మూవీ రివ్యూ: రాజ రాజ చోర

టైటిల్: రాజ రాజ చోర 
రేటింగ్: 3/5
తారాగణం: శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, అజయ్ ఘోష్, రవి బాబు, కాదంబరి కిరణ్, గంగవ్వ తదితరులు 
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
కెమెరా: వేద రామన్ 
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాత: అభిషేక్ అగర్వాల్, టి.జి. విశ్వప్రసాద్ 
దర్శకత్వం: హసిత్ గోలి 
విడుదల తేదీ: 19 ఆగష్ట్ 2021

విచిత్రమైన టైటిల్, వినూత్నమైన పోస్టర్, విషయముందనిపించే ట్రైలర్ ఈ సినిమాపై దృష్టిపడేలా చేసాయి. పైగా జయాపజయాల సంగతెలా ఉన్నా శ్రీవిష్ణు సినిమాల్లో కాస్తో కూస్తో ప్రత్యేకత ఉంటుందన్న అభిప్రాయం రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్లకి ఉంటుంది. ఈ "రాజ రాజ చోర" ఎంతవరకు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడో చూద్దాం. 

భాస్కర్ (శ్రీవిష్ణు) ఒక జిరాక్స్ షాపులో పని చేస్తుంటాడు. యజమాని (అజయ్ ఘోష్) కి తెలియకుండా ఫైల్స్ గట్రా కాస్త ఎక్కువకి అమ్మి పైడబ్బుని జేబులో పెట్టుకుంటుంటాడు. యజమానికి తెలియకుండా ఆ షాపు కేంద్రంగా ఎక్జాం పేపర్స్ లీక్ చేయడం ఇతను చేసే మరో సైడ్ బిజినెస్. తానొక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని అని అబద్ధమాడి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు భాస్కర్. ఆమె పేరు సంజు (మేఘా ఆకాష్). ఇంతకీ మేటరేంటంటే ఈ భాస్కర్ కి ఆల్రెడీ పెళ్లయ్యి ఒక కొడుకు కూడా ఉంటాడు. భార్య పేరు విద్య (సునయన). ఆమె లా స్టుడెంట్. జిరాక్స్ షాపులో సంపాదన ఏ మూలకీ సరిపోక కుటుంబాన్ని నడపడానికి భాస్కర్ "దొంగ" దారులు తొక్కుతాడు. ఆ మార్గంలో అతను సంపాదించినదేమిటి? చివరికి తెలుసుకున్నదేమిటి? భార్యతో సెటిలవుతాడా? లేక ప్రియురాలితోనా? ఇది అతని ట్రాక్. 

మరో పక్క భార్యతో విడాకులైపోయి స్వేచ్ఛా జీవితం గడుపుతున్న విలియం రెడ్డి (రవి బాబు) అని ఒక ఎస్సై ఉంటాడు. అతనికి తన ఫ్రెండ్ భార్యతో అఫైర్. భాస్కర్ జీవితంలోకి ఈ విలియం రెడ్డి ప్రవేశిస్తాడు. ఈ విలియం కి సంజు మేనకోడలు. భాస్కర్, సంజు, విలియం ల మధ్య ఒక ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంటుంది. ఈ ఎస్సై చివరికి ఏమౌతాడు? ఇది ఇంకొక ట్రాక్. 

ఇంకో పక్క ఒక డాక్టర్ (శ్రీకాంత్ అయ్యంగర్). అతనికి వృత్తి మీద వచ్చే సంపాదన కన్నా రియల్ ఎస్టేట్ మీద మక్కువ ఎక్కువ. వృత్తిని పక్కన పెట్టి అతను మార్గం ఎలా తప్పాడన్నది ఇంకొక సబ్ ప్లాట్. ఇలా మూడు నాలుగు ట్రాకుల్ని ఒక కథలో పెనవేసి అల్లిన తీరు బాగుంది. 

సమాజంలో మన చుట్టూ ఉన్న మనుషులు ఈ కథలో కనిపిస్తారు. ఆశ, దురాశ, అబద్ధం, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, అక్రమ సంబంధాలు ఇలా అన్నిటినీ సటిల్ గా టచ్ చేసింది ఈ కథ.  ఇందులో మంచి పాత్ర అనేది ఉండదు. ఒక రకంగా అన్ని పాత్రలూ ఏదో ఒక తప్పు చేస్తాయి. చివరికి కొన్ని పాత్రలు తప్పుని తెలుసుకుని మార్గం మార్చుకుంటాయి, కొన్ని ఎప్పటికీ తెలుసుకోవు. 

రొటీన్ గా కాకుండా వెరైటీగా అనిపించే కథ, కథనం ఇందులో ఉన్నాయి. కొత్త దర్శకుడైన హసిత్ గోలి మంచి పనితనం చూపించారు. టెక్నికల్ గా కూడా సినిమా ట్రెండీగానే ఉందని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటూ సాంగ్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ఫార్ములాని ఫాలో అవుతూ పెట్టే డ్యూయట్స్ కాకుండా కథనంలో ఇమిడిపోయి ఎక్కడా విసిగించని విధంగా ఉన్నాయి సాంగ్స్. కెమెరా వర్క్ కూడా ఇబ్బంది పెట్టలేదు. 

మేఘా ఆకాష్ మెయిన్ హీరోయిన్ అయినా ఇందులో ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం సునయన అనే చెప్పాలి. పర్ఫార్మ్ చెయ్యడానికి చాలా స్కోప్ ఉన్న పాత్ర ఆమెది. దానికి తోడు తెర మీద అందంగా కనిపించి బ్యూటీ విత్ ట్యాలెంట్ అనిపించింది. తమిళంలో తప్ప తెలుగులో పెద్దగా సినిమాలు చేయని ఈ నటి ఇండివిడువాలిటీ ఉన్న వివాహిత మహిళ పాత్రలో ఆకట్టుకుంది. 

రవిబాబు ఇందులో కామెడీ విలన్ టైపు. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఆయనకి కొట్టిన పిండి. అతని పక్కన సైడ్ కిక్ గా కానిస్టేబుల్ కాదంబరి కిరణ్ కూడా పాత్రకి పర్ఫెక్ట్ గా సూటయ్యారు. 

ఇందులో వెరైటీగా ఉన్న పాత్ర గంగవ్వది. బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయిన ఈమె అంజమ్మగా ఒక పాడు బడిన కారు షెడ్డులాంటి చోట నివసిస్తుంటుంది. హీరో కథని మలుపు తిప్పడానికి తోడ్ఫడే పాత్ర ఈమెది. జిరాక్స్ షాప్ యజమానిగా అజయ్ ఘోష్ ది కూడా కేవలం ప్యాడింగ్ పాత్ర కాదు. సెకండాఫులో ఒక హీరో రియలైజేషన్ కి కారణమయ్యే పాత్ర. 

ఇలా ఏ క్యారక్టర్నీ వృధాగా వదిలేయకుండా అర్థవంతంగా కథ రాసుకున్నాడు దర్శకుడు. అయితే మొత్తం 2 గంటల 29 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో ప్రవచన కారుడిగా తనికెళ్ల భరణి పాత్ర లేకపోయినా సినిమాకొచ్చే అడ్డంకేదీ లేదు. ఆ పాత్రని కట్ చేసినా రన్ టైం కలిసొచ్చేదేమో. 

ఎక్కడా ప్రెడిక్టబిలిటీ లేకుండా, ఎక్కడికక్కడ ట్విస్టుల్ని పెడుతూ, రకరకాల మలుపుల్ని తిప్పుతూ నడిపిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ఆయువుపట్టు.  

ఫస్టాఫ్ ముగిసే సరికి సెకండాఫంతా మరింత కామెడీగా సాగుతుందనే ఫీలర్స్ వస్తాయి. కానీ సెకండాఫులో కామెడీ కంటే డ్రామా, మెసేజ్ లాంటివి డామినేట్ చేసాయి. దానివల్ల కాస్త బరువుగా అనిపించినా క్లైమాక్స్ అయ్యే సరికి మంచి సినిమా చూసామన్న సంతృప్తి కలుగుతుంది. 

బాటం లైన్: ప్రేక్షకుల మనసుల్ని దొంగిలించిన చోరుడు

Show comments