ఎమ్బీయస్‍: వాక్సినేషన్ మైలురాళ్లు

ఆగస్టు నెలలో మన దేశం వాక్సినేషన్‌లో రెండు మైలురాళ్లు దాటింది. ఒకటి దేశంలోని వయస్కులలో (18 ఏళ్లు దాటినవారు) 50% మందికి సింగిల్ డోస్ పూర్తి చేయడం, రెండు రోజుకి కోటి డోసుల లక్ష్యాన్ని నెలలో రెండు రోజులు చేరడం. నిజానికి ఆగస్టు నుంచి రోజుకి కోటి డోసులు వేస్తామని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించినా కోవిషీల్డు తప్ప తక్కినవి అనుకున్న ప్రకారం అందుబాటులోకి రాకపోవడం చేత అది అమలు కాలేదు. దాని వివరాలు తర్వాతి పేరాల్లో వివరిస్తాను. మొత్తం మీద చూస్తే ఆగస్టు నెలలో 17 కోట్ల డోసులు వేశారు. అంటే సగటున రోజుకి 55 లక్షల డోసులు. అయితే కనీసం కొన్ని రోజులైనా కోటి టీకాల రికార్డు సాధిద్దామనుకున్నారో ఏమో, 27న 1.09 కోట్ల డోసులు వేశారు. తర్వాతి రోజు 79 లక్షలకు, 29 వచ్చేసరికి యిది 31.14 లక్షలకు పడిపోయింది. మళ్లీ 31న 1.33 కోట్ల డోసులు వేయించారు. సెప్టెంబరు 1న 81 లక్షలే వేశారు.

ఇక రెండో మైలు రాయి ఆగస్టు 24నాటికి 94 కోట్ల ఎడల్ట్స్‌ లో 50% మందికి అంటే 47.29 కోట్ల మందికి కనీసం ఒక్క డోసైనా పూర్తయింది. మొత్తం జనాభాలో 11% మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. మొత్తం జనాభాలో సింగిల్ డోస్ పడిన వారి శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రపంచదేశాల్లో మనం ఎక్కడున్నాం? 217 దేశాల్లో మనది 110వ స్థానం. చెప్పుకోదగ్గ దేశాల్లో పోర్చుగల్ (83%), స్పెయిన్ (77), యుకె (70), యుఎస్ (60), చైనా (43), ఇండియా (33), రష్యా (30)! మన దేశంలో ఆగస్టు 31 నాటికి సింగిల్ డోస్ పూర్తయిన వారి సంఖ్య 50.25 కోట్లకు చేరింది. రెండు డోసులు వేసుకున్నవారి సంఖ్య 15 కోట్లు. మొత్తం 65 కోట్ల మంది. రాష్ట్రాల దగ్గర వేయడానికి రెడీగా 5 కోట్ల డోసులున్నాయి.

మొదటి 10 కోట్ల టార్గెట్ చేరడానికి మనదేశానికి 85 రోజులు పట్టింది. తర్వాతి 10 కోట్లకు 45 రోజులు పట్టింది. తర్వాతి 10కి 29, తర్వాతి 10కి 24, తర్వాతి 10కి 20, తర్వాతి 10కి 19 పట్టాయి. ఆ విధంగా ఆగస్టు 25 వచ్చేసరికి 60 కోట్ల డోసులకు చేరారు. దీనిలో మొదటి సగం 30 కోట్ల డోసుల మాట ఎలా వున్నా, రెండో సగం 30 కోట్లు వేయడానికి 63 రోజులు పట్టింది. అంటే సగటున రోజుకి 47.60 లక్షల డోసులు వేస్తున్నారన్నమాట. ఇక రాష్ట్రాలవారీగా (కేంద్రపాలితాలను కూడా కలిపే మాట్లాడుతున్నాను) వాక్సినేషన్ గురించి విశ్లేషించడానికి ఆగస్టు 28, 31ల నాటి ‘‘హిందూ’’లో యిచ్చిన చార్టులు పనికి వస్తాయి. వాక్సినేషన్ ప్రారంభం కాగానే అందర్నీ కలవరపరిచిన అంశం, టీకాలు వృథా చేయడం. అది క్రమేపీ తగ్గింది. మే1 నుంచి జులై 13 వరకు యిచ్చిన గణాంకాల ప్రకారం 28 రాష్ట్రాలలో వేస్టేజీయే లేదట. 8టిలో 2.50 లక్షల డోసులు వృథా అయ్యాయి. వాటిలో బిహార్‌లోనే 1.26 లక్షలు వృథా అయ్యాయి.

టీకాకరణ శాతాల ప్రకారం చూస్తే కేరళ 70% (25%కు రెండు డోసులు పూర్తయ్యాయి) తెలంగాణ 59 (20), ఒడిశా 50(16), మహారాష్ట్ర 45(16), పంజాబ్ 45(14), తమిళనాడు 44(11), ఉత్తర ప్రదేశ్ 37(7), బిహార్ 40(8), ఆంధ్ర 36(13). వాక్సిన్ల పంపిణీకి వస్తే తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర వంటి రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటె ఎక్కువ కేసులున్నా, డోసులు వృథా చేయకున్నా, వాళ్లకు అవసరమైనన్ని టీకాలు పంపటం లేదు. బెంగాల్, ఝార్‌ఖండ్, బిహార్, ఉత్తర ప్రదేశ్‌లకు కూడా తక్కువ వాక్సిన్లు వెళుతున్నాయి. వీటిల్లో కేసులు తక్కువగా వుండడమో, వేస్టేజి ఎక్కువగా వుండడమో జరుగుతోంది. గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వాక్సిన్లు పోగుపడుతున్నాయి. వాక్సిన్ సప్లయి తక్కువగా వున్న రాష్ట్రాలలో వాక్సినేషన్ వేగం కూడా తక్కువగానే వుంది. పది రాష్ట్రాలలో 50% కంటె తక్కువ అడల్ట్ వాక్సినేషన్ (ఒక డోసు) జరిగింది. వీటిలో తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర, బెంగాల్, బిహార్, ఝార్‌ఖండ్, ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి. పంపిన వాక్సిన్‌ల వాడకం విషయంలో 22 రాష్ట్రాలలో 95% కంటె ఎక్కువగా వాడుకున్నారు.

ప్రయివేటు సెక్టార్ ద్వారా 25% పంపిణీ చేద్దామని ప్రభుత్వం సంకల్పించినా ఆచరణలో అది సాధ్యం కాలేదు. ప్రభుత్వం ఉచితంగా యిస్తున్నపుడు డబ్బిచ్చి ప్రయివేటులో వేయించుకోవడం దేనికి అని చాలామంది అనుకుంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే వాక్సిన్ తయారీదారులకు యిప్పటిదాకా మార్కెటింగ్ ఛానెల్స్ పెద్దగా లేవు. ఎక్కువగా ప్రభుత్వాలకే అమ్ముతూ వచ్చారు. అందువలన యిప్పుడు చిన్న నర్సింగ్ హోంలకు అమ్మడం కష్టమౌతోంది. పెద్ద కార్పోరేట్లతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏతావతా ప్రయివేటు సెక్టార్ 9% కొనుక్కున్నారు, 7% అమ్మగలిగారు. ఇవన్నీ చూసి ముఖ్యమంత్రులు ప్రయివేటు సెక్టార్‌కు 10% లోపునే కేటాయించి, తక్కినది రాష్ట్రాలకు యిమ్మనమని అడిగారు. దాంతో కేంద్రం ‘మీరు 25% ప్రయివేటు సెక్టార్‌కు కేటాయించవలసిన అవసరం లేదు’ అని కంపెనీలకు ఆదేశాలిచ్చింది.

వాక్సినేషన్ యీ స్థాయిలోనైనా జరుగుతోందంటే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాళ్లు నెలకు 12 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని మాట యిచ్చారు. ఆగస్టులో 16.50 కోట్లు చేసి యిచ్చారు. సెప్టెంబరు నాటికి 20 కోట్లు చేసి యిస్తామంటున్నారు. టీకా కార్యక్రమాన్ని దెబ్బ తీసినది కోవాక్సిన్. వాళ్లు బెంగుళూరులో కొత్తగా ప్రారంభించిన ప్లాంట్‌లో చేసిన మొదటి బ్యాచ్‌లో నాణ్యతాపరమైన సమస్యలు ఎదురై తిరస్కరణకు గురైందని, ఫలితంగా ముందుగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగటం లేదని అరోడా యిటీవలే తెలిపారు. అది చెప్తూనే అతి త్వరలోనే నెలకు 10 నుంచి 12 కోట్ల డోసులు సరఫరా చేస్తుందని అనుకుంటున్నాం అని చెప్పారు.  కేంద్రం మే నెలలో ప్రకటించిన ప్రకారం ఆగస్టు – డిసెంబరు మధ్య 40 కోట్ల కోవాగ్జిన్ డోసులు అందుబాటులోకి రావాలి. కానీ ఏప్రిల్-జులై మధ్య 10 కోట్ల డోసులు యిస్తానన్న భారత్ బయోటెక్ 5.4 కోట్లకు మించి యివ్వలేక పోయింది. ఆగస్టులో కనీసం 3.50 కోట్ల డోసులు యిస్తుందని ఆరోగ్య మంత్రి జులై 20న చెప్పారు. కానీ 2 కోట్ల డోసుల కంటె తక్కువే యిచ్చారంటున్నారు. కోవాక్సిన్ అంకెలు ఎప్పుడు మిస్టీరియస్‌గానే వుంటున్నాయి. ఆగస్టు 29న ప్రారంభమైన అంక్లేశ్వర్ యూనిట్‌ నుంచి నెలకు కోటి డోసులు యిస్తామంటున్నారు. ఏమవుతుందో చూడాలి.

మన దేశంలో దొరుకుతున్న మూడో టీకా – స్పుత్నిక్. దీని మీద ప్రభుత్వం చాలా ఆశలే పెట్టుకుంది. మే నెలలో టీకా ప్రణాళికను ప్రకటించినపుడు ఈ ఏడాదిలో స్పుత్నిక్ 15.60 కోట్ల డోసులు వేస్తామని చెప్పారు. జూన్‌లో సుప్రీం కోర్టుకి ఎఫిడవిట్ సమర్పించినపుడు దాన్ని 10 కోట్లకు తగ్గించారు. తీరా చూస్తే ఆగస్టు నెలాఖరుకి 31 లక్షల డోసులు మాత్రమే యివ్వగలిగారు. అదీ కొన్ని నగరాల్లో, ప్రయివేటు ఆసుపత్రులలో మాత్రమే! దాని గురించి చాలామంది విననే లేదు. దీని విషయంలో కొరతకు కారణమేమిటంటే, రష్యా నుంచి దిగుమతి చేసుకోవడమే కాక రెడ్డీ లాబ్స్ వాళ్లు స్థానికంగా ఉత్పత్తి చేద్దామనుకుని వేసుకున్న ప్లాన్లు ఫలించలేదు. ఉత్పత్తిలో సమస్యలు వచ్చాయి. దాంతో దిగుమతిపైనే ఆధారపడవలసి వచ్చింది. సమస్యలు పరిష్కరించుకుని, సెప్టెంబరు నుంచి నెలకు కోటి డోసులు చేస్తామని రెడ్డీ లాబ్స్ వాళ్లు అన్నారు. చూడాలి, ఏమవుతుందో. రెడ్డీస్‌తో పాటు తక్కిన కంపెనీలూ తయారు చేస్తామన్నాయి కానీ అవింకా సామర్థ్యం సమకూర్చుకునే పనిలోనే వున్నాయి. ఉత్పత్తి ప్రారంభం కాలేదు.

స్పుత్నిక్‌లో వచ్చిన పెద్ద సాంకేతిక సమస్య ఏమిటంటే దాని మొదటి డోసుకు ఆధారభూతమైన వైరస్ వేరు, రెండో డోసుకు ఆధారభూతమైన వైరస్ వేరు. రెండోది పెరుగుదల వేగం బాగా తక్కువ. రెండోది రెండు డోసులు తయారయ్యే లోపున మొదటిదానివి 9 డోసులు తయారవుతాయి. ఈ గ్యాప్ వలన రెండో డోసుల లభ్యత తక్కువగా వుంటోంది. రెండిటికి మధ్య 3 వారాల గడువు చాలు. అందువలన తగినన్ని రెండో డోసు వాక్సిన్‌లు తయారు చేస్తే తప్ప మొదటిది రెడీగా వున్న వాక్సినేషన్ ప్రారంభించలేరు. రెండోదాని  తయారీ ఆలస్యమవుతోంది. రష్యా పెద్ద సంఖ్యలో ఎగుమతి చేస్తానని అంది కానీ యీ లోపున అక్కడే కేసులు పెరగడంతో వాళ్లే వాడేసుకున్నారు.

తక్కినవాటి మాటకు వస్తే – జాన్సన్‌కు అనుమతి యిచ్చారు కానీ దాని వాడకం ఎప్పుడు ప్రారంభమౌతుందో తెలియదు. మోడెర్నాకు న్యాయపరమైన రక్షణ కల్పించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోక పోవడంతో ఇప్పటివరకు ఒక్క టీకా కూడా పడలేదు. జైకోవ్ డి, ఎంఆర్ఎన్ఏ ఎచ్‌జీసిఓ19, భారత్ వారి నేసల్ వాక్సిన్ (ముక్కు ద్వారా యిచ్చేది), సీరం వారి నోవావాక్స్, బయో ఇ వాక్సిన్ – యింకా విడుదల కాలేదు. అమెరికా, జి7 యిస్తానన్న టీకాలు న్యాయపరమైన చిక్కుల కారణంగా యిప్పటికీ అందలేదు.

ఇక వాక్సిన్‌ల సామర్థ్యం సంగతి చెప్పుకోవాలంటే భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ నిన్న టిడిబి ఫంక్షన్‌లో మాట్లాడుతూ డెల్టా వేరియంట్‌పై ఫైజర్, మోడెర్నాల సామర్థ్యం 35% మాత్రమేననీ, కోవాక్సిన్ సామర్థ్యం 77% అని చెప్పుకున్నారు. ఆయనకు అంకెలు ఎక్కణ్నుంచి వచ్చాయో తెలియదు కానీ, 280721 హిందూ  ప్రకారం డెల్టా వేరియంట్‌పై ఫైజర్, ఆస్ట్రాజెన్‌కాల ప్రభావంపై యుకెలోని ఒక అధ్యయనం చెప్పిందింది - ఇన్‌ఫెక్షన్‌పై ఫైజర్ ఎఫెక్టివ్‌నెస్ బ్రిటన్‌లో 88%, ఇజ్రాయేల్‌లో 64, స్కాట్లండ్‌లో 79, కెనడాలో 87. హాస్పటలైజేషన్‌పై ఇంగ్లండులో 96, ఇజ్రాయేల్‌లో 93. ఆస్ట్రాజెన్‌కా ఇన్‌ఫెక్షన్‌పై స్కాట్లండ్‌లో 60%, హాస్పటలైజేషన్‌పై ఇంగ్లండులో 92%. ఫైజర్, మోడెర్నా వంటి ఎంఆర్ఎన్‌ఏ టీకాలతో వచ్చే యాంటీబాడీలు కాలక్రమంలో క్షీణించినా, ఆ టీకాల వలన ఉత్తేజితమైన ‘బి’, ‘టి’ సెల్స్ దీర్ఘకాలంపాటు రక్షణ యిస్తాయని పెన్సిల్వేనియా వర్శిటీ అధ్యయనం మొన్న చెప్పింది. దీని శాంపుల్ 61 మంది.

ఇవి యిలా నడుస్తూండగానే కరోనా కొత్త అవతారం సి.1.2 దక్షిణాఫ్రికాలో మేలో తలెత్తింది. ఇప్పటికి యుకె, చైనా, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విజర్లండ్‌లకు పాకింది. ఇది అన్నిటికంటె వేగంగా మ్యుటేట్ అవుతుందట. మన దేశంలో మూడో వేవ్ వస్తుందా? రాదా? అనే ప్రశ్న టీవీ చర్చల్లో తరచుగా వస్తోంది. ఎవరి వాదన వారిదే! ఎక్కువమంది ‘వస్తుంది కానీ దేశంలోని కొన్ని జిల్లాలకే వస్తుంది’ అంటున్నారు. అది నిజం కావచ్చు. సెకండ్ వేవ్ అంత తీవ్రత వుండకపోవచ్చని ఐసిఎమ్మార్ ఎపిడెమాలజిస్టు సమీరన్ పాండా అంటున్నారు. వచ్చాక కానీ చెప్పలేమని నా అనుమానం. కరోనాపై టీకాల ప్రభావం ఏ మేరకు ఉంటోంది అనేది కూడా స్పష్టంగా తెలియటం లేదు. యుకెలో 64% మందికి రెండు డోసులు, 70% మందికి సింగిల్ డోసు అయిపోయాయి కాబట్టి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి కేసులు బాగా తగ్గిపోవాలి. కానీ యింకా రోజుకి 35 వేల కేసులు వస్తున్నాయి.

మన దేశంలో దాదాపు 70% కేసులు కేరళలోనే ఉంటున్నాయి. కేరళలో మొదటి డోసు తీసుకున్నవారు 2.14 కోట్లు, రెండో డోసు తీసుకున్నవారు 0.79 కోట్లు.  కేరళ జనాభా మూడున్నర కోట్లనుకుంటే వాక్సినేషన్ పూర్తయినవారు 22.5%. భారతీయ సగటు 11% కంటె రెట్టింపు. అయినా కేసులు పెరుగుతూనే వున్నాయి. ఎందుకు? లోతుగా అధ్యయనం చేయవలసిన విషయం. ఇంకోటి కూడా గమనించాలి. కేరళలో మొత్తం కరోనా కేసులు 40.60 లక్షలు. మరణాలు 21 వేలు. అంటే 0.5% కూడా లేదన్నమాట. జాతీయస్థాయిలో కరోనా మరణాల రేటు 1.34% దగ్గర నిల్చింది. టీకాకరణ యింత పెరిగినా, మరణాల రేటు తగ్గకపోవడం నాకు విచిత్రంగా వుంది. టీకా వేయించుకున్నా కరోనా వస్తోందిగా, యిక దాని వలన ప్రయోజనమేమిటి అని అడిగితే, అబ్బే రోగతీవ్రత అంతగా వుండదు, ఆసుపత్రిపాలవడం తగ్గుతుంది, మరణం తప్పుతుంది అని చెప్తూ వచ్చారు. వయస్కులలో 50% మందికి ఒక డోసు టీకా పడ్డాక కూడా మరణాల సంఖ్య 1శాతానికైనా తగ్గకపోవడమేమిటి? టీకాలు మొదలు పెట్టడానికి ముందూ అదే పరిస్థితి కదా!

సిఎస్ఐఆర్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్- దిల్లీ మాక్స్ హాస్పటల్స్ కలిసి చేసిన అధ్యయనంలో వాక్సినేషన్ పూర్తయిన 600 మంది హెల్త్ వర్కర్లలో 25% మందికి మళ్లీ కరోనా వచ్చిందట. అయితే వారిలో 5% మందికే ఆసుపత్రిలో చేరే అవసరం పడిందట. ఇక వేరియంట్ల విషయానికి వస్తే ఇవాళ్టి పేపరులో వచ్చింది - ఇన్సాకాగ్ ప్రకారం ఇండియాలోని కేసుల్లో 68% డెల్టావే. డెల్టా ప్లస్ 1.2, ఆల్ఫా 13, బి.1.. 17. వీళ్ల శాంపుల్ 32 వేలు. కోవాక్సిన్ కానీ, కోవిషీల్డు కానీ డెల్టా వేరియంట్ వచ్చేముందే తయారైనవి కాబట్టి అవి దాన్ని నిరోధించలేక పోతున్నాయి. ఈ టీకా రెండు డోసులు వేసుకుంటే సరిపోదు, బూస్టర్‌గా మూడోది కూడా వేయించుకోవలసినదే అని పాశ్చాత్యదేశాలు అనుకుంటున్నాయి. మాకు ఒక డోసు కూడా యివ్వకుండా మీరు మూడేసి వేయించుకోవడం అన్యాయం అని ఆఫ్రికన్ దేశాలంటున్నాయి.

ఇంతకీ రెండు డోసులా? మూడు డోసులా? 190821 ఆంధ్రజ్యోతిలో సీరమ్ చైర్మన్ సైరస్ పూనావాలా ప్రకటన వచ్చింది. ‘టీకా వేయించుకున్నాక ఆర్నెల్లకు యాంటీబాడీలు తగ్గిపోతాయి, బూస్టర్ డోస్ అవసరమే, నేనూ మా 7-8 వేల ఉద్యోగులం వేయించుకున్నాం. మీరూ మూడో డోసు వేయించుకుంటే మంచిదే. టీకా డోసుల మధ్య రెండు నెలల విరామం సరిపోతుంది. టీకాల కొరత కారణంగా కేంద్రం దీన్ని  మూడు నెలలకు పెంచింది. ఫ్లూ వాక్సిన్‌లా ఏటా కోవిడ్ వాక్సిన్ వేయిస్తే మంచిది.’ అని. దేశప్రజల్లో 70% మందికి రెండు డోసులు పూర్తయ్యేసరికి, వాటి ప్రభావం తగ్గిపోయి, బూస్టర్ డోసు అవసరం పడుతుందేమో! ఈ విషవలయంలోంచి ఎప్పటికి బయటపడతామో తెలియదు. ఈలోపున బయట చూస్తే ప్రజలు బేఖాతరుగా తిరిగేస్తున్నారు. మాస్కులు సరిగా ధరించరు. మనం సామాజికదూరం పాటిద్దామని చూసినా, వచ్చి మీదమీద పడిపోతున్నారు. కరోనా వంటి మహమ్మారి కూడా మనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచలేక పోయిందంటే, యిక సాక్షాత్తూ యమధర్మరాజే దిగివచ్చి బెదిరించాలి కాబోలు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)

mbsprasad@gmail.com

Show comments