ఎమ్బీయస్: కాశీ బాకీ తీర్చేస్తున్నారు

1992 డిసెంబరులో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేసిన తర్వాత సంఘీయులు ఒక నినాదం యిచ్చారు – ‘అయోధ్యా ఏక్ ఝాంకీ హై, మధురా కాశీ బాకీ హై’ అని. అయోధ్య మచ్చుతునక మాత్రమే, మధురా కాశీ బాకీ ఉన్నాయి అని. ఇప్పుడు కాశీ బాకీని తీర్చివేసే పనిలో పడ్డారు సంఘీయులు, హిందూత్వవాదులు. 1996లో పివి హయాం ముగిసి వాజపేయి పాలన వచ్చినా అయోధ్య విషయంలో పెద్దగా కదలిక లేదు. ఎందుకంటే వాజపేయి హిందూత్వవాది యైనా స్వతహాగా ఉదారవాది. ప్రస్తుతం పాలన సాగిస్తున్న మోదీకి అలాటి శషభిషలు లేవు. అయోధ్యలో అనుకున్నది చేసేస్తున్నారు. అందుకని మధుర, కాశీ వ్యవహారాలు కూడా చప్పున చక్కబెట్టేదామని తాపత్రయం. పైగా దేశంలో ఎన్నడూ లేనంత యిదిగా హిందూత్వవాదం వీరవిహారం చేస్తోంది. తటస్థులనే జాతి క్రమేపీ అంతరించేట్లా ఉంది. మిగిలినవాళ్లలో ‘ఎందుకొచ్చిన గొడవలివన్నీ’ అనేవాళ్లను పక్కవాళ్లు నంచుకు తినేసే ప్రమాదం ఉంది. వేడివేడిగా ఉన్నపుడే సుత్తిదెబ్బ వేయమన్నాడు ఇంగ్లీషువాడు. సమాజంలో వేడి ఉంది కాబట్టి సుత్తి ఎత్తాల్సిన సమయమిదే అనుకుంటున్నారు హిందూత్వవాదులు.

1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు ఒక్క రోజులోనే మాయమై పోవడంతో దేశం మొత్తం బిత్తర పోయింది. కరసేవకులు ఏదో కాస్త హడావుడి చేస్తారు, యుపి పోలీసులు కాస్సేపు సాగనిచ్చి బాష్పవాయు ప్రయోగాల్లాటివి చేసి వాళ్లని తరిమివేస్తారు అని ఊహించిన వాళ్లందరికీ మతులు పోయాయి. మధ్యయుగాల నాటి లెక్కలు యీ తరంలో తేల్చడమేమిటని సభ్యదేశాలన్నీ ప్రధాని పివిని చీదరించుకున్నాయి. ఇది జరగడానికి ముందే, వివాదం నడుస్తూండగానే పివి ప్రభుత్వం ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ (స్పెషల్ ప్రొవిజన్స్) యాక్ట్’ పేర ఒక 1991 సెప్టెంబరులో చట్టం తెచ్చింది. 1947 ఆగస్టు 15 నాటికి ప్రార్థనాలయాలు ఏ రూపంలో ఉంటే వాటిని అలాగే ఉండనివ్వాలని, మార్చకూడదని ఆ చట్టం చెప్తోంది. ఎందుకంటే గతాన్ని తవ్వుకుంటూ పోతే ఎక్కడ ఆగుతుందో తెలియదు.

చరిత్ర నడుస్తున్న కొద్దీ బౌద్ధాలయాలు, జైనాలయాలు హిందూ దేవాలయాలుగా మారాయి. కొన్ని హిందూ గుళ్లల్లో దేవుళ్లు మారారు. కొన్ని హిందూదేవాలయాలు మసీదులుగా మారాయి. చరిత్ర తప్పిదాలను సరిదిద్దుతాం అంటూ మొదలుపెడితే ఎంత వెనక్కి వెళ్లాలో తేలదు. అందువలన ఏ గొడవా లేకుండా ఉన్నవాటిని యథాతథంగా ఉంచేస్తే మేలు అనుకుని ఆ చట్టం పాస్ చేశారు. ఎంపీలలో అత్యధికులు గతం గతః అనుకుని వదిలేయడమే మంచిదనుకున్నారు కాబట్టి పివిది మైనారిటీ ప్రభుత్వమైనా ఆ బిల్లు పాస్ అయింది. అయితే ఆ బిల్లులో అయోధ్యకు మినహాయింపు యిచ్చారు. ఎందుకంటే బాబ్రీ మసీదు వివాదం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంది.

2019 నవంబరులో అయోధ్యపై తుది తీర్పు యిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ యీ చట్టాన్ని ఉటంకిస్తూ, అయోధ్యకు మాత్రం మినహాయింపు ఉంది కాబట్టి భూమి యావత్తు రామాలయానికి కట్టబెట్టారు. ఇకపై దేని గురించి వివాదం రాదని అనుకున్నవాళ్లు నిరాశ పడేట్లా, కాశీ, మధురా మసీదులపై కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఫోకస్ అంతా కాశీలోని జ్ఞానవాపి మసీదుపై పడింది. మసీదుకి ముందు సంస్కృతపు పేరు ఉండడం వింతగా తోస్తుంది. కానీ అది ఆ పేట పేరనుకుంటాను. నాకు సరిగ్గా తెలియదు. వాపి అంటే బావి. దిల్లీలో పాంచ్‌కువాఁ (ఐదు బావులు) అనే ప్రాంతం ఉంది. అలాగే అక్కడ నుయ్యి వుండేదేమో దాని పేరు జ్ఞానవాపి ఏమో ఎవరైనా తెలుసుకుని చెపితే సంతోషిస్తాను. కరీంనగర్‌లో హనుమాన్ గుడి ఉంటే, నిజామాబాద్‌లో దుర్గ గుడి ఉంటే, ఆ ప్రాంతంపేరుతో పిలిచినట్లే, యిదీ అయి వుంటుంది. ఆ పేరుపై అభ్యంతరం వుండి వుంటే ముస్లిములు ఆ పేరు మార్చేసి ఉండేవారు. ఇస్లాంలోకి మారిన మనుషుల పేర్లే మార్చగలిగినవారు, మసీదుకి యింకో పేరు పెట్టలేరా?

ఈ మసీదును 1669లో ఔరంగజేబు ఒక శివాలయం కూల్చి కట్టించాడని చాలామంది చెప్తూ ఉంటారు. ఆ మసీదు నిర్వహించే అంజుమాన్ ఇంతెజ్‌మియా మస్‌జిద్ కమిటీకి చెందిన ఎస్ ఎమ్ యాసీన్ చెప్పినదాని ప్రకారం, దీన్ని కట్టించినది జానుపూర్‌కి చెందిన షర్ఖీ సుల్తాన్లు. అక్బరు దాన్ని మెరుగు పరిచాడట. అతని కాలంలో హిందూ, ఇస్లాంల సారంతో దీన్ ఇలాహి అనే కొత్త మతాన్ని సృష్టించాడు. మసీదు వెనక్కాల ఉన్న ప్రాంతంలో దీన్ ఇలాహి సెంటర్ (మర్కజ్) ఉండేదట. అక్కడ ఉన్న హిందూ శిథిలాలయం ఆ సెంటర్‌లో భాగమే అంటాడతను. తర్వాతి రోజుల్లో ఔరంగజేబు జ్ఞానవాపి మసీదును మరింత వృద్ధి పరచాడట. ఆ మసీదు గోడలో శృంగార గౌరి మూర్తి ఉంది. హిందూ స్త్రీలు వచ్చి అక్కడ పూజలు చేస్తారు. మసీదుకి అవతల ఉంది కాబట్టి దానిపై ముస్లిములకు ఆక్షేపణ లేదు. ఇలా కొన్ని తరాలుగా నడుస్తూ వస్తోంది.

వారణాశిని ప్రధానంగా హిందూ పుణ్యక్షేత్రంగానే మనం చూస్తున్నాం కానీ అక్కడ సర్వమతాలు విలసిల్లాయని, సర్వమతస్తులు పడుగుపేకల్లా కలిసి ఉన్నారని స్థానిక చరిత్రకారులు చెపుతున్నారు. వారణాశికి 10 కి.మీ. ల దూరంలో ఉన్న సారనాథ్ దగ్గరే బుద్ధుడు తన తొలి ప్రవచనం యిచ్చాడు. బౌద్ధం ఉచ్చదశలో ఉన్నపుడు వారణాశి బౌద్ధక్షేత్రంగా వన్నెకెక్కింది. ఇక 13వ శతాబ్దం నుంచి, ఇస్లాం కూడా యిక్కడ వర్ధిల్లింది. ఊరిలో మొత్తం 350 పేటలు (మొహల్లాలు) ఉంటే వాటిలో ముస్లిములు అధికసంఖ్యలో ఉన్న పేటలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఊళ్లో 1400 మసీదులున్నాయి. మీర్జా గాలిబ్ కొంతకాలం వారణాశిలోనే ఉండి ‘ఇది హిందూస్తాన్ యొక్క కాబా’ అన్నాడు. షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ తన జీవితం గంగతో ముడిపడిపోయి ఉందన్నాడు. ఆ ముఖచిత్రాన్ని మార్చడానికి 30 ఏళ్లగా అనేక ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడు అవి ఊపందుకున్నాయి.

అయోధ్య వివాదం నడుస్తూండగానే 1991లో కాశీ విశ్వనాథ మందిరం ట్రస్టు, మరి కొందరు హిందువులు కలిసి వారణాశి సివిల్ కోర్టులో ఓ కేసు పడేశారు. మసీదు ఉన్న స్థలం ఒకప్పుడు తమదని, అక్కడా గుడి ఉండేదని, 1664లో ఔరంగజేబు దాన్ని ఆక్రమించుకున్నాడని, అందుకని తమకు తిరిగి అప్పగించాలని పిటిషన్. మసీదు కమిటీ, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఆ పిటిషన్ కొట్టేయాలని వాదించాయి. 1991 నాటి చట్టం ప్రార్థనాస్థలాలను యథాతథంగా ఉంచాలని చెప్తోందని వాదించాయి. క్రింది కోర్టు వారి వాదనను కొట్టివేయడంతో 1998 నాటికి కేసు అలహాబాద్ హైకోర్టుకి చేరింది. అది యింకా అపరిష్కృతంగానే ఉంది.

ఇప్పుడు హిందూత్వం బలం పుంజుకోవడంతో 2021 ఏప్రిల్‌లో విజయ శంకర్ రస్తోగీ అనే ఒక లాయరు పాత వాదనలతోనే వారణాశి సివిల్ కోర్టులో ఒక పిటిషన్ పడేశాడు. ఈ విషయం హైకోర్టులో నలుగుతోందని తెలిసినా వారణాశి సివిల్ కోర్టు 2021  దేవాలయాన్ని పడగొట్టి మసీదు కట్టారో లేదో తేల్చమని ఎఎస్‌ఐ (ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా)ను ఆదేశించింది. హైకోర్టులో కేసు పెండింగులో ఉండగా యిలాటి ఆదేశాలివ్వడం తప్పని, దీనివలన ఎన్నో శతాబ్దాలుగా ఎవరి ప్రార్థనాలయాలలో వాళ్లు ప్రార్థనలు చేసుకుంటున్న హిందూ, ముస్లింల ఐక్యతకు విఘాతం కలుగుతుందని ప్రతివాదులు హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు 2001 సెప్టెంబరులో స్టే యిచ్చింది. మా దగ్గర పెండింగులో ఉండగా వారణాశి సివిల్ కోర్టు అలా ఆదేశించడం తప్పంది.

ఇది ఇలా ఉండగా 2021 ఆగస్టులో రాఖీ సింగ్, మరో నలుగురు హిందూ మహిళలు తాము మసీదు బయటి గోడలో ఉన్న శృంగార గౌరిని పూజించడంతో తృప్తి పడటం లేదని, మసీదు లోపల గోచరంగా, అగోచరంగా ఉన్న దేవుళ్లందరినీ పూజిద్దామను కుంటున్నామని, దానికి అనుమతించాలని వారణాశి సివిల్ కోర్టుకే పిటిషన్ పెట్టుకున్నారు. ఎఎస్‌ఐ సర్వేపై హైకోర్టు స్టే యిచ్చింది కాబట్టి యీసారి వారణాశి సివిల్ కోర్టు 2022 ఏప్రిల్ 26న అడ్వకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో సర్వే చేయమని, వీడియోలు తీయమని ఆదేశించింది. వాళ్లు మే 6, 7 తారీకుల్లో సర్వే నియమించారు. అజయ్ కుమార్ పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నారని మసీదు కమిటీ కోర్టులో అప్లికేషన్ పెట్టుకుంది. అజయ్ కుమార్ సహచరుడైన విశాల్ సింగ్ ‘అజయ్ నియమించిన ఫోటోగ్రాఫర్ మీడియాకు సమాచారాన్ని లీక్ చేస్తున్నాడు’ అని ఆరోపించాడు. మూడు రోజుల పాటు వాదనలు విన్నాక కోర్టు విశాల్ సింగ్‌ను స్పెషల్ అడ్వకేట్ కమిషనర్‌గా నియమించింది.

దాంతో పాటు సర్వేని ఎవరూ అడ్డుకోకుండా చూడమని పోలీసులను, రాష్ట్రయంత్రాగాన్ని ఆదేశించింది. మే 17 కల్లా రిపోర్టు సమర్పించమని ఆదేశించింది. ఈలోగానే మసీదు వజూఖానా (నమాజుకి ముందు కాళ్లూ చేతులూ కడుక్కునే కొలను)లో శివలింగం దొరికిందని మీడియాలో వచ్చేసింది. అది రెండున్నర అడుగుల ఎత్తు స్తూపాకారపు నల్లరాయి. దానిపై నాలుగు అడుగుల వ్యాసమున్న తెల్లటి రాయి ఉంది. అది శివలింగం అని పిటిషనర్లు, కాదు, వజూఖానాలో నీళ్లు చిమ్మేందుకు పెట్టిన ఫౌంటెన్ అని మసీదు కమిటీ వాళ్లు వాదిస్తున్నారు. అదేమిటో కోర్టులే తేల్చాలి. హైకోర్టు లఖ్‌నవ్ బెంచ్ దగ్గర పెండింగులో ఉంది. సాంకేతిక కారణాల వలన తీర్పు వెలువరించడం ఆలస్యమౌతోందట. మేం న్యాయవ్యవస్థనే నమ్ముకున్నాం అని మసీదు కమిటీ వాళ్లు అంటున్నారు. కానీ యీ లోపున దేశంలో ఆవేశకావేషాలు పెరుగుతున్నాయి. ‘మసీదులు తవ్వేస్తాం, శివలింగాలు దొరికితే మావి, శవాలు దొరికితే మీవి’ అని బండి సంజయ్ అనేశారు.

ఆలోచిస్తే ఏ రాయి దొరికినా శివలింగం అనేయవచ్చు. శివలింగ రూపవైవిధ్యం గురించి తెలుగు పద్యం కూడా ఉంది. కానీ పానవట్టంతో ఉన్నదైతేనే పూజలందుకున్న శివలింగం అనుకోవాలని నా ఉద్దేశం. పైగా మసీదు నేలలో పాతరపడిపోయి, శతాబ్దాలుగా పూజాపునస్కారం లేకుండా పడి ఉన్న శివలింగాలు మన కెందుకు? కొత్తవే ప్రతిష్ఠాపించుకోవచ్చు. నిత్యపూజలు జరగకపోతే ఏ విగ్రహానికైనా విలువ ఉంటుందా? జ్ఞానవ్యాపి మసీదులో దొరికినది నిజంగా శివలింగమే అయినా, వాళ్లంతా శతాబ్దాలుగా చేతులు, కాళ్లు కడుక్కున్న చోటులోంచి తీసుకుని వచ్చి యిప్పుడు అభిషేకం చేసి తీర్థం తీసుకోవాలా? భక్తి ఉంటే ఇసుకతో సైకతలింగం కూడా చేయవచ్చంటారు. కుక్క ముట్టుకున్న కుండను వాడం కదా! దీన్నెందుకు వాడాలి? స్థానభ్రంశం చెందిన దేవతామూర్తికి మహిమ ఏం మిగిలినట్లు? తనను తనే కాపాడుకో లేకపోయిన ప్రతిమ అది. అంతకంటె శ్రద్ధాభక్తులతో, హోమాది క్రతువులతో కొత్త విగ్రహాన్ని పెట్టుకోవడం మేలు కాదూ! పోనీ ఏ పరమతస్తుడి చేయి పడని వేలాది జీర్ణాలయాలను పునరుద్ధరించవచ్చు.

కాదు, కూడదు, దాన్నే పూజిస్తాం అని పట్టుబడితే, ‘ఇదిగో మీ రాయి, దాన్ని శివలింగం అంటారో, సాలిగ్రామం అంటారో మీ యిష్టం’ అని మసీదు కమిటీ యిచ్చేయవచ్చు. ఏ పేచీ ఉండదు. కానీ వీళ్లు ఒప్పుకోరు. ‘అది ఎక్కడ దొరికిందో అక్కడే పూజలు చేస్తాం, ఆ స్థలాన్ని మాకు అప్పగించండి’ అని గొడవ పెడతారు. ఇప్పటికే అక్కడ పూజలు చేయనివ్వాలంటూ కోర్టులో అప్లికేషన్లు పెట్టుకున్నారు. నేపాల్ వెళ్లి పంచముఖ రుద్రాక్షలు, కేదార్‌నాథ్ వెళ్లి సాలిగ్రామాలు తెస్తాం, యింట్లో పెట్టుకుని పూజించుకుంటాం. దొరికిన చోటే పూజలు చేయాలనే చాదస్తానికి పోము. గుళ్లలో దేవుడి విగ్రహాలు కూడా నల్లరాతివైతే తమిళనాడులో, పాలరాతివైతే రాజస్థాన్‌లో చేయించి తెప్పించుకుని మన ఊళ్లలో సకల లాంఛనాలతో ప్రతిష్ఠాపించుకుంటాం. ఈ మసీదు ‘శివలింగా’న్ని కూడా వేరే ఎక్కడైనా గుళ్లో పెట్టుకుని పూజించవచ్చు.

ఒరిజినల్ కాశీ విశ్వేశ్వరుడి విగ్రహమే అది వాదించడానికి ఆధారం ఏమీ లేదు కదా, ఇప్పుడున్న ఆలయంలోని విగ్రహం తన మహిమలు చూపిస్తూనే ఉంది. మనం మొక్కుతూనే ఉన్నాం, మొక్కులు పెట్టుకుంటూనే ఉన్నాం. ఇన్నాళ్లూ దీపధూపనైవేద్యాలు లేని మసీదు రాయిని పట్టుకుని వచ్చి దాని స్థానంలో పెట్టం కదా! అందుకని వేరే గుడి ఒకటి కట్టి జ్ఞానవాపి జ్ఞానేశ్వరుడనే పేరు మీద పూజలు చేసుకోవచ్చు. కానీ యిలాటి సలహాలు వీళ్లకు గిట్టవు. వాళ్లకు కావలసినది శివలింగం కాదు, అక్కడి మసీదును పడగొట్టడం! మేం అక్కడే పూజ చేస్తాం అంటూ మసీదును బద్దలు కొట్టడానికి చూస్తారు. రేపు భాగ్యలక్ష్మి ఆలయం గర్భగుడి చార్మినార్‌ లోపల ఉందని మా సందేహం అంటూ చార్మినార్‌ను పడగొట్టవచ్చు. కుతుబ్ మీనార్ పక్కనున్న మసీదు ఒకప్పుడు హిందూ దేవాలయం అంటూ రగడ ప్రారంభమైంది. ఆ పేరుతో కుతుబ్ మీనార్‌నూ కొట్టి పడేయవచ్చు. దేశంలో హిందూ ఆలయాలకు కొరత లేదు. కొత్తవి కట్టేందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. అలాటప్పుడు వందల సంవత్సరాలు శిథిలాలలో పడి ఉన్న ప్రతిమలపై యింత ఆరాటం దేనికనిపిస్తుంది నాకు.

మసీదుల్లో హిందూ దేవాలయ చిహ్నాలు ఉండడం అబ్బురం కాదు. అలాగే హిందూ దేవాలయాల్లో బౌద్ధ, జైన చిహ్నాలు ఉండడమూ అబ్బురం కాదు. చరిత్ర పరికిస్తే అన్నీ యిలాటి ఘటనలే. జరిగిపోయిన చరిత్రను సరిదిద్దుతాం అంటూ పాతవి తవ్వడం మొదలుపెడితే ఎక్కడికి తేలతామో తెలియదు. మరో ఏభై, వందేళ్ల తర్వాత ఇప్పుడు చేసినదాన్ని సరిదిద్దుతామంటూ మరొకళ్లు బయలుదేరితే దీనికి అంతెక్కడో తెలియదు. పాత వాటిని అలాగే వదిలేసి, కొత్తగా బాగా కట్టుకుని, బాగా మేన్‌టేన్ చేసుకుంటే మేలు అని నాబోటి వాళ్లు అనుకోవచ్చు. కానీ హిందూత్వవాదుల ఆలోచనా ధోరణి వేరుగా ఉంది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూలగొట్టినట్లే జ్ఞానవ్యాపి మసీదును కూడా అతి సమీపంలోనే ఏదో ఒక రోజు కూలగొడతారని కొందరు ముస్లింల సందేహం.

దానికి అనువైన వాతావరణాన్ని 2018 నుంచి కల్పిస్తున్నారని వారి వాదన. గతంలో మసీదు చుట్టూ చాలా యిళ్లు, దుకాణాలు ఉండేవి. వేలాది మంది గుమిగూడి బాబ్రీ తరహాలో పగలకొట్టే అవకాశం ఉండేది కాదు. కానీ కాశీవిశ్వనాథ మందిర సుందరీకరణ పేరుతో 2018 నుంచే విశాలమైన కారిడార్ నిర్మాణం ప్రారంభమైంది. మసీదు చుట్టూ ఉన్న ఇళ్లు, షాపులు, యితర భవంతులు కూలగొట్టారు. ఇప్పుడు దాడి చేయడానికి అనువుగా ఓపెన్ ఏరియాలో నిలిచి వుంది. 1992లో అయోధ్యలో జరిగినది 2022లో కాశీలో జరగడానికి ఆస్కారం ఉంది. దానికి తగిన భూమికను కోర్టు కేసుల ద్వారా తయారు చేస్తున్నారు. మసీదులో ఉన్న హిందూ చిహ్నాలను తుడిచిపెట్టడానికి మసీదు కమిటీ ప్రయత్నిస్తోందని, అందువలన వాళ్లపై ఎఫ్‌ఐఆర్ పెట్టాలని మూడు రోజుల క్రితం రాఖీ సింగ్ ప్రతినిథి వారణాశి జిల్లా కోర్టులో కేసు పడేశారు. జూన్ 23న కోర్టు కేసు వింటుందట.

మసీదులో హిందూ చిహ్నాలను తుడిచిపెట్టదలచుకుంటే యీ వివాదం మొదలైన 30 ఏళ్ల క్రితమే చేసి ఉండేవారు. ఏ ఆధారాలు లేకుండా చేసి, మీ ఆరోపణ తప్పని వాదించేవారు. ఇవాళ కొత్తగా తలపెట్టడమెందుకు? కానీ యీ లాజిక్ వినేవారెవరు? ‘మధ్యయుగాలలోనే కాదు, యీ తరంలో కూడా ముస్లిములు హిందూ విగ్రహాలను నాశనం చేస్తున్నారు’ అనే నినాదం ఎత్తుకుని, దాడి చేయడానికి కరసేవకులను సమాయత్తం చేయవచ్చు. ఏది జరిగినా నివ్వెరపోతూ చూడడం తప్ప సామాన్యుడు చేయగలిగేదేమీ లేదు. క్రింది స్థాయిలో కోర్టులు, ప్రభుత్వ యంత్రాంగం కుమ్మక్కయి మతోన్మాదులకు అండగా నిలిచినపుడు వీళ్ల చేతిలో ఏముంది? దీని వలన ముస్లిములలో రాడికలైజేషన్ పెరిగి, వారిలో కొందరు టెర్రరిస్టులై, విదేశీ సహాయంతో బీభత్సం సృష్టించినపుడు మళ్లీ నష్టపోయేది సామాన్యుడే! ఆ సామాన్యుడు హిందూ, ముస్లిము, క్రైస్తవుడు, శిఖ్కు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే యీ టెర్రరిస్టులు మసీదు విధ్వంసం చేసినవారి జోలికి వెళ్లరు. సామాన్యులు వెళ్లే రైళ్లు, హోటళ్లలోనే బాంబులు పెడతారు. 1992 అయోధ్య సంఘటన తర్వాత దేశంలో ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరిన్ని జరిగే ప్రమాదం పొంచి ఉంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)

mbsprasad@gmail.com

Show comments