లవ్ స్టోరీ టార్గెట్ @ 20 కోట్లు !

కాస్త ఎక్కువ కాలం షూట్ చేసుకుని, ఎక్కువ కాలం విడుదలకు దూరంగా వుండాల్సి వచ్చిన సినిమా లవ్ స్టోరీ. ఆసియన్ సినిమాస్ తొలిసారి నిర్మాణంలోకి దిగి నిర్మించిన ఈ సినిమాకు ఆది నుంచీ అన్నీ ఒడిదుడుకులే. 

సినిమా కొత్త వాళ్లతో ప్రారంభించారు. కొంత షూట్ చేసారు. దర్శకుడు శేఖర్ కమ్ములకు సంతృప్తిగా అనిపించలేదు. దాంతో మొత్తం ప్రాజెక్టును పక్కనపడేసారు. దాదాపు అయిదు కోట్ల రూపాయలు నష్టం. సినిమాను ఎవరితో తీయాలన్న క్లారిటీ దర్శకుడికి ముందుగా లేకపోవడంతో జరిగిన నష్టం ఇది.

నాగ్ చైతన్య, సాయి పల్లవి వచ్చారు మళ్లీ మొదలైంది. కానీ కరోనా వచ్చి పడింది. ఆఖరికి చాలా ఖర్చులకు ఓర్చి మళ్లీ పూర్తి చేసారు. మొత్తం మీద అన్ని ఖర్చులు కలిపి, దాదాపు 35 కోట్ల మేరకు ఖర్చు అయినట్లు బోగట్టా. సినిమాను చాలా ముందుగా మంచి రేట్లకే విక్రయించారు. 

నాన్ థియేటర్ మీద కూడా బాగానే గిట్టుబాటు అయింది. అయితే ఇప్పుడు కరోనా కారణంగా థియేటర్ రేట్లు అక్కడక్కడ కాస్త సవరించాల్సి వచ్చిందని తెలుస్తోంది. కొన్ని చోట్ల డైరక్ట్ విడుదల చేసుకుంటున్నారు.

స్వంత నిధులతో సినిమా నిర్మించినా వడ్డీలు లెక్క అన్నది వుంటుంది. ఎందుకంటే ఆసియన్ సంస్థ బేసిక్ గా ఫైనాన్స్ వ్యాపారం నుంచి ప్రారంభమైంది. అందువల్ల అన్ని లెక్కలు చూసుకుంటే 20 కోట్లు లేదూ వడ్డీలు లెక్కలు వేయకుంటే 15 కోట్లు థియేటర్ టార్గెట్ అని తెలుస్తోంది. 

నైజాం మీద ఫస్ట్ వీకెండ్ లోనే 10 కోట్లు రావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ మేరకు థియేటర్ల ప్లానింగ్ చేస్తున్నారు. నైజాం మీదే ఆశలు ఎక్కువగా వున్నాయి. ఫిదా సినిమా నైజాంలో 18 కోట్ల మేరకు వసూళ్లు సాగించింది. 

లవ్ స్టోరీ సినిమా ఏ మేరకు తెచ్చుకుంటుందో చూడాలి. ఆంధ్రలో 15 కోట్లు వసూళ్లు తెచ్చుకోగలిగితే నైజాం లాభాలు అందిస్తుందని లెక్కలు వేస్తున్నారు. 

Show comments