సిరివెన్నెల‌.. బ్యూటిఫుల్ లైన్స్!

తెలుగు సినిమా పాట‌కు స‌రికొత్త న‌డ‌త‌ను నేర్పిన ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. మాస్ బీట్ కు కూడా క్లాస్ ట‌చ్ ఇచ్చిన క‌వి సిరివెన్నెల‌. అదే మెలోడీస్ ను అయితే.. మ‌రింత మెలోడియ‌స్ గా మార్చిన ఘ‌న‌త ఆయ‌న‌దే. ఇంటెలెక్చువ‌ల్ ఐడియాస్ ను సాధార‌ణ పాట‌గా మార్చి.. పండిత‌, పామ‌రుల్లో ఎవ‌రికి వారు.. ఇది త‌మ కోస‌మే రాశాడ‌నే భావ‌న‌ను క‌లిగించిన ర‌చ‌యిత సిరివెన్నెల‌. 

విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం... అంటూ ప్ర‌భ‌వించినా! కోడికి ఉందా.. కోతికి ఉందా.. ఈ పెళ్లాచారం, స‌ద్దాం హుస్సేనూ ఇడి ఆమీను హిట్ల‌రు ఎక్సెట్రా.. ఇంట్లో ఉన్న పెళ్లం క‌న్నా డిక్టేట‌ర్ల‌ట్రా.. అంత‌టి డిక్టేట‌ర్ల‌ట్రా! అంటూ హిలేరియ‌స్ కంపారిజ‌న్ తో సాంగ్ రాసినా.. అది సిరివెన్నెల‌కే సాధ్యం!

సురాజ్యం అవ‌లేని స్వ‌రాజ్యం ఎందుక‌ని.. అని ప్ర‌శ్నించినా, వేట అదే, వేటు అదే.. నాటి క‌థే అంతా.. మార‌దు లోకం.. అంటూ ఆవేద‌న‌ను వ్య‌క్త‌ప‌రిచినా,  అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా! కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం.. చితి మంటల సిందూరం   చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా! ఓ విషాద భారతమా.. అంటూ ఆవేద‌న‌తో మార్పును ఆకాంక్షించినా..  అది సిరివెన్నెల‌కే ప్ర‌త్యేకం అయ్యింది.

మంగ‌ళ‌సూత్రం అంగ‌డి స‌రుకా.. కొన‌గ‌ల‌వా చేజారాకా.. అంటూ సినిమా లైన్ నే త‌న పాట‌లో ఒక లైన్ గా మార్చేసి మెప్పించిన ఘ‌న‌త సిరివెన్నెల‌దే. 

సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మాధ్యమం. ఈ క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్ కు అనుగుణంగా రాసే వాళ్ల‌కు అవ‌కాశాల‌కు లోటు ఉండ‌దు. ప్ర‌త్యేకించి గ‌త కొన్ని ద‌శాబ్దాల్లో పాట‌ల ర‌చ‌యిత‌ల ప‌ని కేవ‌లం ట్యూన్ కు త‌గ్గ‌ట్టుగా రాసివ్వ‌డ‌మే అయ్యింద‌ని పాట‌లు వినే ఎవ‌రైనా చెబుతారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా త‌న‌లో గూడుక‌ట్టుకున్న ఆవేద‌న‌నో, స‌మాజం ప‌ట్ల ఆపేక్ష‌నో అంద‌మైన ప‌దాల‌తో అర్థ‌వంతంగా చెప్పే సాహ‌సం చేసిన క‌వి సిరివెన్నెల‌. ఇక్క‌డ సిరివెన్నెల కేవ‌లం ర‌చ‌యిత కాదు, క‌వి! 

స‌ర‌దా పాట రాసినా, సీరియ‌స్ పాట రాసినా, ప్రేమ గీతం రాసినా.. దేన్నైనా గాఢ‌త‌తో రాయ‌డం, ఎక్క‌డైనా ప‌ద‌ప్ర‌యోగాలు అత్యున్న‌త స్థాయిలో ఉండ‌టం తెలుగు సినీ పాట‌ల ర‌చ‌యిత‌ల్లో సిరివెన్నెల ఒక్క‌రికే సాధ్యం. అనేక మంది ర‌చ‌యిత‌లు ట్యూన్ కు త‌గ్గ‌ట్టుగా ఏవో అన‌వ‌స‌ర‌మైన ప‌దాలు, సౌండింగ్స్ కోసం వాడే ప‌దాల‌తో భ‌ర్తీ చేస్తే.. సిరివెన్నెల పాట‌ల్లో మాత్రం ఎక్క‌డా అలాంటి చొప్ప‌దండు ప‌దాలు విన‌ప‌డ‌వు!

శివ 2006 అని రామ్ గోపాల్ వ‌ర్మ ద‌శాబ్దంన్న‌ర కింద‌ట ఒక సినిమా తీశాడు. దాన్ని హిందీలో తీసి.. తెలుగు కోసం డ‌బ్ చేశారు. ఇళ‌య‌రాజా ట్యూన్స్ ను ఎడాపెడా వాడుకున్నారు. ఏ ర‌కంగానూ ఆక‌ట్టుకోని ఆ డ‌బ్బింగ్ సినిమాకు కూడా సిరివెన్నెల గీతాలు చాలా అర్థ‌వంతంగా, సంద‌ర్భంస‌హితంగా ఉంటాయి. ఏ సినిమానూ, ఏ పాట‌ను కూడా సిరివెన్నెల గ్రాంటెడ్ గా తీసుకుని ఏదో ప‌నిపోయింది అనిపించ‌ర‌ని స్ప‌ష్టం అవుతుంది వినే సామాన్యుడికి కూడా!

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి.. మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి.. వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది.. ది రోడ్ నాట్ టేకెన్ జిస్ట్ ను అత్యంత అంద‌మైన తెలుగు ప‌దాల‌తో అమ‌ర్చారు సిరివెన్నెల అంకురం సినిమాలో!

న‌మ్మ‌కు న‌మ్మ‌కు ఈ రేయిని.. అంటూ హెచ్చ‌రించారు,  తెల్లారింది లెగండోయ్.. అంటూ నిద్ర‌లేపే రాత‌తోనే కాదు, ఆ పాట‌ను త‌గ్గ‌ట్టుగా దాని పాడి వాగ్గేయ‌కారుడ‌య్యారు. తెలుగు వారికి చిర‌కాలం గుర్తుండిపోయే వార‌య్యారు సిరివెన్నెల‌.

Show comments