జగన్ కు ఎప్పుడు తెలిసి వస్తుందో?

తెలివి తక్కువ అనుచరులు వందల మంది వుండడం కన్నా, తెలివైనవాళ్లు పది మంది వుంటే చాలు. కానీ ఈ విషయం వైఎస్ జగన్ కు అస్సలు పట్టడం లేదు. పట్టినట్లు కనిపించడం లేదు. పేద్ద తెలివిగా అంతా మాఫీ చేసేసాం, కేక్ కట్ చేయించేసాం అని చంకలు గుద్దేసుకుంటున్నారేమో బాలినేని ఆయన అనుచరులు. కానీ జనాల్లోకి ఓ సంఘటన వెళ్లిపోయిన తరువాత, అది ఓ వర్గం మీద బలమైన ముద్ర వేసేసాక అంత సులువుగా చెరిగిపోదు. 

పార్టీ వేదిక మీద ఓ కార్యకర్త కావచ్చు చిన్న నాయకుడు కావచ్చు ఓ విమర్శ చేసారు. రఘురామ కృష్ణం రాజు మాదిరిగా బహిరంగంగా విమర్శలు చేయలేదు. మీడియాకు ఎక్కలేదు. దానికి బాలినేని అనుచరులు చేసిందేమిటి? ఏకంగా ఎత్తుకొచ్చి, కొట్టేయడమా? చంపేస్తామని బెదిరించడమా? 

ఇప్పడు ఆ వీడియో భయంకరంగా వైరల్ అయిపోయింది. ఏ కోర్టు అయినా, ఏ న్యాయమూర్తి అయినా దాన్ని సూమోటగా స్వీకరించి, విచారణకు ఆదేశిస్తే పరిస్థితి ఏమిటి? అంత వరకు రాకూడదనా? వస్తుందన్న భయంతోనా? అర్జెంట్ గా బాధితుడిని తీసుకువచ్చి, కేక్ కోయించి, నాలుగు రాజీ మాటలు మాట్లాడించేసారు.

అంటే దీంతో అంతా అయిపోయిందా? ప్రతి పక్షానికి అవకాశం పోయి వుండొచ్చు. కానీ ఆ పర్టిక్యులర్ కమ్యూనిటీ జనాల గుండెల్లో పడిన గాయం అంత సులువుగా పోతుందా? పైకి అన్ని మాట్లాడిన బాధితుడి గుండెల్లో గాయం మానిపోతుందా? ఆయన కుటుంబ సభ్యుల మనోవేదన మాటేమిటి? ఆ వీడియో ఇప్పుడు మాయం అయిపోదు కదా? వాట్సాప్ లో తిరుగుతూనే వుంటుంది కదా?

ఇలాంటి తెలివి తక్కువ అనుచరులను పెట్టుకుని ఎవరైనా సాధించేది ఏమిటి? జగన్ ను వ్యతిరేకిస్తే పోలీసులు కొడతారు. నాయకులను వ్యతిరేకిస్తే వారి అనుచరులు కొడతారు అనే ముద్ర పడిపోవడం తప్ప. దానివల్ల ఏమవుతుంది. రాబోయే ఎన్నికల్లో సైలంట్ ఓటింగ్ పెరుగుతుంది. మొదటికే ముప్పు వస్తుంది. జగన్ అది గమనిస్తారో లేదో మరి? 

నిజంగా ఈ విషయంలో బాలినేని తెలివిగా ప్రవర్తించాలనుకుంటే చేయాల్సింది కేక్ లు కట్ చేయించడం, సాక్షి పత్రికలో పేజీలకు పేజీలు ప్రకటనలు ఇప్పించడం కాదు. తన అనుచరుడిని పోలీసులకు పట్టించడం. ఆ విధంగా సరైన సందేశాన్ని పార్టీలోకి పంపించడం. అది మానేసి అంతా అయిపోయింది. కేక్ కట్ చేసేసాం అనుకుంటే అంతకన్నా తప్పు మరోటి వుండదు. 

Show comments