భాజపాతో వస్తేనే పవన్ కు ఎంట్రీ !

మహానాడు తరువాత తెలుగుదేశం, జనసేన పార్టీల మనోభావాల్లో చాలా మార్పులు వచ్చినట్లు కనిపిస్తోంది. మహానాడు తరువాత తెలుగుదేశం పార్టీకి ధీమా పెరిగినట్లు కనిపిస్తోంది. ఆ ధీమా తో స్ట్రాటజీలు మారుస్తున్నట్లు కనిపిస్తోంది. 

ఇప్పటి వరకు వన్ సైడ్ లవ్ అంటూ వెంటబడి, ఇప్పుడు ఇలా ప్లేట్ మారుస్తుండడంతో జనసేనకు మండుతున్నట్లు క్లారిటీ వస్తోంది. ఈసారి తగ్గేదేలే అంటూ సంకేతాలు ఇచ్చారు. నిజానికి 2019లో తగ్గింది ఏమీ లేదు. ఇప్పటికీ అప్పటికీ తమ బలం కూడా పెరిగిందనే భావన జనసేనలో వుండడం వల్ల కూడా ఇలాంటి మాటలు వస్తున్నాయనే అనుకోవాలి.

అయితే ఇదంతా పై పై వ్యవహారం. లోపల ఒరిజినల్ వేరే వుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి.

జనసేన తో పొత్తు పెట్టుకుంటే అది అన్ని విధాలా లాభదాయకంగా వుండాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ మీద ఎంత కాదు అన్న కాపు సామాజిక వర్గ ముద్ర వుంది. అసలే తెలుగుదేశం పార్టీ దూరమైన తన బిసి ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి చూస్తోంది. ఇలాంటి నేపథ్యంలో జనసేనతో పొత్తు అంటే ఇబ్బంది కావచ్చు.

అదే సమయంలో జనసేనతో పొత్తు అంటే భాజపా నుంచి ఆ పార్టీని దూరం చేయడమే. అలా దూరం చేస్తే తెలుగుదేశం పార్టీ మీద భాజపాకు కచ్చితంగా ఆగ్రహం వస్తుంది. దాన్ని తట్టుకోవడం కష్టం. 2019 లో భాజపా ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఆర్థిక వనరలు అందకుండా చేసింది అన్నది రాజకీయ వర్గాలు కథలు..కథలుగా చెప్పుకుంటాయి. అందువల్ల మరోసారి భాజపాను కెలికే ఉద్దేశం, ధైర్యం తెలుగుదేశం పార్టీ కి లేదు.

అందువల్ల ఇటు బిసి ఓటు, అను భాజపా అనుగ్రహం అన్నీ కలగాలంటే జనసేన ఒంటరిగా కాకుండా భాజపా సహితంగా రావాలి. అప్పుడు కూడా జనానికి ఎలాంటి కలరింగ్ ఇవ్వవచ్చు అంటే అందరూ కలిసి జగన్ మీద పోరాడుతున్నట్లు. కానీ ప్రస్తుతానికి అయితే భాజపా నేరుగా తెలుుగుదేశంతో పొత్తు ఆలోచనలో లేదు.

అందుకే తెలుగుదేశం పార్టీ పెద్దలు ఓ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. జనసేనను నేరుగా రావద్దు, పొత్తు వద్దు అని చెప్పలేదు. అలా చెప్పడం కన్నా, వస్తే భాజపాతో రండి…అలా అయితే అన్ని విధాలా లాభదాయకంగా వుంటుంది అని చెప్పబోతున్నట్లు రాజకీయ వర్గాల బోగట్టా. అంటే భాజపాను తమ దగ్గర కు చేరే బాధ్యత జనసేన నెత్తిన మోపడం అన్నమాట. వచ్చిందా? భాజపాతో కలిసి వస్తుంది. లాభంగా వుంటుంది. రాలేదా? తమ పార్టీ మూలాల్లో వున్న సామాజిక వర్గ అభీష్టం…బిసి లను దగ్గరకు చేర్చుకునే ప్లాన్ నెరవేరుతుంది.

ఇలాంటి ఆలోచనను తెలుగుదేశం పెద్దలు చేస్తున్నారని పసిగట్టిన జనసేనాధిపడి పవన్, ముందుగానే రివర్స్ గేర్ వేసి, త్యాగాల గురించి, తగ్గడం ఇక లేదన్న సంకేతాల గురించి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. 

Show comments