. విశాల్ ఆంధ్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టడమే వింతగా వుంటే, పోయి పోయి చంద్రబాబు మీద పోటీకి సిద్దం కావడం మరీ ఆశ్చర్యంగా వుంది.

కానీ ఈ మేరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ మేరకు చెన్నయ్ వర్గాల ను సంప్రదిస్తే విశాల్ వైపు నుంచే ఈ ఫీలర్లు బయటకు వచ్చాయని చెబుతున్నారు. 

అంటే విశాల్ కావాలని ఈ ఫీలర్లు బయటకు వదిలారా? అలా వదలడం ద్వారా ఆయన ఆశించేదేమిటి?

చంద్రబాబు వైపు నుంచి వద్దని బుజ్జిగింపా? లేదా వైకాపా నుంచి రా రమ్మని ఆహ్వానమా? ఏం కోరుకుంటున్నారు విశాల్. 

నిజానికి విశాల్ తమిళనాట రాజకీయాల్లో తన లక్ ప్రయత్నించారు. కానీ ఫలితం పాజిటివ్ గా రాలేదు. అలాంటిది తెలుగునాట ఏం సాధించగలరు? 

విశాల్ తండ్రిది రెడ్డి సామాజిక వర్గం. తల్లి వైపు కమ్మ సామాజిక వర్గం అని తెలుస్తోంది. మరి ఈ రెండింటి అండతో చంద్రబాబును ఢీకొనగలనని అనుకుంటున్నారా? అలా ఢీ కొనాలంటే కనీసం యాభై కోట్లు డబ్బు కూడా కావాలి. ఆర్థికంగా విశాల్ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదని కూడా వార్తలు వున్నాయి.

మొత్తానికి విశాల్ ఏదో ప్లాన్ వేస్తున్నట్లుంది. అందుకే ఆయన వైపు నుంచే ఈ ఫీలర్లు బయటకు వచ్చి సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

Show comments