ఎమ్బీయస్: ఉక్రెయిన్ యుద్ధం ఎప్పడు ముగుస్తుంది?

రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసి 100 రోజులు దాటింది. యుద్ధం యిన్నాళ్లు సాగుతుందని ఎవరూ అనుకోలేదు. రష్యాకున్న మిలటరీ శక్తి ముందు ఉక్రెయిన్ బలం చాలా చిన్నది కదా అనుకున్నారు. కానీ ఉక్రెయిన్ నిలదొక్కుకుని, యుద్ధం యింకా కొనసాగిస్తోందంటే దానికి కారణం, అమెరికా, నాటో దానికి ప్రచ్ఛన్నంగా, దాదాపు ప్రత్యక్షంగా అందిస్తున్న మద్దతే. దానికి చారిత్రక కారణాలున్నాయి. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత మిత్రదేశాల మధ్య జరిగిన చర్చల్లో స్టాలిన్ చాలా తెలివిగా వ్యవహరించి, ఎక్కువ లాభాలు పొందాడు. జర్మన్లను తొలిసారిగా మట్టి కరిపించినది రష్యన్లే కాబట్టి, అతని మాటకు విలువ నిచ్చారు. ఆ తర్వాత రష్యా తూర్పు యూరోప్ అంతా తన అధీనంలో ఉండేట్లు చూసుకుంది. అంతేకాదు, యూరోప్ దేశాల వలస దేశాల్లో వాళ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు సహాయసహకారాలు అందించి, అవి తృతీయ కూటమి దేశాలుగా ఏర్పడి ఒక శక్తిగా మారడానికి ప్రచ్ఛన్నంగా తోడ్పడింది. వీటన్నిటి సహకారంతో అమెరికాకు పోటీగా ఆర్థిక, రాజకీయశక్తిగా ఎదగసాగింది.

రష్యా ప్రగతిని చూసి ప్రపంచంలోని అనేక దేశాలు ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలో ఉన్నవి, కమ్యూనిజం వైపు, కనీసం సోషలిజం వైపు మొగ్గు చూపాయి. వాటన్నిటికి రష్యా అన్ని విధాలా సాయపడింది. ఇలా అయితే ప్రపంచదేశాల్లో వామపంథా బలపడుతుందని సామ్రాజ్యవాద దేశాలన్నిటికి బెదురు పట్టుకుంది. కానీ రెండవ ప్రపంచ యుద్ధానంతరం యూరోపియన్ దేశాలన్నీ ఆర్థికంగా కుదేలై ఏమీ చేయలేకపోయాయి. యుద్ధం వలన లాభాలే తప్ప నష్టం కలగని అమెరికా మరింత బలపడి, పశ్చిమ యూరోప్ దేశాలను ఆడించసాగింది. ఈ విధంగా యూరోప్ ప్రధానంగా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికాల్లోని దేశాలు అమెరికా, రష్యాల పోటీ మధ్య యిరుక్కున్నాయి. ప్రపంచదేశాలలో పలుకుబడి పెంచుకునే ప్రయత్నంలో రష్యా తన దేశప్రజల బాగోగులు నిర్లక్ష్యం చేయడంతో, అక్కడ తిరుగుబాటు వచ్చి రష్యన్ యూనియన్ కుప్పకూలింది. దాని సభ్యదేశాలన్నీ వేటికి అవి అయిపోయాయి.

ఇక అప్పణ్నుంచి ప్రపంచం ఏకధ్రువ ప్రపంచమై పోయింది. అమెరికా ఏమనుకుంటే అదే జరుగుతోంది. అమెరికా అందించే ఆర్థిక, సైనిక సహాయం కారణంగా యూరోప్ దానికి వంత పాడుతోంది. పదేళ్లపాటు రష్యా అణిగే ఉంది. అయితే గత 20 ఏళ్లగా పుటిన్ నాయకత్వంలో రష్యా పుంజుకోవడం మొదలుపెట్టడంతో అమెరికా, యూరోప్‌లకు కన్నెఱ్ఱ అయింది. అవన్నీ కలిసి ఉక్రెయిన్ సమస్య ద్వారా రష్యాను అదుపు చేయడానికి సమకట్టాయి. ఉక్రెయిన్, నాటో, పుటిన్ అభ్యంతరాలు.. యివన్నీ ‘‘రష్యా ఉక్రోషం – ఉక్రెయిన్ సంక్షోభం’’ అనే వ్యాసంలో వివరించాను. రష్యాకున్న మిలటరీ బలంతో పోలిస్తే ఉక్రెయిన్ త్వరలో లొంగిపోక తప్పదనే అందరూ అనుకున్నారు. కానీ అమెరికా, యూరోప్ ఉక్రెయిన్ పేరు చెప్పి రష్యాతో ప్రాక్సీ వార్ చేయసాగాయి. దాంతో రష్యా యుద్ధంలో గెలవలేక పోతోంది. ఇటు ఉక్రెయినూ గెలవటం లేదు.

మేమేమీ ప్రాక్సీ వార్ చేయడం లేదు అంటున్నాడు బైడెన్. కానీ మరో పక్క ఉక్రెయిన్ దళాలకు ఆయుధాలు సమకూరుస్తూనే ఉన్నాడు. యుద్ధం మొదలుకాగానే నాటో దేశాలు, అమెరికా ఉక్రెయిన్‌కు అనేక ఆయుధాలను పంపించాయి. అమెరికా, ఇంగ్లండు మిలటరీ ఇంటెలిజెన్సు సమాచారాన్ని అందచేస్తూ వచ్చాయి. వాటి సహాయంతో ఉక్రెయిన్ సేన రష్యా సైన్యానికి నష్టం కలిగించ గలిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి యూరోప్ నేతలు జయజయధ్వానాలు పలికి అతన్ని హీరోగా నిలిపారు. ఎన్ని చేసినా ఉక్రెయిన్ తన గడ్డపైకి వచ్చిన రష్యన్ సైన్యాన్ని వెనక్కి నెట్టలేకపోయింది. దాంతో అమెరికా లెండ్-లీజ్ అగ్రిమెంటు కింద అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపించింది. అంతేకాదు, మీ వెంట మేమున్నాం, మీకేం భయం లేదు అని చాటడానికి బైడెన్ భార్య మే నెలలో ఉక్రెయిన్‌కు వెళ్లింది. అదే సమయంలో కెనడా ప్రధాని కూడా వెళ్లాడు.

జి7 దేశాల నాయకులు ‘‘పుటిన్ ఉక్రెయిన్ యుద్ధంలో గెలవకూడదని మేం తీర్మానించాం.’’ అని ప్రకటించారు. రష్యన్ పెట్రోలు, గ్యాస్ ఉత్పాదనలపై ఆధారపడుతూ వస్తున్న యూరోప్ దేశాలు మేం యికపై దిగుమతి చేసుకోము అని ప్రకటించి రష్యాను ఆర్థికంగా దెబ్బ తీయడానికి నిశ్చయించుకున్నాయి. వాటి కారణంగా తమ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా ఫర్వాలేదనే నిర్ణయానికి వచ్చాయి. ఇలా రష్యాను రకరకాలుగా తిప్పలు పెట్టడంలో అమెరికా ఆంతర్యం ఏమిటన్నదానిపై వినిపిస్తున్న ఒక వాదన బలంగా ఉంది. యూరోప్ సాగిస్తున్న ప్రచ్ఛన్న యుద్ధంతో విసిగిన రష్యా తన పొరుగున ఉన్న ఏదో ఒక యూరోప్ దేశంపై దండెత్తుతుందని, వెంటనే యూరోపియన్ దేశాలు, అమెరికా కలిసి రష్యాపై డైరక్టుగా యుద్ధానికి దిగి చిత్తుచిత్తుగా ఓడించేయాలని దాని పథకంట.

ఇది గ్రహించే కాబోలు, యూరోప్ ఎంత కవ్వించినా, రష్యా ఉక్రెయిన్‌ను దాటి తన రణరంగాన్ని విస్తరించటం లేదు. ఉక్రెయిన్‌లో రష్యన్లు అత్యధికంగా ఉన్న డోన్‌బాస్ వంటి ప్రాంతాలను సులభంగా ఆక్రమించి, వాటికి స్వాతంత్ర్యం ప్రకటిస్తూ ఉక్రెయిన్‌ను బలహీన పరుద్దామని చూస్తోంది. యుద్ధంలో గెలిచిన ప్రాంతాల్లో సైతం అక్కడి భవనాలు, ఆస్తులు ధ్వంసం చేయకుండా, పౌరుల జోలికి పోకుండా జాగ్రత్త పడుతోంది. ఉక్రెయిన్‌తో చర్చల మార్గాన్ని మూసివేయలేదు. కానీ యిప్పటిదాకా చర్చలు విఫలమయ్యాయి. నాటోలో చేరి తీరతానని ఉక్రెయిన్ అంటోంది. అది మాత్రం కుదరదని రష్యా అంటోంది. ఉక్రెయిన్ గతంలో పోగొట్టుకున్న ప్రాంతాల విముక్తే నా లక్ష్యం అంటున్నాడు జెలెన్‌స్కీ.

యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తయిన సందర్భంగా రష్యా సైన్యం రెచ్చిపోయి దాడులు చేస్తోంది. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతాలలో శాశ్వతంగా సొంతం చేసుకోవడానికి చూస్తోంది. దక్షిణ ఖెర్సన్, హ్రివ్నియా ప్రాంతాల్లో రష్యా కరెన్సీని ప్రవేశపెట్టింది. అక్కడి పౌరులకు రష్యా పాస్‌పోర్టులు కూడా యిస్తోంది. ఇటు ఉక్రెయిన్ యుద్ధారంభం నుంచి పదివేల మంది సైనికులను పోగొట్టుకుంది. తమ సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని ఉక్రెయిన్ సైన్యాధ్యక్షుడు అంగీకరించాడు. యుద్ధంలో ఆటుపోట్లు సహజమే. వీటి కంటె రష్యాను కలవరపరిచే అంశం, యూరోపియన్ దేశాలు తీసుకుంటున్న ఆర్థికపరమైన చర్యలు.

ఇయు దేశాలు మార్చిలో ‘ఈ ఏడాది చివరికల్లా రష్యా నుంచి మేము దిగుమతి చేసుకునే గ్యాసును మూడోవంతుకు తగ్గించేస్తాం’ అని ప్రకటించాయి. ఇయు దేశాలు దిగుమతి చేసుకునే చమురులో 25 శాతం, సహజవాయువులో 40 శాతం రష్యానే సప్లయి చేస్తోంది. దాని ద్వారా రోజుకి బిలియన్ డాలర్లు సంపాదిస్తోంది. రష్యా నుంచి దిగుమతులు ఆపేస్తే, మరి యూరోప్‌కు సప్లయి ఎలా అంటే అమెరికా, కతార్ యిస్తాయి అనుకున్నారు. సౌదీ వంటి దేశాలు తమ చమురు ఉత్పత్తిని పెంచి, యూరోప్‌ను ఆదుకుంటాయని లెక్క వేస్తున్నారు. ఈ వరసంతా చూసి రష్యా తన పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న దేశాలు తమ చెల్లింపులను రూబుళ్లలో చెల్లించాలని పట్టుబట్టింది. పోలండ్, బల్గేరియా, ఫిన్‌లాండ్ అలా చెల్లించడానికి తిరస్కరించడంతో రష్యా సరఫరా ఆపేసింది. రష్యా పెట్రోలు లభ్యత తగ్గడంతో యూరోప్‌లో ఫ్యూయల్ చార్జీలు పెరిగాయి. ప్రజాగ్రహం ఎదుర్కోవడానికి ప్రభుత్వం వాటిపై పన్నుల్లో కొన్ని రాయితీలు యిస్తోంది.

మే 30న ఇయు ముఖ్యమైన ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరికల్లా రష్యా నుంచి సముద్రమార్గంలో వచ్చే పెట్రోలు కొనం అని చెప్పింది. పైప్‌లైన్ ద్వారా వచ్చే చమురును మాత్రం తాత్కాలికంగా అనుమతిస్తామని అంది. ఎందుకంటే హంగరీ, స్లొవేకియా దానిపై ఆధారపడతాయి. పైప్‌లైన్‌పై ఆధారపడిన జర్మనీ, పోలండ్ మాత్రం ఏడాది చివరికల్లా తాము సప్లయి ఆపేస్తామని అన్నాయి. జర్మనీ చాలాకాలం పాటు తటస్థంగా ఉంటూ వచ్చింది కానీ యిప్పుడు మాత్రం రష్యాకు వ్యతిరేకంగా ఉద్యమించింది. ఇయు యూరోప్‌లో ఉన్న రష్యా ప్రభుత్వపు, రష్యన్ల ఆస్తులు స్తంభింపచేయడం, కొందరు వ్యక్తుల ప్రయాణాలను నిరోధించడం, స్విఫ్ట్ ఆపరేషన్స్ నుంచి రష్యాలో పెద్ద బ్యాంక్ ఐన ఎస్‌బెర్ బ్యాంకును తొలగించడం వంటి చర్యలు కూడా చేపట్టింది. అనేక రష్యన్ సంస్థలపై కూడా ఆంక్షలు విధించింది. ఇంతకు ముందు ఐదు దఫాలుగా రష్యాపై నిషేధాలు ప్రకటిస్తూ వచ్చింది. పుటిన్, అతని ప్రభుత్వంలో ముఖ్యాధికారులు మొత్తం కలిపి వెయ్యిమందిని ప్రత్యేకంగా టార్గెట్ చేసింది.

యూరోప్‌కు చమురు, సహజ వాయువు ఎగుమతులు ఆగిపోతే రష్యా ఏం చేస్తుంది? ఆసియా దేశాలకు అమ్ముకుంటుంది. అంతగా యిబ్బంది వస్తే చైనా వచ్చి ఆదుకోవచ్చు. రెండూ కమ్యూనిస్టు దేశాలు కాబట్టి.. అనుకోకూడదు. రెండిటిలోనూ కమ్యూనిజం లేదు. అమెరికా ద్వేషమే రెండిటినీ కలుపుతోంది. రష్యా అమెరికా చేతిలో చిత్తయితే, పొరుగున ఉన్న చైనాకు ప్రమాదం ముంగిట్లో ఉన్నట్లే. అది జరగకుండా చైనా సర్వశక్తులూ ఒడ్డుతుంది. అమెరికా, ఇయు ఎంత రెచ్చగొట్టినా రష్యా నాటో దేశంపై దాడి చేయకుండా సంయమనం పాటించినంత కాలమే యిది సాధ్యపడుతుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వలన ప్రపంచదేశాలన్నీ ఏదో ఒక రకంగా యిబ్బంది పడుతున్నాయి. యుద్ధం త్వరగా ముగిసి సాధారణ పరిస్థితులు వస్తే బాగుండునని ఆశిస్తున్నాయి. గతంలో ఇరాక్, లిబియాలను తొక్కేసినట్లే యిప్పుడు రష్యాను కూడా తొక్కేద్దామని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్నంతకాలం శాంతి అంత త్వరగా నెలకొనదు. ఈ యుద్ధంలో ఇండియా తటస్థ వైఖరి అవలంబించింది. ఎందుకంటే మనకు అమెరికా, రష్యా రెండిటితోనూ మొహమాటాలున్నాయి.

ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుంది? నా ఉద్దేశంలో ఇయులో విభేదాలు వచ్చేవరకు సాగుతుంది. ఇప్పటికే హంగరీ వంటి దేశాలు ఇయు నాయకత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని వ్యాఖ్యానిస్తున్నాయి. దేశ మనుగడకు చమురు ఉత్పాదనలు అతి ముఖ్యం. వాటి ధరలు పెరిగితే ప్రజలు తిరగబడవచ్చనే భయం ఆ దేశాలకుంది. ఈ యుద్ధం యూరోప్ దేశాల ప్రజలు తమ ప్రభుత్వాలపై నిరసన తెలిపేవరకూ సాగుతుందని కూడా అనవచ్చు. యుద్ధంపై రష్యా ప్రజల్లో కూడా అసంతృప్తి ఉండి వుంటుంది కానీ ‘ఈ యుద్ధం చేయకపోతే నాటో మద్దతుతో ఉక్రెయిన్ మనపై దాడి చేస్తుంది. మనమంతా పాశ్చాత్యదేశాలకు ఊడిగం చేయాల్సి వస్తుంది.’ అని పుటిన్ తన ప్రజల్ని భయపెట్టవచ్చు.

బంగ్లాదేశ్ యుద్ధసమయంలో భారతీయ ప్రజలు చాలా భారాన్నే మోశారు. కానీ పాకిస్తాన్ తూర్పు నుంచి దాడి చేసే ప్రమాదం శాశ్వతంగా తొలిగిపోతుందనే లెక్కతో ఆ భారాన్ని సంతోషంగా మోశారు. రష్యన్లు కూడా అలాగే అనుకోవచ్చు. అనుకోకపోయినా నోరెత్తే సాహసం చేయలేరు, అక్కడ నియంతృత్వం అలాటిది. కానీ యూరోప్ వాసులు ‘ఎవరి మధ్యో జరిగే యుద్ధానికి మనమెందుకు మూల్యం చెల్లించాలి? మన ఆయుధాలు వాళ్లకెందుకు పంపాలి? ఉక్రెయిన్ నాటోలో చేరితే ఎంత? చేరకపోతే ఎంత?’ అని తమ అధినేతలను అడిగితే వారి వద్ద సమాధానం లేదు. ఉక్రెయిన్ బాధితుల పేరు చెప్పి యూరోప్‌లో రేట్లు పెంచేయడం గురించి యిప్పటికే జోకులు పేలుతున్నాయి. నెలలు గడిచే కొద్దీ వారి అసహనం ప్రభుత్వంపై ఆగ్రహంగా మారితే నిలదొక్కుకోవడం కష్టం. ఇటు జెలెన్‌స్కీ యూరోప్ దేశాలకు లెక్చర్లు దంచుతున్నాడు. ‘‘ఆంక్షలు యింకా పెంచండి. రష్యా మళ్లీ కోలుకోకుండా చేయండి.’’ అంటూ. ‘నీకేం నాయనా, ఏమైనా చెప్తావ్, మధ్యలో మేం ఛస్తున్నాం’ అని యూరోపియన్లు విసుక్కోవచ్చు. అమెరికా మాట కొస్తే యీ యుద్ధంలో అమెరికా మితిమీరి జోక్యం చేసుకోవడం పట్ల అక్కడ మీడియా పూర్తి మద్దతు యివ్వటం లేదు. ప్రజాభిప్రాయం ఎలా వుందో సర్వేలు చెప్పాలి.

- ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)

mbsprasad@gmail.com

Show comments