ఫ్రిబవరి విడుదలలు వుంటాయా?

కరోనా పరిస్థితులు ప్రస్తుతం విషమంగానే వున్నాయి. ఫిబ్రవరి రెండో వారానికి అంతా నార్మల్ అవుతుందని అంచనాలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబాయి, ఢిల్లీ ల్లో తగ్గుముఖం పట్టినట్లు కేసుల సంఖ్య చూస్తుంటే కనిపిస్తోంది. ఎంత వేగంగా పెరిగిందో, అంత వేగంగా తగ్గుముఖం పడుతోంది. 

ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కరోనా విజృంభణ కనిపిస్తోంది. ఇది ఇంకో రెండు వారాల వరకు వుంటుందని అంచనా. ఈ లెక్కన ఫిబ్రవరిలో ప్లాన్ చేసిన పెద్ద సినిమాలు విడుదల అవుతాయా అన్నది సందేహం.

ఆచార్య సినిమా ఇప్పటికే వాయిదా పడింది. 11న రవితేజ ఖిలాడీ సినిమా రావాల్సి వుంది. యాభై శాతం ఆక్యుపెన్సీ వున్నా విడుదలకు రెడీగా వుంది యూనిట్. అయితే నైట్ కర్ఫ్యూ తొలగించాల్సి వుంది. అది వుంటే రావడం కష్టం. అప్పటికి వేళలు సవరిస్తానే ఆశతో వుంది యూనిట్. 

ఫిబ్రవరి 25 భీమ్లా నాయక్ రావాల్సి వుంది. కానీ టికెట్ రేట్ల సమస్య తేలకుండా, కొత్త రేట్లు రాకుండా, అలాగే యాభై శాతం ఆక్యుపెన్సీ తొలగించకుండా ఆ సినిమా విడుదల కష్టం. ఫిబ్రవరి రెండో వారం వరకు తెలుగునాట కేసులు వుంటే భీమ్లా నాయక్ విడుదల అనుమానమే.

మిడ్ రేంజ్ సినిమాలు చాలా నిర్మాణంలో వున్నాయి. కానీ అవి కూడా ఫిబ్రవరిలో విడుదల ప్లాన్ చేస్తాయా? అన్నది ప్రస్తుతానికి అనుమానంగానే వుంది. మహా అయితే ఫిబ్రవరి మొత్తం మీద డిజె టుల్లు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి ఒకటి రెండు సినిమాలు మించి రాకపోవచ్చు.

Show comments