కృష్ణ..గుంటూరు ప్రాంతీయపార్టీ!

తెలుగుదేశం పార్టీ తరపున గొంతులు చించుకుని వాదన వినిపిస్తున్నది ఎవరు? కిందా మీదా అయిపోతున్నది ఎవరు? కేవలం కృష్ణ, గుంటూరు ప్రాంతీయులేనా? మరి మిగిలిన నాయకులు అంతా ఏమయ్యారు? ఆర్నెల్లకో, ఏణ్ణర్ధానికో యనమలనో, అయ్యన్ననో వాయిస్ వినిపిస్తారు. ఆ తరువాత సైలంట్. అచ్చెన్న అయితే సరేసరి. 

సమస్య ఏదయినా తెలుగుదేశం తరపున మైకు పట్టుకునేందుకు వస్తున్న నాయకుల సంఖ్య బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది.  నిజానికి వైకాపా ఎంపీ రఘురామ కృష్ణ రాజు నే బెటర్. రాష్ట్రంలోని అన్ని సమస్యలూ నావే..అందరు నాయకులు నా టార్గెట్ అనే అన్నట్లు రోజూ ఓ ప్రకటన పడేస్తుంటారు. 

మర్నాడు తమ పత్రికలకు ఏదో ఒక బ్యానర్ కావాలి కదా అని దాన్నే అంది పుచ్చుకుంటూ వుంటాయి కొన్ని 'సామాజిక వర్గ' పత్రికలు. తెలుగుదేశం లోకల్ లీడర్లు కావచ్చు, రాష్ట్ర స్థాయికి ఎదిగిన ప్రాంతీయ నాయకులు కావచ్చు, ప్రస్తుతం వీలయినంత ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. 

ఇంకా రెండున్నరేళ్లు వుంది. ఇప్పటి నుంచీ ఎందుకు హడావుడి చేయడం అని ఫీలవుతున్నారో? మరి ఇంకేమైనా కారణాలు వున్నాయో, మొత్తం మీద తెల్లవారి లేస్తే పత్రికల్లో కనిపించే తెలుగుదేశం నాయకుల పేర్లు చాలా అంటే చాలా కుచించుకుపోతున్నాయి. 

దీని వల్ల ఏమవుతోందీ అంటే, బుద్దా వెంకన్నా..అలాగే మాట్లాడుతారు లే...ధూళిపాల నరేంద్రనా...తెలిసిందేగా...వర్ల రామయ్య..మామూలేగా...ఇలా లైట్ తీసుకునేలా మారిపోతోంది సిట్యువేషన్. తెలుగుదేశం పార్టీని ఎలాగైనా గద్దె ఎక్కించాల్సిందే..లేదా వైకాపాను ఎలాగైనా గద్దె దించాల్సిందే అన్న పట్టుదల, లేదా అవసరం కృష్ణ, గుంటూరు ప్రాంతీయులకే ఎక్కువ వుందేమో అనిపిస్తోంది ఈ వ్యవహారం చూస్తుంటే. 

అసలే అమరావతి అన్నదే అసలు సిసలు ఎజెండా ఆ పార్టీకి అని తెలుగుదేశం మీద ఓ ఆరోపణ వుండనే వుంది. ఇప్పుడు ఆ ప్రాంతం జనాలే పార్టీలో యాక్టివ్ గా వుండి కిందా మీదా అయిపోతున్నారు అంటే జనం తెలుగుదేశం పార్టీ అంటే కృష్ణా, గుంటూరు ప్రాంతీయ పార్టీ అని డిసైడ్ అయిపోయే ప్రమాదం వుంది. 

Show comments