ఎమ్బీయస్‍: యుపి రాజకీయాల్లో వలసలు

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే యుపిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బుధవారం నాడు ఒక కాంగ్రెసు ఎమ్మెల్యే, ఒక ఎస్పీ ఎమ్మెల్యే బిజెపిలో చేరారు. ఇద్దరూ ఒబిసిలే. అంతకమంటె ముఖ్యంగా వార్తల్లోకి ఎక్కినది జనవరి 11 మంగళవారం నాడు బిజెపి మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, అతనితోపాటు నలుగురు ఎమ్మెల్యేలు, బుధవారం నాడు మరో మంత్రి దారాసింగ్ చౌహాన్, గురువారం నాడు ధరం సింగ్ సైనీ అనే మరో మంత్రి బిజెపిలోంచి బయటకు వచ్చేశారు. వీళ్లు ఎస్పీలో చేరుతున్నారు. వీళ్లు ఒబిసి నేతలే. ఇప్పటికి ముగ్గురు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు బిజెపి విడిచారు. స్వామిప్రసాద్ గతంలో బియస్పీలో వుండేవాడు. 2016లో దాన్ని వదిలిపెట్టి 2017లో బిజెపిలో చేరాడు. 20 నియోజకవర్గాల్లో పలుకుబడి వుందట. దారాసింగ్ బియస్పీ నుంచి 2017లో బిజెపిలో చేరాడు. ఈ ముగ్గురూ బయటకు వచ్చేస్తూ యథావిధిగా యోగి ప్రభుత్వంలో బిసిలకు, దళితులకు న్యాయం జరగలేదని, వాళ్ల గురించి తాము ఎంతో పోరాడినా ఉపయోగం లేకపోయిందని స్టేటుమెంట్లు యిచ్చారు. స్వామిప్రసాద్ కూతురు బిజెపి ఎంపీగా కొనసాగుతోంది.

కాంగ్రెసు పార్టీ నుంచి కొందరు జారుకుంటున్నారు. వారిలో ఒకతను ఆర్‌ఎల్‌డిలో చేరాడు. మరో అతను ఎస్పీలో చేరాడు. అప్నా దళ్ (సోనేలాల్) నుంచి యిద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎస్పీలో చేరవచ్చు. అన్ని పార్టీల నుంచి ఫలానావారు మారుతున్నారట అనే పుకార్లు షికారు చేస్తున్నాయి. టిక్కెట్టు దొరకే ఆశ లేనివాళ్లే వెళుతున్నారు అని పార్టీలు సమర్థించుకుంటున్నాయి. కొత్తగా వచ్చి చేరేవారితో ఎస్పీకి ఉత్సాహం పుడుతున్నా, ఆలస్యంగా రావడం చేత సర్దుబాటు చేయడం కష్టమౌతోంది. ఇప్పటికే ఆ స్థానాలను వేరేవాళ్లకు యిస్తామని ఒప్పుకున్నందున వీరిని ఎలా యిరికించాలో తెలియదు. నిన్నటిదాకా వైరివర్గాలుగా వున్న క్యాడర్ యిప్పుడు ఏ మేరకు కలుస్తారో చూడాలి. ఫిరాయింపుల కారణంగా బెంగాల్‌లో బిజెపి లాభపడలేదు సరికదా, యిబ్బంది పడింది.

కానీ అఖిలేశ్ ముందుగానే యివన్నీ ఏర్పాటు చేసుకుని, పథకం ప్రకారం రోజుకొకరి చేత ఫిరాయింప చేస్తూ వార్తల్లో వుంటున్నాడని, ఆ విధంగా బిజెపి మొరేల్ దెబ్బ తీస్తున్నాడనీ కూడా అంటున్నారు. బిజెపి భాగస్వాములు యిద్దరే కాబట్టి సీట్ల సర్దుబాటు త్వరగానే పూర్తయింది. అప్నాదళ్ (సోనేవాల్) 10-14 సీట్లు, నిషాద్ పార్టీ 13-17 సీట్లు పోటీ చేస్తూండగా తక్కినవన్నీ బిజెపి చేస్తుంది. కానీ కొత్త చేరికల కారణంగా ఎస్పీ సీట్ల సర్దుబాటు యిప్పట్లో పూర్తయ్యే జాడలు లేవు. చిన్నాచితకా పార్టీలను పోగేయడం వలన అఖిలేశ్‌కు పెద్దగా ఒనగూడిందని చెప్పలేం కానీ, బియస్పీ బరిలోంచి యించుమించు తప్పుకోవడంతో అదృష్టం కలిసి వస్తోందనే చెప్పాలి. కాంగ్రెసు ఎలాగూ ఆటలో అరటిపండే కాబట్టి, బిజెపితో యించుమించు ముఖాముఖీ పోరనే చెప్పాలి.

ఏ కారణం చేతనో కానీ మాయావతి ఎన్నికలలో పోటీ చేయడం లేదు. ప్రచారంలోనూ పాల్గొనడం లేదు. కానీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఆమె తరఫున సతీశ్ చంద్ర మిశ్రా ప్రకటనలు గుప్పిస్తున్నాడు. యోగి ప్రభుత్వం బ్రాహ్మణుల నుంచి దళితుల దాకా అందర్నీ నిర్లక్ష్యం చేసి యోగి కులమైన ఠాకూర్లను మాత్రమే ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నాడు. బియస్పీ ఓటర్లు బిజెపికి ఓటేసే పరిస్థితి లేదు. బరిలో సీరియస్‌గా వుండి వుంటే అది ఎస్పీ ఓటునే చీల్చి వుండేది. అది నిస్తేజం కావడంతో బిజెపిని ఓడిద్దామనుకున్న జాతవ్, ముస్లిము, బ్రాహ్మణ ఓటర్లు ఎస్పీనే ఎంచుకునే అవకాశం వుంది.  కానీ గతంలో ములాయం హయాంలో ఎస్పీ చేసిన గూండా రాజకీయాలు అఖిలేశ్‌కు యిబ్బందిగా మారాయి. అతను ముఖ్యమంత్రిగా చేసిన రోజుల్లో కూడా పాలనలో సగం కాలం అతని కుటుంబసభ్యులే పాలించారు. 2014 పార్లమెంటు ఎన్నికలలో ఓటమి తర్వాతే అతను మేల్కొన్నాడు. ఎస్పీ అంటే యాదవుల పాలనే అనే పేరు వస్తుందనే భయంతో ‘నయీ హవా హై, నయీ సపా (సమాజ్‌వాదీ పార్టీ) హై’ అనే నినాదాన్ని యిస్తున్నాడు.

మోదీ అంటే భయపడి ఛస్తున్న ప్రాంతీయ పార్టీలన్నీ బెంగాల్‌లో మమత విజయంతో ఉత్సాహం తెచ్చుకున్నాయి. బెంగాల్ గెలవడానికి బిజెపి చేసిన విశ్వప్రయత్నాన్ని మమత ఒంటిచేత్తో వమ్ము చేయడం వాళ్లని విస్మయపరచడంతో బాటు వారిలో విశ్వాసాన్ని కలిగించింది. అంతకుముందు బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో 31 ఏళ్ల తేజస్వి యాదవ్ బిజెపి, జెడియులకు చెమటలు పట్టించాడు. అతని విజయాన్ని నిలవరించడానికి ఆ రెండు పార్టీలు చాలా కష్టపడవలసి వచ్చింది. కాంగ్రెసు పుణ్యమాని తేజస్వి ఓడిపోయాడు. అది గమనించిన అఖిలేశ్ యీసారి కాంగ్రెసును దూరం పెట్టి మోదీని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. ఏవో చిన్న పార్టీలు అతని వెంట ఉన్నా, యిది యించుమించు ముఖాముఖీ పోరాటమే.

ఇప్పుడు దేశంలోని ప్రాంతీయ పార్టీలు అఖిలేశ్‌కు వెన్నుదన్నుగా నిలిచి మోదీ రథానికి అడ్డుపడదామని చూస్తున్నాయి. ఒకటి రెండు సీట్లలో తృణమూల్, ఎన్సీపీ పొత్తు పెట్టుకున్నాయి. ఆప్, డిఎంకె, తెరాస, శివసేనలు ప్రచారానికి వస్తారని ప్రచారం జరుగుతోంది. మోదీకి భయపడి రాకపోయినా నిధులు పంపవచ్చు. యుపిలో బిజెపి ఆధిక్యతను గణనీయంగా తగ్గించినా, అఖిలేశ్ కాలరెగరేయవచ్చు. మోదీ ప్రభకు అడ్డుకట్ట వేయడం మరీ దుస్సాధ్యం కాదని ప్రాంతీయ పార్టీలకు ధైర్యం రావచ్చు. వారికా ధైర్యం రాకుండా వుండాలంటే బిజెపి గతంలో కంటె ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే ముఖ్యమంత్రిగా యోగి ఏం చేశాడన్నదానిపై ఆధారపడుతుంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో, ముఖ్యంగా వలస కార్మికులు, ఆక్సిజన్ కొరత విషయాల్లో యుపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అందరికీ తెలిసినదే. ఇక తక్కిన విషయాల్లో దాని పెర్‌ఫామెన్స్ ఎలా వుందో ఒక ఐడియా రావడానికి ఇండియా టుడే డిసెంబరు 6 సంచికలో ‘బెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా’’ పేర వివిధ పెరామీటర్స్‌లో పెద్ద రాష్ట్రాల గమనం ఎలా వుందో చూసి యిచ్చిన ర్యాంకుల వివరాలు యిస్తున్నాను. ఇవి ఎంతవరకు కరెక్టో పత్రికవాళ్లకే తెలియాలి.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మొదటి స్థానం పంజాబ్‌దైతే, ఆఖరి స్థానం ఝార్‌ఖండ్‌దైతే యుపిది 19. (2020లో 15వ స్థానంలో, 2019లో 13వ స్థానంలో వుంది. అంటే దిగజారిందన్నమాట) వ్యవసాయంలో పంజాబ్‌ది 1వ, కేరళది 20వ స్థానాలైతే యుపిది 8 (2020లో 11, 2019లో 10, అంటే ఎగబాకిందన్నమాట) శుభ్రతలో పంజాబ్ 1, అసాం 20, యుపి 9 (10-9), విద్యారంగంలో హిమాచల్ ప్రదేశ్ 1, బిహార్ 20, యుపి 18 (19-19), శాంతిభద్రతలలో గుజరాత్ 1, అసాం 20, యుపి 4 (8-10), పరిపాలనలో రాజస్థాన్ 1, పంజాబ్ 20, యుపి 12 (16-16), ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్‌లో ఎపి1, కర్ణాటక 20, యుపి 19 (20-18), ఎంటర్‌ప్రైనార్‌షిప్‌లో హరియాణా 1, బిహార్ 20, యుపి 11 (12-14),

పాలన యిలా వుండగా అమిత్ షా వచ్చి యీసారి టార్గెట్ 300 ప్లస్ అని చెప్పి వెళ్లాడు. అమిత్ కారణంగానే యుపిలో బిజెపి 2014లో 42% ఓట్లతో 80లో 71 ఎంపీ సీట్లు సాధించిది. యుపి విజయమే అమిత్‌ను జాతీయాధ్యక్షుణ్ని చేసింది. యుపిలో కులాలు, ఉపకులాలు, వాటి బలాబలాలు అన్నీ అమిత్‌కు కంఠోపాఠం. ఒక్క ముస్లిముకు కూటా టిక్కెట్టివ్వకుండా 2017లో మళ్లీ విజయం సాధించాడు. అప్పుడు యోగి రంగంలో లేడు. 2019 పార్లమెంటు ఎన్నికలలో 50% ఓట్లు, 62 సీట్లు గెలుచుకుంది బిజెపి. ఇది యోగి సిఎం అయిన రెండేళ్ల తర్వాత వచ్చిన ఎన్నికలని మనం గుర్తు పెట్టుకోవాలి. అయితే అప్పుడు అభ్యర్థి మోదీ. జాతీయవాదం, సిఐఏ వగైరాలు కీలకాంశాలు. మరి యిప్పుడు అభ్యర్థి యోగి. అతను ప్రస్తుతం ఎమ్మెల్సీ. కానీ యీ ఎన్నికలలో అయోధ్య నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని పార్టీ ప్లాను. ఆ అవధ్ ప్రాంతంలో ఎస్పీకి బాగా పట్టుంది. కానీ అయోధ్యలో ఆలయనిర్మాణం సాగుతోంది కాబట్టి ఆ వూపుతో యోగి తను నెగ్గడమే కాక, అవధ్ మొత్తంలో బిజెపి అభ్యర్థుల గెలుపుకు ఉపయోగపడుతుందని పార్టీ ఆలోచిస్తోందట. అయోధ్య కుదరకపోతే మధుర నుంచి పోటీ చేయిద్దామన్న ఆలోచన కూడా వుందట.

అతని పరిపాలనపై యుపి ఓటరు ఏమనుకుంటున్నాడనేది ప్రధానాంశం అవుతుంది. అమిత్ ఎంత చాకచక్యం వుపయోగించినా యిదే ముఖ్యం. హిందూత్వ నినాదం ఎటూ వుంది. దీనికి తోడు అభివృద్ధి జరుగుతోందని చూపించడానికి అయోధ్య మందిరంలో చురుకుదనం, కాశీ ఆలయం కారిడార్ పూర్తి చేయడం, కొన్ని ప్రారంభోత్సవాలు జరిపారు. ఎక్కువగా శంకుస్థాపనలు జరిగాయి. డిసెంబరులో మోదీ ప్రయాగ్ రాజ్‌కు వచ్చి మహిళల స్వయంసహాయక బృందాల ఖాతాలకు రూ.1000 కోట్లు, లక్షమంది బాలికల ఖాతాలకు రూ.20 కోట్లు బదిలీ చేశారు.  రైతుల ఆగ్రహం ఒకటి ముఖ్యమైన అంశం. కానీ లఖింపూర్ ఘటన యాక్సిడెంటు కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అని సిట్ యిచ్చిన నివేదిక యిబ్బందికరంగా మారింది. నిందితుణ్ని వెనకేసుకుని వస్తున్న తండ్రి అజయ్ మిశ్రాను కేంద్ర కాబినెట్‌లోంచి తీయాలంటే బ్రాహ్మణ ఫ్యాక్టర్ అడ్డుపడుతోంది.

స్వామిప్రసాద్ 2014లో ఒక విద్వేషప్రసంగం చేసి కేసులో యిరుక్కుంటే అరెస్టు వారంటు జారీ కావడం, దానిపై అలహాబాదు హైకోర్టు 2016లో స్టే యివ్వడం జరిగాయి. తర్వాత జరిగిన వాదనల్లో అతను కోర్టుకి హాజరు కాకపోవడంతో సుల్తాన్‌పూర్‌లోని కోర్టు జనవరి 12న బుధవారం హాజరు కావాలంటూ ఈ నెల 6న ఆదేశించింది. అతను వెళ్లకపోవడంతో అరెస్టు వారంటును పునరుద్ధరించింది. మరి యోగి 80-20 ప్రసంగం విద్వేషపూరిత ప్రసంగం కింద వస్తుందో రాదో ఎవరైనా కేసు వేస్తే తప్ప తెలియదు. యుపి అసెంబ్లీ పోరు 80-20 పోరాటంగా ఆయన వర్ణించాడు. రాష్ట్రంలో 80% మంది ఉత్తమ పరిపాలన, అభివృద్ధికి సంపూర్ణ మద్దతు యిచ్చే 80% బిజెపితో వుంటారని, రైతు విరోధులు, అభివృద్ధినిరోధకులు, గూండాలు, మాఫియాతో వుండేవారు ఐన 20% మంది ప్రతిపక్షాలతో వుంటారని వివరించాడు కూడా.

యుపి జనాభాలో 20% మంది ముస్లిములని మనం గుర్తు తెచ్చుకుంటే యోగి ఎవరి గురించి యీ మాటలు అంటున్నాడో సులభంగా అర్థమవుతుంది. నిజానికి బిజెపి 80% మందికి ప్రాతినిథ్యం వహిస్తుందనడానికి లేదు. 2017లో 312 సీట్లు గెలుచుకున్నప్పుడు కూడా దానికి 40% ఓట్లే వచ్చాయి. 2012లో అయితే బొత్తిగా 15%. 47 సీట్లు. 80% మంది అభివృద్ధికాముకులని యోగి ఒప్పుకుంటే దానిలో సగం మందే బిజెపిని సమర్థిస్తున్నారన్న మాట. ఇతర రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడల్లా యోగి తన ముస్లిము వ్యతిరేకతను బాహాటంగా చాటుకుంటున్నాడు. అలాటిది సొంత రాష్ట్రంలో గర్వంగా చెప్పుకోడా? ‘గతంలో అబ్బాజాన్ గాళ్లకే రేషన్ కార్డు దొరికేది. ఇప్పుడు అందరికీ యిస్తున్నాం’ అని చెప్పుకున్నాడు. ‘ఈ రాష్ట్రంలో తాలిబాన్‌లను అభిమానించే సిగ్గులేని జనం ఉన్నారు’ అన్నాడు. యోగి పాలనలో శాంతిభద్రతల గురించి యుపి గురించి తర్వాత రాసే వ్యాసంలో ప్రస్తావిస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

mbsprasad@gmail.com

Show comments