ఎమ్బీయస్: శ్రీకృష్ణ రాయబారం

మహాభారతంలోని కృష్ణరాయబార ఘట్టం చాలా రసవత్తరమైన ఘట్టం, ముఖ్యంగా తెలుగువారికి. రాయబార పద్యాలు తెలుగువారి జీవితాల్లో భాగమై పోయాయి. అవి నోటికి రాకపోయినా విననివారు ఎవరూ ఉండరు. ఈ వ్యాసంలో మూల సంస్కృత భారతంలో ఉన్నది రాస్తున్నాను. దీనికి నేను ఆధారపడిన గ్రంథాలు లలితా త్రిపుర సుందరీ ధార్మిక పరిషత్ వారు వెలువరించిన ఉద్యోగపర్వాలు. సామవేదం వారి ‘ఇదీ యథార్థ భారతం’, ఈ వ్యాసం చదివితే ‘అబ్బ, తెలుగువారు ఎంత బాగా ఇంప్రవైజ్ చేశార్రా’ అనిపించక మానదు. తెనిగించినప్పుడు కవిత్రయం చేర్చిన విశేషాల గురించి, ‘పాండవోద్యోగ విజయాలు’గా తిరుపతివెంకట కవులు నాటకీకరించినపుడు అద్దిన సొబగుల గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథం అవుతుంది. ఇప్పటికే పరిశోధించి, రాసిన వ్యాసాలు చాలా ఉన్నాయి. ఓపిక తెచ్చుకుని సేకరించి, చదివితే చాలా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలో తెలుస్తుంది.

రాయబారంలో పైకి సంధి చేసుకోండని చెప్తూనే యుద్ధం ఖచ్చితంగా జరిగేట్లా చూశాడు కృష్ణుడు. పాండవులు శాంతిని కోరుకుంటున్నారని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే యుద్ధానికి దిగారని లోకాన్ని కన్విన్స్ చేశాడు. పాండవుల శౌర్యప్రతాపాలను వర్ణించి చెప్పి, కౌరవపక్షాన ఉన్న రాజుల మనోస్థయిర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశాడు. కౌరవపక్ష వీరుల్లో చీలికలు వచ్చేట్లు చేశాడు. ఇన్ని సాధించిన కృష్ణుడి చాకచక్యం, మాట్లాడే తీరు చూస్తే వాహ్ అనిపిస్తుంది. కృష్ణుడు యుద్ధాన్ని ఎందుకు కోరుకున్నాడు అనే విషయంపై చాలా వాదనలున్నాయి. కృష్ణుడు గొల్లవాడు కాబట్టి క్షత్రియుల మధ్య యుద్ధం పెట్టి వాళ్ల నాశనం అయ్యేట్లు చూశాడు అని కొందరు చెప్పే వాదన సరైనది కాదు. ‘‘కృష్ణుడు క్షత్రియుడు కాడా?’’ అని చాలాకాలం క్రితం రాసిన వ్యాసంలో అతని మూలాలు రాశాను. అది చదవనివారి కోసం క్లుప్తంగా చెప్తున్నాను.

క్షత్రియుడైన యయాతి తన కోరికను మన్నించనందుకు పెద్దకొడుకు యదువుపై కోపగించి, 'నీ వంశం వారెవ్వరికీ రాజ్యార్హత వుండరాదు. నా మాట కాదని ఎవరైనా రాజ్యం చేపట్టినా రాణించరు. మీరంతా పశువులు మేపుకుంటూ బతకండి.'' అని శాపమిచ్చాడు. రెండో కొడుకు తుర్వసుణ్ని 'మీ వంశం వారు అడవులు పట్టి కిరాతకులై బతకండి' అని అన్నాడు. (దీన్ని బట్టి పశువులు మేపుకునేవారందరూ, కిరాతకులందరూ ఒకప్పుడు రాజ్యాలు ఏలారు అనుకోవడానికి లేదు.  యయాతి తన కొడుకులను ఆ విధంగా శిక్షించాడు. మిగిలిన యిద్దరినీ 'అల్పాయుష్కులై బతకండి' అని శపించాడు) అందువలన యదువు వంశీకులకు రాజ్యార్హత లేకుండా పోయింది. యయాతి శాసనాన్ని యదువంశ వారసులు అందరూ పాటించలేదు. శూరసేన, మధుర రాజ్యాలను పాలించసాగారు. వసుదేవుడి తండ్రి శూరసేనుడు అలా పాలించినవారిలో ఒకడు. కానీ వసుదేవుడు మాత్రం తనకు రాజ్యం రాగానే పూర్వీకుడు యయాతి శాసనాన్ని మన్నించి రాజ్యం కాదన్నాడు. భోజవంశంలోని ఉగ్రసేనుడికి రాజ్యం ధారపోశాడు. తాను గోపాలకవృత్తి స్వీకరించాడు.

కృష్ణుడు పుట్టినపుడు వసుదేవుడు నందుడి యింటికి తీసుకెళ్లాడు. అంతేకాదు, తను ఖైదులో పడినప్పుడు తన మొదటి భార్య రోహిణిని నందుడి సంరక్షణలోనే ఉంచాడు. నందుడి యింటికే ఎందుకు అంటే, వసుదేవుడి తాతకు యిద్దరు భార్యలు. ఒకామె క్షత్రియస్త్రీ, మరొకామె గోపస్త్రీ. వసుదేవుడు ఆ క్షత్రియస్త్రీ మనుమడైతే, నందుడు ఆ గోపస్త్రీ మనుమడు. అందువలన వాళ్లిద్దరూ అన్నదమ్ముల వరస. కృష్ణుడి బాల్యం నందుడి వద్దే వ్రేపల్లెలో, గోవుల మధ్య, గోపాలుర మధ్య గడిచింది. కంససంహారం తర్వాత అతను విద్య నభ్యసించి అన్నగారితో కలిసి రాజ్యనిర్వహణలో పడ్డాడు. వృత్తిగా పశుపోషణ ఎంచుకోలేదు. క్షత్రియోచితంగా యుద్ధాలు చేసి, రాజ్యాన్ని విస్తరించాడు. రాజుగా మాత్రం పట్టాభిషేకం చేసుకోలేదు. క్షత్రియులతో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నాడు. కృష్ణుడు ముమ్మాటికీ క్షత్రియుడే. కృష్ణుడు రాయబారానికి వస్తున్నాడని తెలిసి ధృతరాష్ట్రుడు విదురుడితో ‘‘అతడు ఆహుక వంశక్షత్రియులకు అధిపతి’’ అంటాడు. అందువలన కృష్ణుడు కులద్వేషంతో క్షత్రియనాశనం కోరి యుద్ధం జరిగేట్లా చూశాడన్న వాదన తప్పు.

ఇక భూభారం తగ్గించడానికి అవతారమెత్తి యుద్ధం చేయించాడన్నది కూడా విశ్వసనీయం కాదు. గతంలో కంటె యిప్పుడే జనాభా విపరీతంగా పెరిగింది. మరి విష్ణువు అవతారం యిప్పట్లో లేదు కదా! పైగా కృష్ణావతారంలో కురుక్షేత్రం జరిగింది భరతఖండంలో మాత్రమే. ప్రపంచంలోని తక్కిన భూభాగాల్లోని జనాభా మాటేమిటి? అక్కడ తగ్గలేదు కదా! నిజానికి ప్రకృతే ఎప్పటికప్పుడు తన భారాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది. ఏదో రోగమో, ప్రకృతి వైపరీత్యమో తెచ్చిపెట్టి కొంత జనాభాను తుడిచిపెడుతూ ఉంటుంది. విష్ణువు అవతారాలెత్తవలసిన అవసరాన్ని కల్పించదు. అయినా అవతారాల్లో జనక్షయం జరిగిన యుద్ధాలు చేసినవెన్ని కనుక? పరశురాముడు, రాముడు, కృష్ణుడు, రాబోయే కల్కి! గౌతమబుద్ధుణ్ని విష్ణువు అవతారంగా అంగీకరిస్తే యుద్ధాలు ఆపించి భూభారం పెంచాడని అనాల్సి వస్తుంది. అందువలన జనక్షయం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగేట్లా చూశాడనేది కూడా ఒప్పుకోలేము.

భారతం పరికిస్తే కురువంశంలో ఉన్న దాయాదుల తగాదాలో కృష్ణుడు తలదూర్చి, అండర్‌డాగ్స్ పక్షం వహించి, వాళ్లకు అడుగడుగునా, అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలిచి, కింగ్‌మేకర్ అయ్యాడని, పాండవుల చేత ప్రత్యక్షదైవంగా మన్ననలు అందాడని అనుకోవాల్సి వస్తుంది. తన పాండవపక్షపాతం కౌరవులకు తెలుసని తెలిసినా కృష్ణుడు రాజీ కుదర్చడానికి వెళ్లిన రాయబారిగా వెళ్లాడు. ఎందుకు? తమ స్వార్థం కోసం పాండవులు భీకరయుద్ధాన్ని తెచ్చిపెట్టి జననాశనానికి కారకులయ్యారని రాజలోకం అనుకోకూడదని! రాజీ కోసం సిన్సియర్‌గా ప్రయత్నించారనీ, కానీ కౌరవుల మూర్ఖత్వం కారణంగానే యుద్ధానికి దిగవలసి వచ్చిందనీ లోకానికి ఎస్టాబ్లిష్ చేయడానికి! అంతకు ముందు రాయబారులుగా వ్యవహరించిన ద్రుపద పురోహితుడు, సంజయుడు స్టేచర్‌లో చిన్నవాళ్లు. ‘సాక్షాత్తూ కృష్ణుడంతటివాడు నచ్చచెప్పినా కౌరవులు వినలేదు, యుద్ధానికి కారణభూతులయ్యారు’ అని తక్కిన రాజులందరూ అర్థం చేసుకోవాలంటే యీ ప్రయత్నం చేసి తీరాలనుకుని ఆ భారాన్ని తన మీద వేసుకున్నాడు కృష్ణుడు.

సంజయ రాయబారం తర్వాత కౌరవుల నుంచి మరో మాట లేకపోవడంతో కలతపడిన ధర్మరాజు సోదరసహితంగా ద్వారకకు వచ్చి నువ్వే మాకు మార్గదర్శనం చేయాలి అని అడిగినప్పుడు నేనే స్వయంగా వెళతాను సరేనా అన్నాడు. ధర్మరాజు ‘నువ్వు వెళ్లి, క్షేమంగా, మా యిరుపక్షాలకు లాభం చేకూర్చి తిరిగి రా. మేమంతా మంచిగా కలిసి జీవించేట్లు చూడు.’ అన్నాడు. అప్పుడు కృష్ణుడు ‘కౌరవులు వైరాన్ని ఆశ్రయించుకుని ఉంటే, నువ్వు ధర్మాన్ని ఆశ్రయించుకున్నావు. కౌరవుల వద్ద చాలా సైన్యం ఉండడంతో మీతో రాజీ పడవలసిన అవసరం వారికి కనబడటం లేదు. మీపై వారికి జాలి లేదు. వనవాస సమయంలో మిమ్మల్ని పరిహసించలేదా? ఆ దుర్యోధనుడు చంపదగినవాడు.’ అంటూ కౌరవులు చేసిన అకృత్యాలన్నిటినీ ఏకరువు పెట్టాడు.  అన్నీ విని కూడా తన స్వభావానికి విరుద్ధంగా భీముడు ‘‘వంశనాశనం జరగకుండా సంధి కుదిరేందుకు అనువుగానే మాట్లాడు. దుర్యోధనుడికి సహనం తక్కువ. వినాశనం చేయడానికి పుట్టినట్లు కనబడుతోంది. కానీ మా వలన భరతవంశం నశించకూడదు. పెద్దలతో దుర్యోధనుడికి చెప్పి శాంతి నెలకొనేట్లు చూడు.’’ అన్నాడు.

అది వింటూనే కృష్ణుడు పకపకా నవ్వి, తన మాటలతో భీముణ్ని రెచ్చగొట్టాడు. ‘కౌరవులను చంపుతానని ప్రతిజ్ఞలు చేసిన నీకు హఠాత్తుగా భయం పట్టుకుంది. మోహం కమ్మివేసింది, నపుంసకుడివి అయిపోయావు. క్షత్రియుడవై ఉండి యిలా మాట్లాడతావా?’ అన్నాడు. భీముడికి రోషం వచ్చింది. ‘‘నా గురించి తెలిసినవాడెవడైనా యిలా మాట్లాడగలడా? నేనేదో దయతో మాట్లాడితే నువ్వు ఆక్షేపిస్తున్నావు. శాంతి గురించి మాట్లాడడం నా మంచితనానికి సంబంధించినది. పరాక్రమమంటావా, యుద్ధం ప్రారంభమైనప్పుడు నువ్వే చూస్తావు.’’ అని సమాధాన మిచ్చాడు. అప్పుడు కృష్ణుడు ‘‘యుద్ధంలో మనమే గెలుస్తామని చెప్పలేము. అందువలన సంధి కుదర్చడానికే నేను ప్రయత్నిస్తాను. కానీ కౌరవులు అది కుదరనిచ్చేట్లు లేరు. యుద్ధమంటూ జరిగితే యుద్ధభారం నీపై, అర్జునుడిపై ఉంది. నీలో నిరుత్సాహం కనబడితే దాన్ని పోగొట్టి తేజస్సును ప్రజ్వలింప చేయడానికి అలా మాట్లాడానంతే.’’ అని సర్ది చెప్పాడు.

అర్జునుణ్ని అడిగితే ‘ కౌరవులు మాకు మేలు చేస్తారని ఆశ పడడం చవిటి నేలలో విత్తనాలు నాటడం వంటిది. కౌరవసంహారమే మాకు మేలు కలిగిస్తుందని నీకు అనిపిస్తే అదే చేయి’ అన్నాడు. నకులుణ్ని అడిగితే ‘మేం అరణ్యవాసంలో ఉండగా మాకు రాజ్యం పట్ల ఆసక్తి ఉండేది కాదు. కానీ యిప్పుడు ఏడు అక్షౌహిణుల సైన్యం వచ్చి మా వెంట చేరిన తర్వాత మాకు ఆసక్తి పెరిగింది. మాకు ఏది మంచిదైతే అదే చేయి. నువ్వు ఏది తలచుకుంటే అదే జరుగుతుందనే నా నమ్మకం.’ అన్నాడు. సహదేవుణ్ని అడిగితే ‘కౌరవులు మాతో సంధి కోరుకున్నా, అది జరగకుండా చూడు. ఎలాగోలా యుద్ధం జరిగేట్లు చేయి. ధర్మరాజాదులు యుద్ధానికి విముఖులైనా, నేను మాత్రం యుద్ధం చేసి తీరతాను. కౌరవులను వధిస్తే తప్ప నా మనస్సు శాంతించదు.’ అన్నాడు.

ఇక ద్రౌపది అయితే స్పష్టంగా చెప్పింది. ‘‘ఎట్టి పరిస్థితుల్లో సంధికి ఒప్పుకోవద్దు. యుద్ధం జరిగి తీరాలి. అయిదూళ్లుచ్చినా చాలంటున్నాడు ధర్మరాజు. శాంతివచనాలు పలుకుతున్నాడు భీముడు. మాకు కావలసినది రాజ్యభాగం కాదు, ప్రతీకారం. నాకు జరిగిన అవమానాలు తెలిసి కూడా వీళ్లిలా మాట్లాడుతున్నారంటే వీళ్లు జీవించి ఉండి ప్రయోజనం ఏముంది? వీళ్ల వలన కాకపోతే కౌరవులపైకి నా ముసలి తండ్రి ద్రుపదరాజుని కుమారులతో కలిసి వెళ్లమని చెప్తాను. ఉపపాండవులను, అభిమన్యుణ్ని పంపుతాను. దుర్యోధనుడు యింకా బతికి వుంటే అర్జునుడి ధనుర్బలం, భీముడి భుజబలం వ్యర్థం. దుశ్శాసనుడి భుజం తెగి, నేల మీద పడి రక్తంలో దొర్లుతూ ఉంటే నేను చూడాలి. కౌరవసభలో కనబడకుండానే నన్ను కాపాడావు. ఇప్పుడు ప్రత్యక్షంగా కోరుతున్నాను. నీ దయకు నేను పాత్రురాలినైతే కౌరవులపై నీ కోపాన్ని ప్రకటించు.’’ అని కన్నీళ్లతో వేడుకుంది. కృష్ణుడు ‘‘ద్రౌపదీ, కౌరవస్త్రీలు నీ కంటె ఎక్కువగా రోదించడాన్ని త్వరలోనే చూడగలవు.’’ అని ఓదార్చాడు.   

మర్నాడు కృష్ణుడు ద్వారక నుంచి హస్తినకు బయలుదేరాడు. అందరూ వీడ్కోలు పలికారు. అర్జునుడు ఆఖరి మాటగా కృష్ణుడి వద్దకు వచ్చి ‘‘దుర్యోధనుడు లోభాన్ని విడిచిపెట్టి, అర్ధరాజ్యాన్ని యిస్తేనే అది నాకు నచ్చుతుంది. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే కౌరవసైన్యాన్ని నాశనం చేస్తాను.’’ అని చెప్పాడు. అది విని భీముడు ఎంతో సంతోషించాడు. గమనిస్తే కృష్ణుడు తన రాయబారంలో పాండవులకు అర్ధరాజ్యం యివ్వాలనే మాట్లాడాడు తప్ప ఐదూళ్ల బేరం పెట్టలేదు. ఐదూళ్లు చాలన్నారు కదా, ఇప్పుడేమిటి సగానికి ఎసరు పెట్టారు అని దుర్యోధనుడు తర్కించలేదు. కృష్ణుడు రాయబారిగా వస్తున్నాడని తెలియగానే ధృతరాష్ట్రుడు ఆతిథ్యమర్యాదలు ఘనంగా చేసి కృష్ణుణ్ని ఆకట్టుకోవాలని చూశాడు. కానీ దుర్యోధనుడు ‘ఏం చేసినా కృష్ణుడు పాండవపక్షపాతే. అతను యిక్కడకు రాగానే బంధించి వేస్తాను. అతని అండ లేనిదే పాండవులు ఏమీ చేయలేరు కాబట్టి, యుద్ధం విరమించి నాకు దాసోహమంటారు.’ అని తన ఆలోచనను చెప్పాడు. అది వినగానే భీష్ముడికి కోపం వచ్చింది. రాయబారిని బంధించాలనే ఆలోచన చాలా తప్పంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయాడు.

మర్నాడు కృష్ణుడు వచ్చాడు. ధృతరాష్ట్రుణ్ని కలిసి పలకరించాడు. తర్వాత విదురుడి యింటికి వచ్చి అక్కడ కుంతిని ఓదార్చాడు. ‘పరాక్రమంతో రావలసినది రాబట్టుకోవాలి తప్ప శాంతి వచనాలతో సాధించేది ఏమీ లేదని మా వాళ్లకు చెప్పు’ అందామె. కృష్ణుడు అక్కణ్నుంచి దుర్యోధనుడి యింటికి వెళితే భోజనం చేసి వెళ్లమన్నాడు. కృష్ణుడు ‘నీది కుటిలబుద్ధి. అలాటివాడి యింట్లో నేను తినను’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రాత్రి విదురుడి యింట్లో పడుక్కుని, మర్నాడు ఉదయమే ధృతరాష్ట్ర సభకు వెళ్లాడు. ధృతరాష్ట్రుణ్ని ఉద్దేశించి ‘నువ్వు పెద్దవాడివి. నీ కన్నీ తెలుసు. మొత్తమంతా నీ చేతిలో ఉంది. నువ్వు నీ పుత్రుల్ని నియంత్రిస్తే, వీరి శత్రువుల్ని నేను నియంత్రిస్తాను. మనిద్దరం కలిసి శాంతిస్థాపన చేద్దాం. పాండవులకు అర్ధరాజ్యం యిచ్చి తోడునీడగా పెట్టుకుంటే, నీ రాజ్యం బలపడుతుంది. యుద్ధం జరిగి, ఏ పక్షంవారు మరణించినా దుఃఖించేది నువ్వే. పాండవులు ‘పెదతండ్రీ, నువ్వు పుత్రవాత్సల్యం చూపిస్తే వచ్చి సేవ చేయడానికీ సిద్ధమే, న్యాయం జరగకపోతే యుద్ధానికి సిద్ధమే!’ అని చెప్పమన్నారు.’’ అన్నాడు.

అప్పుడు పరశురాముడు కృష్ణార్జునులతో యుద్ధం మంచిది కాదన్నాడు. కణ్వమహర్షి, నారదుడు కూడా అదే హితవు చెప్పారు. ధృతరాష్ట్రుడు కృష్ణుడితో ‘‘నేను నా కొడుకుని ఒకప్పుడు వారించలేదు నిజమే. కానీ యిప్పుడు అదుపు తప్పిపోయాడు. నువ్వే అతనికి నచ్చచెప్పు.’’ అంటూ భారాన్ని కృష్ణుడిపై పెట్టాడు. కృష్ణుడు దుర్యోధనుడితో ‘‘నువ్వు పదకొండు అక్షౌహిణులతో స్నేహం చేసుకున్నవాడివి ఐదుగురు పాండవులతో చేసుకొనలేవా? నీకు ప్రస్తుతం ముఖ్యులుగా ఉన్న కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని పాండవుల ముందు ఎందుకూ పనికిరారు. పాండవులు సగభాగమిచ్చి నీ సంపదను కాపాడుకో.’’ అన్నాడు. భీష్మద్రోణ విదురధృతరాష్ట్రులు కృష్ణుణ్ని సమర్థించారు.

దుర్యోధనుడికి మండుకొచ్చింది. ‘‘అందరూ నన్నే తప్పుపడుతున్నారు. నేను చేసినదేముంది? ధర్మరాజే జూదం ఆడి ఓడిపోయి అరణ్యాలకు పోయాడు. ఇప్పుడు వచ్చి మా వెనకాల సైన్యం ఉంది అంటే నేను భయపడిపోయి ఇచ్చేయాలా? అసలు పాండవులకు రాజ్యమేముంది? మాకు ఊహ తెలియనప్పుడు మా నాన్న ఇంద్రప్రస్థం రాజధానిగా సగం రాజ్యం యిచ్చేశాడు. దాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ వాళ్లకి నేనెందుకు యివ్వాలి? నేను బతికి వుండగా సూదిమొన మోపినంత స్థలం కూడా యివ్వను. ఒకవేళ యుద్ధంలో మేం మరణించవలసి వచ్చినా అది క్షాత్రధర్మమే.’’ అని కరాఖండీగా చెప్పాడు. కృష్ణుడికి కోపం వచ్చింది. ‘‘నువ్వేమీ తప్పు చేయలేదని అంటున్నావా? ద్యూతక్రీడ ఆడించావు, అన్నగారి భార్య ఐన ద్రౌపదితో అనుచితంగా ప్రవర్తించావు. లక్కయింట్లో వాళ్లని చంపించాలని చూశావు. ఇప్పుడు తమ పైతృకమైన ఆస్తిని పాండవులు అడుగుతూంటే యివ్వ నిరాకరిస్తున్నావు.’’ అని నిందించాడు.

అప్పుడు దుశ్శాసనుడు ‘‘అన్నా, యీ పెద్దల వ్యవహారం చూడబోతే నువ్వు సంధికి ఒప్పుకోకపోతే వీళ్లే నిన్ను బంధించి, ధర్మరాజు చేతిలో పెట్టేట్లున్నారు.’’ అన్నాడు. దాంతో దుర్యోధనుడికి కోపం వచ్చి సభ విడిచి వెళ్లిపోయాడు. కృష్ణుడు అప్పుడు సభాసదులను ఉద్దేశించి ‘‘బుద్ధిహీనుడైన దుర్యోధనుణ్ని రాజుగా చేసి, యిప్పుడు అతన్ని నియంత్రించ లేకపోవడం కురువృద్ధుల పొరపాటు. దీన్ని పరిష్కరించడానికి నాకు తోచిన ఉపాయాన్ని చెపుతున్నాను. భోజరాజు ఉగ్రసేనుడి కొడుకు కంసుడు దురాచారుడు. తండ్రి జీవించి ఉండగానే ఆయన అధికారాన్ని హరించి రాజయ్యాడు. నేను అతన్ని సంహరించాక బంధువులమంతా కలిసి ఉగ్రసేనుణ్ని రాజును చేశాం. వంశ సంరక్షణకై కంసుణ్ని ఒకణ్ని పరిత్యజించి, అంధకవృష్ణి వంశస్థులైన యాదవులందరూ ఒక్కటై సుఖంగా వృద్ధి పొందుతున్నారు. అదే విధంగా దుర్యోధనుణ్ని, శకునిని, దుశ్శాసనుణ్ని బంధించి పాండవుల వశం చేయండి. ధృతరాష్ట్రా, అప్పుడు పాండవులతో సంధి చేసుకో. రాజ్యాన్ని కాపాడుకో.’’ అన్నాడు.

ధృతరాష్ట్రుడు విదురుడితో ‘‘గాంధారిని పిలిపించు, ఆమెతో కలిసి దుర్యోధనుడికి హితవు చెప్పే ప్రయత్నం చేస్తాను.’’ అన్నాడు. గాంధారి వచ్చి భర్తతో ‘‘నీ పుత్రప్రేమనే తప్పు పట్టాలి.’’ అంది. కొడుకుని మళ్లీ సభకు రప్పించింది. ‘‘నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. పెద్దల మాట విను. యుద్ధంలో అన్ని వేళలా గెలుపు సిద్ధిస్తుందన్న నమ్మకం లేదు. పాండవులకు అర్ధభాగం యిచ్చి, తక్కినది అనుభవించు.’’ అని హితవు చెప్పింది. తల్లి చెప్పినది వినకుండా దుర్యోధనుడు సభలోంచి బయటకు వెళ్లిపోయాడు. ‘‘నన్ను బంధించి పాండవులకు అప్పగించమని కృష్ణుడు యిచ్చిన సలహాను మన పెద్దలు అమలు చేస్తే చాలా ప్రమాదం. దానికి ముందు మనమే కృష్ణుణ్ని బంధించివేద్దాం. దెబ్బకు పాండవులు కోరలు తీసిన పాములవుతారు.’’ అని తన సహచరులతో అన్నాడు.

ఆ దురాలోచనను సాత్యకి పసిగట్టాడు. కృతవర్మను పిలిచి సేనను సిద్ధం చేయమన్నాడు. వెళ్లి కృష్ణుడికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికి చెప్పాడు. విదురుడు ధృతరాష్ట్రుడితో ‘‘కృష్ణుణ్ని ఎవరైనా బంధించగలరా? ఏమిటీ పిచ్చి ఆలోచన రాజా’’ అన్నాడు. కృష్ణుడు ధృతరాష్ట్రుడితో ‘‘ఈ దుష్టకౌరవులు నన్ను పట్టుకుంటారో లేక నేనే వారిని బంధించి పాండవుల పాలు చేస్తానో చూడవచ్చు.’’ అని సవాలు విసిరాడు. సరిగ్గా అదే సమయానికి దుష్టచతుష్టయం సభలోకి ప్రవేశించారు. వారిని చూస్తూనే ధృతరాష్ట్రుడు మండిపడుతూ దుర్యోధనుడితో ‘‘పాపాత్ముడా! నీచపు పనులు చేసేవారే నీకు సహాయకులు. కృష్ణుణ్ని బంధించడం అసాధ్యం. అది తెలుసుకో.’’ అని తిట్టాడు. విదురుడు కృష్ణుడు శక్తిసామర్థ్యాల గురించి వర్ణించాడు. కృష్ణుడు దుర్యోధనుడితో ‘‘సుయోధనా, నీ మోహం వలన నన్ను ఒంటరివాడ ననుకుంటున్నావు. చూడు నా అసలు రూపం’’ అంటూ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

దానిలో సమస్త దేవతలూ కనబడ్డారు. పాండవులు, యాదవులు అందరూ కనబడ్డారు. కళ్ల నుండి, ముక్కుల నుండి, చెవుల నుండి భీకరాగ్ని జ్వాలలు పొగతో పాటు అన్ని దిక్కులకూ వెలువడసాగాయి. రాజులందరూ కృష్ణుడి ఆ ఘోరస్వరూపాన్ని చూసి భయపడి కళ్లు మూసుకున్నారు. భీష్మద్రోణులూ, విదురుడు, సంజయుడు, తపోధనులైన ఋషులు మాత్రం కళ్లు మూయకుండా చూశారు. ధృతరాష్ట్రుడు నిన్ను చూడాలని ఉంది, ఆ తర్వాత దేన్నీ చూడాలని లేదు అని ప్రార్థిస్తే కృష్ణుడు అతనికి తాత్కాలికంగా రెండు కళ్లిచ్చాడు. తర్వాత తన విశ్వరూపాన్ని ఉపసంహరించి, సాత్యకి కృతవర్మలతో సహా సభ నుంచి వెళ్లిపోయాడు. వెళ్లబోయే ముందు భీష్మద్రోణాదులతో ‘‘జరిగినది చూశారు. దుర్యోధనుడి ప్రవర్తన ఎలా ఉందో చూశారు. మహారాజైన ధృతరాష్ట్రుడు తాను అసమర్థుడనని చెప్తున్నాడు.’’ అని నొక్కి చెప్పాడు. ఇదీ మూలభారతంలోని కృష్ణరాయబార ఘట్టం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)

mbsprasad@gmail.com

Show comments