అనుష్కా శ‌ర్మ‌.. ఇది ఓవ‌ర్ అనిపించ‌డం లేదా?

త‌మ కూతురు మొహాన్ని ఫొటోగా ఎవ్వ‌రూ వీక్షించ‌కుండా దాచి ఉంచాల‌ని టీమిండియా క్రికెట‌ర్ విరాట్ కొహ్లీ, న‌టి అనుష్కా  శ‌ర్మ‌లు అనుకున్నారు. ఇది వారి వ్య‌క్తిగ‌తం. వాస్త‌వానికి ఈ మ‌ధ్య‌కాలంలో సెల‌బ్రిటీలు ఎవ్వ‌రూ ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేదు. త‌మ పిల్ల‌ల‌ను మీడియా ముఖంగా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డానికి వారు త‌హ‌త‌హ‌లాడారు. అందుకు విరాట్, అనుష్క‌లు భిన్నంగా నిలిచారు. ఇది వారి పూర్తి వ్య‌క్తిగ‌త‌మైన అంశం.

ఇక్క‌డి వ‌ర‌కూ బాగానే ఉంది. తమ ఫోటోలు మీడియాలో బాగా అచ్చు కావాలి, త‌మ‌కు ప‌బ్లిసిటీ కావాలి, త‌మ కూతురుకు వ‌ద్దు అనుకోవ‌డాన్ని కూడా స‌మ‌ర్థించ‌వచ్చు. ఇందుకు త‌గ్గ‌ట్టుగా త‌మ బిడ్డ‌ను వారు పెద్ద‌గా మీడియా ముందుకు తీసుకురాలేదు. తీసుకొచ్చినా.. కెమెరామెన్ల‌ను వారించారు. త‌మ అనుమ‌తి లేకుండా ఫొటోల‌ను ప్ర‌చురిస్తే లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా హెచ్చ‌రించిన‌ట్టుగా ఉన్నారు. ఇది కూడా బాగానే ఉంది!

అయితే.. త‌మ కూతురుని ఒక్క‌సారి బాహ్య ప్ర‌పంచం ముందుకు తామే తీసుకు వ‌చ్చి, తీరా త‌న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చే స‌రికి మాత్రం.. అనుష్క శ‌ర్మ బాగా ఇదైపోతున్నారు. వాస్త‌వానికి కెమెరామెన్లు కూడా కావాల‌ని వీరి బిడ్డ ఫొటోల‌ను తీయ‌లేదు. అనుష్క‌నే త‌న కూతురును కెమెరా ముందుకు తీసుకు వ‌చ్చిన‌ట్టు అయ్యింది.

ఇండియా, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మూడో వ‌న్డే స‌మ‌యంలో విరాట్ కొహ్లీ అర్ధ‌సెంచ‌రీ కొట్ట‌గానే త‌మ కూతురును స్టేడియంలోని వీఐపీ స్టాండ్స్ లోకి తీసుకు వ‌చ్చింది అనుష్క‌. త‌న చేత చేతులు ఊపించింది. కొహ్లీ కూడా త‌న అర్ధ‌సెంచ‌రీని కూతురుకు అంకితం ఇచ్చిన‌ట్టుగా అభివాదం చేశాడు. మ‌రి ఇంత డ్రామాను క్రియేట్ చేసింది మిస్ట‌ర్ అండ్ మిసెస్ విరాట్ కొహ్లీ.  దీంతో స‌హ‌జంగానే కెమెరాలు అటువైపు తిరిగాయి.

రోహిత్ శ‌ర్మ  సెంచ‌రీలు చేసిన స‌మ‌యంలో అత‌డికీ, అత‌డి భార్య‌కూ మ‌ధ్య‌న జ‌రిగే అభివాదాల్లాగానే ఇది కూడా జ‌రిగింద‌నుకోవాలి. అలా విరాట్ , అనుష్క‌ల కూతురు ఫొటో వీడియోలుగా ప్ర‌సారం అయ్యింది. కొంద‌రు ఔత్సాహికులు వాటిని స్క్రీన్ షాట్లుగా తీసి త‌మ సైట్ల‌లో ప్ర‌చురించుకున్నారు. దీనిపై మ‌ళ్లీ పాత పంచాయ‌తీ మొద‌లుపెట్టారు మిసెస్ కొహ్లీ. 

త‌మ కూతురు ఫొటోల‌ను ఎందుకు ప్ర‌చురించారంటున్నారామె! ఈ విష‌యంలో మీడియా సంస్థ‌ల‌కు హెచ్చ‌రిక‌లు, వార్నింగులు, లీగ‌ల్ నోటీసులు ఇలాంటి ర‌చ్చ అంతాన‌ట‌! త‌ను స్పందించ‌గానే ఫొటోల‌ను డిలీట్ చేసిన సైట్ల‌ను మాత్రం అనుష్క మెచ్చుకుంటున్నారు! 

ఈ విడ్డూరాల‌న్నీ చూస్తున్న స‌గ‌టు మ‌నిషి మాత్రం.. ఏమిటిదంతా? అనుకోక‌మాన‌డు! కూతురు ఫొటో బ‌య‌ట‌కు రాకూడ‌ద‌నుకోవ‌డం వారి వ్య‌క్తిగ‌తం. అయితే.. స్టేడియంలోకి తీసుకు వ‌చ్చి, లైవ్ లో రొటీన్ డ్రామాల‌ను క్రియేట్ చేసి, ఆ పై మ‌ళ్లీ త‌మ కూతురు ఫొటోను ఎందుకు ప్ర‌చురించార‌ని అన‌డం ఎలా స‌బ‌బు అవుతుంది? అంటే వీడియోల రూపంలో త‌మ కూతురు మొహాన్ని అంతా చూస్తార‌ని అనుష్కు తెలియ‌దా? త‌నే షో చేసి.. ఇప్పుడు మ‌ళ్లీ ర‌చ్చ ఏమిటో మ‌రి!

Show comments