ఐటీ రైడ్స్ నన్ను మరింత బలంగా మార్చాయి

ఏకథాటిగా 4 రోజుల పాటు తన నివాసం, ఆఫీసులపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడులపై నటుడు సోనూ సూద్ స్పందించాడు. ఐటీ రైడ్స్ పై స్పందించడానికేం లేదన్న సోనూ.. తన లావాదేవీలు, సేవా కార్యక్రమాల పారదర్శకతను వివరించాడు.

"నా లావాదేవీలన్నీ చాలా పారదర్శకంగా ఉన్నాయి. ఎంతలా అంటే, ఒకే ఒక్క సింగిల్ క్లిక్ తో నా లావాదేవీలు, ఖాతాలు అన్నీ చూడొచ్చు. నా ఆదాయ-వ్యయాలతో పాటు మేం సాయం అందించిన ప్రతి వ్యక్తి వివరాలు, వాళ్ల ఫోన్ నంబర్లతో పాటు కంప్యూటర్ లో ఉన్నాయి. నా ఫౌండేషన్ ద్వారా వేలమంది ప్రాణాలు కాపాడ్డమే కాదు, ప్రతి పైసాకు లెక్క కూడా చెబుతున్నాం."

ఢిల్లీలో ఉన్న ఆప్ కు మద్దతుగా నిలిచినందుకే తనపై ఐటీ దాడులు జరిగాయనే వాదనను సోనూ  ఖండించాడు. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు పిలిచినా వెళ్తానని.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలతో కూడా టచ్ లోనే ఉన్నానని తెలిపాడు. బీజేపీ తనపై కోపంగా ఉందని అనుకోవడం లేదన్నాడు.

"ఐటీ రైడ్స్ పై ఎలా స్పందించాలో తెలియడం లేదు. ఓవైపు మంచి పనులు చేస్తున్నాను, మరోవైపు ఇలా జరుగుతున్నాయి. నా సేవా కార్యక్రమాలు మాత్రం ఆపను. ఇట్స్ ఓకే. ఆదాయపు పన్ను శాఖ అధికారులు వాళ్ల పని వాళ్లు చేశారు. నా పని నేను చేస్తున్నాను. అంతకుమించి రైడ్స్ పై స్పందించడానికేం లేదు."

4 రోజుల పాటు జరిగిన ఐటీ శాఖ సోదాలు తనను మానసికంగా మరింత స్ట్రాంగ్ గా మార్చాయంటున్నాడు సోనూ సూద్. ఇప్పుడు తనపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని అంటున్న సోనూ.. మంచి పనులు చేసేలా అంతా తనను ఆశీర్వదించాలని కోరాడు.

Show comments