ఎమ్బీయస్‍: యుపి బ్రాహ్మల్లో పరశురామస్ఫూర్తి

ఈ వ్యాసంలో ప్రస్తావిస్తున్న పరశురాముడి చరిత్ర గురించి ‘పరశురాముడి చుట్టూ రాజకీయాలు’ వ్యాసంలో రాశాను. అప్పటి సామాజిక సోపానంలో పై మెట్టు మీద వున్న రెండు వర్గాలు కలిసి తక్కినవాళ్లను అదుపు చేస్తూ వచ్చినంతకాలం వాళ్లకు బాగానే సాగింది. కానీ వాళ్లలో వాళ్లకే పోట్లాట వస్తే ఏమవుతుందో పరశురాముడి కథ తెలుపుతుంది. ఎప్పటికైనా పాలకుడిదే పైచేయి. కొద్దికాలం పాటు ఋషివర్గం (ఇప్పటి పరిభాషలో న్యాయబుద్ధి గల మేధోవర్గం అనవచ్చు) వాళ్లని భయపెట్టింది. కానీ త్వరలోనే సద్దు మణిగి, క్షత్రియవర్గమే పాలిస్తూ వచ్చింది. పరశురాముడు దాడి చేసినప్పుడు అంతఃపురంలో దాక్కున్న దశరథుడు యాగం చేసి రామలక్ష్మణాదులను కన్నాడు. దాన్ని నిర్వహించినది క్షత్రియ యువరాణిని పెళ్లాడిన ఋషి ఋష్యశృంగుడే. పరశురాముడు ఎదురైనప్పుడు రాముడు అతని తేజాన్ని లాక్కోవడమనేది ఋషివర్గాన్ని నిర్వీర్యం చేసి, క్షత్రియవర్గం మళ్లీ బలపడడాన్ని సూచించిందని అనుకోవచ్చు.

తమను ఎదిరించిన పరశురాముడికి ఏ రాజూ గుడి కట్టించలేదు. విష్ణువు అవతారంలో తాబేలుకి కూడా శ్రీకూర్మంలో గుడి కట్టారు. వామనుడికి కూడా గుడి కనబడదు కానీ కాంచీపురంలో ‘ప్రపంచాన్ని కొలిచిన విష్ణువు’ అనే అర్థం వచ్చే ఉలగ అళంద పెరుమాళ్ అనే పేరుతో ఒక గుడి వుంది. దానిలో త్రివిక్రమావతారం కనబడుతుంది. కానీ పాలకులపై తిరుగుబాటు చేసిన పరశురాముడికి గుడి లేదు. భువనేశ్వర్‌లో పరశురామేశ్వరాలయం వుంది. కానీ రామేశ్వరం గుడిలో దేవుడు రాముడు కాదు శివుడు అయినట్లే, దీనిలో కూడా గర్భగుడిలో శివలింగమే ఉంటుంది. పరశురాముడికి గుడి లేదు కానీ, అతని తల్లి రేణుకకు గుళ్లున్నాయి. ఆవిణ్ని గ్రామదేవతగా ‘ఎల్లమ్మ’ పేరుతో తెలుగు రాష్ట్రాలలో, కర్ణాటకలో కొలుస్తారు. నది వద్ద సంఘటనకు గుర్తుగా ఆమె గుడిలో ఒక నీళ్లకుండ పెడతారు. గమనించవలసినదేమిటంటే యీ గుళ్లు రాజులు కట్టించలేదు. శ్రామికులు కట్టారు. పరశురాముడు తల నరికినప్పుడు రేణుక తల శ్రామికవాడలలో పడిందని, అప్పణ్నుంచి ఆవిణ్ని తమ యింటి ఆడపడుచుగా వారు భావిస్తారని అంటారు. అందుకే యీ గౌరవం.

ఇంతకీ మొదటి వ్యాసంలో ప్రస్తావించిన పరశురామ క్షేత్రం ఏది? ఉత్తర కర్ణాటకలో వున్న గోకర్ణం అని కొందరంటారు, కాదు, దక్షిణ మహారాష్ట్రలోని కొంకణ్ అంటారు కొందరు. అబ్బే కాదు, కేరళ అంటారు మరి కొందరు. ఎక్కువమంది కేరళకే ఓటేస్తారు. తన ప్రాంతంలో బ్రాహ్మణాధిక్యం వుండాలని పరశురాముడు దేశంలోని ఉత్తమ బ్రాహ్మణ కుటుంబాల నందరినీ అక్కడకు రప్పించి, స్థలాలిచ్చి, సకల శాస్త్రపరిరక్షణాభారం వారికి అప్పగించాడని చెప్తారు. వారే నంబూద్రీలు. నంబూద్రీ ఐన ఆదిశంకరుడి పూర్వీకులు తెలుగుప్రాంతాలకు చెందినవారని, పరశురాముడి పిలుపుపై కేరళ వెళ్లారని తెలుగు ‘చరిత్రకారుడు’ నేలటూరి వెంకటరమణయ్య రాశారు. నిజమేనేమో అని అనుమానం వచ్చేలోపునే ఆయన రామానుజుడు, మధ్వాచార్యుడు కూడా తెలుగువాళ్లని రాసేశారు. ఇక యిది చరిత్ర కాదని అర్థమైపోయింది.

నంబూద్రీలు బ్రాహ్మణుల్లోనే అత్యుత్తమ శాఖ తమది అని వారు చెప్పుకుంటారు. వారిలో మంచీ, చెడూ రెండూ ఉన్నాయి. చెడు అంటే వాళ్ల ఛాందసాచారాల గురించి తప్ప, వేరేలా తప్పుపట్టడానికి లేదు. వారు సమాజంలో ఏ వర్గాన్నీ హింసించలేదు. తమ పూజాదికాలూ, తామూ ఏమిటో అంతే! అయితే తమ కులంలోని స్త్రీలను ఘోషాలో పెట్టి (అంతర్జనం అంటారు వాళ్లని) చాలా అన్యాయం చేశారు. స్త్రీలకే కాదు, పురుషులకు కూడా. నంబూద్రి కుటుంబంలో పెద్దకొడుక్కి మాత్రమే నంబూద్రి యువతిని పెళ్లి చేసుకునే అర్హత వుండేది. తక్కిన కొడుకులు వేరేలా తంటాలు పడాల్సి వచ్చేది. దీని కారణంగా బహుభార్యాత్వం, వృద్ధకన్యలు, వ్యభిచారం వంటి అనేక దురాచారాలు ప్రబలాయి. 20 వ శతాబ్దం ఆరంభంలో ఇమ్మెస్ నంబూద్రిపాద్ వంటి యువనంబూద్రీలు యీ పద్ధతిపై తిరగబడి, సంస్కరణలు తెచ్చారు. నంబూద్రిపాద్ తర్వాతి రోజుల్లో కాంగ్రెసులో చేరి, కమ్యూనిస్టయి, అనేక సంస్కరణలు చేసి చాలా పేరు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన ఒక సంస్కరణ ఆయన కులాన్ని చాలా దెబ్బ తీసింది.

నంబూద్రిలలో ఉన్న గొప్ప మంచి ఏమిటంటే, ఐతిహ్యం ప్రకారం వారికి పరశురాముడు వాళ్లకి అప్పగించిన బాధ్యతను ఎంతో శ్రద్ధగా నిర్వర్తించారు. భారతదేశానికి చెందిన సమస్త లలితకళలను, మంత్ర, తంత్ర శాస్త్రాలను, మర్మకళ వంటి యుద్ధతంత్రాలను, కలరిపయట్టు వంటి యుద్ధవిద్యలను, మూలికా వైద్యంతో సహా ఆయుర్వేదాన్ని వారు కాపాడారు. తాము నేర్చుకుని, నిరంతరాధ్యయనం చేస్తూ, యితరులకు నేర్పారు. ఇప్పటికి కూడా ప్రాచీనమైనదేదైనా కావాలంటే, తాళపత్రగ్రంథాలను రిఫర్ చేయాలంటే కేరళకు వెళ్లాల్సిందే. భారతీయ వారసత్వాన్ని వేలాది ఏళ్ల పాటు మ్యూజియంలో పెట్టి కాపాడినవారు వాళ్లే. మ్యూజియం క్యూరేటరుకు జీతం యివ్వాలి కదా. క్యూరేటరు భద్రంగా వుండేట్లు చూస్తాడంతే. వీళ్లు వాటిలో నైపుణ్యం సంపాదించి, యితరులకు నేర్పుతూ వచ్చారు. ఈ పని చేస్తూ వుంటే భుక్తి గడవాలి కదాని రాజులు వీళ్లకు వందల ఎకరాలు యిచ్చారు. వాళ్లు స్వయంగా వ్యవసాయం చేయలేక రైతులకు లీజుకి యిచ్చి, వాళ్లిచ్చే అయివేజుతో కాలం గడుపుకునేవారు.

ప్రపంచం మొత్తంలో ప్రజాస్వామ్యయుతంగా, అహింసాయుతంగా గెలిచిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం 1957లో కేరళలో నంబూద్రిపాద్‌ నేతృత్వంలో ఏర్పడింది. దున్నేవాడిదే భూమి నినాదాన్ని అమలు చేయడానికి ఆయన వెంటనే 1957లో భూసంస్కరణల ఆర్డినెన్స్ తెచ్చి, ఫ్యూడల్ వ్యవస్థలో పరిమితికి మించిన భూముల్ని రైతులకు కట్టబెట్టాడు. దాంతో జమీందార్లు తిరగబడ్డారు. ప్రధాని నెహ్రూకి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యం, సోషలిజం మా మౌలిక సిద్ధాంతాలని చెప్పుకునే కాంగ్రెసు నెహ్రూపై ఒత్తిడి తెచ్చింది. కాంగ్రెసులో అతి రైటిస్టుల నుంచి, అతి లెఫ్టిస్టుల దాకా అందరూ వుండేవారు. ఆ సమయంలో రైటిస్టులది పైచేయి అయింది. నెహ్రూ ఆర్టికల్ 356 ఉపయోగించి, కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. నెహ్రూ వ్యక్తిత్వానికి యిది మాయని మచ్చ.

తర్వాతి రాజకీయ పరిణామాల తర్వాత చివరకు 1969లో సిపిఐకు చెందిన అచ్యుత మేనన్ ముఖ్యమంత్రిగా వుండగా అది చట్టంగా మారింది. భూస్వాములకు భూములు పోయాయి. జమీందార్లకు, ధనికులకు వ్యవసాయ, వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వారు బతికిపోయారు. కానీ కౌలు ఆదాయం తప్ప వేరేదీ లేని నంబూద్రీలు దారుణంగా చితికిపోయారు. పొట్ట గడవక, వారి కుటుంబాలలోని స్త్రీలు యితర కులస్తులను పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో వున్నాయి. నంబూద్రీలు ఇంగ్లీషు చదువుల వైపు మళ్లి, ఉద్యోగాలకు వెళ్లారు. అన్ని రకాల వృత్తులూ చేపట్టారు. వారిలో కొందరు పూజారులుగా ప్రధానమైన ఆలయాల్లో యిప్పటికీ వున్నారు. కేరళ పరశురామక్షేత్రమే అయితే నంబూద్రీలలో ఆ స్ఫూర్తి మాత్రం కానరాదు. వాళ్లు పోరాడలేదు, తిరగబడలేదు, రాజకీయాల్లోకి వెళ్లలేదు. వచ్చిన మార్పును మౌనంగా అంగీకరించారు.

పరశురామక్షేత్రంగా చెప్పుకునే కొంకణ్‌కు చెందిన (కొంకణస్థ అంటారు) చిత్‌పావన్ బ్రాహ్మణులు మాత్రం వీరికి భిన్నం. తమది అగ్నిసంస్కారం చెందిన బ్రాహ్మణశాఖ అని చెప్పుకుంటారు. స్కంధ పురాణం ప్రకారం పరశురాముడు దూరప్రాంతం నుంచి కొంకణానికి ఓడలో వస్తూ అగ్నికి ఆహుతైనవారిని చూశాడు. చితిలోనుంచి వారిని బతికించి, బ్రాహ్మణులుగా మార్చాడు. వీరిలో బ్రాహ్మణత్వంతో బాటు క్షాత్రం కూడా మెండుగా వుంది. వాళ్లు వచ్చిన దూరప్రాంతం ఇజ్రాయేలు అనీ, ఇరాన్ అనీ, టర్కీ అనీ వేర్వేరు కథనాలున్నాయి.ఆ కులానికి చెందిన మిలింద్ సోమన్‌పై గత ఏడాది యూదుడనే ఆరోపణ వచ్చినపుడు అతను యీ కథనాన్ని కొట్టిపారేశాడు. ఏది ఏమైనా వీళ్లు బ్రాహ్మణులలో కొత్తగా వచ్చి చేరారు కాబట్టి వీళ్లను మహారాష్ట్రలో తొలినుంచీ వున్న దేశస్థ బ్రాహ్మణులు తమ కంటె తక్కువగా చూశారు.

ఛత్రపతి శివాజీ తన ప్రధానమంత్రిని పేష్వాగా పేర్కొన్నాడు. అతని తర్వాత అతని కుమారుడు శంభాజీ, ఆ తర్వాత శంభాజీ సవతి సోదరుడు రాజారాం, ఆ తర్వాత శంభాజీ కొడుకు శాహూ మహారాష్ట్ర పాలకులయ్యారు. మొదటి పేష్వాలు దేశస్థ బ్రాహ్మణులు కాగా, శాహూ కాలంలో 1713లో పేష్వాగా నియమితుడైన బాలాజీ విశ్వనాథ్ భట్ చిత్‌పావన్ బ్రాహ్మణుడు. అతని కాలంలో చిత్‌పావన్లకు ప్రాధాన్యత పెరిగింది. వాళ్లు సేనాధిపతులుగా శూరత్వం చూపించి, మరాఠా సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. పేష్వాలుగా కూడా అయ్యారు. శాహూ తర్వాతి నుంచి రాజులు పేరుకి మాత్రమే ఛత్రపతులు. పేష్వాలే నిజమైన పాలకులయ్యారు. పేష్వాల సారథ్యంలో మరాఠా సామ్రాజ్యం దేశంలో అనేక ప్రాంతాలు గెల్చింది. ఔరంగజేబు అనంతరం వచ్చిన మొఘల్ పాలకులు బలహీనులు కావడంతో మరాఠా సామ్రాజ్యమే ఆంగ్లేయుల వ్యాప్తికి అవరోధంగా మారింది.

1818లో మరాఠాలను పూర్తిగా జయించాకనే ఆంగ్లేయులు భారతదేశాన్ని వశపరుచుకోగలిగారు. 1857 నాటి సిపాయిల తిరుగుబాటులో ప్రధానపాత్ర వహించిన నానా ఫడణవీస్ చిత్‌పావన్ బ్రాహ్మణుడే. పేష్వాలుగా, సేనాపతులుగా ప్రధానమైన పదవుల్లో వున్న చిత్‌పావన్ బ్రాహ్మణులు ఆంగ్లేయుల విజయం తర్వాత ఇంగ్లీషు నేర్చుకుని ఉన్నతోద్యోగాలను కైవసం చేసుకున్నారు. వారిలో అనేకమంది సంస్కర్తలున్నారు, ఎందరెందరో ప్రముఖులున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో చిత్‌పావన్లెందరో పాల్గొన్నారు. గాంధీకి గురువుగారైన గోపాలకృష్ణ గోఖలే, గాంధీయిజానికి బద్ధవిరోధియైన సావర్కార్ యిద్దరూ చిత్‌పావన్లే. సావర్కార్ శిష్యుడు, చిత్‌పవన్ ఐన గోడ్సే 1948లో గాంధీని హత్య చేసినపుడు మరాఠాలు, జైనులు, లింగాయతులు కలిసి చిత్‌పావన్ రాజులు పాలించే సాంగ్లీ వంటి సంస్థానాలలో చిత్‌పావన్ల యిళ్లు, ఫ్యాక్టరీలు తగలబెట్టారు.

గాంధీపై ప్రేమ కంటె దీన్ని చిత్‌పావన్ల మీద ఆగ్రహంగా చెప్పుకోవాలి.  మరాఠాలలో క్షత్రియులు కూడా వున్నా సైన్యంలో చేరిన అనేక శూద్రకులాల వారు కూడా మరాఠాలుగా గుర్తింపబడ్డారు. ఆంగ్లేయులు వెళ్లిపోయాక సంస్థానాలలో చిత్‌పావన్‌లు పేష్వాల కాలంలో లాగ, తమపై పెత్తనం చేస్తారేమోనన్న భయంతో వారిపై దాడి చేశారు. వెంటనే యీ సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో కలిసిపోయి, శాంతిభద్రతల భారాన్ని భారత సైన్యంపై మోపాయి. తర్వాతి కాలంలో చిత్‌పావన్లు ఉద్యోగాలలో చేరి ఉన్నతస్థానాలకు వెళ్లారు కానీ, రాజకీయాధికారాన్ని మరాఠాలకు అర్పించేశారు. ఏది ఏమైనా అప్పుడప్పుడు చిత్‌పావన్ సమావేశాలు జరుపుకుంటూ మనకి పూర్వవైభవం రావాలంటే పోరాడాల్సిందే అంటూ శపథాలు చేస్తూంటారు. 2007 నాటి సమావేశం ఫోటోలు చూశాను. వాటిల్లో వేదికపై పరశురాముడి బొమ్మ ఉన్న పెద్ద పోస్టర్ పెట్టారు. అంటే బ్రాహ్మడు పోరాడాలంటే పరశురాముణ్నే ఆదర్శంగా పెట్టుకోవాలన్నమాట.

ఇప్పుడు యుపిలో జరుగుతున్నదదే. చాలా రాష్ట్రాల జనాభాలో బ్రాహ్మణుల శాతం 3 నుంచి 4 వుంటుంది. కానీ యుపి, ఉత్తరాఖండ్‌, హిమాచల్ ప్రదేశ్‌లలో చాలా ఎక్కువ. ఉత్తరాఖండ్ విడిపోయాక యుపిలో కాస్త తగ్గి ప్రస్తుతం 10% వుంది. సంఖ్యాబలమే కాదు, వారికి ఆర్థికబలం, రాజకీయబలం కూడా బాగానే వుంది. అసెంబ్లీ సీట్లలో సగం సీట్లు అవధ్, పూర్వాంచల్ ప్రాంతాలలో వున్నాయి. వాటిలో బ్రాహ్మలు గణనీయమైన సంఖ్యలో వున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో బ్రాహ్మలనగానే హింసాప్రవృత్తి, హత్యారాజకీయాలు అసోసియేట్ చేయం. కానీ ఉత్తరాదిన, తూర్పున ఉన్న బ్రాహ్మణులలో యివి పుష్కలంగా కనబడతాయి. ఎందరో గూండాలు, హంతకులు కనబడతారు. వాళ్లు క్షత్రియులతో (యుపిలో రాజపుత్రులు అంటారు) తలపడినప్పుడు తమను తాము పరశురాముళ్లగా ఊహించుకుంటారు.

యుపిలో అన్ని కులాల కంటె రాజపుత్రులదే ఆధిక్యం. భూస్వాములుగా తక్కిన కులాలను అణచడంలో ప్రథములు. వ్యవసాయ, వర్తక, వ్యాపారాలలో మొదటివరుసలో వున్నారు. ఆ బలంతో రాజకీయాల్లో కూడా వారి మాట చెల్లుబాటవుతుంది. రాజపుత్రులంటే పడని బ్రాహ్మణులు ఒకప్పుడు కాంగ్రెసుతో వుండేవారు. కాంగ్రెసు ముఖ్యమంత్రులలో గోవింద వల్లభ పంత్, కమలాపతి త్రిపాఠీ, ఎచ్ఎన్ బహుగుణ, శ్రీపతి మిశ్రా వంటి బ్రాహ్మణులు అనేక మంది వున్నారు. ఎన్‌డి తివారీ (1989) ఆఖరి బ్రాహ్మణ ముఖ్యమంత్రి. మండల్ రాజకీయాల తర్వాత యుపిలో బిసిలు సంఘటితం కావడం చూసి, కాంగ్రెసు సామర్థ్యంపై నమ్మకం పోగొట్టుకుని యుపి బ్రాహ్మణులు ఒక్కోసారి ఒక్కోరికి ఓటేస్తున్నారు.

అగ్రకులాలకు వ్యతిరేకంగా హరిజన ఓటు బ్యాంకుకు యితర వెనకబడిన కులాల తోడ్పడడంతో రాజకీయాల్లో దూసుకుని వచ్చిన మాయావతి కొంతకాలానికి ప్రాభవం కోల్పోయింది. మళ్లీ అధికారంలోకి రావాలంటే బ్రాహ్మణుల తోడ్పాటు కావాలనుకుంది. ఎందుకంటే సర్వకాల సర్వావస్థల్లో తనకు అండగా నిలిచే జాతవ దళితులు జనాభాలో 12% వుంటే, బ్రాహ్మణులు 10% వున్నారు. ఈ కూటమికి కొందరు ఒబిసిలు, ముస్లిములు కలిస్తే విజయం తథ్యం అనుకుంది. బ్రాహ్మణులను ఆకట్టుకోవడానికి సతీశ్ చంద్ర మిశ్రా అనే ఆయన్ని పార్టీ జనరల్ సెక్రటరీగా పెట్టుకుంది. 2007 ఎన్నికలలో అప్పటిదాకా యిస్తూ వచ్చిన ‘తిలక్ (బ్రాహ్మణులను సూచించే బొట్టు) తరాజూ (వైశ్యులను సూచించే త్రాసు) తల్వార్ (రాజపుత్రులను సూచించే కత్తి) - ఇన్‌కో మారో జూతే చార్’ (నాలుగు చెప్పుదెబ్బలు వేయండి వీళ్లకి) అనే పాత నినాదాన్ని మార్చి ‘బ్రాహ్మన్ శంఖ్ బజాయేగా, హాథీ (బియస్పీ ఎన్నికల గుర్తు) దిల్లీ జాయేగా’ నినాదాన్ని అందుకున్నారు. ఇక్కడ ఒక వివరణ. వైశ్యులు కూడా యుపిలో రాజకీయాల్లో కొంతకాలం ప్రధానపాత్ర పోషించారు. మన దగ్గర రోశయ్యగారు అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యారు కానీ యుపిలో కాంగ్రెసు తరఫున చంద్రభాను గుప్తా 1967 లోనే ముఖ్యమంత్రి అయ్యారు. 1990-2000లో బిజెపి తరఫున రామ్‌ప్రకాశ్ గుప్తా అయ్యారు.

అన్ని విధాలా ముందంజలో వున్న క్షత్రియుల ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడానికి బ్రాహ్మణులు మాయావతితో చేతులు కలిపి, 403లో 206 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయేందుకు సాయపడ్డారు. ఆ సారి తక్కిన పార్టీల నుంచి కూడా బ్రాహ్మలు భారీగా ఎన్నికై 56 సీట్లు గెలుచుకున్నారు. అంటే మొత్తం సీట్లలో 14%. 2012లో 41 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. అధికారంలోకి వచ్చాక మాయావతి బ్రాహ్మణులను పట్టించుకోవడం మానేశారు. బ్రాహ్మణ అధికారులను వేధించారు. దాంతో వాళ్లు బియస్పీకి దూరమై ఎస్పీకి దగ్గరయ్యారు. 2012 అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీ 42 మంది బ్రాహ్మణులకు టిక్కెట్లు యిస్తే వారిలో 23 మంది గెలిచారు. అసెంబ్లీలో మొత్తం బ్రాహ్మణుల ఎమ్మెల్యేల సంఖ్య 47 (11.7%) అయింది. అఖిలేశ్ అధికారంలోకి వచ్చి, పరశురామ జయంతిని శెలవుగా ప్రకటించాడు. కొందరు బ్రాహ్మణులను చేరదీశాడు.

అయినా మోదీ ప్రధాని అభ్యర్థి అయినప్పటి నుంచి బ్రాహ్మణులు బిజెపి వైపుకి మళ్లారు. అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ఓట్లేసిన బ్రాహ్మణుల శాతం చూడబోతే - 1996లో 71%, 2002లో 49, 2007లో 39, 2012లో 38, 2017 వచ్చేసరికి అది 80! 2014 పార్లమెంటు ఎన్నికలలో 72% మంది, 2019లో 82% మంది బిజెపికి ఓటేశారు. కానీ వారి ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం పెద్దగా మారలేదు. 2012లో 47 వుంటే 2017లో కూడా అంతే వుంది. బిజెపి వారికి ఎక్కువగా టిక్కెట్లు యిచ్చిందేమీ లేదు. 2017లో ఎస్పీ బిజెపి చేతిలో ఓడిపోయింది. బిజెపి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేసింది. ఆయన ఒక మఠానికి అధిపతే కానీ, జన్మతః రాజపుత్రుడు. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రాజపుత్రులను అందలం ఎక్కించాడు, బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేశాడు.

యుపిలో సెలవులు మరీ ఎక్కువై పోయాయని, 220 రోజుల ఎకడమిక్ సెషన్ 120 రోజులకు తగ్గిపోయిందని, అందువలన మొత్తం 42 సెలవుల్లో 17 సెలవులు జయంతి, వర్ధంతులకు యిస్తున్నారని, అలాటివాటిల్లో 15 రద్దు చేస్తున్నానని యోగి ఆదిత్యనాథ్ 2017లో ప్రకటించాడు. తక్కిన 85 రోజులను ఎలా పెంచుతారో ఆయన చెప్పలేదు. యోగి తీసేసిన సెలవుల జాబితా – కర్పూరీ ఠాకూర్, ఆచార్య నరేంద్ర దేవ్, చరణ్ సింగ్, మాజీ ప్రధాని చంద్రశేఖర్, ఆంబేడ్కర్ వర్ధంతి, కశ్యప మహర్షి, వాల్మీకి, పరశురాముడు, విశ్వకర్మ, మహారాజా అగ్రసేన్, హజరత్ చిస్తీ ఉర్స్, జమాత్ ఉల్ విదా, ఈదే మిలాదున్నవి, ఛాత్ పూజా, మహారాణా ప్రతాప్. వీటిల్లో వేరెవరి గురించి వివాదం రాలేదు కానీ పరశురామ జయంతిని తీసేయడం వలన బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బ తీసినట్లయిందని, దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని, బిజెపి తప్ప తక్కిన రాజకీయ పార్టీలన్నీ డిమాండు చేస్తున్నాయి.

యుపి బ్రాహ్మణులకు యోగిపై చాలా ఫిర్యాదులున్నాయి. ఆ కోపం బిజెపిపై ప్రసరించింది. ఈసారి దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామం బిజెపి కేంద్రనాయకత్వాన్ని భయపెట్టింది. బ్రాహ్మణుల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయంటూ పోరాడుతున్న కాంగ్రెసు నాయకుడు జితేంద్ర ప్రసాదను బిజెపిలోకి తీసుకుని యోగి కాబినెట్‌లో మంత్రి పదవి యిచ్చింది. యుపిలో కాంగ్రెసు ప్రభావం నానాటికీ క్షీణిస్తోంది. ఇన్నాళ్లుగా జితిన్ ప్రసాద సాధించినదేమీ లేదు. కేవలం బ్రాహ్మణనాయకుడు కావడం చేతనే బిజెపి అతనికి పెద్దపీట వేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బ్రాహ్మణ ఓటుబ్యాంకుపై వల వేయడానికి మాయావతి ‘బ్రాహ్మణ్ ఉత్పాత్ మచాయేగా, హాథీ బఢ్‌తా జాయేగా’ నినాదాన్ని అందుకుంది. నెగ్గితే పరశురాముడికి విగ్రహం కట్టడంతో బాటు ఆయన పేర ఆసుపత్రులు కట్టిస్తానంటోంది. జులైలో అయోధ్యలో బ్రాహ్మణ సమావేశం పెట్టి వాళ్లను ఆకర్షిస్తోంది.

కానీ యీసారి ఆమె కంటె అఖిలేశ్ ముందంజలో వున్నాడు. బిసిలకు, బ్రాహ్మణులకు ఉమ్మడి శత్రువు రాజపుత్రులు కాబట్టి, రాజుల మదాన్ని అణచిన పరశురామ జపం జపిస్తూ బ్రాహ్మణులను దువ్వుతున్నాడు. తన పార్టీలోకి ఐదుగురు ప్రఖ్యాత బ్రాహ్మణ నాయకులను చేర్చుకున్నాడు. తను అధికారంలోకి వస్తే 108 అడుగుల పరశురామ విగ్రహం పెడతాడట. అప్పుడే దాని మోడల్‌ను చూపిస్తున్నాడు కూడా. అంతే కాదు, మొత్తం 75 జిల్లాలలోనూ జిల్లా కొకటి చొప్పున పరశురామ విగ్రహాలను పెడతాడట. పరశురామ జయంతి సెలవు మాట సరేసరి. ఈలోగా ‘ప్రబుద్ధ్ సమ్మేళన్’ పేరుతో ఆగస్టు నుంచి బ్రాహ్మణ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాడు. ఏది ఏమైనా యీసారి యుపి బ్రాహ్మణులు సమరోత్సాహంతో, పరశురామస్ఫూర్తితో రాజకీయాల్లో చురుగ్గా వుండబోతున్నారు.

ఇలాటి ఉత్సాహం ఆంధ్ర బ్రాహ్మణుల్లో ఉంటుందా అనే ప్రశ్న వేసుకుంటే కచ్చితంగా వుండదు అనే సమాధానం వస్తుంది. తెలుగు రాజకీయాల్లో ప్రకాశంగారు ప్రజాబలంతో నెగ్గిన బ్రాహ్మణ ముఖ్యమంత్రి. తర్వాత పివి నరసింహారావుగారు అయినా, ఆయన సొంతబలం మీద కాకుండా, ఇందిర చలవ వలన అయ్యారు. కాంగ్రెసు పార్టీ తరఫున కొందరు బ్రాహ్మణులు ఎన్నికవుతూ వుండేవారు. మంత్రులూ అయ్యారు. 1982లో టిడిపి పుట్టాక తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కులసమీకరణాలు మారాయి. 30 ఏళ్లగా సమాజసేవ, రాజకీయచైతన్యం వంటివి వెనకబడి, డబ్బుండి దాన్ని ఎన్నికల్లో ఖర్చుపెట్టి, గెలిచి, మళ్లీ సంపాదించుకో గలిగినవారే రాజకీయాల్లో రాణించసాగారు. అలా ఖర్చుపెట్టడం, సంపాదించడం యిష్టం లేనివారు దూరంగా వుండసాగారు.

2019 మార్చి నాటి హిందూ రిపోర్టులో 1952-78 కాలం, 1983-2014 కాలాల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్యేల సంఖ్యలో వచ్చిన తేడాను అంకెలతో సహా స్పష్టంగా చూపించారు. మొదటి పీరియడ్‌లో మొత్తం క్షత్రియ ఎమ్మెల్యేల సంఖ్య 74 ఉంటే అది రెండో పీరియడ్‌లో 68కి పడిపోయింది. వైశ్యుల సంఖ్య 19 నుంచి 26కి, రెడ్ల సంఖ్య 229 నుంచి 350కి, కమ్మల సంఖ్య 202 నుంచి 297కి, బిసిల సంఖ్య 164 నుంచి 258 కి, కాపుల సంఖ్య 106 నుంచి 166కి పెరిగింది. ఇక బ్రాహ్మణుల విషయానికి వస్తే దారుణంగా 69 నుంచి 6కి పడిపోయింది. టిడిపి చంద్రబాబు చేతిలోకి వచ్చాక, ఆయన ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్టు కూడా యివ్వలేదు వాళ్లకి. ఇక మంత్రులుండే ప్రశ్నే లేదు. అయినా బ్రాహ్మలు ఆయన పార్టీకి ఓటేస్తూనే వచ్చారు. 2014లో ఆంధ్రలో అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పోరేషన్ పెట్టారు కానీ దాని చైర్మన్ ఐవైఆర్‌కు నిధులు కాదు కదా, ఎపాయింట్‌మెంట్ కూడా యివ్వలేదు. అయినా బ్రాహ్మణులు ఆందోళన చేయలేదు.

వైసిపి విషయానికి వస్తే కాంగ్రెసు తరహాలోనే బ్రాహ్మలకు కూడా టిక్కెట్లు యిస్తోంది. ఆ పార్టీ తరఫున నెగ్గినవారిలో మల్లాది విష్ణు, కోన రఘుపతి కనబడుతున్నారు. కోనకు డిప్యూటీ స్పీకరు పదవి యిచ్చారు. లేటెస్టుగా జగన్ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పోరేషన్‌ను ఎండోమెంట్స్ శాఖ నుంచి బిసి వెల్‌ఫేర్ శాఖకు బదిలీ చేస్తే వీళ్లు అభ్యంతరం తెలపలేదు. పరిపాలనా సౌలభ్యం కోసం చేశాం అని చెప్పుకుంటున్నారు కానీ, నిధులను దారి మళ్లించడానికే చేస్తున్నారని అందరి అభిప్రాయం. బిసిలకు కోసం 50 ప్లస్ కార్పోరేషన్లు విడివిడిగా పెట్టగా లేనిది, బ్రాహ్మలను ఏ సంబంధం లేని బిసి శాఖ క్రిందకు ఎలా తీసుకుని వస్తారు? తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పోరేషన్‌కై ప్రత్యేకంగా బజెట్ ఎలాకేషన్ చేసింది.  

ఓ కార్పోరేషన్ పేర నిధులు కేటాయించడం, అప్పులు తీసుకురావడం, తర్వాత మరో దానికి తరలించడం, వైసిపి ప్రభుత్వానికి అలవాటైన పని. ఇప్పుడు అదే జరుగుతుందని అనుమానం. పేరు బ్రాహ్మల కార్పోరేషన్‌ది, ఖర్చు బిసిలది కావచ్చు. ఇదెక్కడి అన్యాయం అని అడిగే రాజకీయ చైతన్యం ఆంధ్ర జనాభాలో 4% వున్న బ్రాహ్మణులకు లేదు. ఏ కులానికైనా సరే, జనాభాలో ఎంత శాతం మంది ఉన్నారనేది ప్రశ్న కాదు. తమ న్యాయమైన హక్కుల కోసం ఏ రీతిలో పోరాడుతున్నారు అనేదే ముఖ్యం. రిస్కు తీసుకోనివారు నష్టపోవలసినదే. చైతన్యవంతంగా లేకుండా ఏ కులమైనా, ఏ వర్గమైనా యిలాటి వివక్షతకు గురవుతూనే వుంటుంది. వీరి కోసం పరశురాముడు తపస్సుకి విరామమిచ్చి కొండ దిగి రాడు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2021)

mbsprasad@gmail.com

Show comments