మూవీ రివ్యూ: ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు

టైటిల్: ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు
రేటింగ్: 1.5/5
తారాగణం: సుశాంత్, మీనాక్షి చౌదరి, వెంకట్, రవి వర్మ, వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, హరీష్ కోయలగుండ్ల తదితరులు 
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
నిర్మాతలు: రవి శంకర్, హరీష్ కోయలగుండ్ల 
దర్శకత్వం: దర్శన్
విడుదల తేదీ: 27 ఆగష్ట్ 2021

"అలవైకుంఠపురములో" లో ముఖ్యమైన పాత్రలో కనిపించిన సుశాంత్ ఇప్పుడు మెయిన్ లీడ్ గా "ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు" తో ముందుకొచ్చాడు. 

అరుణ్ (సుశాంత్) ఒక ఆర్కిటెక్చర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అదే కంపెనీలో మీనాక్షి (మీనాక్షి చౌదరి) చేరుతుంది. ఆమె అన్న ఒక కార్పొరేటర్ స్థాయి రాజకీయ నాయకుడు (వెంకట్). అన్నయ్య, వదిన ఊళ్లో లేనప్పుడు అరుణ్ ని తన ఇంటికి పిలుస్తుంది మీనాక్షి. ఆమెను సర్ప్రైజ్ చేయడానికి కొత్త బైక్ వేసుకుని వస్తాడు అరుణ్. అనుకోకుండా మీనాక్షి పక్క ఫ్లాట్ లో ఒక దొంగతనంతో కూడిన హత్యాప్రయత్నం జరుగుతుంది. కాలనీ జనమంతా నీలం రంగు చొక్కా వేసుకున్న అగంతకుడి కోసం వెతుకుతుంటారు. అరుణ్ కూడా అదే రంగు చొక్కా వేసుకునుంటాడు. ఇక అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాడు అనేది కథ. 

ఈ సింగిల్ పేజీ కథని రెండున్నర గంటల సినిమా తీయడానికి పడ్డ పాట్లు చూస్తే జాలేస్తుంది. పరీక్షల్లో రాయడానికి మేటర్ లేనప్పుడు ఆవేశంగా పేజీలు నింపితే మార్కులొస్తాయనే లెక్క ఒకటుంటుంది. సరిగ్గా అలాంటి ప్రయత్నమే జరిగిందిక్కడ. "ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు" అనే టైటిల్ పెట్టుకున్నాం కదా అని కథని కూడా అక్కడే నిలిపేయకూడదు కదా! 

ఇంటర్వల్ వరకు కథలో పాయింట్ మొదలవ్వదు. సెకండాఫులో మొదలయింది కదా అనుకుంటే సహనాన్ని పరీక్షించే లెవెల్లో సా....గుతుంటుంది. 

హీరోయిన్ ఫ్లాటులో ఇరుక్కున్న హీరో బయటకెళ్లాలి, తన బైకులో ఉన్న తన ఫ్రెండ్ పాస్పోర్ట్ జాగ్రత్తగా తీసుకోవాలి, కొత్త బైకుని జనం నుంచి కాపాడుకోవాలి...ఇవీ హీరో గారి లక్ష్యాలు. కానీ బయట కాలనీ జనం దొంగ కనపడితే చంపేడానికి సిద్ధంగా ఉన్నారు. హీరో బయటికెళ్లితే తననే దొంగనుకుని జనం ఎక్కడ కొడతారో అని హీరోయిన్ భయం. అందుకే ఆపుతుంది. వీటికి తోడు తల్లికి యాక్సిడెంటయ్యిందని ఐసీయూలో ఉందని ఫోనొస్తుంది హీరోకి. కాబట్టి అతను వెళ్లాలి. కానీ ఎలా? 

ఇలాంటి సీన్లు పెట్టి ప్రేక్షకుల్ని టెన్షన్ పడమంటే ఎలా పడతారు? కథ రాసుకోవడంలోనే ఇంటిలిజెన్స్ కనపడదు. అన్నీ బలవంతంగా పెట్టుకున్న సీన్లే తప్ప వేటికీ లింకులుండవు. ఇలాంటి పలుచనైన కథలని హ్యూమరస్ గా హ్యాండిల్ చెయ్యాలి. అప్పుడు ఆడియన్స్ కి రిలీఫ్ ఉంటుంది. టెన్షన్ ని కూడా సరైన కామెడెలో మిక్స్ చేయొచ్చు "అనగనగా ఒక రోజు" టైపులో. 

కానీ ఒక పక్కన సుశాంత్ హీరోయిజం చూపించాలి, స్టార్ హీరోల సినిమాల్లో ఉన్నట్టు ఫైట్స్ ఉండాలి, హీరో నవరసాలు పండించడానికి కథ లేకపోయినా సన్నివేశాలుండాలి అనే ఫార్ములాతో సినిమా తీస్తే అది రుచి పచి లేని పదార్థం ఇలాగే తయారవుతుంది. 

హీరో, హీరోయిన్ల నటన బాగానే ఉన్నా కథా, కథనాలు ఓర్పుని పరీక్షిస్తే వాళ్లకేం ఉపయోగం జరిగినట్టు? ఎన్ని ప్రొడక్షన్ వేల్యూస్ ఉంటే మాత్రం ఏం ప్రయోజనం ఒనగూరినట్టు? 

ఉన్న పది మంది ప్రేక్షకులు ఆఫ్ఘన్ శరణార్ధుల్లా బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు. థియేటర్ల్కోంచి ఎప్పుడు బయటపడతామా అనే లెక్కతో పాటు కొనుక్కొచ్చిన టికెట్ కు న్యాయం జరిగేలా కాసేపైనా ఉంటుందేమోనని ఆశపడి కూర్చున్నారు. చివరకి ఆశ అడియాసే అయింది. 

చీమంత కథకి ఏనుగంత యాక్షన్ ఎపిసోడ్ కండక్ట్ చేసినట్టుంది. రెండు లోకల్ పొలిటికల్ వర్గాలు, ఒక రౌడీలాంటి పోలీసు, అమాయకుడైన ఫ్రెండ్ మధ్య హీరో టెన్షన్ తో నలిగిపోవడమే సెకండాఫులో మూడో వంతు కథ. పోలీసుగా చేసిన నటుడు కాస్తంత ఓవరాక్షన్ చేసాడు. పొలిటీషియన్ గా చేసిన రవి వర్మ పేలవంగా కనిపించాడు. చాలానాళ్ళ తర్వాత కనిపించిన ఒకనాటి హీరో వెంకట్ కి తేలిపోయే పాత్రని ఇచ్చారు.

అభినవ్ గోమఠం ది పెద్ద పాత్రే. బాగానే చేసాడు. హరీష్ కోయలగుండ్ల "మేటర్" పాత్రలో ఓకే. కాళ్లు చాపేసుకుని నిస్సత్తువతో పడున్న ప్రేక్షకులకి ఉన్నంతలో వెన్నెల కిషోర్ ఆక్సీజను, అతిధి పాత్రలో కనిపించిన సునీల్ సెలైన్ బాటిల్లా ఆదుకున్నారు.   

ఎవరైనా సినిమాకి ఎదో ఒక వాహనంలో వెళతారు. టైటిలే ఇలా ఉందంటే సినిమాకి రావక్కర్లేదని సింబాలిక్ గా చెప్పినట్టేమో. 

బాటం లైన్: ఓర్పు లేనివాళ్లు వెళ్లరాదు

Show comments