ఎమ్బీయస్‍: సత్యజిత్ రాయ్ ‘ప్రతిద్వంద్వి’ నేపథ్యం

సత్యజిత్ రాయ్ శతజయంతి సందర్భంగా రాద్దామనుకున్న మూడు ఆర్టికల్స్‌లో యిది మూడవది. ‘‘చారులత’’, ‘‘నాయక్’’ల గురించి యిప్పటికే రాశాను. ఆయన చాలా రకాల సినిమాలు తీసినా దరిద్రం, పేదరికం, నిరుద్యోగం ఆయన ట్రేడ్‌మార్క్ అనుకుంటారు కాబట్టి ఆ జానర్‌లో ‘‘ప్రతిద్వంద్వి’’ (1970) సినిమాను పరిచయం చేస్తాను. ‘‘శత్రంజ్ కే ఖిలాడీ’’ గురించి 2017 మూడో క్వార్టర్‌లో రాశాను. కావాలంటే నా బ్లాగ్‌లో చదవవచ్చు. ‘‘ప్రతిద్వంద్వి’’ సినిమాతో నా తరం వాళ్లు బాగా ఐడెంటిఫై అవుతారు. కథ కలకత్తా నేపథ్యంలో జరిగి వుండవచ్చు. కానీ అప్పట్లో దేశమంతా యించుమించు అదే పరిస్థితి. నిరుద్యోగం, దరిద్రం కారణంగా మారుతున్న సామాజిక విలువలను ఏ మేరకు గౌరవించాలో తెలియని పరిస్థితి. భవిష్యత్తు గురించి భయం, వ్యవస్థపై తిరుగుబాటు చేయాలన్న కోరిక, కానీ జంకు, కాస్సేపటికే తెగింపు, అంతలోనే చుట్టూ వున్న పరిస్థితులు వెనక్కి లాగడం.. యీ సందిగ్ధ పరిస్థితికి యీ సినిమా అద్దం పట్టింది. సినిమా చిన్నది. కథా పెద్దగా లేదు.

ప్రతిద్వంద్వి సినిమాకు మూలం ఆ పేరుతో సునీల్ గంగోపాధ్యాయ్ (1934-2012) రాసిన నవల. సునీల్ ప్రఖ్యాత బెంగాలీ కవి, నవలా రచయిత, అతను రాసిన ‘‘సే సమయ్’’ (ఆ రోజులు) నవలకు 1985లో సాహిత్య ఎకాడమీ ఎవార్డు వచ్చింది. అతని రచనలు యువతరాన్ని ఓ వూపు వూపాయంటే అతిశయోక్తి కాదు. జేమ్స్ జాయిస్ తన 1920 నాటి ‘‘యులెసిస్’’ నవలలో ఓ సామాన్యుడి జీవితంలో ఒక రోజులో జరిగిన ఘట్టాలను చైతన్య స్రవంతి తరహాలో వర్ణిస్తూ పెద్ద నవల రాశాడు. ఇది కూడా అలాటిదే. 25 ఏళ్ల నిరుద్యోగి జీవితంలో నాలుగైదు రోజుల్లో జరిగిన అనేక అప్రధాన ఘట్టాలను విపులంగా చూపిస్తుంది. దీని తర్వాత అనేక సినిమాలు యీ తరహాలో వచ్చి రానురాను బోరు కొట్టించాయి కానీ యిది మొదటిది కాబట్టి నావల్టీ కనబడింది.

అప్పటి కాలంలోకి వెళ్లి ఆ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటే తప్ప సినిమాను అర్థం చేసుకోలేం. అందుకని వాటి గురించి వివరిస్తాను. అప్పట్లో ఉద్యోగాలు దొరకడం గగనంగా వుండేది. అప్పుడే కాదు, అంతకుముందూ అంతేట. మా నాన్నగారి ఫ్రెండు ఒకాయన 1905 ప్రాంతంలో పుట్టారు. బిఏ ఫిజిక్స్ చదివారు. చాలా తెలివైనవాడు. ఇంగ్లీషు, తెలుగు చాలా బాగా రాయగలడు, మాట్లాడగలడు. అయినా ఉద్యోగం లేదు. పొలం మీద నుంచి వచ్చే అయివేజుతో కాలక్షేపం చేసేవాడు. ‘మీ కాలంలో డిగ్రీ చదివినవాళ్లు అరుదు కదా, మీకు ఉద్యోగం ఎందుకు రాలేదు?’ అని అడిగాను. ‘ఏ కాలంలోనైనా డిమాండు కంటె సప్లయి ఎక్కువుంటోంది. రెండో ప్రపంచయుద్ధం టైములో ఆగ్జిలరీ సర్వీసెస్‌లో కొంతకాలం తాత్కాలికంగా ఉద్యోగం దొరికిందంతే. యుద్ధం ముగిసిపోగానే తీసేశారు.’ అన్నాడాయన.

మేం కాలేజీలో చదివే రోజుల్లోనూ, బయటకు వచ్చాకా అంతే. వాంటెడ్ కాలమ్స్ చూడడాలూ, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్‌లో పేరు నమోదు చేసి, ఐదేళ్లయినా పిలుపు రాకపోవడాలూ, ఉద్యోగం కోసం అబద్ధాలు చెప్పడాలూ, సిఫార్సులు... ఇలా ఎన్నో తిప్పలు. ఈ మధ్య ఓ పాఠకుడు రాశారు – ‘1950-80 సినిమాలన్నిటిలో హీరో యీసురోమని ఏడుస్తూంటాడు’ అని. నిజమే, ఆ కాలంలో వాస్తవిక సినిమాలు తీసేవారు కాబట్టి ఆ పరిస్థితులు చూపిస్తూ, నిజాయితీగా బతుకుతూ, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోండి అని బోధిస్తూ తీసేవారు. ‘‘ఆకలిరాజ్యం’’ (1980) అలాటి సినిమాయే. తర్వాతి రోజుల్లో అడ్డదారుల్లో హీరో పైకి వచ్చి, చివర్లో పశ్చాత్తాప పడినట్లు చూపించేవారు. తర్వాత కాలంలో అదీ మానేశారు. సినిమా థీమ్‌లు మారిపోయాయి. ఇప్పుడూ నిరుద్యోగం వుంది, చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగాలు దొరకటం లేదు, దొరికినవి హఠాత్తుగా పోతున్నాయి, బాధలున్నాయి, రోగాలున్నాయి, మురికివాడలు పెరుగుతున్నాయి. కానీ వాటి గురించి సినిమాలు తీయడం మానేసి కేవలం వినోదమే లక్ష్యంగా తీస్తున్నారు. అండర్‌వ(ర)ల్డ్, క్రైమ్ చూపించినా దానిలో కష్టనష్టాలను చూపించడం లేదు. గ్లామరైజ్ చేస్తున్నారు.

1970ల నాటి పరిస్థితికి, యిప్పటికి అనేక మార్పులు వచ్చాయి. దానికి కారణం 1991 నాటి పివి సంస్కరణలు అనుకోవడం పొరపాటు. 1970లలో ప్రారంభమైన గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్ వగైరాలు దేశంలో మార్పులు తెచ్చాయి. బ్యాంకుల జాతీయకరణ కారణంగా సామాన్యులకు డబ్బు అందుబాటులోకి వచ్చింది. కుటీర పరిశ్రమలకు, స్మాల్ స్కేల్ సెక్టార్‌కు ఋణాలిచ్చి ప్రోత్సహించడంతో ఉపాధి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. రాజీవ్ గాంధీ వచ్చాక లైసెన్సులు తీసేయడంతో స్థానిక వ్యాపారాల మాట ఎలా వున్నా, దిగుమతులు పెరిగాయి. కన్స్యూమరిజం పెరిగింది. గ్లోబలైజేషన్ ఫలాల కోసం పివి సంస్కరణలు ప్రారంభించాక, ట్రేడింగు పెరిగింది, సేవారంగం పెరిగింది కానీ ఉత్పత్తి రంగం దెబ్బ తినడం ప్రారంభమైంది. ఇప్పుడు సాంతం పోయింది. ఇతర దేశాల్లోకి తాము చొచ్చుకుపోవడానికి గ్లోబలైజేషన్ ప్రారంభించిన పాశ్చాత్యదేశాలు యిప్పుడు నాలిక కరుచుకుని పరిమితులు విధించాలని చూస్తున్నాయి. గ్లోబలైజేషన్ ఫలితాలను పూర్తిగా అందుకున్న దేశం చైనా. అది యిప్పుడు ప్రపంచానికే కార్ఖానా అయిపోయింది. ఇండియా కొంత పొందింది, చాలా పోగొట్టుకుంది.

ఈ సినిమాలో దానిలో హీరో సిద్ధార్థ బియస్సీ చదివాక మెడిసిన్ చదవాలని కాలేజీలో చేరాడు. కానీ తండ్రి అర్ధాంతరంగా చనిపోవడంతో రెండేళ్ల చదువు మానేసి, ఉద్యోగాల వేటలో పడాల్సి వచ్చింది. ఉద్యోగాలు దొరకటం లేదు. అతని తమ్ముడు చాలా తెలివైన విద్యార్థే కానీ, నక్సలైట్లవైపు మొగ్గి, చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడు. హింసాత్మక ఘటనల్లో పాలుపంచుకుంటున్నాడు. హీరోకి ఆ తెగింపు లేదు, కాలేజీ రోజుల్లో స్డూడెంట్ యూనియన్ అంటూ తిరిగినా, అతనికి రాజకీయాలపై ఆసక్తీ లేదు. ఇక అతని చెల్లెలికి ఆదర్శాల, నీతినియమాల గోల లేదు. బతకనేర్చినది. స్టయిల్‌గా డ్రస్ చేసుకుని, బాస్‌ను వలలో వేసుకుని, జీతం పెరిగేట్లు చూసుకుంటూ బతుకుతోంది. వెస్టర్న్ డాన్సు నేర్చుకుంటోంది. కుదిరితే మోడలింగు చేద్దామనుకుంటోంది. ఎలాగోలా డబ్బు సంపాదించడమే లక్ష్యం.

మన హీరోది అటూ, యిటూ కాని స్థితి. టిపికల్ మధ్యతరగతి బెంగాలీ మనస్తత్వం. చదువుకున్నాడు కాబట్టి, కూలీవాడిగా పనిచేయడానికి నామోషీ. కలకత్తా విడిచి వెళ్లడం యిష్టం లేదు. అక్కడే ఉద్యోగం కావాలి. సిటీలలో పుట్టిపెరిగిన వాళ్లకు యీ జబ్బు వుంటుంది. నగరజీవనం గురించి ఫిర్యాదు చేస్తూనే వుంటారు కానీ వేరే ఊళ్లలో అవకాశాలున్నా విడిచి వెళ్లరు. సిటీలో వుండడానికి ప్రమోషన్లు వదులుకున్నవారు, సిటీకి రావడానికి సిఫార్సులు చేయించుకునేవారు చాలామంది కనబడతారు. తెలంగాణ ప్రభుత్వం టీచర్ల బదిలీలు చేస్తే అలజడి రావడానికి యిదో కారణం. ప్రతీవాడికీ సిటీయే కావాలి. కలకత్తాలో యీ జబ్బు చాలా వుంది. పోనీ నగరంలోనే వుండాలని శ్రమించే ఉద్యోగాలు చేస్తారా అంటే చేయరు. అవన్నీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన బిహారీలు, ఒడియాలు, ఈశాన్య ప్రాంతాలవారూ చేస్తారు. వీళ్లు వైట్ కాలరు జాబ్ మాత్రమే కావాలనుకుంటూ అలాగే ముదిరిపోతారు.

మన హీరో కూడా అలాగే ముదిరిపోయి 25 ఏళ్లు తెచ్చుకున్నాడు. కలకత్తా బయట ఉద్యోగమంటే వద్దంటాడు. ఇక్కడే మూడేళ్లగా యింటర్వ్యూలు హాజరవుతూన్నాడు. అప్పటి సినిమాల్లో ఇంటర్వ్యూ దృశ్యాలు చాలా వుండేవి. ఒక్క ఉద్యోగానికి వందలాది మంది అభ్యర్థులుండేవారు. ఓ బెంగాలీ సినిమాలో ఒక సీనుంది. ఐదు ఉద్యోగాలున్నాయి, ఐదు వందల అప్లికేషన్లు తీసుకుంటాం అని ప్రకటిస్తే వేలాది మంది కంపెనీ బిల్డింగు ముందు గుమిగూడారు. మాది తీసుకోమంటే మాది తీసుకోమని ఆందోళన చేశారు. పెద్ద గలభా జరిగింది. కంపెనీ యజమాని బయటకు వచ్చి బాల్కనీలోంచి రోడ్డు మీద ఆందోళనకారులను చూశాడు, జాలి పడ్డాడు. ‘పోన్లే పోస్టుకి రెండు వందల మంది అప్లయి చేయవచ్చని అనుమతి యిస్తా’’ అన్నాడు ఔదార్యం ఒలకపోస్తూ. నిరుద్యోగులందరూ చప్పట్లు కొట్టారు. ఇక్కడ ఉద్యోగాల సంఖ్య పెరగలేదు, నిరాశపడే అభ్యర్థుల సంఖ్య రెట్టింపయింది. అదీ క్రూయల్ జోక్!

హీరో బస్సెక్కి యింటర్వ్యూకి వెళ్లడంతో సినిమా ప్రారంభమైంది. ఆ ఇంటర్వ్యూలో ‘గత పదేళ్లలో ప్రపంచంలో జరిగిన ముఖ్యమైన సంఘటన ఏది?’ అని అడిగితే ‘అమెరికా వంటి బలమైన దేశాన్ని వియత్నాం ప్రజలు ధైర్యంగా ఎదిరించడం’ అని జవాబిచ్చాడు. ‘1969 జులైలో చంద్రమండలంపై మనిషి పాదం మోపడం కంటేనా?’ అని రెట్టిస్తే ‘అది ముందు నుంచీ ఊహించినదే. కానీ అత్యంత సాధారణ రైతులైన వియత్నాం ప్రజలు యీ తీరులో పోరాడడం అనూహ్యం.’ అన్నాడు. కంపెనీవాళ్లు ఉలిక్కిపడ్డారు. ‘కమ్యూనిస్టువా?’ అని అడిగారు. ‘సామాన్యులను మెచ్చుకోవడానికి కమ్యూనిస్టు కానక్కరలేదు’ అన్నాడు. అయినా వాళ్లు ఉద్యోగం లేదు పొమ్మన్నారు.

ఈ సినిమా తీసేనాటికి సామాజిక పరిస్థితులు, మార్పు దశలో వున్నాయి. హక్కుల కోసం కార్మికులు ఉద్యమించడం ఉచ్చదశలో వుంది. కార్మికులు అసంఘటితంగా వున్న కొన్ని రాష్ట్రాలలో యజమానులు దోపిడీ చేస్తే, సంఘటితమైన చోట కార్మికులు యజమానులను కష్టాలపాలు చేశారు. బెంగాల్‌లో 1967లో కాంగ్రెసు ప్రభుత్వం పడిపోయి, కమ్యూనిస్టుల మద్దతుతో మిశ్రమ ప్రభుత్వాలు ఏర్పడసాగాయి. ప్రభుత్వంలో మంత్రిగా వున్నా జ్యోతి బసు, కార్మిక సంఘాల ద్వారా బెంగాల్‌లో పెట్టుబడిదారులను యిబ్బంది పెట్టసాగాడు. పుచ్చుకున్న జీతానికి తగిన పని చేయకపోవడం, మాటిమాటికి సమ్మెలు, విధ్వంసచర్యలు.. వీటితో పెట్టుబడి తరలిపోసాగింది. కమ్యూనిస్టులంటే కంపెనీ యజమానులు వణకసాగారు. అందుకని ఏ మాత్రం కమ్యూనిస్టు వాసన తగిలినా ఉద్యోగం యిచ్చేవారు కారు.

ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హీరో ఓ కాఫీ షాపుకి వెళితే అక్కడ ఒకతను కనబడి కమ్యూనిస్టు పార్టీ తరఫున చిల్లరమల్లర పనులు చేసి కాస్తోకూస్తో సంపాదించుకోవచ్చని సలహా యిచ్చాడు. ఇతను యింట్రస్టు చూపలేదు. అప్పుడతను కలకత్తా బయట ఉద్యోగం చేస్తానంటే మెడికల్ రిప్రంజెటేటివ్ ఉద్యోగానికి సిఫార్సు లెటరు యిస్తానన్నాడు. కలకత్తా విడిచి వెళ్లడానికి హీరో సందిగ్ధంలో పడ్డాడు. ఎండలో తిరిగి తలకాయనొప్పి వచ్చింది. ఆస్ప్రో వేసుకుని, సినిమాహాలు కెళ్లి కునుకు తీస్తే సరి అనుకుని హాలు కెళితే, అక్కడ అసలు సినిమా ప్రారంభించడానికి ముందు, దేశం ప్రగతిపథంలో దూసుకుపోతోందంటూ డాక్యుమెంటరీ ఫిల్మ్ చూపిస్తున్నారు. అంతలో నక్సలైట్లు వేసిన బాంబు హాల్లో పేలింది. ఇది ఆ రోజుల్లో కలకత్తాలో సర్వసాధారణం.

1964లో కమ్యూనిస్టు పార్టీ చీలి మితవాద సిపిఐ, అతివాద సిపిఎంగా విడిపోయింది. అయితే సిపిఎంకు ప్రజాస్వామ్యపు ఎన్నికలవిధానంలో నమ్మకం వుండడం దానిలోని కొందరు అత్యంతవాదులకు నచ్చలేదు. మావో ప్రవచించిన సాయుధ పోరాటంతోనే సమసమాజం ఏర్పడుతుందంటూ, నక్సల్‌బారీ ఉద్యమం ప్రారంభించారు. 1960 దశాబ్దం మధ్య నుండి నిరుద్యోగం, అవినీతి, దారిద్ర్యం కారణంగా అన్ని వర్గాల్లో అసంతృప్తి పెచ్చురేగింది. రైతాంగం, గిరిజనులు తాము దోపిడీకి గురవుతున్నామని గమనించి భూస్వాములపై తిరగబడ్డారు. అశాంతితో రగులుతున్న యువత వారికి అండగా నిలిచి, నగరాల్లో విధ్వంసం చేపట్టారు. బెంగాల్‌లోని నక్సల్‌బారీలో ప్రారంభమైన యీ సాయుధ పోరాటం అతి త్వరలో అనేక రాష్ట్రాలను, ముఖ్యంగా ఒడిశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, బిహార్‌లలో ప్రభుత్వాలను ఒక ఊపు ఊపింది. విద్యావంతులైన యువతీయువకులు నాయకత్వం వహించారు. కొందరు ఇంజనియరింగు విద్యార్థులు కూడా చదువు మధ్యలో వదిలేసి తుపాకులు పట్టారు.

నాకు తెలిసున్న కొందరు నక్సల్ ఉద్యమంలోకి వెళ్లిపోయారు. తర్వాతి రోజుల్లో అనేకమంది స్వార్థపరులు స్వప్రయోజనాలకై దానిలో చేరి భ్రష్టు పట్టించారు కానీ మొదట్లో నిజాయితీపరులే ఎక్కువ. వారిలో చాలామంది చచ్చిపోయారు. తర్వాతి రోజుల్లో మావోయిస్టులు సిద్ధాంత విభేదాలంటూ తమలో తాము కొట్టుకుని చీలికలు, వాలికలు అయిపోయారు. ఇప్పుడు ఆ పేరుతో కొందరు మిగిలారు కానీ వారి గురించి మంచి అభిప్రాయం కలవారు బహుతక్కువ. వాళ్లు తమకు బలమున్న చోట సమాంతర ప్రభుత్వం నడుపుతూ, భయభ్రాంతులతో అదుపు చేస్తున్నారు తప్ప, సిద్ధాంతబలంతో ప్రజల్ని తమవైపు తిప్పుకోవడం లేదు. సారాయి వేలం జరగకూడదు అని వాళ్లు శాసిస్తే ఓహో గిరిజనులు మద్యానికి బానిసలు కాకుండా కాపాడుతున్నా రన్నమాట అనుకోకూడదు. అప్పటికి ఆపేసి, వాళ్లు చెప్పినప్పుడు వేలం వేయాలి. కాంట్రాక్టులు కూడా వాళ్లు చెప్పినవారికే యివ్వాలి. ఓట్లు కూడా వాళ్లు వేయమంటే వేయాలి, లేకపోతే చేతులు నరుకుతామంటారు.

ప్రజల మీద, వాళ్ల అభిప్రాయాల మీద వాళ్లకు ఏ గౌరవమూ వుండదు. తాము చెప్పినదే వేదం. తాము చేసిన ఏ హింసైనా సరే, అది వారి దృష్టిలో సబబే. ఓపికున్నంతకాలం వారు యీ దోపిడీలతో బతికేసి, తర్వాత పోలీసులకు లొంగిపోయి, వాళ్లిచ్చిన సౌకర్యాలు పొంది, ఆ తర్వాత సెటిల్‌మెంట్ వ్యాపారాల్లోకి దిగుతున్నారు. తమ మాట వినని వారిని, యిప్పటికీ మావోయిస్టులుగా వున్న తమ పాత స్నేహితులతో చెప్పి బెదిరించడమో, కిడ్నాప్ చేయించడమో చేయిస్తూంటారు. ఇలాటి కేసులెన్నో బయటకు వచ్చాయి. వీళ్ల కంటె అన్యాయమైన వారెవరంటే, నగరాల్లో మన మధ్య వుంటూ వారి పక్షాన పెద్దదిక్కులుగా వ్యవహరించేవారు. ప్రజాహక్కుల కోసం, పర్యావరణం కోసం, యితర ప్రజాసమస్యలపై పోరాడే నిజాయితీపరుల్లో వీళ్లు కలిసిపోతారు. పోలీసులు మావోయిస్టులపై చేసిన ఎన్‌కౌంటర్ల గురించే వీళ్లు మాట్లాడతారు తప్ప మావోయిస్టులు సాధారణ ప్రజలపై, పోలీసులపై చేసిన ఘోరాలపై మాట్లాడరు. మావోయిస్టులు ఏ కలక్టరునో కిడ్నాప్ చేయగానే ప్రభుత్వం వీళ్లను పిలిచి మధ్యవర్తిత్వం చేయమంటుంది. వీళ్లు తగుదునమ్మానని బేరాలాడడానికి బయలుదేరతారు. వ్యాపారస్తులు, ప్రభుత్వాధికారులు గిరిజనులను దోపిడీ చేయకుండా ప్రభుత్వమే కాపాడిననాడు యిలాటి శక్తులు తలెత్తనే ఎత్తవు.

ఇదంతా యీనాటి నక్సలైట్ (మావోయిస్టు)ల స్థితి. ఈ సినిమా తీసిన 1970 నాటిది కాదు. అప్పటికి సిద్ధాంతపరమైన కలహాలే ఎక్కువ. మావో అంతశ్శత్రువులను ముందు చంపమన్నాడంటూ నక్సలైట్లు సిపిఎం నాయకులను చంపసాగారు. నగరంలో బాంబులు వేసి అల్లకల్లోలం సృష్టించి తమ ఉనికిని చాటుకునేవారు. సిపిఎంను దెబ్బ తీయడానికి, సిపిఐ, ఇందిరా గాంధీ కలిసి వారిని ప్రోత్సహించారు. నలుగురు గుమిగూడిన చోట నక్సలైట్లు నాటు బాంబులు వేసేవారు. పోలీసులను తుపాకీలతో కాల్చేవారు. ఇలాటి పరిస్థితుల్లో కలకత్తా నగరం మొత్తం గందరగోళ స్థితిలో వుంటూ ప్రజలు వేరే గతి లేక ఏదోలా బతికేస్తూండేవారు. థియేటర్లో బాంబు పేలడంతో అందరూ బయటకు పరిగెట్టారు. ఆ గలభాలో హీరో వాచి కింద పడిపోయి పగిలింది. రిపేరు చేయించడానికి వెళ్లాడు కానీ మరమ్మత్తు చార్జీలు విని వద్దులే అనుకున్నాడు. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

mbsprasad@gmail.com

Show comments