ఈసారి జగన్ ని నమ్ముకుంటే కష్టమే..!

జనం చూపు జగన్ వైపే ఉంది, కానీ జగన్ చూపు తమపై ఉందో లేదో తెలియడంలేదని కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు లోలోపల తెగ మథనపడిపోతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి పూర్తిగా జగన్ పై ఆధారపడటం కష్టమేనని అనుకుంటున్నారు నాయకులు. 

జగన్ తమని గెలిపిస్తారనే భరోసా ఉన్నా.. టికెట్ దక్కుతుందనే ఆశ మాత్రం వారిలో కరువైనట్టుంది. అందుకే సొంతగా తమ బలం పెంచుకునే ఆలోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికలనాటికి పరిస్థితులు ఎలా ఉన్నా తాము మాత్రం పోటీలో ఉండాలని భావిస్తున్నారు.

2014లో అయినా 2019లో అయినా జగన్ పేరుతోనే వైసీపీ అభ్యర్థులు గెలుపొందారనే విషయం వాస్తవం. స్థానికంగా వారికున్న బలాబలాలను పక్కనపెడితే.. జగన్ పాదయాత్ర, జగన్ ప్రచారం, జగన్ పై ఉన్న నమ్మకంతోనే జనాలు వారిని సునాయాసంగా గెలిపించారు. కానీ 2024లో వారందరికీ మళ్లీ టికెట్ ఇస్తారా లేదా అనేది అనుమానమే. ఇలాంటి వారి సంఖ్య ఎంతనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే లోలోపల భయం ఉన్నవారంతా ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంతగా జనాల్లోకి వెళ్తున్నారు. నేను-నా కార్యకర్త అనే పేరు పెట్టుకుని ఆ తర్వాత దానికి జగన్ పేరు జతచేర్చారు. మొత్తమ్మీద సొంతబలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అటు చిత్తూరు జిల్లాలో రోజా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 

జగన్ వద్ద రోజాకు ఎంత పరపతి ఉన్నా కూడా.. స్థానికంగా ఆమెకు సపోర్ట్ లేదు. స్థానిక నాయకులంతా రోజాకు వ్యతిరేకంగా మారారు. ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ పంచాయితీ కూడా జరిగింది. దాదాపుగా వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించబోమని తేల్చి చెబుతున్నారు నేతలు. దీంతో రోజాకి కూడా జనాల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి. మీతో మీ ఎమ్మెల్యే అంటూ రోజా నియోజకవర్గంలో కలియదిరుగుతున్నారు.

వీరే కాదు.. ఇంకొంతమంది ఎమ్మెల్యేలకు కూడా లోలోపల భయం ఉంది. వారంతా పార్టీతో సంబంధం లేకుండా.. తమ సొంత పరపతి పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున టికెట్ వచ్చినా రాకపోయినా తమకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటున్నారు. 

పార్టీమారే ధైర్యం ఎంతమంది చేస్తారో తెలియదు కానీ, జగన్ టికెట్ ఇవ్వకపోయినా రెబల్ గా గెలిచి తిరిగి పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తారనే ప్రచారం ఉంది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. దీంతో టికెట్ రాదేమోనని అధినేతపై అనుమానం పెంచుకున్న నేతలు సొంత దుకాణం పెట్టుకుంటున్నారు. 

Show comments