రాజకీయం వేడెక్కించే ప్రయత్నాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ వుంది. కానీ కొన్నాళ్ల క్రితం వరకు స్తబ్దుగా వున్న ప్రతిపక్షాలు కాస్త గట్టిగా యాగీ చేస్తున్నాయి. ఆంధ్ర సంగతి అలా వుంచితే తెలంగాణలో కూడా ప్రతిపక్షాలకు మీడియా కవరేజ్ స్టార్ట్ అయింది. తెలంగాణలో కేసిఆర్ కు ఎదురు లేదు అనుకున్న టైమ్ లో భాజపా కాస్త హడావుడి చేసింది. కానీ ఆ తరువాత అది ఆగిపోయింది. ఇలాంటి టైమ్ లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించి హడావుడి మొదలు పెట్టారు.

మొదట్లో పార్టీలోనే హడావుడి కనిపించింది. కానీ అవన్నీ సర్దు మణిగి రేవంత్ రెడ్డి హడావుడి తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి దూకుడు కాస్త గట్టిగానే వుంది. కేసిఆర్, కేటిఆర్ లను వ్యతిరేకించలేక, చతికిల పడిన అనేక మంది తెలంగాణ ఉద్యమ నాయకులు రేవంత్ రెడ్డి దూకుడు చూసి ఆనందిస్తున్నారు. కేటీఆర్ కూడా అంతే దూకుడును ప్రదర్శిస్తున్నారు. సీన్ లోకి రాహుల్ ను కూడా లాగారు. రేవంత్ ను కోర్టుకు లాగారు. 

అది అలా వుంటే ఆంధ్రలో గత కొంత కాలంగా తెలుగుదేశం ట్విట్టర్ కే పరిమితం అయింది. జనసేన కూడా అదే దోవలో వెళ్లింది. కానీ ఇప్పుడు రెండూ కూడా జనాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. రోడ్ల పరిస్థితిపై జనసేన రోడ్డెక్కింది. అయితే తెలుగుదేశం మాత్రం అచ్చంగా రేవంత్ రెడ్డి స్టయిల్ నే అనుకరించాలని చూస్తోంది. అదే గట్టిగా నోరు పారేసుకోవడం. దాంతో అలజడి రేగడం. దాన్ని మీడియా భూతద్దంలో చూపిచడం. ఇదే స్కీము నడుస్తోంది. 

ఆ విధంగా ఆంధ్ర రాజకీయాల్లో ఏదో నడుస్తోంది అని జనాలను నమ్మించే ప్రయత్నం. అయితే ఇక్కడ గమ్మత్తేమిటంటే ఇది కొంత వరకు ఫలిస్తుంది. ఎంత వరకు అంటే మీడియాకు మెటీరియల్ అందించే వరకు మాత్రమే. జనాలను ఇన్ వాల్వ్ చేయలేదు. నాయకులు నోరు పెట్టుకుని రోడ్డెక్కితే వచ్చే హడావుడి జనాలను ఇన్వాల్వ్ చేయలేదు. అయితే అధిష్టాన వర్గాన్ని కలవరపెట్టడానికి కొంత వరకు పనికి వస్తుంది.

అయితే తెలంగాణలో కేటిఆర్ అలెర్ట్ గానే వున్నారు. వన్ మ్యాన్ షో అయినా ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేయాలో అలా చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆంధ్రలో జగన్ దగ్గరే సమస్య. ఆయన దగ్గరకు పక్కా ఫీడింగ్ తీసుకెళ్లే వారు తక్కువ. ధైర్యం చేసేవారు తక్కువ. పైగా ఆయన వినే అవకాశం కూడా తక్కువే. అయితే జగన్ నే విషయం తెలుసుకున్నట్లు కనిపిస్తోంది.

అందుకే ప్రశాంత్ కిషోర్ ను మళ్లీ రంగంలోకి దింపారు. ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ జెన్యూన్ గా వుంటుందని జగన్ ను నూరుశాతం నమ్మకం. జగన్ ఇంత త్వరగా పికె ను రంగంలోకి దింపడానికి కారణం ప్రతిపక్షాలు కాస్త హడావుడి చేయడమే. అవి ఒకందుకు హడావుడి చేస్తే, జగన్ మరోలా స్పందించారు. అది ఆయనకే మంచిది. కిందిస్థాయిలో పరిస్థితులు ఇప్పుడు జగన్ దృష్టికి వస్తాయి.

నామినేటెడ్ వర్క్ లకు బిల్లులు చెల్లించక ఏడాది దాటిపోతోంది. ఆ పనులు చేసిన కార్యకర్తలు వడ్డీలు కట్టుకోవాల్సి వస్తోంది. బడుగు, బలహీన వర్గాలకు డబ్బులు పంచుతున్న వైనం మధ్యతరగతిని దూరం చేస్తోంది. వారి ఓటింగ్ శాతం ఎంత అన్నది పక్కన పెడితే, కొంతయినా ప్రభావం తప్పదు. కింది స్థాయి వారికి ఇళ్ల పట్టాల కార్యక్రమం దాదాపు వికటించింది. 

ప్రభుత్వం ఇళ్లు కట్టించి వుంటే అది వేరుగా వుండేది. చేతులు ఎత్తేయడంతో మైనస్ అయింది. పోనీ ఇచ్చిన స్థలం కాస్తయినా పెద్దదిగా వుంటే వేరు. కనీసం మూడు సెంట్లు అయినా వుంటే దాన్ని నమ్ముకుని వుండడం, అభివృద్ది చేసుకోవడం చేస్తారు. 

మరీ ఒక్క సెంట్ స్థలం కోసం ఎవరు లక్షలు ఖర్చు చేస్తారు? అది కూడా ఊరికి దూరంగా. ఈ పరిస్థితి గమనించారో, లేదా మరెందుకో, మధ్యతరగతి వారికి ఇళ్ల స్థలాలు అన్న మాటను మరిచిపోయినట్లు కనిపిస్తోంది. నిజానికి పట్టణాల్లో అర్హులైన మధ్యతరగతి వారందరికీ కనీసం మూడేసి సెంట్ల వంతున స్థలాలు ఇస్తే దాని ప్రభావం వేరుగా వుంటుంది.

కానీ ఇలా చేయాలంటే చాలా ఆర్ధిక వనరులు కావాలి. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని, ఎన్నాళ్లో బండి లాగించలేదని ప్రతిప్రక్షాలు భావిస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఏదో విధంగా కిందా మీదా పడి నిధులు సమీకరిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే ప్రభుత్వంపై విరుచుకుపడాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి.

ముఖ్యంగా ప్రతి అంశంలోనూ ఓ తప్పు వెదుకుతున్నాయి. అప్పులు, నాయకుల దందాలు, నియామకాలు, ఇలా ప్రతి దానిపై అవకాశం కోసం చూస్తున్నాయి. అందులో భాగంగా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ వ్వవహారాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

ఆర్వీ

Show comments