మూవీ రివ్యూ: గల్లీ రౌడీ

టైటిల్: గల్లీ రౌడీ
రేటింగ్: 2.25/5
తారాగణం: సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహ, వెన్నెల కిషోర్, సుడిగాలి సుధీర్, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్ తదితరులు 
కెమెరా: సుజాతా సిద్ధార్థ్
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
సంగీతం: సాయి కార్తిక్, రాం మిరియాల
నిర్మాత: కోన వెంకట్, ఎం.వి.వి. సత్యనారాయణ
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
విడుదల తేదీ: 17 సెప్టెంబర్ 2021

థియేటర్స్ కి ప్రేక్షకులు మునుపటిలా రాని ప్రస్తుత తరుణంలో ఎన్నో సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజవుతుంటే కొన్ని మాత్రం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి థియేటర్స్ లో విడుదలవుతున్నాయి. అలా ఈ రోజు వచ్చిన సినిమా "గల్లీ రౌడీ". ఎలా ఉందో వివరాల్లోకి వెళ్ళి చెప్పుకుందాం. 

వాసు (సందీప్ కిషన్) చిన్నప్పటినుంచీ చదువులో టాపర్. పెద్దయ్యాక డాక్టరు కావాలని కలలు కంటాడు. కానీ అతని తండ్రి, తాత రౌడీలు. తాత ప్రత్యర్థి రౌడీ చేత అవమానింపబడతాడు. 

ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి రౌడీ వారసుడిని తయారు చెయ్యాలనుకుని వాసు చేత చదువు మానిపించి రౌడీ ట్రైనింగ్ ఇస్తారు. మొత్తానికి కుర్రవయసొచ్చేసరికి రౌడీ అవుతాడు. తన లవర్ సాహిత్య (నేహా శెట్టి) కోసం ఒక రౌడీని కొట్టడంతో కెరీర్ మొదలుపెడతాడు.

అదలా ఉంటే పట్టపగలు వెంకట్రావు (రాజేంద్ర ప్రసాద్) సాహిత్య తండ్రి. అతనొక సీనియర్ పోలీస్ కానిస్టేబుల్. అతని 2 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని బైరాగి అనే ఒక పెద్ద రౌడీ కబ్జా చేస్తాడు. అదేంటని ప్రశ్నిస్తే వెంకట్రావుని కొట్టి ఆ స్థలాన్ని రాయించేసుకుంటాడు. 

ఫొయిన స్థలం ఎలాగూ తిరిగి రాదు కనుక వెంకట్రావు భార్య, తల్లి, కూతురు, కొడుకు ఆ పెద్ద రౌడీని కిడ్నాప్ చేసి 2 కోట్లు రాబట్టుకోవాలని ప్లాన్ వేస్తారు. ఆ పథకానికి వాసు సహాయసహకారాలు అందిస్తాడు. 

ఆ తర్వాత ఏమౌతుందనేది కథ. 

కథ ఎలా ఉన్నా కథనాన్ని కామెడీ జానర్ లో నడిపే ప్రయత్నం చేసారు. కానీ ఎప్పుడో 15 ఏళ్ల క్రితం స్టైల్లో హీరో బిల్డప్ సీన్లు అవీ చూస్తుంటే ఈ దర్శకనిర్మాతలు అక్కడే ఆగిపోయారేని అర్థమవుతుంది. 

తన స్థలాన్ని ఒక రౌడీ కబ్జా చేస్తే కానిస్టేబుల్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడతాడా? ఇంత వెనకబడిన పాయింటా? 

పైగా సందీప్ కిషన్ మీద అంతేసి బిల్డప్ సీన్లు పెడితే చూసేవాళ్లకి కూడా కన్విన్సింగ్ గా ఉండదనేది గ్రహించలేకపోయారు. 

ఉత్తిపుణ్యానికి సిక్స్ ప్యాక్ బాడీలు పెంచే హీరోల ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో ఒక రౌడీ పాత్ర చేస్తున్నప్పుడు, హై వోల్టేజ్ ఫైట్స్ చెయ్యాలనుకున్నప్పుడు సందీప్ కాస్త కండ పెంచుంటే బాగుండేది. బెండకాయలాంటి బాడీతో పనసకాయల్లాంటి రౌడీల్ని కొడుతున్నప్పుడు డాల్బీ డీటీయస్సులు బెదిరిపోయేలా సౌండ్స్ వస్తుంటే ప్రేక్షకులు ఒకరిమొహాలు ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితి. 

బాడీ సంగతి పక్కనపెడితే సినిమా పూర్తయ్యే సరికి సందీప్ నటించిన ఒక్క సీన్ గానీ, కనీసం ఒక్క డయలాగ్ కానీ వెంటాడదు. స్టార్ కాని నటుడి మీద బిల్డప్ సీన్స్ పెట్టడం ఓవర్ అనిపిస్తుంది. 

ప్రతి నటుడికి తన ఆహార్యానికి, ఇమేజ్ కి తగిన పాత్రలుంటయి. సందీప్ కూడా దానిని అనుసరించి కథలెంచుకుంటే బెటరని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. 

నేహా శెట్టి ఉన్నంతలో పర్వాలేదు కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. 

రాజేంద్రప్రసాద్ ఇలాంటి పాత్రలు అనేకం చేసేసారు. 

సెకండాఫులో ఎక్కువసేపు ఇన్స్పెక్టర్ గా కనిపించే బాబీ సింహాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెంచి క్యారక్టర్ ని లేపారు. 

ఇది కామెడీ ట్రాకులో నడిచిన సీరియస్ సినిమా. లాజిక్కులు పక్కనపెట్టేసి చూస్తూ ఉంటే మధ్యలో కొన్ని చోట్ల బానే ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్లీ అంతలోనే గ్రిప్ సడలిపోయి కాళ్లు చాపుకునేలా చేస్తుంది. 

హీరో బిల్డప్పులు ఇంత ఓవర్ గా లేకుండా కొంచెం అండర్ ప్లే చేసి తీసుంటే కన్విన్సింగ్ గా ఉండేది. టెక్నికల్ గా సినిమా ఓకే. ఒకటి రెండు పాటలు బాగానే ఉన్నాయి. డయలాగ్స్ లో ఇంకా పదునుండొచ్చు. సెకండాఫులో మాత్రం సాగతీత పర్వం సహనానికి పరీక్ష పెడుతుంది. కోనా వెంకట్ మార్కులో నాగేశ్వర రెడ్డి స్టైల్లో తీసిన ఈ సినిమా ఒక దశాబ్దం క్రితం వచ్చుంటే బాగుండేదేమో. ఇప్పుడు మాత్రం జీన్స్ ప్యాంట్ కాలంలో బ్యాగీ పాంట్ లాగ ఔట్ డేటెడ్ గా కొట్టింది. 

బాటం లైన్: సిల్లీ రౌడీ

Show comments