ఇంకా రంగంలోకి దిగని పీకే.. కారణం అదేనా?

మరోసారి ప్రశాంత్ కిషోర్ టీమ్ రంగంలోకి దిగుతుందని స్వయంగా సీఎం జగన్ ఇదివరకే ప్రకటించారు. మంత్రి మండలి సమావేశంలో అందర్నీ అలర్ట్ చేశారు. ముందుగానే ఎన్నికలకు సిద్ధం అవ్వాలని, అలర్ట్ గా ఉండాలని, ఎక్కడా వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్త పడాలని హితవు పలికారు. 

పీకే టీమ్ నవంబర్ నుంచే పని మొదలు పెడుతుందని కూడా హింట్ ఇచ్చారు. కానీ నవంబర్ గడిచిపోయి డిసెంబర్ వచ్చింది. ఇంకా పీకే టీమ్ జాడ లేదు. అసలు కారణం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికిప్పుడు సర్వే అవసరం లేదు..

సర్వేలు అవసరం లేకుండానే ఎప్పటికప్పుడు స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కుప్పంలో సైతం వైసీపీకి బలం పెరిగిందని నిరూపితమైంది. 

అదే సమయంలో ఏయే ప్రాంతాల్లో వైసీపీ ఎక్కువ నమ్మకంతో ఉంది, ఎక్కడెక్కడ స్థానిక నాయకులపై వ్యతిరేకత ఉందనే విషయం కూడా ఈ ఎన్నికలతో స్పష్టమైంది. సో.. ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా ప్రశాంత్ కిషోర్ టీమ్ రంగంలోకి దిగి సర్వే చేయాల్సిన అగత్యం లేదు. అందుకే ఈ వ్యవహారాన్ని కొన్నాళ్లు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

సిట్టింగుల్లో మార్పుచేర్పుల్లేవు

సిట్టింగులను మార్చేందుకు కూడా జగన్ పెద్దగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ, ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించకపోవడంతో అసలు సిట్టింగ్ లపై జగన్ కు వ్యతిరేకత లేదనే విషయం స్పష్టమైంది. 

అభ్యర్థి పనితనంపైనే ఆధారపడకుండా.. సంక్షేమ పథకాలపై జగన్ ఎక్కువగా నమ్మకం ఉంచారు కాబట్టి, అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు పెద్దగా ఉండకపోవచ్చు. పైపెచ్చు.. ఒకరితో ఒకరు పోటీపడి మరీ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయాలు అందించారు.

సో.. జగన్ రెండోసారి కూడా ఇదే టీమ్ తో రంగంలోకి దిగే అవకాశముంది. అలా అని సేమ్ టీమ్ కూడా కాదు. పూర్తిగా రివర్స్ అయిన రఘురామ, అప్పుడప్పుడూ ఎగిరెగిరి పడుతున్న ధర్మాన, ఆనం లాంటి వారి విషయంలో జగన్ నిర్ణయం తీసుకుంటారు. ఇలా ఓ 30శాతం చిన్నచిన్న మార్పులతో జగన్ ఎన్నికల టీమ్ సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ కోణంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ కు పనిలేదు

అంతర్గత కలహాలకు చెక్

జనసేన, టీడీపీ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేల విషయంలో కాస్తో కూస్తో అసంతృప్తి ఉన్నా.. వాటికి కూడా జగన్ ఇటీవల చెక్ పెట్టారు. కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్సీ పదవులతో.. అంతర్గత కలహాలను కూడా సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు జగన్. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికిప్పుడు చేయాల్సిన పనిలేదు.

మరి టీమ్ ఎప్పుడు దిగుతుంది?

టైమ్ గ్యాపే కానీ, టైమింగ్ లో గ్యాప్ ఉండదు. గతంలో పాదయాత్ర సమయంలో పీకే టీమ్ ఎలా చాపకింద నీరులా పనిచేసుకుంటూ వెళ్లిందో.. ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ప్రత్యేకంగా ఎక్కడా వేరేవాళ్లు వచ్చి వైసీపీ కోసం పనిచేస్తున్నారనే పేరు లేకుండా అంతా వ్యూహాత్మకంగా సాగిపోతుంది. దీని కోసం జగన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 

సరైన సమయం వచ్చినప్పుడు పీకే టీమ్ రంగంలోకి దిగుతుంది. ఎన్నికలయ్యే వరకు వైసీపీ నేతలకు అండగా నిలబడి వ్యవహారం చక్కబెడుతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో ఏడాది తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏపీలో తన పని మొదలుపెడతాడు. 

Show comments