యాంటీ జ‌గన్ ఓటు బ్యాంక్ కోసమేనా?

రాజ‌కీయ నాయకులు చులాగ్గా ఏమీ మాట్లాడరు. చటుక్కున మాటలు వదలరు. దాని వెనుక చాలా వ్యవహారాలు వుంటాయి. అందులోనూ కేటీఆర్ లాంటి ఆరితేరిపోతున్న పొలిటీషియన్ అస్సలు ఆ పని చేయరు. అందుకే ఆయన ఇటీవల చేసిన ‘పక్క రాష్ట్రం’ విమర్శల మీద దృష్టి పెట్టాల్సి వస్తోంది. ఈ మాటలు ఆయన యధాలాపంగా అన్నారని అనుకోవడానికి లేదు. 

రాజ‌కీయ వర్గాల బోగట్టా ప్రకారం, జ‌గన్ కు కేసీఆర్ కు మధ్య బంధాలు బలంగా వున్నాయనే ఆలోచలను ఆంధ్ర ఓటర్ల నుంచి తప్పించడానికే ఈ ప్రయత్నం చేసారని తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు జ‌గన్ కు గట్టిగా లభించింది. ఆ మద్దతు ఒకలా కాదు. ‘అన్ని విధాలా’ లభించింది. అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు అంటే కేటీఆర్ కామెంట్ చేసే వరకు అలాగే వుందని ఆంధ్ర రాజ‌కీయ నాయకులు అంతా నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ విషయంలో కేటీఆర్ కు ఆంధ్ర ప్రతిపక్ష నేతలు కొంత ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు రాజ‌కీయ వర్గాల బోగట్టా. 

సాఫ్ట్ వేర్, సోషల్ మీడియా ప్రభావిత ఓటర్లు అంతా జ‌గన్ కు వ్యతిరేకంగా వున్నారని, హైదరాబాద్ లోని ఆంధ్ర ఓటర్లలో ఈ బాపతు జ‌నాలే ఎక్కువని, అందువల్ల ఇప్పుడు కనుక జ‌గన్ తో బంధాలు తెంపుకోకపోతే ఆ ఓట్లు అన్నీ భాజ‌పాకు వెళ్లిపోయే ప్రమాదం వుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. జ‌గన్ తో కేసీఆర్/కేటీఆర్ ఆ బంధాలు తెంపుకోకపోతే ఆంధ్ర ఓట్లు భాజ‌పాకు వెళ్లే ప్రమాదం వుంది.

సహజంగానే మేధావి వర్గ, సాఫ్ట్ వేర్, సోషల్ మీడియా ప్రభావిత ఓట్లు చాలా వరకు భాజ‌పాకు వెళ్లడానికి అవకాశం వుంది. కానీ అక్కడ సరైన కేండిడేట్ వుండాలి. అని నమ్మబలికినట్లు తెలుస్తోంది. అందుకే కేటీఆర్ పూర్తిగా బంధాలు తెంపుకోవాలని అనుకోకపోయినా, ఆంధ్ర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ మాటల తూటాలు విసిరారని తెలుస్తోంది. కానీ అది ఆ వెంటనే చాలా వరకు రివర్స్ కూడా అయింది. 

ఆంధ్ర ఓటర్లు లక్షల్లో వున్నమాట వాస్తవం. కానీ వారిలో సగభాగం రాయల సీమ నుంచి వున్నారు. మిగిలిన సగభాగం ఆంధ్ర నుంచి వున్నారు. రాయల సీమ ఓటర్లు చాలా వరకు జ‌గన్ హార్డ్ కోర్ బ్యాచ్. ఇప్పుడు ఆ ఓట్లు పోయే ప్రమాదం వుంది. అందుకే కేటీఆర్ సర్దుబాటు చర్యలకు వెంటనే దిగారు.

మరోపక్కన తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అది కూడా మళ్లీ టీఆర్ఎస్ కు కాస్త నెగిటివ్ నే. ఎందుకంటే తెలంగాణ ఓటర్లు తెలుగుదేశం పార్టీ అంటే మండి పడుతుంటారు. జ‌గన్ తో కేటీఆర్/కేసీఆర్ బంధం వున్నా, ఊడినా వారికి ఓకె కానీ తెలుగుదేశం పార్టీతో బంధం అంటే సహించరు. దాన్ని కూడా కేటీఆర్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద అమెరికా ఎన్నికల్లో ఇండియన్ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎత్తుగడలు వేసినట్లు, తెలంగాణలో కూడా ఆంధ్ర ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఎత్తుగడలు ఇప్పటి నుంచే ప్రారంభమైనట్లు అనుకోవాల్సి వస్తోంది. తెలంగాణలోని ఆంధ్ర ఓట్లు సామాజిక వర్గాల వారీగా చీలిపోవు. ఆంధ్రలో అటువంటి వ్యవహారం వుంటుంది కానీ ఇక్కడ కాదు. ఇక్కడ కేవలం పార్టీల వారీగా మాత్రమే ఎక్కువగా వ్యవహారం ఆధారపడి వుంటుంది. కానీ కేసీఆర్/కేటీఆర్ కనుక తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గాలను దగ్గరకు తీస్తే వైకాపా అనుకూల సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు మళ్లే ప్రమాదం కూడా వుంది.

అందువల్ల ఇకపై ఇలా తొందర పడకుండా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కేటీఆర్ కు వుంది. కేసీఆర్ అనుభవాన్ని ఆయన అందుకోసం ఆసరాగా తీసుకుంటే మంచిది.

-ఆనం చంద్రశేఖర్

Show comments