ఎమ్బీయస్‍: సినిమా టిక్కెట్లు ఎవరమ్మితే ఏమిటి?

వేరే ఏ పరిశ్రమలోనైనా ఐతే పెట్టుబడి పెట్టాక కిట్టుబాటు దశకు కావడానికి, లాభనష్టాలు తెలియడానికి హీనపక్షం ఐదారేళ్లు పడుతుంది. కానీ ఈ సినీపరిశ్రమలో మహా అయితే ఒక ఏడాది! గుఱ్ఱప్పందాల్లో కొన్ని గంటల్లో లక్షాధికారి కావచ్చు, భిక్షాధికారి కావచ్చు. గుఱ్ఱాల వేగాన్ని మనం నియంత్రించలేం. కానీ సినీనిర్మాణం మన చేతిలోనే వుంటుంది. వేరే పరిశ్రమల్లో మనం తాడూ, బొంగరం దగ్గర్నుంచి సమకూర్చుకోవాలి. ఇక్కడ ఆ సమస్య లేదు. సినిమా తీయడానికి ముందుకు వస్తే చాలు, రచయిత కథ వినిపిస్తాడు, తర్ఫీదైన తారాగణం, సాంకేతిక గణం సిద్ధంగా వుంటారు. స్టూడియోకి వెళితే సకల హంగులతో ఫ్లోర్ల్ వుంటాయి. అన్నిటినీ సమన్వయం చేయడానికి దర్శకుడూ లభిస్తాడు. ఏ సబ్బో తయారు చేస్తే దాని ఉనికిని జనాలకు తెలియపరచడానికి పబ్లిసిటీపై చాలా ఖర్చు అవుతుంది. కానీ సినిమా తీస్తామని ప్రకటిస్తే చాలు, మర్నాడు పత్రికలలో వార్త వచ్చేస్తుంది, జనాలకు తెలిసిపోతుంది. మీరు దాచి వుంచుదామనుకున్న ఫోటోలతో సహా జనంలోకి వెళ్లిపోతాయి.

సినిమా హిట్టయితే డబ్బు కురుస్తుంది. పోయినా కొత్త పంపిణీ విధానం వలన ఆ నష్టాన్ని పదిమందీ పంచుకుంటారు. ఈ కారణం చేత సినిమా తీసే విద్య వచ్చినవాళ్లూ, రానివాళ్లూ కూడా చేతిలో డబ్బుంటే చాలు గోదా లోకి దిగిపోతున్నారు. కష్టపడకుండా రియల్ ఎస్టేటులో సంపాదించిన డబ్బు, అక్రమ పద్ధతుల్లో అండర్‌వరల్డ్ ద్వారా సంపాదించిన డబ్బు.. యిలా రకరకాల డబ్బులు వచ్చి సినిమాల్లో పడుతున్నాయి. దాంతో నల్లధనానికి యీ పరిశ్రమ ఆటపట్టయింది. డబ్బు వర్షంలా కురవడంతో దీన్ని ప్రొఫెషనల్‌గా నడిపినా, నడపకపోయినా ఫర్వాలేదనే ధీమా వచ్చేసింది సినిమా పెద్దలకు. ఆ ఉన్మత్త స్థితిలోనే ఒక బలమైన వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ, ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్‌కు ప్రేక్షకులను, థియేటర్లను, ఓటిటిని, ప్రభుత్వాలను నిందించడం ఏ మేరకు సబబు?

సినిమావాళ్లు ప్రేక్షకులను మోసగించాలనే చూస్తున్నారు తప్ప, అతని విశ్వాసాన్ని పొందాలని చూడటం లేదు. హోటల్‌కి వెళ్లేవాడు ఇడ్లీకై 30 రూపాయలు వెచ్చిస్తాడు. బిర్యానీకై 150 రూపాయలు వెచ్చిస్తాడు. ఎందుకంటే బిర్యానీలో పడే దినుసుల ఖర్చు గురించి, చేసే విధానంలో శ్రమ గురించి అతనికి అవగాహన వుంది. ఇప్పుడు సినిమా వాళ్లు ఇడ్లీని 150 రూపాయలకు అమ్ముదామని చూస్తున్నారు. ఎందుకయ్యా యింత రేటు అంటే, ఇడ్లీని ఎక్కణ్నుంచో తెప్పించామండి, తెచ్చినవాడికి బక్షీసుగా 100 రూపాయలిచ్చామండి అంటున్నారు. నువ్వు ఎక్కణ్నుంచి తెప్పిస్తే నాకెందుకు, బక్షీసుగా ఎంతిస్తే నాకెందుకు, నా ప్లేట్లో వచ్చినది ఇడ్లీయే కదా అని కస్టమరు గోల పెడుతున్నాడు. ఓహో నీ ఏడుపు యిలా వుందా అని చెప్పి ప్లేటు మీద గుడ్డ కప్పి వుంచి, బిర్యానీ అని తను చెప్పడమే కాక, పదిమందిని లాక్కుని వచ్చి చెప్పిస్తున్నారు. ఏ సమీక్షకుడో యిది బిర్యానీ కాదు, యిడ్లీయే అని చెప్తే వాణ్ని బండబూతులు తిట్టి బెదిరిస్తున్నారు. కస్టమరు దగ్గర 150 రూపాయలు పుచ్చుకుని, చివరకు ప్లేట్లో ఇడ్లీ పెడుతున్నారు. దాంతో కస్టమరు  పళ్లు నూరుకుని నీ హోటల్‌కు రావడం మానేస్తున్నాడు.

ఎందుకిలా మోసం చేస్తున్నారని అడిగితే సినిమాకు చాలా ఖర్చయిపోయిందండి, అది రాబట్టాలంటే ఎలాగోలా అబద్ధాలు చెప్పి అమ్మేసుకోవాలి కదండీ అంటున్నారు. ఖర్చు ఎక్కడవుతోంది? సాంకేతిక నిపుణుల దగ్గర, సిబ్బంది దగ్గర కావటం లేదు. ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా షూటింగు స్పాట్‌లో కేటరింగ్ చేసినవాడికి, ‘అజ్ఞాతవాసి’ సినిమా షూటింగు స్పాట్‌లో కేటరింగ్ చేసినవాడికి ఒకే రేటు యిస్తున్నావు. కరంటు ఖర్చు ఒకటే. వాహనాల పెట్రోలు ఖర్చూ ఒకటే. 2 కోట్ల సినిమా తీసినా, 200 కోట్ల సినిమా తీసినా స్టూడియో ఫ్లోర్ అద్దె ఒకటే. స్క్రిప్టు, మ్యూజిక్, ఫోటోగ్రఫీ యిత్యాది విభాగాల వారికి యిచ్చేది సినిమా బజెట్ బట్టి మారదు. కారెక్టరు యాక్టర్ల పారితోషికమూ మారదు. మరి ఎక్కడ వస్తోంది తేడా? హీరో హీరోయిన్లు, డైరక్టరు రెమ్యూనరేషన్ దగ్గర వస్తోంది. పెద్ద హీరోని పెట్టుకుంటే, పేరున్న డైరక్టరును పెట్టుకుంటే అమ్ముకోవడం యీజీ అనే కాలిక్యులేషన్‌తో వాళ్లను తెచ్చుకోవడంతో వస్తోంది చిక్కు.

మనం తీయాల్సింది మంచి సినిమా కాదు, నాలుగు వారాలు నడిచే సినిమా కాదు, అమ్ముడుపోయే సినిమా అనే దృక్పథమే సినీరంగాన్ని తగలేసింది. మొదలుపెట్టిన దగ్గర్నుంచి యీ సినిమా ఎలా అమ్మాలి అన్నదే చింత, అమ్మేసుకున్న తర్వాత ఎందరు తిట్టుకున్నా ఫర్వాలేదు అనే ఏటిట్యూడ్. ఫలానా హీరో సినిమా అనగానే సినిమా ఎలా ఏడ్చినా టేబుల్ ప్రాఫిట్ వచ్చేస్తుంది అనే లెక్కలేసుకుని ఆ హీరో డిమాండు చేసినంతా యిచ్చి, ఆయన పెట్టమన్న కాస్ట్‌లీ డైరక్టరును పెట్టి బజెట్‌లో 70శాతం అక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు.  తెరపై గ్రాండ్యూర్ కనబడటం లేదు. ఫారిన్‌లో తీశాం అంటే అక్కడ కథేమైనా నడుస్తోందా? నాలుగైదు రీళ్లు అక్కడ తీశాం, ఖర్చయింది అనగలరా? ఓ రెండు పాటలు తీస్తున్నారు, వెనక్కాల ఏముందో తెలియకుండా 20 మంది డాన్సర్లను పెడుతున్నారు. గబగబా షాట్స్ వచ్చిపడుతున్నాయి. అది ఎక్కడ తీసినా ఒక్కటే.

వీళ్లమైనా ఒక మంచి నవలను హెచ్చు రేట్లు పెట్టి కొన్నారా? ఒక హాలీవుడ్ మ్యూజిక్ డైరక్టరును తెచ్చి పెట్టారా? సినిమాపై ఏ విధంగానూ ఖర్చు కావటం లేదు. హీరోకి 15-50 కోట్లు, ఆయన కొత్త బొంబాయి హీరోయిన్ అంటే ఆమెకు ఖర్చు, బొంబాయి విలన్ అంటే అతనికి ఖర్చు. వాళ్లకు యిచ్చినదాని కంటె వాళ్ల వెనక్కాల వచ్చినవాళ్లకు ఖర్చులు, రానుపోను చార్జిలు, హంగూ ఆర్భాటాలూ యిలాటివాటికి పోతుంది. హీరో ఏం చెప్తే అది చేస్తారు తప్ప కథ ఏం డిమాండు చేస్తోందో అలా చేయరు. ఇలా చేసి సినిమాకు భారీగా ఖర్చయింది. అందువలన మొదటి రెండు, మూడు వారాలు టిక్కెట్టు ఎక్కువ రేటు పెట్టి, సినిమా ఎలా వుందో టాక్ బయటకు వచ్చేలోపున నొల్లేసుకోనీయండి అంటున్నారు. ఈ హెచ్చు రేట్లలో కొంత శాతమైనా సాంకేతిక నిపుణులకు, యితర తారాగణానికి యిస్తున్నారా? లేదే!

కరోనా కాలంలో సామాన్యజనులు తిండిలేక అల్లాడారు. అదానీలు, అంబానీలు తమ ఆస్తులను మరింత పెంచుకున్నారు. సినీరంగంలోనూ అంతే కదా! చిరంజీవిగారు సినిమా కార్మికుల అవస్థలను చూపించి ప్రభుత్వాలను ఆదుకోమని అడుగుతున్నారు. నష్టపోయిన బడా హీరోలున్నారా? వారి పారితోషికమేమైనా తగ్గిందా? సినీపరిశ్రమ మళ్లీ కుదుటపడేవరకూ మా రెమ్యూనరేషన్ సగానికి తగ్గించుకుంటాం, థియేటర్లు యిన్నాళ్లూ బోసిపోయి వున్నాయి. టపటపా సినిమాలు తీసేసి, థియేటర్లను కళకళలాడిద్దాం. అందరి జేబుల్లోనూ డబ్బులు గలగలలాడుతాయి అంటున్నారా? గతంలో ‘‘మోసగాళ్లకు మోసగాడు’’, ‘‘అల్లూరి సీతారామరాజు’’ వంటి భారీతారాగణంతో ఉన్న సినిమాలను నెల్లాళ్లలో తీసేశారట. మరి యిప్పుడు సోలో హీరోసెంట్రిక్ సినిమానే ఏడాదిన్నర తీస్తున్నారు. కథపై, తనపై నమ్మకం లేక తీసిందే తీసి చెక్కుతూనే వున్నారు. ఆ సినిమా రిలీజవుతుందేమో, తమకో నాలుగు బేరాలు తగులుతాయేమోనని ఆశ పెట్టుకున్న సాంకేతిక గణం, యితర తారాగణం నిరాశ పడుతున్నారు.

ఇప్పుడు టిక్కెట్ల అమ్మకం విషయమే వుంది, అది ప్రభుత్వానికి, థియేటర్లకు మధ్య పన్ను చెల్లింపుల యిస్యూ. దానికీ, సినిమా నిర్మాణానికీ సంబంధం ఏముంది? పన్ను చెల్లింపుల విషయంలో ప్రభుత్వానికీ, థియేటర్లకు పంచాయితీ యీనాటిది కాదు. థియేటరు వాళ్లను గతంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా నమ్మేవారు కాదు. తమ సినిమా ఆడేటన్ని రోజులూ తమ మనిషిని హాల్లో వుంచేవారు. అతను టిక్కెట్లు అమ్మకం పూర్తి కాగానే, ఫోన్ చేసి డిస్ట్రిబ్యూటరుకు అంకెలు చెప్పేవాడు. హాలువాళ్లు అతన్ని మేనేజ్ చేసి, ఎక్‌స్ట్రా కుర్చీలు వేసో, టిక్కెట్టు చింపకుండా వెనక్కి తీసేసుకునో అదనంగా సంపాదించేవారు. అందుచేత యీ రిప్రంజటేటివ్‌పై మరో పర్యవేక్షకుణ్ని పెట్టుకునేవారు డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడు థియేటర్లను అద్దెకు తీసుకునే పద్ధతి వచ్చాక యీ నిఘా అవసరం తీరిపోయింది.

ఇక ప్రభుత్వం విషయానికి వస్తే కలక్షన్ బట్టి పన్ను కట్టాలి కాబట్టి థియేటరు వాళ్లు ఆక్యుపెన్సీ తక్కువగా చూపించి పన్ను ఎగ్గొట్టేవారు. కలక్షన్ రిపోర్టు నెల అయిపోయిన తర్వాత యిచ్చేవారు కాబట్టి, చెక్ చేయడానికి అవకాశం వుండేది కాదు. మునిసిపాలిటీలు యీ పన్నుపై ఆధారపడేవి కాబట్టి, ఆదాయం లేక యిబ్బంది పడేవి. ‘‘మోహనమకరందం’’లో మోహన్ కందాగారు రాశారు. 1975లో కర్నూలు, అనంతపురం జిల్లాలకు కమ్మర్షియల్ టాక్సెస్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసే రోజుల్లో రూ.25 లక్షల పన్ను ఎగవేస్తే డిమాండు నోటీసు యిచ్చారాయన. ఎగ్జిబిటర్లు సమ్మెకు దిగారు. 50 రోజుల పాటు చేశాక కమిషనర్ వచ్చి వాస్తవాలు తెలుసుకుని ‘మీ థియేటర్లు ఆసుపత్రులు కావు, అత్యవసర సర్వీసులందించే శాఖలు కావు. వినోదం అందిస్తున్నారు. కుదరకపోతే మానేయండి. ప్రజలు హరికథకో, బుర్రకథకో పోతారు.’ అంటూ చక్కాపోయారు. ఎగ్జిబిటర్లు 55 రోజుల తర్వాత సమ్మె విరమించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌లా అప్పుడు రామారావు, నాగేశ్వరరావులు తమ మీద కక్ష కొద్దే ప్రభుత్వం యిలా చేసిందని అనలేదు.

ఎన్టీయార్ ముఖ్యమంత్రి అయ్యాక, యీ ఎగవేతలు ఆపడానికే శ్లాబ్ సిస్టమ్ పెట్టారు. హాలు నిండినా, నిండకపోయినా యింత అని అద్దె కట్టేయాల్సిందే. వీడియోలు వచ్చేవరకు అది బాగానే నడిచింది. దాని కారణంగానూ, దరిమిలా సినిమాల నాణ్యత తగ్గడంతోనూ జనాలు థియేటర్లకు రావడం తగ్గిపోవడంతో అద్దె మోపలేని భారమైంది. వైయస్ హయాంలో శ్లాబ్ పద్ధతి మార్చారు. ప్రస్తుతం కలక్షన్ల ఆధారంగా పన్ను కట్టే విధానమే వుంది. కమ్మర్షియల్ టాక్స్ అధికారులకు లంచాలిచ్చి థియేటర్లు పన్ను ఎగ్గొడుతున్నాయనేది బహిరంగ రహస్యమై పోయింది. అందుకే మంత్రిగారు అడిగారు – ‘ఫలానాఫలానా సినిమాలకు యింతింత కలక్షన్లు వచ్చాయన్నారు. మరి మాకు టాక్స్ యింతే వచ్చిందేం?’ అని. వెంటనే వీళ్లు ‘అబ్బే, అదంతా ఉత్త గ్యాస్ కబుర్లండి. హాలు నిండనే లేదు’ అనసాగారు.

కంపెనీలు చూడండి, బ్యాంకు ఋణం కోసం ఒక బాలన్స్‌షీటు, ఇన్‌కమ్‌ టాక్స్ వాళ్లకోసం మరో బాలన్స్‌షీటు యిస్తూంటారు. ఇదీ అలాటిదే! ఇన్‌కమ్ టాక్స్ వాళ్లు యిలాటివి అరికట్టడానికే ఆన్‌లైన్ పేమెంట్స్ చేయమంటున్నారు. క్రాస్ చెకింగ్ చేస్తున్నారు. అదే పని ప్రభుత్వం చేస్తే అది సినీపరిశ్రమపై దాడి అంటారేమిటి? చిత్రపరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం స్టూడియోలకు స్థలాలు యివ్వాలి, అవి రిజిస్టరయినప్పుడు స్టాంప్ డ్యూటీ మాఫ్ చేయాలి, సినీకళాకారులకు యిళ్ల స్థలాలు యివ్వాలి.  మరి దానికి ఆదాయం రావాలా వద్దా? ప్రయివేటు వ్యాపారంతో మీకేం పని అని అప్పుడు అనటం లేదే! అయినా ప్రభుత్వం థియేటర్ల ఆదాయంపై నిఘా వేస్తే, అది సినిమా వ్యాపారంలో తలదూర్చినట్లు ఎలా అయింది? ఫలానా హీరో రెమ్యూనరేషన్ తగ్గించేయండి, ఆ సినిమాలో ఐదు పాటలెందుకు, మూడు తీసేయండి అంటోందా?

థియేటర్లకు ఎంత ఆదాయం వస్తోందో నికరంగా తేలాలంటే టిక్కెట్లు ఎన్ని అమ్ముడుపోతున్నాయో తెలుసుకోవడం ప్రభుత్వానికి అత్యవసరం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్ముతున్న సంస్థలను అడిగితే వాళ్లు చెప్పకపోవచ్చు. అందువలన ప్రభుత్వమే ఆ వ్యాపారాన్ని తన చేతిలోకి తీసుకుంటోంది. అయినా రాష్ట్రంలో అన్ని థియేటర్ల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముడుపోవటం లేదు. భౌతికంగా టిక్కెట్లు అమ్ముతున్నారు. త్వరలో వాటిని కూడా తన చేతిలోకి తీసుకోవాలి. ఎలా అనేదానిపై ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో రావాలి. థియేటర్లకు టిక్కెట్లు అమ్మి పెట్టే పని యిప్పటివరకు ప్రయివేటు సంస్థలు చేస్తున్నాయి, యికపై ప్రభుత్వం కూడా ఆ వ్యాపారంలో దిగుతుంది. సినిమా టిక్కెట్ల వ్యాపారం చేయడమేమిటి, దరిద్రంగా అని కొందరంటున్నారు. కొన్ని ప్రభుత్వాలు పాలు అమ్ముతున్నాయి. అన్న క్యాంటీను, అమ్మ క్యాంటీను అంటూ ఇడ్లీ, సాంబారు అమ్ముతున్నాయి. వాటికంటె తీసిపోయిందా యిది?

ఏ వ్యాపారంలోకైనా ప్రభుత్వం దిగిందంటే సామర్థ్యం గురించిన ప్రశ్నలు ఉదయిస్తాయి. ప్రభుత్వోద్యోగి థియేటరు కౌంటరులో సమయానికి వచ్చి, కూర్చుని టిక్కెట్లమ్ముతాడా? అని అడుగుతున్నారు. ఆఫీసుకి ఆలస్యంగా వచ్చినట్లే ఫస్ట్ షోకి రావలసినవాడు సెకండ్ షో టైముకి వస్తే..? అంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుంది. వినోదపు పన్ను ద్వారా ఆదాయం గణనీయంగా నష్టపోతున్నపుడు దాన్ని రాబట్టుకోవడానికి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషించవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్ టిక్కెట్లు అమ్ముతున్న బుక్‌మైషో లాటి సంస్థలకు యిప్పటికే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వుంది కాబట్టి దానితో టై-అప్ కావచ్చు. దానితో ఒప్పందాలు లేని టౌన్లలో థియేటర్ల విషయంలో కంప్యూటర్ అవసరం లేకుండా మొబైల్ ద్వారా టికెట్ బుకింగ్ చేసే సౌకర్యం పెట్టవచ్చు. ఇప్పుడు గ్యాస్ సిలండర్ బుక్ చేయాలంటే మొబైల్‌లోనే చేస్తున్నాంగా. అమ్మకం అఫీషియల్ అయిపోయి, బ్లాక్ మనీకి ఆస్కారం లేకుండా వుంది.. ఫిజికల్‌గా థియేటర్ల వద్ద కూర్చోబెట్టాలంటే గ్రామ వాలంటీర్లను కూర్చోబెట్టవచ్చు. వాళ్లు ప్రలోభాలకు లొంగిపోకుండా వాళ్లపై సూపర్‌వైజర్లను పెట్టవచ్చు. నిధుల కోసం అల్లాడుతున్న రాష్ట్రం ఏదో ఒక రకంగా ఇన్‌కమ్ లీకేజిని అరికట్టడానికి చూడడాన్ని ఏ విధంగా తప్పుపట్టగలం?

అయితే జగన్ ప్రభుత్వం విషయంలో బిల్లుల చెల్లింపు విషయంలో జరుగుతున్న జాప్యం బట్టి, వసూలు చేసిన సొమ్మును థియేటర్లకు చెల్లించకుండా వాయిదా వేస్తారేమోనన్న భయం వుంది. బుక్‌మైషో లాటి వాళ్లు మర్నాడే పంపేస్తున్నారట, ప్రభుత్వం తాత్సారం చేస్తే థియేటర్లకు నష్టమే. ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రభుత్వ ఖాతాకు జమ అవుతూండగానే దానిలో థియేటర్ల వాటా వారికి వెళ్లిపోయేలా ప్రోగ్రాం రాయించి ఆ శంక పోగొట్టవచ్చు. వైసిపి ప్రభుత్వమే కాక మరే ప్రభుత్వం వచ్చినా, యీ విషయంలో డబ్బు వాడేసుకోవడానికి వీల్లేకుండా చేయాలి. ఇక మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నట్లుగానే దీనిపై కూడా అప్పు తెచ్చుకుంటారని ప్రతిపక్షాలు అంటున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ వందల కోట్లో వస్తుందంతే, దానిమీద తేగలిగిన అప్పెంత? అని వాపోయారు. వాళ్ల అవసరాలతో పోలిస్తే యిది ఏ మూలకు రాదులా వుంది. అందుకే ఆయన ఎంతొస్తుందో కూడా సరిగ్గా కనుక్కోలేదు.

అయినా అది చూపించి అప్పులు తెచ్చుకుంటే సినిమావాళ్లకేం బాధ? అప్పు తీర్చుకోవాల్సింది ఆంధ్ర పౌరులు, హైదరాబాదులో నివసించే సినీ హీరోలు కాదు. అయినా అప్పిచ్చేవాడికి ఉండాలి బుర్ర. నూటికి 85-90 సినిమాలు ఫ్లాపవుతూంటే, ఏ సినిమా ఎలా అఘోరిస్తుందో రిలీజు దాకా తెలియకపోతే, ఓ పక్క థియేటర్లు గోడౌన్లగా మారిపోతూ వుంటే, సినిమా టిక్కెట్ల మీద నికరాదాయం వస్తుందని ఎలా అనుకుంటారు? అది అనవసర చర్చ. ఆన్‌లైన్ టికెటింగ్ చేయమని సినిమా పెద్దలే ప్రభుత్వాన్ని గతంలో అడిగారని కొందరు సినీప్రముఖులు చెప్తున్నారు. ఎందుకంటే థియేటర్లు వాళ్లనీ మోసం చేస్తూ వచ్చాయి. డిజిటలైజ్ అయితే క్లియర్ పిక్చర్ వస్తుందని వాళ్ల ఆశ. ఇన్నాళ్లకి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ పద్ధతి నిర్దుష్టంగా ఎలా వుండాలో సూచించి, అది అమలయ్యేట్లా చూస్తే సినీపరిశ్రమలో వుండేవాళ్లే కాదు, నా బోటి సినిమా అభిమానులూ సంతోషిస్తాం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)

mbsprasad@gmail.com

Show comments