మూవీ రివ్యూ: అఖండ

టైటిల్: అఖండ
రేటింగ్: 2.5/5
తారాగణం: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వల్, జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, ప్రభాకర్ తదితరులు 
సంగీతం: తమన్
కెమెరా: సి రాం ప్రసాద్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు 
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల: 2 డిసెంబర్ 2021

బాలకృష్ణ-బోయపాటి కలయికలో గతంలో వచ్చిన "సింహా", "లిజెండ్" తర్వాత మూడవ చిత్రంగా తయారైన చిత్రం "అఖండ". ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదాలు పడుతూ చివరికి నేడు విడుదలయ్యింది. 

విడుదలకి ముందు "జై బాలయ్య" పాట హిట్ కావడం, ట్రైలరులో కూడా బాలయ్య మార్కు హై వోల్టేజ్ వ్యవహారం కనపడడంతో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. 

బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో ఒక అంచనా ఉంటుంది. అందునా బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చిత్రమంటే బ్రేకులు తీసేసిన బండిలా జనం మీద విరుచుకుపడుతుందని తెలిసిందే. వీళ్ల కాంబినేషన్లో సినిమాల్ని లాజిక్ అనే బల్బుని పూర్తిగా ఆపేసి చూడాల్సిందే. 

ఎంత ప్రిపరేషన్ ఉన్నా కూడా ఒక్కోసారి ఊహకి మించిన అనుభవం ఎదురవుతూ ఉంటుంది. "అఖండ" విషయంలో అదే జరిగింది. హీరోయిజం ఎలివేషన్ పేరుతో బోయపాటి చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఆ లేపడంలో చూపిన శ్రద్ధలో సగం కూడా రాయడంలో చూపించలేదు. అందుకే పాతకాలం ఫార్మాట్ లోనే సాగుతుంది కథంతా. 

ఒక ఊరిలో ఫ్యాక్షనిస్టుల్ని నాలుగు తన్నో, "లంబిడీకోడక" అంటూ బూతులు తిట్టి సంస్కారం గురించి లెక్చరిచ్చో మంచివారిగే మార్చేసే ఒక రైతు పాత్రలో మొదటి బాలకృష్ణ దర్శమిస్తాడు. 

జబ్బల పైకి మాత్రమే జాకెట్ వేసుకుని కల్లు తాగే కలెక్టర్ పాత్రలో కనిపిస్తుంది హీరోయిన్. రైతుగారి మంచితనానికి, హీరోయిజానికి పడిపోయి ఆయనని ఊరి పొలిమేర్లకి తీసుకుపోయి తాటి కల్లు తాగించి వేలితో స్వయంగా ఆవకాయ నాకిస్తుంది ఈ కలెక్టరు గారు. 

"నాకండి బాబూ బాగా నాకండి.." అంటూ పక్కన కల్లు కుండ దింపిన వాడు డయలాగొకటి కొడతాడు. లేడీ కలెక్టరుని ఇంత చవకబారుగా చూపించిన తెలుగు సినిమా ఇదే అయ్యుండొచ్చు. ఇలాంటి దిగువస్థాయి అతి ఊర మాస్ దినుసులతో సన్నివేశాలు కదులుతుంటాయి. 

అదలా ఉంచితే ఇక రెండో బాలకృష్ణ అఘోరగా దర్శనమిస్తాడు. అతనికి శరీరంలోని షట్చక్రాలు ఆధీనంలో ఉంటాయట. పంచభూతాలు కూడా మాట వింటాయట. పిలిస్తే భూతనాథుడు కూడా వెంటొస్తాడట. అలాంటి దైవాంశసంభూతుడి పాత్రలో విలన్ గ్యాంగుల్ని చంపుకుంటూ పోతుంటాడు తన శూలంతో. 

ఒక్కోసారి డయాలుగులు చెప్తున్నప్పుడు "జగదేకవీరుడు అతిలోక సుందరి"లోని అమ్రిష్ పురి గుర్తుకొస్తాడు. 

అంతమందిని నరికి గుట్టలుగా పారేసినా, ఒక ఎన్.ఐ.ఏ ఆఫీసర్ ని తన్ని బొక్క బోర్లా పడుకోబెట్టినా, చుట్టూ తుపాకులు పట్టుకుని ఉన్న ఎన్.ఐ.ఏ జవాన్ల మధ్య ఉన్న అఘోర బాలకృష్ణని చూసి ఎన్.ఐ.ఏ చీఫ్ బెదిరిపోయి "మాకు అప్పజెప్పకుండా మీరే చంపేస్తే ఎలాగండీ" అంటూ మెతక మెతకగా బితుకు బితుకుమంటూ అడుగుతాడు. 

అప్పుడు అఘోరాగారు ప్రాసతో కూడిన పంచు డయలాగులు కొడతాడు. అవన్నీ విని అరెస్ట్ చేయకుండా వదిలేస్తాడు ఎన్.ఐ.ఏ చీఫ్. ఇదేంట్రా అనే ప్రశ్న రాగానే, "బాలయ్య సినిమా అంతే...బాలయ్య సినిమా అంతే.." అనే ధ్వని మనసులోంచి సమాధానంగా వినిపించాలి. లేకపోతే క్లైమాక్స్ వరకు కూర్చోవడం కుదరదు. 

బాలయ్య శరీరంలో వృద్ధాప్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయినా కూడా చొక్కా లేకుండా అఘోరా పాత్ర చేసారు. ఇద్దరు బాలకృష్ణలు కవలపిల్లలే అయినా అదేంటో తండ్రీకొడుకుల్లాగ ఉన్నారు. ఇది లుక్ విషయంలో కచ్చితంగా బోయపాటి వైఫల్యమే. 

జై బాలయ్య పాటలో కొన్ని స్టెప్స్ కొత్తగా ఉన్నాయి. కోరియోగ్రాఫర్ ని మెచ్చుకుని తీరాలి. అలాగే కెమెరా వర్క్ గానీ, నేపథ్య సంగీతం గానీ బాగున్నాయి. పాత రజనికాంత్ సినిమా "బాబా"లోని "ఏకమేవ ద్వితీయం" స్టైల్లో "వేదం సత్శివం" అనే లైన్ వినిపిస్తుంటుంది ఇందులో. మిగిలిన పాటలేవీ పెద్దగా ఆకట్టుకోవు. 

నిజానికి శివుడి ఎలిమెంట్ ఉన్న ఈ చిత్రాన్ని అద్భుతంగా రాసుకోవచ్చు. అంతా బాలకృష్ణ ఎలివేషనే తప్ప శివుడి ఎలివేషన్ లేదిందులో. ఎం రత్నం మాటలు ఒకటి రెండు చోట్ల బాగానే ఉన్నా మిగతావన్నీ పాతచింతకాయ ప్రాస పంచులే. 

సినిమా నిండా చావులు, రక్తపాతమే. కానీ తెర మీద ఎవరు చచ్చిపోతున్నా ప్రేక్షకుడికి బాధగానీ, సంతృప్తి గానీ కలగదు. 

చిన్న బాలకృష్ణ కూతురు చావుబతుకుల్లో ఉన్నా కూడా సగటు ప్రేక్షకుడికి ఏమీ పట్టదు. అలాగే విలన్లు చస్తున్నా కూడా సంతృప్తి కలుగుతున్న ఫీలింగ్ రాదు. 

ఏవో సన్నివేశాలలా వెళ్తున్నాయంతే అన్నట్టుంటుంది. పూర్తి స్థాయి ప్రెడిక్టబుల్ కథనం ఇది. 

శ్రీకాంత్ మెయిన్ విలన్ గా తేలిపోయాడు. విగ్రహం ఉన్నా విలనీ పలకలేదు. ఇక జగపతిబాబైతే ఉన్నాడా లేడా అన్నట్టుగా మూడు నాలుగు సీన్స్ కి పరిమితం చేసారు. ఎన్.ఐ.ఏ చీఫ్ పాత్రలోనూ, బాలకృష్ణల తల్లి పాత్రలోనూ తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేని నటీనటుల్ని పెట్టారు. 

ఎవరి రేంజులో వాళ్లు నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాలనే కుతూహలంతో కనపడ్డారు. 

మొత్తమ్మీద బాలకృష్ణతో హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నంతో బోయపాటి తీసిన సినిమా ఇది. బడ్జెట్ హద్దులు దాటింది. కరోనా వడ్డీలు పెంచింది. కానీ సినిమాలో ఆ రెండు బరువుల్ని మోయగల కండపుష్టి మాత్రం లేదు. 

గతంలో "సింహా" అయినా "లెజెండ్" అయినా మంచిపాటలు, కథాబలంతో నడిచాయి. అందుకే అవి విజయం సాధించగలిగాయి. అఖండలో ఆ రెండూ మిస్సింగ్. 

అయినా వయసుకు తగ్గట్టుగా హీరోలు కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. చిరంజీవి, నాగార్జున వంటి వారు కూడా పూర్తిగా తమ భుజాలమీద సినిమాని మోసెయ్యాలని అనుకోకుండా యువహీరోలని ప్యాడింగ్ గా పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ పద్ధతి బాలకృష్ణ కూడా పాటించాల్సిన సమయం వచ్చేసింది. ప్రేక్షకులకి ప్రస్తుతం 60 దాటిన బాలకృష్ణని పూర్తిగా భరించడం కష్టం. పైగా "అఖండ"లో ఇద్దరు బాలకృష్ణలు. 

పూర్తిస్థాయి బాలయ్య అభిమానులకి నచ్చవచ్చేమో గానీ సగటు ప్రేక్షకుడు మాత్రం ఈ సినిమా చూసి నీరసంగా నిట్టూరుస్తాడు. 

ఆద్యంతం బాలకృష్ణమయమైన ఈ సినిమాలో కాస్తంత కథాబలం, కథన బలం కూడా తోడై ఉంటే ప్రమాదం నుంచి తప్పుకునేది. ప్రస్తుతానికి మాత్రం "హరహరాహరా.." అంటూ జపం చేసుకోవడమే. 

బాటం లైన్: అఖండమైన బాదుడు

Show comments