అయ్యో పాపం.. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితేంటి..?

వచ్చే ఎన్నికలనాటికి ఎలాగోలా బీజేపీని బతిమిలాడుకుని ఎన్డీఏ కూటమిలో చేరి ఏపీలో పరువు దక్కించుకోవాలని, పనిలో పనిగా మోదీ దగ్గర పరపతి పెంచుకోవాలనేది చంద్రబాబు ఆలోచన. అందులో భాగంగానే ప్రస్తుతానికి పవన్ ని దువ్వుతున్నారు, ముచ్చటగా మూడు పార్టీలు జట్టు కట్టేందుకు వ్యూహ రచనలు చేస్తున్నారు. చంద్రబాబు పన్నాగానికి ఇప్పుడు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బ్రేక్ వేశారు. ఏపీ సీఎం జగన్ ని ఎన్డీఏలోకి ఆయన ఆహ్వానించారు.

వాస్తవానికి అథవాలే బీజేపీ నేత కాకపోయినా ఈ ఆహ్వానాన్ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని రాజ్యసభ సభ్యత్వంతో కేంద్ర మంత్రి అయ్యారు అథవాలే. తనకు జగన్ మంచి మిత్రుడని, తన పార్టీలాగే వైసీపీ కూడా ఎన్డీఏలో భాగస్వామి కావాలని, తద్వారా సొంత రాష్ట్రానికి పలు అభివృద్ధి పనుల్ని సాధించుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు.

కేంద్రం అనుమతి లేకుండానే జరుగుతుందా..?

ఎన్డీఏలో మిత్ర పక్షాలు ఏది మాట్లాడాలన్నా ఆచితూచి, బీజేపీకి అభ్యంతరం లేకుండానే మాట్లాడతారు. అలాంటిది కేంద్ర మంత్రి అథవాలే నేరుగా వైసీపీని ఎన్డీఏలోకి రావాలంటూ ఆహ్వానించారంటే బీజేపీ మనసులో జగన్ కచ్చితంగా ఉండి ఉంటారని విశ్లేషకుల అభిప్రాయం. అదే నిజమైతే ఇప్పటి వరకూ చంద్రబాబు వేసిన ఎత్తులు, నక్కజిత్తులన్నీ వృథాయే అని చెప్పుకోవాలి.

రైతు ఉద్యమం, ఇతరత్రా కారణాలతో ఉత్తరాదిలో సీట్లు తగ్గినా.. దక్షిణాది నుంచి వైసీపీలాంటి బలమైన పార్టీల మద్దతు ఉంటే ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం గ్యారెంటీ. ఆ ఆశతోనే కమలదళం జగన్ వైపు చూస్తోంది.

మరి చంద్రబాబు పరిస్థితి ఏంటి..?

2019 ఎన్నికలకు ముందు మోదీని బండబూతులు తిట్టి, తిట్టించిన చంద్రబాబు.. ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పూర్తిగా ప్లేటు మార్చారు. ఎన్నికల టైమ్ లో మోదీ భార్యను కూడా రాజకీయాల్లోకి లాగిన బాబు.. ఓడిన వెంటనే సైలెంట్ అయ్యారు. మోదీని పల్లెత్తు మాట అనడంలేదు, కేంద్రాన్ని అస్సలు విమర్శించడం లేదు.

రాబోయే రెండున్నరేళ్లలో బీజేపీకి బాగా దగ్గరవ్వాలనేది బాబు ఆలోచన. పొత్తుకి సై అంటే ఏపీలో 50శాతం సీట్లతో సరిపెట్టుకోవాలని మిగతా సీట్లు బీజేపీ, జనసేనకు త్యాగం చేయాలనే ఉద్దేశం కూడా బాబులో ఉందని అంటారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో ఈ పొత్తుల ఎత్తులు మొదలయ్యాయి. మిగిలిన రెండున్నరేళ్లలో ఈ బంధం మరింత బలపడేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు.

నిండా మునగాల్సిందేనా..?

వచ్చే ఎన్నికల్లో బాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎలాగోలా పరువు కాపాడుకుంటారని సీనియర్లు ఆశపడుతున్నారు. ఇప్పుడు ఆ ఆశలు కూడా గల్లంతు అయితే, టీడీపీని నమ్మేదెవరు, నమ్ముకుని ఉండేదెవరు? ఎలాగూ వైసీపీలోకి ఎంట్రీ ఉండదు కాబట్టి.. మెల్లి మెల్లిగా టీడీపీ నేతలంతా బీజేపీలోకి సర్దుకునే అవకాశం ఉంటుంది.

జగన్ ఎన్డీఏ కూటమిలో చేరితే ఏపీలో కాంగ్రెస్ కి పట్టిన గతే టీడీపీకి కూడా పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కి ఎలాగూ ఇగో ప్రాబ్లమ్ కాబట్టి.. ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకుని.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. ఈ కుమ్ములాటలో బాబు నిండా మునిగిపోవడం ఖాయం. 

Show comments