ఎమ్బీయస్‍: గుజరాత్‌లో మాంసాహారంపై కట్టడి

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి హిందూత్వ విధానంలో భాగంగా మతమార్పిడి బిల్లు తెచ్చినట్లే, గుజరాత్‌ కొత్త ముఖ్యమంత్రి అలా చేద్దామంటే వీలు లేకపోయింది. ఎందుకంటే పాత ముఖ్యమంత్రి అంతకు ముందే దాన్ని పాస్ చేసేశారు. అందుకని ఆయన మాంసాహారంపై పడ్డారు. తొలి మెట్టుగా కొన్ని నగరాల్లో రోడ్లపై మాంసాహారాన్ని విక్రయించే తోపుడు బళ్లను నిషేధింప చేశారు. ఆ అంశాన్ని వివరించే ముందు ఆ ముఖ్యమంత్రి గురించి కాస్త చెప్పవలసి వుంటుంది. 2001 అక్టోబరు నుంచి పన్నెండున్నరేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా వుంటూన్న మోదీ 2014 మేలో ప్రధాని కాగానే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవర్ని పెట్టాలా అని ఆలోచించి, జనాభాలో 18% వుండి, రాజకీయంగా బలంగా వుంటూ 90 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగలిగి, 1995 నుంచి బిజెపికి అండగా వుంటూన్న, పటేల్ (పాటిదార్) వర్గానికి చెందిన ఆనందీబెన్ పటేల్‌ను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఆవిడ పాలనలోనే హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటేల్ రిజర్వేషన్ ఉద్యమం రావడంతో, దాన్ని యీవిడ సరిగ్గా మేనేజ్ చేయలేదన్న ఫిర్యాదులు వచ్చి రెండేళ్ల పాలన పూర్తవుతూండగానే 2016 ఆగస్టులో విజయ్ రూపాణీని ముఖ్యమంత్రిగా చేశారు.

రూపాణీ, జనాభాలో అల్పసంఖ్యలో వున్నా, ఆర్థికంగా బలమైన జైన్ వర్గానికి చెందినవాడు. పటేల్ ముఖ్యమంత్రిని తీసేశారని కోపం వస్తుందేమోనని నితిన్ పటేల్‌ను అనే సీనియర్ను ఉప ముఖ్యమంత్రిగా పెట్టారు. అయితే రూపాణీకి, నితిన్‌కు పడేది కాదు. రూపాణీ సిఎంగా వుండగానే 2017 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దానిలో బిజెపి చాలా దెబ్బ తింది. 182 సీట్లున్న అసెంబ్లీలో కేవలం 99 సీట్లు తెచ్చుకోగలిగింది. దిక్కూదివాణం, స్థానికంగా ఒక్క బలమైన నాయకుడూ లేని కాంగ్రెసు 77 సీట్లు తెచ్చుకుంది. దేశమంతా మోదీ, అమిత్‌ల ప్రభ వెలిగిపోతూండగా వాళ్ల సొంత రాష్ట్రంలో పరిస్థితి యిలా కావడంతో తల కొట్టేసినట్లయింది. అర్జంటుగా 12 మంది కాంగ్రెసు వాళ్లను తమ పార్టీలో ఫిరాయింప చేసుకుని సంఖ్యాబలాన్ని 111కి పెంచుకున్నారు. ఈ ఓటమికి రూపాణీని ఎంతవరకు తప్పుపట్టాలో తెలియక ఊరుకున్నారు. దాంతో మోదీ తర్వాత ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రిగా రూపాణీ చరిత్ర కెక్కారు.

కానీ 2020 నుంచి కోవిడ్ మహమ్మారి ముంచుకుని వచ్చింది. 2020 ఫిబ్రవరిలో నమస్తే ట్రంప్, 2021 ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం ప్రారంభం యిలాటివన్నీ గుజరాత్‌లోనే జరిగాయి. గుజరాత్ పరిశ్రమల విషయంలో అగ్రగామే కానీ, విద్య, వైద్యం, హ్యూమన్ యిండెక్సెస్ వంటి అనేక యితర విషయాల్లో వెనుకబడి వుంటుంది. ఆరోగ్య వసతుల లేమితో పాటు పాలనలో అసమర్థత వెక్కిరించింది. కోవిడ్ బాధితుల సంఖ్య గుజరాత్‌లో విపరీతంగా వుంది. ప్రజలకు అసంతృప్తి రగిలింది. పైగా సిఎం రూపాణీ, ఆరోగ్య శాఖ చూస్తున్న డిప్యూటీ సిఎం నితిన్‌ల మధ్య కలహాల వలన పాలన దెబ్బ తింది. పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. ముఖ్యమంత్రిని మార్చకపోతే 2022 ఎన్నికలు గెలవడం కష్టం అనుకున్న బిజెపి అధిష్టానం 15 నెలల ముందే 2021 సెప్టెంబరులో రూపాణీని తీసేసి, అతని స్థానంలో ఆనందీ అనుచరుడు 59 ఏళ్ల భూపేంద్ర పటేల్‌ను తెచ్చింది.

అతను అంతకు ముందు మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు కాదు. 2017లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. 2001లో మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిని చేసినప్పుడు అప్పటి అధిష్టానం రిస్క్ తీసుకుంది కానీ అది ఫలించింది. ఇప్పుడీ ప్రయోగం ఫలిస్తుందో లేదో తెలియదు. గుజరాత్‌ రెండు పార్టీల రాష్ట్రం. అయితే కాంగ్రెసు, లేకపోతే బిజెపి. ప్రాంతీయ పార్టీలు లేవు. ఓటరు పార్టీలతో బాటు కులాన్ని కూడా పరిగణించి ఓటేస్తాడు. పటేల్ ఉద్యమం యిప్పుడు చల్లబడింది. దాని నాయకుడు హార్దిక్ కాంగ్రెసులో చేరి, ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టు లాడుతున్నాడు. అందువలన పటేళ్లను ఆకట్టుకుంటే లాభమనుకుంది బిజెపి.

పటేళ్లలో రెండు ఉపకులాలున్నాయి. ఎగువ స్థాయి లేఉవా, దిగువ స్థాయి కద్వా. లేఉవాలు ఆర్థికంగా బలవంతులు. కద్వాలు సంఖ్యాపరంగా అధికులు. 1960లో గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి యిప్పటివరకు 17 మంది ముఖ్యమంత్రులుంటే వారిలో ఐదుగురు పటేళ్లు. వారిలో భూపేంద్ర తప్ప తక్కినవారందరూ లేఉవా పటేళ్లే. ఈసారి కద్వాకు ఛాన్సు దక్కింది. భూపేంద్ర సివిల్ ఇంజనియర్, రియల్ ఎస్టేటు వ్యాపారి. సర్దార్ ధామ్, విశ్వఉమియా ఫౌండేషన్ అనే రెండు పటేల్ కులస్తుల సంస్థల్లో బోర్డు మెంబరు. 2015లో అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెట్ కార్పోరేషన్ చైర్మన్ అయి, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో, అహ్మదాబాద్ బస్ రాప్డి ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌లో పాలుపంచుకున్నాడు. 2010లో కార్పోరేటర్ అయ్యాడు. 2017లో ఆనందీబెన్ నియోజకవర్గం నుంచే తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ముఖ్యమంత్రిని మార్చడమే కాదు, కాబినెట్‌ మొత్తాన్ని కొత్త మొహాలతో నింపేశారు. ముగ్గురు మంత్రులకి తప్ప తక్కినవాళ్లెవరికీ పాలనానుభవం లేదు. ముఖ్యమంత్రి పదవి ఆశించిన నితిన్ పటేల్‌ను ఉపముఖ్యమంత్రి పదవిలో కొనసాగించలేదు సరి కదా, సాంతం తీసేశారు. అతనితో పాటు సౌరభ్ పటేల్, ప్రదీప్‌సింహ్ జడేజాలను కూడా! నితిన్ ఉత్తర గుజరాత్‌లోని లేఉవా పటేల్ కాబట్టి అతని స్థానంలో అదే కులానికి, ప్రాంతానికి చెందిన రుషీకేశ్ పటేల్‌ను వేశారు. ప్రదీప్ మధ్య గుజరాత్‌లోని క్షత్రియుడు కాబట్టి అదే కులానికి, ప్రాంతానికి చెందిన అర్జున్‌సింహ్ చౌహాన్‌ను వేశారు. పటేళ్ల తర్వాత పలుకుబడి కలిగిన కోలి కులానికి నాయకులైన పురుషోత్తమ్ సోలంకి, కువర్‌జీ బవాలియాల స్థానంలో అదే కులానికి చెందిన దేవ మలాం, ఆర్‌సి మక్వాణాలను వేశారు.

ఈ మార్పులతో కాబినెట్‌లో పటేళ్లు 8 నుంచి 7కి, క్షత్రియులు 4 నుంచి 2కి తగ్గారు. బ్రాహ్మణులు 1 నుంచి 2కి, ఒబిసిలు 4 నుంచి 6కి, ఎస్సీలు 1 నుంచి 2కి, ఎస్టీలు 2 నుంచి 4కి పెరిగారు. 54 స్థానాలున్న సౌరాష్ట్ర నుంచి గతంలో 10 మంది మంత్రులుంటే యిప్పుడు 7గురున్నారు. 53 స్థానాలున్న ఉత్తర గుజరాత్ నుంచి గతంలో 4గురుంటే యిప్పుడు ముగ్గురున్నారు. 35 స్థానాలున్న దక్షిణ గుజరాత్ నుంచి గతంలో 5గురుంటే యిప్పుడు 7గురున్నారు. 40 స్థానాలున్న మధ్య గుజరాత్ నుంచి గతంలో 4గురుంటే యిప్పుడు 8గురున్నారు. దీన్ని బట్టి బిజెపి ఎక్కడ బలపడాలనుకుంటోందో ఒక అంచనా వస్తుంది. ప్రస్తుతం సౌరాష్ట్ర, మధ్య గుజరాత్‌లలో బిజెపి వీక్. మధ్య గుజరాత్‌లో క్షత్రియులు, ఎస్సీలు, ముస్లిములు కాంగ్రెసును బలపరుస్తూంటారు.

ప్రతిపక్షాల గురించి మాట్లాడుకోవాలంటే – కాంగ్రెసుకు 2021 ఫిబ్రవరి నుంచి రాష్ట్రాధ్యక్షుడే లేడు. హార్దిక్ పటేల్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా కూర్చోబెట్టారు. ఇంకో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయనగా 2021 డిసెంబర్లో కోలీ కులస్తుడైన జగదీశ్ ఠాకోర్‌ను అధ్యక్షుణ్ని చేశారు. బిజెపి పటేళ్లను దువ్వుతోంది కాబట్టి, కాంగ్రెసు కోలీలపై కన్నేసింది. గుజరాత్ జనాభాలో వీళ్లు 22% వుంటారని అంచనా. ఒబిసిలలో వీరి శాతం 40. సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్‌నగర్, రాజ్‌కోట్, సురేంద్రనగర్, జునాగఢ్, అమ్రేలీ, భావనగర్‌లోని 45 అసెంబ్లీ స్థానాల్లో వీళ్లు పటేళ్లతో పోటీ పడగలరు. ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి తరఫున 12, కాంగ్రెసు తరఫున 10, మొత్తం 22 మంది ఎమ్మెల్యేలున్నారు. కోలీ ఓట్లతోనే కాంగ్రెసు 2017 ఎన్నికలలో 16 సీట్లు అదనంగా గెలుచుకోగలిగింది. సౌరాష్ట్ర ప్రాంతంలో 2012లో 35 సీట్లు గెలుచుకున్న బిజెపి 2017లో 21తో ఆగిపోయింది.

2021 మేలో వచ్చిన తుపాను కారణంగా కోలీల జీవితాలు అస్తవ్యస్తమైతే రూపాణీ ఆదుకోలేదంటూ అతని మంత్రివర్గ సహచరుడు, కోలీ కులస్తుడు అయిన పురుషోత్తమ్ సోలంకి ధ్వజమెత్తాడు. నితిన్‌కు ఉపముఖ్యమంత్రి పదవి యిచ్చినట్లుగా, తనకూ ఆ పదవి యివ్వాలని అతని డిమాండ్. ఇప్పుడతన్ని కాబినెట్‌లోంచి తీసేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే అది గుజరాత్‌లో ఒక ఫోర్స్‌గా ఎదుగుదామని చూస్తోంది. 2021 ఫిబ్రవరిలో 120 సీట్ల సూరత్ మునిసపల్ కార్పోరేషన్‌లో 27 సీట్లు గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెసుకు ఏమీ రాలేదు. మిగిలిన 93 బిజెపికే. బిజెపిపై అలిగిన పటేళ్లు కాంగ్రెసుపై ఆశ విడిచి కొత్త పార్టీ ఐన ఆప్‌ను సమర్థించారు. తక్కిన చోట్ల యిది జరగకుండా పటేళ్లను బుజ్జగించడానికే బిజెపి పటేల్ ముఖ్యమంత్రిని తిరిగి తెచ్చిందని కూడా అంటున్నారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెసు అసంతృప్తులపై గురి పెట్టింది కాబట్టి గుజరాత్ కాంగ్రెసు లోంచి కొందరు అందులోకి దూకి, గుజరాత్ తృణమూల్ శాఖ తెరిచినా ఆశ్చర్యం లేదు.

ఈ అవరోధాలన్నిటినీ అధిగమించడానికి రాష్ట్ర బిజెపి దగ్గరున్న ఏకైక ఆయుధం – హిందూత్వ. 2002లో గోధ్రా అల్లర్ల తర్వాత మోదీ మతమార్పిడి చట్టం తెస్తానని వాగ్దానం చేసి 2003లో నెరవేర్చాడు. 2021 జూన్‌లో గుజరాత్ ప్రభుత్వం దానిలో సవరణలు తెచ్చి కఠినతరం చేసింది. మతాంతర వివాహం ఎవరైనా చేసుకుందామనుకుంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ఆ వివాహం కుటుంబసభ్యుల్లో ఎవరికి నచ్చకపోయినా వాళ్లు పోలీసు కంప్లెయింటు యివ్వవచ్చంది. మతం మార్చుకోవాలంటే జిల్లా మేజిస్ట్రేటు దగ్గరకు ముందుగానే తెలియపరచాలని, లేకపోతే ఐదేళ్ల వరకు జైలుశిక్ష వేయవచ్చని యీ సవరణలు చెప్తున్నాయి. మభ్యపెట్టి, లోభపరిచి మతాంతర వివాహం జరిగింది అని ఏ ఆధారాలు చూపక్కరలేకుండానే బయటివాళ్లెవరైనా కేసు పెట్టవచ్చు. అలా జరగలేదని నిరూపించుకోవాల్సిన భారం మాత్రం వివాహం చేసుకున్నవారిపై మోపిందీ చట్టం.

దాని ఆసరాతో వడోదరాలో తొలి కేసు నమోదైంది. ప్రేమ వివాహం చేసుకున్న కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగి, పోలీసు స్టేషన్‌కు వచ్చి చెప్పుకుంటే వాళ్లు యీ చట్టం కింద కేసు పెట్టేశారు. పైగా ముస్లిం భర్త రేప్, సొడోమీకి కూడా పాల్పడ్డాడు అని చేర్చారు. అదేం లేదు మొర్రోమంటూ భార్య గుజరాత్ హైకోర్టు కెళితే హైకోర్టు ఆగస్టులో స్టే యిచ్చింది. ఎవరైనా మతాంతర వివాహం చేసుకుంటే మీకేమిటి అభ్యంతరం అని ప్రభుత్వాన్ని అడిగింది. హైకోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పిస్తే సుప్రీం కోర్టుకి వెళతామని అప్పటి ముఖ్యమంత్రి రూపాణీ అన్నారు. ‘లవ్ జిహాద్’ను ప్రోత్సహించడానికి విదేశాల నుంచి డబ్బు వస్తోందని మంత్రులు అన్నారు. ఇన్ని చేసినా రూపాణీ పదవి నిలవలేదు.

హిందువుల సంఖ్య పెంచడానికై మోదీ ముఖ్యమంత్రిగా వుండగా రాష్ట్రప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది. ఈ మతమార్పిడి బిల్లులో జైనులను, బౌద్ధులను కూడా హిందువులతో కలిపివేస్తూ 2006లో ఓ సవరణ చేసింది. తాము హిందువులం కాదని, తమ మతం వేరని జైనులు కేసు పడేశారు. దాంతో ప్రభుత్వం 2008లో ఆ సవరణను ఉపసంహరించుకుంది. గుజరాత్ రాష్ట్ర పాలన చక్కగా వుండి వుంటే రూపాణీని మార్చి వుండేది కాదు బిజెపి అధిష్టానం. ముఖ్యమంత్రినే కాదు, కాబినెట్‌లో అందర్నీ మార్చి పారేసి, మొత్తం కొత్తవాళ్లను తెచ్చిందంటేనే తెలుస్తోంది వారి పని తీరు ఎంత అమోఘంగా సాగిందో! మనం మార్చకపోతే ప్రజలే మార్చేస్తారని భయపడి, బిజెపి యీ స్టెప్ తీసుకుంది. పాలనానుభవశూన్యుడైన కొత్త ముఖ్యమంత్రి పాలన ఎలా చేయాలో తాను నేర్చుకుని, సహచరులకు నేర్పి ఏడాదిలోపు అద్భుతమైన ఫలితాలు చూపించి, ప్రజలను ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టి వుంటే బాగుండేది.

కానీ అతను కూడా వచ్చిన రెండు నెలలకే ప్రజల ఆహారపు అలవాట్లపై పడ్డాడు, అదే ప్రధానమైన సమస్య అన్నట్లు! 6 కోట్ల జనాభా వున్న గుజరాత్‌లో పటేళ్లు 18%, ఒబిసిలు 40%, ముస్లిములు 10%, ఎస్సీలు 6%, ఎస్టీలు 15%, ఇతరులు 11% ఉన్నారు. వీరిలో శాకాహారులు కొందరున్నా, మాంసాహారాన్ని అనుమతించరాదని పట్టుబట్టే వాళ్లు జైనులు, వైష్ణవులు మాత్రమే. వీళ్లు సంఖ్యలో పెద్దగా లేకపోయినా ఆర్థికంగా బలవంతులు. వీళ్లను తృప్తి పరచడానికి మాంసాహారంపై ఒత్తిడి తేవడానికి సంకల్పించింది ప్రభుత్వం. వాస్తవానికి హిందూమతావలంబనకు, శాకాహారానికి సంబంధం లేదు. చిన జియర్ గారు సమయానికి మర్చిపోయి వుంటారు కానీ రాముడు, కృష్ణుడుతో సహా హిందూ దేవుళ్లలో చాలామంది మాంసాహారులే! అగస్త్యుడి వంటి ఋషులూ మాంసాహారులే! జంతువుల్ని తినగానే జంతు లక్షణాలు వస్తే, పొట్లకాయ తింటే ఒంటి మీద పొడలు రావాలి, కాకరకాయ తింటే బొడిపెలు రావాలి, గుమ్మడికాయ తింటే గుండ్రంగా అవ్వాలి. స్వాములు జోకులేస్తే నప్పదు. మూఢభక్తులు ప్రవచనాలుగా ప్రచారం చేస్తారు. కాస్త తమాయించుకోవాలి. భక్తి మనసులో వుంటుంది, పొట్టలో కాదు. శాకాహారులైనంత మాత్రాన పుణ్యాత్ములూ కారు, మాంసాహారులైనంత మాత్రాన పాపాత్ములూ కారు.

గుజరాత్‌లో వెజిటేరియనిజం చాలా ఎక్కువ అన్నమాట నిజమే కానీ, దాన్నిబట్టి వాళ్లే గొప్ప హిందువులు అనడానికి లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హిందువులు కూడా మాంసాహారం తినకుండా నిరోధించే ప్రయత్నాలు మొదలుపెట్టారు భూపేంద్ర. నవంబరులో గుజరాత్‌లోని కొన్ని నగరాల్లో వీధుల్లో మాంసాహారం అమ్మే బళ్లను తీసిపారేశారు. బలవంతంగా ట్రక్కులు ఎక్కించేశారు. ఇప్పుడే కాదు, ఎప్పణ్నుంచో నాన్-వెజిటేరియన్స్‌కు గుజరాత్ అంటేనే దడ. నేను పనిచేసిన స్టేట్ బ్యాంక్ సౌరాష్ట్ర హెడాఫీసు భావనగర్‌లో వుండేది. చిత్రమేమిటంటే, దేశంలో కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు కూడా మాంసం తింటూంటే, అక్కడ మాత్రం క్షత్రియ, శూద్ర కులాలలోనే కాదు, ఎస్సీలలో కూడా వెజిటేరియన్స్‌గా వున్నవాళ్లని చూశాను. మా ట్రైనింగ్ సెంటర్ మెస్‌లో నాన్ వెజ్ పెట్టేవారు కాదు, కనీసం ఎగ్ కూడా! కాన్ఫరెన్స్ కెళ్లినా అంతే. ఇతర రాష్ట్రాలలో అలా కాదు. నాన్ వెజ్ కూడా వుంటుంది. తినేవాళ్లు తింటారు, లేనివాళ్లు లేదు. ఇక్కడ మాత్రం బలవంతపు బ్రాహ్మణార్థంలా, బలవంతపు శాకాహారం.

ట్రైనింగు నెలన్నరపాటు వున్నా సరే, శాకాహారమే తప్ప ఆమ్లెట్టు కూడా దక్కదు. నెలా, రెండు నెలలంటే ముక్కు మూసుకుని కాలక్షేపం చేస్తాం కానీ బదిలీ అయి వెళ్లి అక్కడ మూడునాలుగేళ్లు వుండాలంటే నాన్‌వెజ్ లేకుండా ఎలా? ఈ గొడవ వలన యితర రాష్ట్రాల వారికి యిళ్లు దొరకడం కష్టమయ్యేది. శాకాహారులు కాకపోతే యిళ్లు అద్దెకిచ్చేవారు కారు. గుజరాత్‌లో కులస్పృహ ఎక్కువ. కులాల వారీగా కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పరుచుకుని, కాలనీలు కట్టేసుకుని, వాటిల్లో ఫలానా వారికే అమ్మాలి, ఫలానావారికే అద్దెకివ్వాలి అని తీర్మానాలు చేసుకుని కచ్చితంగా అమలు చేసేస్తూంటారు. అందువలన మా ఫ్లాట్‌లోనే మేం వండుకుంటాం, అవశేషాలు కనబడనీయం అని ఇంటి ఓనర్ను ఒప్పించినా, సొసైటీవాళ్లు ఒప్పుకోరు. మాంసాహారికి అద్దె కివ్వడానికి వీల్లేదంతే అని పట్టుబడతారు.

మా ఫ్రెండు, కొలీగ్ సిద్దారెడ్డికి భావనగర్‌కి బదిలీ అయింది. అంతకుముందే అక్కడకు వెళ్లిన మా సీనియర్ ఒకాయనకు మంచి యిల్లు దొరకలేదు. ఆయన ఒడియా వైశ్యుడు. చేపలు, మాంసం తింటామనగానే యిల్లివ్వం అన్నారు. చివరకు ఊరికి దూరంగా క్రిస్టియన్ కాలనీలో దొరికింది. సిద్దారెడ్డి తనకు కూడా యిదే అవస్థా అని వాపోతూండగా, ఒక కర్ణాటక మిత్రుడు ఏం ఫర్వాలేదని హామీ యిచ్చి, తనకు తెలిసున్న ఓనరు దగ్గరకి వెళ్లి ‘సిద్దారెడ్డి బ్రాహ్మడు, మీ దగ్గర బ్రాహ్మలకు భట్, దేశాయ్ అని వున్నట్లే, ఆంధ్రాలో బ్రాహ్మలకు పేరు చివర రెడ్డి అని వుంటుంది.’ అని చెప్పాడు. ఆయన సరేనని తన పై వాటా అద్దెకిచ్చేశాడు. సిద్దారెడ్డి కుటుంబం కొన్నాళ్లు నోరు కట్టుకుని బతికారు కానీ, తర్వాత ఉండబట్టలేక గుడ్లు తెచ్చి ఆమ్లెట్టు వేసుకోసాగారు. ఇంటాయనకు ఆ వాసన సుపరిచితం కాబట్టి, మేడెక్కి వచ్చి యిదేమిటన్నాడు, వేస్తే వేశారు కానీ మా ఆవిడకు చెప్పకుండా నాకూ పెట్టండన్నాడు! అక్కడున్నంతకాలం ఆ ఏర్పాటు సాగింది.

ఓ సారి మా సిద్దారెడ్డి అడిగాడు – మేం వచ్చేముందు ఆమ్లెట్లు ఎక్కడ తినేవాడివి అని. ఎవరూ చూడకుండా ఏ సందులోనే బండి మీద తినేవాణ్ని అన్నాడతను. అలాటి జీవులకు నోట్లో కరక్కాయ కొట్టాడు భూపేంద్ర యిప్పుడు. అలాటివాళ్లు తక్కువనుకోకండి, నేను చాలామంది గుజరాతీలను చూశాను, రాష్ట్ర సరిహద్దుల్లో వుండగా నాన్‌వెజ్, వైన్ తీసుకోరు. దాటితే తీసుకుంటారు. ఇదేమి నియమమో నాకు తెలిసేది కాదు. వీధి బండిమీద తినకపోతే ఏం? చక్కగా పెద్ద హోటల్‌కి వెళ్లి తినవచ్చు కదా అనకండి. గుజరాత్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. 1980లో ఓ గెస్ట్‌హౌస్‌లో బస చేసి, పనిమనిషికి అర్ధరూపాయి యిచ్చి టీ తాగమంటే, ‘కప్పు రూపాయిన్నర, దీనితో ఏం తాగమంటావ్’ అని అడిగింది. అప్పట్లో హైదరాబాదులో కప్పు టీ అర్ధరూపాయే! మామూలు హోటళ్లలో కంటె బండి మీద తిళ్లు తినడమే గుజరాతీల కలవాటు. మన దగ్గరా విస్తారంగా తింటారు కదా! పైగా యితర రాష్ట్రాల నుంచి గుజరాత్‌కు కూలిపని మీద వచ్చే వాళ్లు లక్షల్లో వుంటారు. వాళ్లకి వచ్చే ఆదాయానికి వీధి బళ్లే గతి.

నవంబరు నుంచి భావనగర్, రాజ్‌కోట్, జునాగఢ్ (ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువ), వడోదరా, అహ్మదాబాద్‌ల కార్పోరేషన్లు మాంసాహారం అమ్మే బళ్లను నిషేధించసాగాయి. గుళ్లకు, బళ్లకు 100 మీటర్ల వ్యాసార్థంలో ఉండకూడదన్నాయి. కారణం ఏమిటంటే ‘అవి చూస్తే శాకాహారుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి’ అని చెప్పారు. ఈ మనోభావాలనేవి ఏమిటో నాకూ స్పష్టంగా తెలియదు కానీ, వాటిని ప్రతీవాడూ ఎడాపెడా వాడేసుకుంటున్నారు. ఎవరైనా కోర్టుకి వెళితే యివి అక్కడ నిలబడవనుకున్నారో ఏమో, వాటిల్లోంచి వచ్చే వాసన యువతను చెడగొడుతోందన్నారు. ఆ తర్వాత ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది కాబట్టి అన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేది మాంసాహారపు బళ్లు మాత్రమేనా? మాంసం తీసేసి, శాకాహారం పెడితే ట్రాఫిక్‌కు అడ్డు రాదా? రోడ్డు మీద ఎందరు చిల్లర వ్యాపారులంటారు? వాళ్లందరినీ తరిమివేస్తున్నారా?

ఈ కారణాలను ఎవరూ నమ్మలేదు. సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు. దాంతో ఈ బళ్లు శుచీ, శుభ్రతా పాటించటం లేదు కాబట్టి తీసేశాం అని చెప్పుకున్నారు. అక్కడికి శాకాహార బళ్లు మాత్రం ఊహూ శుచి పాటించేసేట్లు! మీరు గమనించారో లేదో గుజరాతీలు యిళ్లు శుభ్రంగా వుంచుకుంటారు కానీ యింటిబయట చెత్తపోయడంలో ఘనులు. అహ్మదాబాద్‌లో కూడా ఎపార్టుమెంటు కాంప్లెక్సుల మేన్‌టెనెన్స్ బాగుండదు. వీధి పక్కన తిండి తినేటప్పుడు రుచే తప్ప శుచి పట్టించుకోరు. గుజరాత్‌లోనే కాదు, ముంబయిలో కూడా గుజరాతీలు అధికంగా వున్న పేటల్లో వీధులన్నీ యీ బళ్లతో నిండిపోయి, మహారాష్ట్రుల చీదరింపుకి గురి అవుతూ వుంటాయి.

అందువలన శుభ్రత పేరు చెప్పి వీధిబళ్లు తీసేశారంటే ఫక్కున నవ్వు వస్తోంది. దీనివలన పేదసాదలు చాలా యిబ్బంది పడతారు. కేవలం కూరగాయల మీద బతకాలంటే చాలా ఖర్చవుతుంది. చేపల వంటి చౌక ప్రత్యామ్నాయం అందుబాటులో వుండాలి. గుజరాత్‌లో శాకాహారులు అత్యధికంగా వుంటారు కాబట్టి కూరగాయల ధర ప్రియం. వంకాయలు మన దగ్గర కిలో రూపాయిన్నర అమ్మే రోజుల్లో అక్కడ ఎనిమిది రూపాయలుండేది. ఈ దాడుల వలన పేదవాళ్లకు, వలస కార్మికులకు కష్టం కలిగి, ఫిర్యాదు చేయసాగారు. 17 లక్షల మంది సభ్యత్వం కల లారీ గల్లా లడత్ సమితి అనే ఫుడ్ వెండార్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించింది. 2021 జనవరిలోనే అహ్మదాబాద్‌లో పార్టీ ఆఫీసు తెరిచిన మజ్లిస్ వారు నిరసన తెలపడానికి మేయర్ కిరీట్ పర్మార్‌కు గుడ్లు బహూకరించారు. లిఖితపూర్వకమైన ఆదేశం ఎలా యిచ్చారో చూపించండి అని అడిగితే మేయరు చూపించలేక పోయారు. అంతా నోటిమాట మీదనే నడుస్తోందిట.

ఈ గొడవ బయటకు రావడంతో ముఖ్యమంత్రి తెలివిగా ‘ప్రజలు ఏం తింటున్నారనేది మేం పట్టించుకోము. అనారోగ్యకరమైన ఆహారం అమ్మితేనూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తేనూ మాత్రమే చర్యలు తీసుకుంటాం. అయినా కొన్ని కార్పోరేషన్లు విడివిడిగా తీసుకున్న చర్యలివి. రాష్ట్రప్రభుత్వానికి దీనిపై ఏ అభిప్రాయమూ లేదు.’ అన్నాడు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్ ‘ఈ బళ్ల వాళ్లమీద చర్యేలేవీ తీసుకోవద్దని మేయర్లకు చెప్పాను.’ అని ప్రకటించాడు. ఈ బళ్లు తాము అమ్మే ఐటమ్స్‌పై గుడ్డ వేసి కప్పేస్తే సరిపోతుందని కొన్ని కార్పోరేషన్లు సడలింపు యిచ్చాయి. గుడ్లు కూడా కనబడకూడదట. వాటినీ మూసేయాలట. గుజరాతీలు వాటిని చూసినా మనసు చలించి, భ్రష్టులై పోతారా? రిజర్వ్ బ్యాంకు డేటా ప్రకారం గుజరాత్‌లో మాంసం ఉత్పత్తి 2004-05లో 13 వేల టన్నులుంటే అది 2018-19 నాటికి 33 వేలైంది. దానిలో కొంత ఎగుమతి అయినా, చాలా భాగం స్థానికంగా ఖర్చవుతోంది.

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు 2014లో చేపట్టిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బేస్‌లైన్ సర్వే ప్రకారం రాజస్థాన్, హరియాణా, పంజాబ్‌లలో కంటె గుజరాత్‌లో ఎక్కువమంది మాంసాహారులున్నారు. కానీ తమ రాజకీయావసరాల కోసం గుజరాత్‌ను ఒక ఋష్యాశ్రమంలా తీర్చిదిద్దుదామనే తాపత్రయంతో యిలాటి ఆదేశాలు జారీ చేస్తే అది దురుపయోగం అయ్యే ప్రమాదాలు చాలా వుంటాయి. ఇచ్చిన లంచం చాలకపోతే పోలీసు వాడు నీ బండి మీద అమ్మేది వెజ్ బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ అనవచ్చు. గోరక్షక దళాలు మేకలు తోలుకుని వెళ్లేవాళ్లపై కూడా దాడి చేయవచ్చు. ఇవన్నీ ఆధునిక జీవనవిధానానికి అలవాటు పడిన వారిని గుజరాత్‌కు దూరం చేయవచ్చు.

అహ్మదాబాద్‌లో అనేక సౌకర్యాలున్నా ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందలేదేం అని ఒక మిత్రుణ్ని అడిగితే ‘ఇక్కడ ప్రొహిబిషన్ పెద్ద అవరోధంగా తయారైంది. మద్యం దొరకని కాదు. ఇక్కడ దొరకని బ్రాండ్ లేదు. కానీ కాస్ట్‌లీ. శుక్రవారం సాయంత్రం అయ్యేసరికి పొరుగున ఉన్న మౌంట్ ఆబూ (మద్యనిషేధం లేని రాజస్థాన్‌లో వుంది)కి కార్లు బార్లు కడతాయి. శిల్పకళ చూసి తరిద్దామని కాదు, తాగి ఊగడానికే! దేశంలోని తక్కిన నగరాల్లో సందుకో బారు, రెస్టారెంటు వుండగా యిక్కడికి వచ్చి యీ అవస్థలు ఎవడు పడతాడు? అందుకే ఐటీవాళ్లు రావటం లేదు.’ అన్నాడు. రిలయన్స్ వారి యాడ్ సంస్థ ముద్రా కమ్యూనికేషన్స్ స్థాపించిన ఎజి కృష్ణమూర్తి గారు ఓ పుస్తకంలో రాశారు. అహ్మదాబాద్‌లో యాడ్ కంపెనీ పెడతాం, రమ్మనమని బొంబాయిలోని అనుభవజ్ఞులైన యాడ్ నిపుణులను అడిగితే రాము అన్నారట. మందు పార్టీలు చేసుకోవడానికి వీలుపడని ప్రదేశమది. మందు సంపాదించినా, పోలీసులు వస్తారేమోనని భయపడాలి అన్నారట.

ఇక యీయన కొత్తవాళ్లని రిక్రూట్ చేసుకుని, సొంతంగా డెవలప్ చేసుకున్నారు కానీ టైము పట్టింది. మా బ్యాంకు స్టాఫ్ కూడా పైన చెప్పిన లిక్కర్, వెజ్-నాన్ వెజ్ గొడవల వలన గుజరాత్ పోస్టింగు సాధ్యమైనంత వరకు తప్పించుకునేవాళ్లం. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం బయట తినే తిండిపై కూడా ఆంక్షలు పెట్టడం మొదలుపెడితే యువతరం అటువైపు వెళ్లడానికి జంకుతారు. గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి యిలాటి అంశాలపై కాకుండా సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

mbsprasad@gmail.com

Show comments