ఎమ్బీయస్‍: సుబ్బిశెట్టి సుబ్బిరెడ్డి అయి వుంటే...?

ఆంధ్రప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించింది. ఆర్యవైశ్య సంఘం హర్షించింది. నాటక కళాకారులు విమర్శించారు. భావస్వేచ్ఛకు భంగకరం అని కొందరు బాధపడ్డారు. గమనించవలసినది యీ 100 ఏళ్ల నాటి నాటకాన్ని చదవకూడదని నిషేధించలేదు. ప్రదర్శనను మాత్రం నిషేధించారు. ఎందువలన? ప్రదర్శనలో అశ్లీలతను చొప్పిస్తూన్నందువలన! ఆ ముక్కవరకు చెప్పి వూరుకుంటే పోయేది. కానీ చాలాకాలంగా ఆర్యవైశ్య సంఘం డిమాండు చేస్తున్న కారణంగా అని న్యూస్ బయటకు రావడంతో అది అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. జిఓలో యీ డిమాండు గురించి ఏమీ లేదు. ప్రదర్శనలో అశ్లీలత గురించీ లేదు. ఎపి క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ సిఇఓ గారి 18.2.21 లేఖను మాత్రం ప్రస్తావించారు. ఆ లేఖలో ఏముందో నాకు తెలియదు.

నిషేధం తర్వాత హర్షించిన ఆర్యవైశ్య సంఘం .. యిన్నేళ్ల తర్వాతైనా మా డిమాండు మన్నించినందుకు ధన్యవాదాలు అన్నట్లు వార్తల్లో రాలేదు. అందువలన యీ డిమాండు ఎన్నాళ్ల నుంచి వుందో, వైశ్యులలో యీ సంఘం స్టాండింగు ఏమిటో తెలియదు. ఈ రోజుల్లో కంప్యూటర్‌లో ఐదు నిమిషాల్లో ఒక సంఘం పేర లెటర్‌హెడ్ సృష్టించి, తోచినది రాసేసి మీడియాకు పంపేయవచ్చు. టాపిక్ యింటరెస్టింగ్‌గా వుంటే చాలు, ‘మీ సంఘం రిజిస్టర్డా? సభ్యులెంతమంది? ఈ విషయంగా మీరు సభ పెట్టుకుని తీర్మానం చేశారా? దాని కాపీ జతపరచగలరా?’ అని ఎవరూ అడగరు. ‘ఈ మధ్య ఒక ప్రముఖ నటుడు తన ఉపన్యాసంలో ‘పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు..’ అన్నారు. పిల్లులకు సెలూన్‌కి వెళ్లే తాహతు లేదని సూచించే యీ స్టేటుమెంటు పిల్లి జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగించడాన్ని మా అఖిలాంధ్ర బ్రహ్మాండకోటి మార్జాలప్రేమికుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది’ అని ఒకటి పంపితే చాలు, సాయంత్రం టివి9లో గంట సేపు జరిగే చర్చలో పాల్గొనమని పిలుపు వస్తుంది.

ఫిర్యాదు చేసినా, చేయకపోయినా హర్షించిన యీ సంఘం యిలాటిది కాదనుకుని ఆలోచిస్తే, వారి అభ్యంతరం దేనికట? సుబ్బిశెట్టి అనే పాత్ర వేశ్యాలోలత్వం చూపించినందుకా? మరి హీరో ఐన బిల్వమంగళుడు బ్రాహ్మణుడు. చింతామణి కోసం సర్వస్వం పోగొట్టుకున్న భ్రష్టుడయ్యాడు. అతని మిత్రుడు భవానీ శంకరం కూడా ఉన్నత జాతి వాడే అని తోస్తుంది. అందువలన వైశ్యుల్లో మాత్రమే యీ జాడ్యం వుందని నాటకరచయిత అనలేదు. అప్పట్లో వేశ్యల వద్దకు వెళ్లడం సహజం, ఎవరినైనా ఉంచుకోవడం అత్యంత సహజమైన విషయాలు. కొన్ని ఊళ్లలో సానివాడలుండేవి. భోగం వారు నివసించే వీధులుండేవి. భోగం వారు ఆటపాటల్లోనే కాదు, చదువుసంధ్యల్లో కూడా ముందుండేవారు. పెళ్లికి భోగంమేళం పెట్టేవారు. నేను స్కూల్లో చదివే రోజుల్లో కూడా కార్తీకమాస వనభోజనాలు అంటూ ఊరవతల తోటలో భోజనాలతో పాటు భోగం మేళాలూ పెట్టేవారు.

సంఘసంస్కర్తల పుణ్యమాని యాంటీ-నాచ్ ఉద్యమం ఉధృతంగా సాగింది. చివరకు చట్టం ద్వారా దేవదాసీ వ్యవస్థను రద్దు చేశారు. భోగం వారు కులవృత్తితో పాటు, తమ కులం పేరును వాడడం మానేశారు. కొందరు కళావంతులమని చెప్పుకునేవారు. తర్వాత అదీ మానేశారు. నాయుళ్లమని చెప్పుకున్న కుటుంబాలు కూడా నాకు తెలుసు. ఇప్పుడు వేశ్యావృత్తిని ఫలానా కులానికి అన్వయించి చెప్పటానికి లేదు. దిక్కులేనివారు ఆ వృత్తిలోకి వెళుతున్నారు. వారికి గౌరవమూ లేదు, సంపదా లేదు. అప్పట్లో భోగంవారు విపరీతంగా ఆర్జించి, దానధర్మాలు, అనేక సత్కార్యాలు చేయించిన సందర్భాలు చాలా వున్నాయి. ఉంపుడుకత్తెల వ్యవస్థను మార్చడానికి జరిగిన ఆ ఉద్యమంలో భాగంగానే నూరేళ్ల క్రితం కాళ్లకూరి నారాయణరావు గారు ఆ నాటకం రాశారు. ఆయన విద్యాధికుడు. సంఘసంస్కర్త. ఈ నిషేధం కారణంగా ఆయన బూతు నాటకాల రచయిత అనుకుంటే మహాపాపం. దీనితో పాటు తాగుడుకి వ్యతిరేకంగా ‘‘మధుసేవ’’, వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా ‘‘వరవిక్రయం’’ నాటకాలు కూడా రాశారు.

ఏ నాటకమైనా సరే, సమాజాన్ని ప్రతిబింబించాలంటే వివిధ కులాల నుంచి పాత్రలను ఎంచుకోవాలి. వరవిక్రయంలో అమిత లోభి, విలన్ ఐన సింగరాజు లింగరాజు, లౌక్యుడైన పెళ్లిళ్ల పేరయ్య వీళ్లందరూ బ్రాహ్మణులే. వీటి గురించి ఏ అభ్యంతరాలూ రాలేదు. నాటకాలుగా ఆడారు, రేడియో నాటకాలుగా వినిపించారు, సినిమాలుగా తీశారు. చింతామణి సంగతీ అంతే. భానుమతి, రామారావు, రంగారావులతో తీశారు. రేలంగి సుబ్బిశెట్టి పాత్ర వేశారు. కట్నసమస్య అయితే యిప్పటికీ వుంది, కానీ వేశ్యావ్యవస్థ, ఉంచుకోవడాలూ లేదు. కానీ స్త్రీలోలత్వం వుంది కాబట్టి, అది మంచిది కాదని సందేశాన్ని హాస్యపరంగా యిచ్చే నాటకంగా దాన్ని చూశారు. నేటి సంభాషణా రచయిత బుర్రా సాయిమాధవ్ తండ్రి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రిగారు చింతామణి పాత్రలో రాణించారు. చెప్పవచ్చేదేమిటంటే దీనిలో హాస్యానికి నవ్వుకున్నారు తప్ప కులపరంగా ఫీలవలేదు. దానిలో పద్యాలు చాలామందికి కంఠోపాఠం కూడా. వేలాది ప్రదర్శనలిచ్చి వుంటారు.

గమనించవలసిన దేమిటంటే, లెక్కలు తీస్తే యీ నాటకాన్ని స్పాన్సర్ చేసినవాళ్లలో వైశ్యులే ఎక్కువమంది వుంటారు. సామెతల్లో, కళారూపాల్లో వైశ్యులను లోభులుగా చూపిస్తారు కానీ నిజజీవితంలో దాతల్లో వాళ్లే ఎక్కువ. గుళ్లు, సత్రాలు కట్టించడమే కాదు, నృత్యాలకు, నాటకాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు విరాళాలివ్వడంలో ముందుంటారు. ఈ నవరాత్రుల్లో చింతామణి నాటకం వేస్తామంటే మేం చందా యివ్వమయ్యా అంటే ఏ నిర్వాహకుడూ వేసేవాడే కాదు. పోనుపోను నాటకాలకు ఆదరణ తగ్గింది. జనాలు రావడం మానేశారు. అందువలన యీ పేరుతో నాటకం వేసి, అశ్లీలాన్ని మాటల్లో, చేతల్లో చూపించసాగారు. విటుడు సుబ్బిశెట్టి, వేశ్యమాత శ్రీహరి పాత్రల మధ్య స్క్రిప్టులో లేని సంభాషణలు అప్పటికప్పుడు కల్పించి, చొప్పించసాగారు. దీనికి తోడు సుబ్బిశెట్టి ఆకారాన్ని, వేషాన్ని పరమ వికారంగా మార్చి అధమస్థాయి హాస్యాన్ని పండించడానికి చూశారు.

ఇది కొంతమంది వైశ్యకులస్తులను యిబ్బంది పెట్టి వుండవచ్చు. నాటకాల్లో, సినిమాల్లో అనేక కులాల వారిని కించపరిచే విధంగా పాత్రలు రూపొందిస్తున్నారు. అందరూ సహిస్తున్నారు. కానీ సుబ్బిశెట్టి పాత్ర అసహ్యకరమైన బూతుకి మారుపేరుగా మారడం వీళ్లు సహించలేక పోయి వుండవచ్చు. అలాటప్పుడు స్క్రిప్టులో లేకుండా చొప్పించిన అశ్లీలకరమైన సంభాషణలను, హావభావాలను సెల్‌ఫోన్‌తో రికార్డు చేసి కోర్టులో కేసు పెట్టి వుంటే నిర్వాహకులను శిక్షించమని కోరి వుంటే సవ్యంగా వుండేది. కానీ అంత పని చేసే ఓపిక ఎవరికీ లేదు. అన్నిటికంటె సులభమైన పని ఏమిటంటే ప్రభుత్వానికి ఓ పిటిషన్ పెట్టడం. మీ స్టాఫ్‌ను పంపించి, గమనించమనండి అని అడిగి వుండవచ్చు. కానీ కొండనాలుకకి మందు వేయమని అడగడం కంటె నాలుకే పీకేయండి అని అడిగారు.

ప్రభుత్వానికి కూడా అది సులభమైన పని అనిపించింది. ఎందుకంటే, ప్రదర్శన జరిగిన చోటకల్లా ప్రభుత్వ సిబ్బంది వెళ్లి, స్క్రిప్టు దగ్గర పెట్టుకుని ఎక్కడ దారి తప్పుతున్నారు అని గమనించి, కేసులు పెట్టడం అసాధ్యమైన పని. సెన్సారు ఆమోదించని సీన్లను సినిమాల్లో కలిపేస్తూంటే పట్టుకోవడం కూడా సాధ్యం కావటం లేదు. అందువలన బ్యాన్ చేసేస్తే పోయె కదా అనుకున్నారు. కానీ పొలిటికల్ విల్ వుండాలి కదా. ప్రభుత్వం దగ్గర గోళ్లు గిల్లుకుంటూ కూర్చునే సవాలక్షమంది సలహాదారులున్నారు కదా, వారిలో ఒకరు వచ్చి ‘ఈ మధ్య ఓ యిద్దరు గుప్తాలను మన కార్యకర్తలు చావగొట్టగానే ఎబిఎన్ వాళ్లు వైసిపి కమ్మలనే కాదు, వైశ్యులను కూడా బతకనీయటం లేదు అని పెద్ద అల్లరి చేసేసింది. వైశ్యులను బుజ్జగించడానికి యిది ఏ మాత్రం ఖర్చు లేని పని. చేసేద్దాం’ అని చెప్పి వుంటారు. ‘అయితే చేసేయ్’ అని వుంటారు ఏలినవారు.

ఈ ధోరణి కొనసాగితే రేపు మరో సలహాదారు వచ్చి ‘గురజాడ వారి కన్యాశుల్కంలో సౌజన్యారావు పంతులు తప్ప తక్కిన అందరూ బ్రాహ్మలు దురాశాపరులు, మోసగాళ్లే నండి. పైగా ‘బ్రాహ్మల్లో కూడా మహానుభావులు లేకపోలేదండి’ అనే క్లాసిక్ వెటకారం కూడా వుందండి. ఈ మధ్య బ్రాహ్మలు మనమంటే పళ్లు నూరుకుంటున్నారు కాబట్టి, దాన్నీ బ్యాన్ చేసేద్దామండి.’ అని చెప్పారనుకోండి. దానికీ రైఠో అనేస్తారు. ఇలా పాత క్లాసిక్స్ అన్నీ నిషేధానికి గురైనా ఆశ్చర్యపడనక్కరలేదు. చింతామణి నాటకాన్ని బ్యాన్ చేస్తే లబలబలాడేవాళ్లు, యిటీవలి పదేళ్లలో వాళ్లు ఏ నాటకానికైనా వెళ్లారా అని ఆలోచించుకోవాలి. నాటకరంగమే పూర్తిగా మూలపడింది. సినిమాలు అన్నిటినీ మింగేశాయి. ఇప్పుడు సినిమాలనూ హాల్స్‌లో చూసేవారు లేరు. ఇక నాటకశాలలే లేవు. ఏవో పరిషత్తు నాటక పోటీలు పెడితే అక్కడ వేస్తున్నారు. అప్పుడప్పుడు పద్యనాటకాలు వేస్తున్నారు.

ఈ చింతామణి వేస్తున్నారంటే పచ్చిగా చెప్పాలంటే దానిలోని బూతు వేల్యూకై వేస్తున్నారు. రికార్డింగు డాన్సులున్నాయి. తక్కిన సందర్భాల్లో ఫర్వాలేదు. కానీ జాతర్లలో, తిరనాళ్లలో అర్ధరాత్రి దాటాక నగ్నంగా నర్తించమని డాన్సర్లపై ఒత్తిడి వస్తోంది. ‘‘గమ్యం’’ సినిమాలో దానిపై ఓ సీను వుంది కూడా. ఆ ప్రదర్శనను అప్పటికప్పుడు ఆపించే అధికారం పోలీసులకు ఉంది. కానీ ఊపులో వున్న జనాలు తిరగబడతారు. కోళ్లపందాల విషయమూ అంతే. చట్టం వుంటుంది. కోర్టు ఆర్డర్లు వుంటాయి. అమలు కావు. వేలాదిమంది జూదర్లను అదుపు చేయాలంటే పోలీసు ఫోర్సు సరిపోతుందా? చింతామణి నాటకంలో బూతు డైలాగులు రాగానే సినిమాల్లో పెళ్లి సన్నివేశాల్లో లాగ ‘ఆపండి’ అని గుప్పెడు పోలీసులు అరిస్తే అక్కడున్న మూడు, నాలుగు వందలమంది జనం ఊరుకుంటారా? అందువలన మొత్తానికి నిషేధించేస్తే, ‘చింతామణి’ పేరు వినగానే పర్మిషన్ లేదయ్యా అనేయవచ్చు కదా అని ప్రభుత్వం ఆలోచన కావచ్చు.

మరి ఆ నాటకం ఆడుతూ వచ్చినవాళ్ల సంగతేమిటి? నా దగ్గరో ఐడియా వుంది. నాటకం పేరు చింతామణి అని తీసేసి బిల్వమంగళుడు అని పేరు పెట్టి, కథ అటూయిటూ మార్చి ఆడుకోవడమే! సుబ్బిశెట్టి అనే పేరు తీసేసి, సుబ్బిశాస్త్రి లేదా సుబ్బిరెడ్డి అని పెట్టుకుంటే సరి, ఏ గొడవా వుండదు. రెడ్డి అంటే కాస్త ఎఫెక్టివ్‌గా కూడా వుంటుంది. కావాలంటే ఆ పాత్ర చివర్లో చింతామణిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్లు కూడా మార్చవచ్చు. కామెడీ, విలనీ రెండూ పండుతాయి. ఆ పాత్రకు రాయలసీమ యాస కూడా పెడితే బంగారానికి తావి అద్దినట్లవుతుంది. గతంలో సినిమా విలన్లకు భుజంగం, భూషణం, నరహరి లాటి పేర్లుండేవి, కులాల తోకలుండేవి కావు. ఇటీవలి కాలంలో రెడ్డి తగిలిస్తున్నారు.

ఎందరు అగ్రహీరోల సినిమాల్లో విలన్లకు రెడ్డి పేరు పెట్టారో గణాంకాలతో ఒక రెడ్డిగారు మెసేజి పంపారు. చౌదరి పేరుతో ఒక్క విలనూ లేడని వాపోయారు కూడా. ఆ విషయంగా నేను రిసెర్చి చేయలేదు కాబట్టి నిజానిజాలు చెప్పలేను కానీ తెలుగు సినిమాకు సంబంధించి కొన్ని వ్యాకరణసూత్రా లున్నాయని మాత్రం తెలుసుకున్నాను. కత్తితో ఎవణ్ణో చంపి రక్తం ఒంటికి పూసుకుంటే తప్ప కామేచ్ఛ కలగని పాత్రధారి పేరు కడప రెడ్డెమ్మే అవుతుంది కానీ మరోటి కాదనీ, వేటూరి, సీతారామశాస్త్రి విడిగా ఎంత మహాకవులైనా వాళ్ల పేర్లు కలిపితే ఓ హాస్యపాత్ర అవుతుందని, దారిన కనబడే ఎవర్ని చూసినా మా ఆయనలా వున్నావనీ, నా మాట వినకపోతే మా ఆయన జి ‘పగులుద్ది’ అని ఓ బ్రాహ్మణ ముత్తయిదువే అంటుందనీ, దానికి కారణం ఆమెకు గల ఓసిడి అనే రోగమనీ.. కొన్ని తెలుసు. ఈ గణాంకాల సదరు రెడ్డిగారు రేపు నిర్మాతో, దర్శకుడో అయితే ఆ సూత్రాలకు లోబడే సినిమా తీస్తారనీ తెలుసు. ఈ సూత్రాలకు రెడ్లకు అభ్యంతరాలుండి వుంటే వాటికి పెట్టుబడులే పెట్టి వుండేవారు కారు.

ఇప్పుడంతా రెడ్డి రాజ్యమే అయిపోయిందని, అన్ని పదవులు, హోదాలు రెడ్లకే దక్కుతున్నాయని రగిలేవాళ్లందరూ యీ బిల్వమంగళ నాటకాన్ని ఆదరిస్తారని నా ఊహ. శ్రీహరి పాత్ర చేత సుబ్బిరెడ్డి కారెక్టరును ‘నువ్వేమీ చేతకానివాడివి, చొల్లు కార్చుకోవడం తప్ప మరేమీ రాదు’ వంటి డైలాగులు పెట్టించి కసి తీర్చుకోవచ్చు. చివర్లో కిడ్నాప్ ఫెయిలయి, డబ్బంతా ఊడ్చుకుపోయి పుణుకులు అమ్ముకున్నట్లు చూపిస్తే ప్రేక్షకులకు మరింత ఖుషీ. రెడ్డి రాజ్యాన్ని దెబ్బ కొట్టిన సంతోషం కలుగుతుంది. ఆర్యవైశ్య సంఘం వారిలా ఆర్యరెడ్ల సంఘం వారెవరూ అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వానికి పిటిషన్లు పెట్టరని ధీమాగా వుండవచ్చు. అలా పెట్టేవారైతే సినిమాల్లో రాయలసీమ రెడ్లను రక్తపిపాసులుగా చూపిస్తూన్నందుకు, రాజకీయ నాయకులు చీటికీమాటికీ ‘రాయలసీమ రౌడీ సంస్కృతి, ‘కడప రెడ్ల గూండాయిజం యిక్కడ చెల్లదు’ వంటి ప్రకటనలకు ఎప్పుడో అభ్యంతరం పెట్టి వుండేవారు, కేసులు పెట్టేవారు. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

Show comments