వైఎస్ఆర్ డైలాగులు గుర్తుచేసిన చంద్రబాబు..!

అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట.. అలా ఉంది చంద్రబాబు పరిస్థితి అంటూ గతంలో వైఎస్ఆర్ వేసిన సెటైర్లు అందరికీ గుర్తుండే ఉంటాయి. తాజాగా చంద్రబాబు మరోసారి ఆ వ్యాఖ్యల్ని గుర్తుకు తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గృహ రుణాలు రద్దు చేస్తుందని, జగన్ చెప్పిన వన్ టైమ్ సెలిట్మెంట్ కి ఎవరూ వెళ్లొద్దని పిలుపునిచ్చారు బాబు. ఇదే ఇక్కడ అసలైన కామెడీ.

అసలు టీడీపీ అధికారంలోకి వచ్చేదెపుడు, రుణాలు రద్దు చేసేదెపుడు. తన హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకే కేటాయింపులు చేయలేక చేతులెత్తేసిన బాబు, ఇప్పుడు గృహ రుణాలు రద్దు చేస్తారంటే పేదలు నమ్ముతారా..? రైతు రుణమాఫీ అంటే ఏంటో అందరికీ రుచి చూపించిన బాబుని జన్మలో ఎవరైనా నమ్మే అవకాశం ఉందా..?

జగనన్న శాశ్వత గృహ హక్కు పేరుతో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకుని ఇళ్లు కట్టుకున్నవారందరినీ రుణ విముక్తుల్ని చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. గతంలో రుణాలు తీసుకుని ఇళ్లు కట్టుకున్నవారందరికీ వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద వెసులుబాటు కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి జాబితాను త్వరలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సచివాలయాలకు పంపించబోతోంది.

సచివాలయాల్లోనే నిర్దేశిత రుసుము చెల్లించినవారికి ఇంటిపై, స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తారు. లక్షలాదిమంది లబ్ధిదారులకు ఇది సంతోషకరమైన విషయం. అయితే దీన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారు బాబు. సెటిల్ మెంట్ కు వెళ్లొద్దని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.

చంద్రబాబు హామీలను నమ్మేవారెవరు..?

జగన్ అధికారంలోకి రావడానికి ఒక్క ఛాన్స్ అంటూ ఆయన చేసిన ప్రచారమే కారణం అంటూ చంద్రబాబు పదే పదే దెప్పిపొడుస్తుంటారు. అయితే 2014 ఎన్నికల ముందు తానిచ్చిన హామీలను పూర్తిగా మరచిపోవడం టీడీపీ ఓటమికి  అసలు కారణం అనేది ఆయనకు ఇంకా అర్థం కాకపోవడం విచిత్రం.

ఆనాడు రైతు రుణమాఫీ పేరుతో చంద్రబాబు ఆడిన డ్రామాలు ఎవరూ మరచిపోలేదు. అలాంటి బాబు ఇప్పుడు గృహ రుణమాఫీ అంటే.. కచ్చితంగా అది ''హామీ మాఫీ'' పథకమే అనే అర్థం చేసుకోవాలి. మాఫీ చేస్తానంటూ బాబు హామీ ఇచ్చారంటే అది కచ్చితంగా ఆ హామీని మాఫీ చేయడమే, మరచిపోవడమే.

హామీ ఇచ్చారంటే దానిపై నిలబడటం, నిలబెట్టుకోవడం జగన్ చేసే పని. అలాంటిది గృహరుణాల సెటిల్మెంట్లపై జగన్ స్టేట్ మెంట్ ఇస్తే, దాన్ని చంద్రబాబు రాజకీయాలకు వాడుకోవాలని చూడటం ఓవర్ యాక్షన్ కాక ఇంకేంటి..? గతంలో చంద్రబాబుపై వైఎస్ఆర్ వేసిన సెటైర్ ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది.

Show comments