సినిమావాళ్లకు థియేటర్లు వద్దా?

సినిమాను థియేటర్లోనే చూడండి....ఇది అరిగిపోయిన స్లోగన్. సినిమా జనాలు అంతా స్టేజ్ ఎక్కి చెప్పేది ఇదే. కానీ వాళ్లు మాత్రం చూడరు. థియేటర్ విజిట్ అంటూ వెళ్లి రావడం తప్ప థియేటర్లలో సినిమా చూడరు. ప్రతి సినిమా సెలబ్రిటీ ఇంట్లో క్యూబ్ వుండనే వుంది.

గమ్మత్తేమిటంటే అక్కడ కూడా మొహమాటం వాడడమే. నిర్మాతకు తాము కానీ లేదా తమ మేనేజర్లు కానీ ఫోన్ చేసి, క్యూబ్ కీ అడిగి ఫ్రీగా చూడడమే తప్ప రూపాయి విదల్చరు. ప్రతి పెద్ద హీరో, డైరక్టర్ చేసే పని ఇదే. నిర్మాతలు సణుగుకుంటూనే, మొహమాటాలకు పోయి ఫ్రీగా కీ సమర్పించుకుంటారు. 

ఇటీవల పుష్ప సినిమా మీద అటు నార్త్, ఇటు సౌత్ సినిమా సెలబ్రిటీల నుంచి విపరీతంగా అప్లాజ్ లు సోషల్ మీడియాలో కురిసాయి. అయితే ఎప్పుడు? ఆ సినిమా అమెజాన్ ప్రయిమ్ లోకి వచ్చాక. అంటే ఓటిటి లోకి వచ్చేవరకు దాని జోలికి పోలేదన్నమాట.

ఆ మద్య రిపబ్లిక్ సినిమాది కూడా ఇదే తంతు. ఆన్ లైన్ లోకి వచ్చాక ప్రశంసలే ప్రశంసలు. లెటెస్ట్ గా మెగాస్టార్ కూడా శ్యామ్ సింగ రాయ్ మీద ప్రశంసలు కురిపించారు. ఎప్పుడు ? సినిమా ఆన్ లైన్ లోకి వచ్చాక. అన్ని సినిమాలు కాకపోయినా, మంచి సినిమాలు అనుకున్నపుడు, మంచి టాక్ వినిపిస్తున్నపుడు సెలబ్రిటీలు థియేటర్ కు వెళ్తే అదో ముచ్చట. 

అప్పుడు అది సినిమాకూ పనికి వస్తుంది. థియేటర్ కు పనికి వస్తుంది. అలా కాకుండా జనాలకు చెప్పడానికే నీతులు అన్నట్లు చెబుతూ వుంటే, జనం మాత్రం థియేటర్ కు ఎందుకు రావాలి? వాళ్లకు టీవీలు వున్నాయి, ఓటిటిలు వున్నాయి కదా? జనం సినిమా సెలబ్రిటీల ద్వంద వైఖరి కనిపెడితే సగం ఆట కట్టేస్తుంది. 

Show comments